గంగోత్పత్తి

నారదమహర్షి పలికెను: విష్ణుపాదాగ్రము నుండి పుట్టి, గంగ అని చెప్పుబడుచున్న పుణ్యతీర్థము యొక్క ఉత్పత్తిని నా మీద అనుగ్రహముంచి తెలుపుము.

సనకమహర్షి పలికెను: “ఓ పాపరహితుడా! నారదా! చెప్పువారలకు వినువారలకు పాపము లను నశింపచేసి పుణ్యమును ఇచ్చు గంగోత్పత్తిని నీకు చెప్పెదను వినుము. ఇంద్రాదిదేవతలకు తండ్రి కశ్యపమహర్షి ఉండెను. కశ్యపమహర్షికి ఆదితి, దితి అను దక్షప్రజాపతి పుత్రికలు భార్యలుగా ఉండిరి. దేవతల తల్లి అదితి. దైత్యుల తల్లి దితి. అదితి దితి పుత్రులైన దేవదైత్యులు ఒకరినొకరు జయింపవలెనని ఎల్లప్పుడు భావించుచుండిరి. అందువల్లనే దైత్యులకు పూర్వదేవులు అని పేరు. దైత్యులలో మొదటివాడు దితి పుత్రుడు బలవంతుడగు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుని పుత్రుడు మహానుభావుడైన ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని పుత్రుడు విరోచనుడు. బ్రాహ్మణ భక్తి గలవాడు. విరోచనుని పుత్రుడు బలి మిక్కిలి తేజోవంతుడు, ప్రతాపవంతుడు. దైత్యులకు సేనానాయకుడై బలి వారికి సంతోషజనకుడు ఆయెను. గొప్ప సైన్యముతో భూమండలమును అంతటిని గెలిచి రాజ్యము అనుభవించుచుండెను. స్వర్గమును జయించవలయునని సంకల్పించెను.”

బలి చక్రవర్తి సైన్యము చాలా శ్రేష్ఠమైనది. పదివేల కోట్ల లక్షల ఏనుగులు. అన్నియే రథములు. అన్నియే అశ్వములు. ప్రతి ఏనుగు వెంట అయిదువందల పదాతి సైన్యము కలిగియుండెను. ఆ సైన్యమును గూర్చి ఏమి వర్ణించగలము. బలి చక్రవర్తి మంత్రులలో అగ్రేసరులు కుంభాండుడు, కూపకర్ణుడు అను వారలు. బలిచక్రవర్తి నూరుగురు పుత్రులలో పెద్దవాడైన బాణాసురుడు తండ్రితో సమానమైన బలపరాక్రమములు గలవాడు. దేవతలను జయించవలయునని సంకల్పించి గొప్ప సైన్యముతో బయలుదేరెను. ధ్వజములతో, ఛత్రములతో ఆకాశమున మెఱుపులను, సముద్రమున అలలను స్మరింపజేయుచు సైన్యము సాగెను. దేవేంద్ర నగరమును చేరి సింహపరాక్రములైన రాక్షసులతో అమరావతిని ముట్టడించెను. వజ్రకరుడు మొదలగు దేవతలు కూడా గొప్ప సైన్యముతో నగరమునుండి బయలువెడలిరి. అపుడు ప్రళయకాల మేఘములవలె ధ్వనించుచు యుద్ధభేరీ ధ్వనులతో ఆకులముగా దేవదానవులకు భయంకరమైన యుద్ధము మొదలాయెను. రాక్షసులు దేవతా సైన్యముపై శరజాలములను విడిచిరి. దేవతలు కూడా భయంకరమైన యుద్ధములో దైత్యులపై బాణవర్షమును కురిపించిరి. గెలువుము, చీల్చుము, భేదించుము, ఛేదించుము, చంపుము కొట్టుము అని పెద్దగా అరుచుచున్న సైన్యము ధ్వని వినిపించుచుండెను. శరముల ధ్వనులు, దుందుభిధ్వనులు, దైత్యుల సింహనాదములు, రథముల భాంకారములు, బాణముల కేంకారములు, అశ్వముల సకిలింపులు. ఏనుగుల ఘీంకారములు, ధనుష్టంకారములు నిండి లోకమంతయూ శబ్దమయ మాయెను. దేవదానవులు వదిలిన బాణముల రాపిడి వలన పుట్టిన జ్వాలలను చూచిన ప్రపంచ మంతయూ అకాలప్రళయము సంభవించినదని తలచెను.

