కూర్మపురాణాను క్రమణ కథనము

బ్రహ్మ పలికెను: ఓ మరీచీ ! ఇపుడు కూర్మ పురాణమును వినుము. ఈ పురాణమున లక్ష్మీ కల్పానుచరితము వర్ణించబడినది. ఈ పురాణమున కూర్మ శరీర ధారియగు శ్రీహరి విడివిడిగా ధర్మార్థ కామమోక్షముల మాహాత్మ్యము ఇంద్రద్యుమ్న ప్రసంగముతో ఋషులకు తెలిపెను. ఈ పురాణమున పదిహేడువేల శ్లోకములు కలవు. ఈ పురాణమున బ్రహ్మ ధర్మములు పలు విధములు చెప్పబడినవి. ఈ ధర్మములను నానా కథా ప్రసంగముతో మానవులకు సద్గతిదాయకములుగా చెప్పబడినవి. ఈ పురాణమున పూర్వభాగమున మొదట పురాణోపక్రమము చేయబడినది. ఇచట లక్ష్మీ ఇంద్రద్యుమ్నుల సంవాదము, కూర్మ ఋషి గణ సంవాదము, వర్ణాశ్రమాచార కథా, జగదుత్పత్తి, సంగ్రహముగా కాల సంఖ్య, ప్రళయాంతమున శ్రీహరి స్తవము, తరువాత సంక్షేపముగా సృష్టి, శంకర చరితము, పార్వతీ సహస్ర నామములు, యోగ నిరూపణము, భృగువంశ చరితము, స్వాయంభువ చరితము, దేవాద్యుత్పత్తి, దక్షయజ్ఞ ధ్వంసము, దక్ష సృష్టి కథా, కశ్యప వంశ కధనము, ఆత్రేయ వంశకధనము, శుభకరమైన శ్రీకృష్ణ చరితము, మార్తండ కృష్ణ సంవాదము, వ్యాస పాండవ సంవాదము, యుగధర్మాను కధనము, వ్యాస జైమిని కీర్తనము, వారణాసీ మాహాత్మ్యము, ప్రయాగ మాహాత్మ్యము, లోకత్రయ వర్ణనము, వేదశాఖా నిరూపణము వర్ణించబడినవి. ఇక ఉత్తరభాగము, ఈశ్వర గీత, నానాధర్మ ప్రబోధకమగు వ్యాసగీత, బహువిధ తీర్థమాహాత్మ్యము, ప్రతిసృష్టి కధ చెప్పబడినది. ఇంతవరకు చెప్పబడినదంతయూ బ్రాహ్మీ సంహితా అనబడినది. ఇక ఇక్కడి నుండి భాగవతీ సంహితా చెప్పబడినది. ఈ సంహితలో అర్థ నిరూపణము చేయబడినది. ఈ సంహితలో చతుర్వర్ణముల ప్రవృత్తి విడివిడిగా చెప్పబడినది. ఈ సంహితలో మొదటి పాదమున బ్రాహ్మణ వ్యవస్థ చెప్పబడినది. ఈ వ్యవస్థ యందు భోగసౌఖ్య వర్ధకమగు సదాచార స్వరూపము చెప్పబడినది. ద్వితీయ పాదమున క్షత్రిచవత్తి చక్కగా చెప్పబడినది. ఈ వృత్తిని సక్రమముగా అనుసరించినచో పాపములు తొలగి స్వర్గమును పొందును. తృతీయ పాదమున నాలుగు విధములగు వైశ్యవృత్తి చెప్పబడినది. దీనిని ఆచరించినచో ఉత్తమగతి లభించును. నాలుగవ పాదమున శూద్రవృత్తి చెప్పబడినది. ఈ వృత్తిని యధావిధిగా ఆచరించినచో భవిష్యత్తులో ఉత్తమగతిని పొందును. ఇట్లు ద్వితీయ సంహిత పంచపదిగా చెప్పబడినది. తృతీయ సహిత సౌర సంహిత అనబడును. ఈ సంహిత మానవ కార్యసాధిక అని ప్రసిద్ధి చెందెను. కోరిక గల వారికి షట్కర్మ సిద్ధిని షడ్విధములుగా చెప్పిరి. నాలుగవది వైష్ణవీ సంహిత మోక్షప్రదమని కీర్తించబడినది. ఈ చతుష్పది ద్విజులకు సాక్షాత్తుగా బ్రహ్మ స్వరూపముగా చెప్పబడినది. ఈ నాలుగు పాదములు క్రమముగా 6, 4, 2, 5, వేల శ్లోకములు కలవి. ఇది చతుర్వర్గ ఫలప్రదమగు కూర్మ పురాణము చెప్పబడినది. చదువువారికి వినువారికి సర్వోత్తమగతిని ప్రసాదించును. ఈ కూర్మ పురాణమును భక్తితో వ్రాసి బంగారు తాబేలుతో బ్రాహ్మణునకు దానము చేసినచో ఉత్తమ పదమును పొందును. (4/106)