ప్రకాశించు ఆయుధములను ధరించిన రాక్షస సైన్యము చంచలములైన మెరుపులతో ప్రకాశించుచు మేఘములతో కప్పబడిన రాత్రివలె శోభించెను. మహాఘోరమైన ఆ యుద్ధములో రాక్షసులు ప్రయోగించిన పర్వతములను శీఘ్రవిక్రములైన దేవతలు బాణములచే చూర్ణము చేసిరి. మరికొందరు ఏనుగులతో ఏనుగులను, రథములతో రథములను, అశ్వములతో అశ్వములను, గదలతో మరి కొందరిని కొట్టుచుండిరి. పరిఘలతో కొట్టబడిన కొందరు నెత్తుటి బురదలో పడిరి. ప్రాణములను కోల్పోయిన కొందరు విమానమును ఆశ్రయించిరి. యుద్ధమున దేవతలచే చంపబడిన రాక్షసులు దేవత్వమును పొంది రాక్షసులతో యుద్ధమునకు తలపడిరి. అతి భయంకరులైన రాక్షసులు దేవతలచే కొట్టబడి, మిక్కిలి కోపించినవారై, పలువిధములైన శస్త్రములతో దేవతలను కొట్టిరి. రాళ్ళతో, భిండివాలములతో, ఖడ్గములతో, గొడ్డళ్ళతో, తోమరములతో, పరిఘలతో, చిన్నకత్తులతో, కుంతములతో, చక్రములతో, శంఖులతో, రోకళ్ళతో, అంకుశములతో, నాగళ్ళతో, పట్టిసములతో, శక్తులతో గులకరాళ్ళతో, శతఘ్నులతో, పాశములతో, అరచేతులతో, పిడికిళ్ళతో, శూలములతో, బాణములతో, ముద్గరములతో కూడిన క్షిపణులతో, రథములతో, అశ్వములతో, ఏనుగులతో, పదాతులతో సంకులమై యుద్ధము వృద్ధి పొందెను. దేవతలు కూడా పలు విధములైన అస్త్రములను రాక్షసులపై ప్రయోగించిరి. ఇట్లు ఎనిమిది వేల సంవత్సరములు భయంకరమైన యుద్ధము సాగెను.

తరువాత రాక్షస బలము వృద్ధి చెందగా పరాజయము పాలైన దేవతలు స్వర్గమును విడిచిపెట్టి అందరూ భయముతో పారిపోయిరి. మానవరూపముతో రహస్యముగా భూలోకమున తిరుగుచుండిరి. విరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి నారాయణుని యందు భక్తి కలవాడై, మూడు లోకములను తిరుగులేని ఐశ్వర్యముచే పెరిగిన కాంతి, బలము కలవాడై అనుభవించ సాగెను. శ్రీమహా విష్ణువును సంతోషింప చేయుటకు అశ్వమేధ యాగములచే పూజించెను. స్వర్గమున ఇంద్రత్వమును దిక్పాలత్వమును కూడా నిర్వహించెను. దేవతల ప్రీతికొఱకు బ్రాహ్మణులుచేయు యాగములలో అన్నిటిలో దైత్య రాజైన బలిచక్రవర్తియే హవిస్సులను భుజించుచుండెను. దేవమాతయగు అదితి తన పుత్రుల దురవస్థను చూచి మిక్కిలి దుఃఖించినదై నేనిచట వ్యర్థముగా నివసించుచున్నానని తలచి హిమవత్పర్వతమునకు వెళ్ళెను. ఇంద్రునికి ఐశ్వర్యమును, దైత్యులకు పరాజయమును కోరుచు హరిని ధ్యానించుచు మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సును చేయనారంభించెను. కొంతకాలము కూర్చొని, మరికొంతకాలము నిలబడి, కొంతకాలము ఒక కాలు మీద నిలబడి, మరికొంతకాలము కాలు కొనమీద నిలబడి, కొంతకాలము పండ్లను భుజించుచు, తరువాత ఎండుటాకులకును భుజించుచు, తరువాత నీరు మాత్రమే తీసుకొని, తరువాత గాలిని భుజించుచు, ఆ తరువాత నిరాహారముగా మనసుతో సచ్చిదానంద స్వరూపుడైన శ్రీమన్నారాయణుని ధ్యానము చేయుచుండెను. ఇట్లు అదితి వేయి దివ్యవత్సరములు తపస్సును చేసెను. అంతులేని ఆమె తపస్సును విని మాయావులైన దితిపుత్రులు బలిచక్రవర్తిచే పంపబడి దేవతారూపముతో అదితి వద్దకువచ్చి ఇట్లు పలికిరి. “ఓ తల్లీ! శరీరమును శుష్కింపచేయు తపస్సు నెందుకు చేయుచున్నావు? దితి పుత్రులకు తెలిసినచో చాలా కష్టములు వచ్చును. శరీరమును శుష్కింపచేయు, పలు దుఃఖములను కలిగించు ఈ తపస్సును వదిలిపెట్టుము. శ్రమ వలన కలిగెడు పుణ్యమును పండితులు అభినందించరు. ధర్మమును సాధించుటయందు ఆసక్తి కలవారు శరీరమును ప్రయత్నముతో కాపాడుకొనవలయును. శరీరమును ఉపేక్షించి వారు ఆత్మఘాతకులు అగుదురు. కావున నీవు ఆనందముగా ఉండుము. పుత్రులమగు మమ్ములను బాధించకుము. ఓ తల్లీ! తల్లిలేని వారు చచ్చినవారితో సమానులు. ఆవులు, పశువులు, వృక్షములు మాతృహీనములై చనిపోయినవాటివలె ఆనందమును పొందజాలవు. దరిద్రుడైనను, రోగియైనను, దేశాంతరమునకు వెళ్ళిన వాడైనను తల్లిని చూచినంతనే పరమానందమును పొందును. అన్నమును, నీటిని, ధనాదులను ప్రియులను కూడా ఎప్పుడో ఒకప్పుడు విముఖుడై వదులును గాని తల్లిని విడుచువాడెవడును ఉండడు. తల్లి, ధర్మపరాయణులైన పతివ్రత యగు స్త్రీ ఎవరింట ఉండదో వాడు అడవికే వెళ్ళవలయును. తల్లిలేని మానవుడు నారాయణ భక్తిలేని ధర్మము వంటివాడు. సద్భోగములేని ధనము, భార్యాపుత్రులులేని ఇల్లు వంటివాడు. కావున దుఃఖముతో ఆర్తులైన నీ పుత్రులను కాపాడుము.” ఇట్లు రాక్షసులు పలుకుచున్ననూ అదితి సమాధినుండి చలించలేదు.

ఇట్లు పలికిన, దేవరూపములో ఉన్న రాక్షసులు హరినే ధ్యానించుచు చలించకయున్న అదితిని చూచి కోపముతో చంపుటకు సంకల్పించిరి. ప్రళయకాలమునందలి మేఘముల వలె కోపముతో ఎఱ్ఱబారిన కన్నులు గలవారై కోరలనుండి అగ్నిని సృజించిరి. ఆ వహ్ని అరణ్యమును అంతటిని కాల్చి వేసెను. అనేక ప్రాణులతో ఆకులముగానున్న నూరు యోజనములు విస్తీర్ణముగల ఆ వనమును దహించిన అగ్నియే అదితిని హింసించదలచిన దైత్యులను కూడా దహించివేసెను. రాక్షసులను సంహరించునది, భక్తులను అనుగ్రహించునది అగు శ్రీమహావిష్ణువుయొక్క సుదర్శనచక్రముచే కాపాడబడిన అదితి వేల సంవత్సరముల నుండి శ్రీమహావిష్ణువును ధ్యానించుచున్నదై మిగిలి యుండెను. (1/10)