బ్రహ్మపురాణ ఇతిహాస కథనము

సూతమహర్షి పలికెను: ఇట్లు సనత్కుమార మహర్షి మాటలను వినిన నారదమహర్సి సంతోషముతో శ్రేయస్సును తెలియగోరి ప్రీతి చెందినవాడై ఇట్లు పలికెను.

నారదమహర్షి పలికెను: ఓ మహానుభావా అన్ని తంత్రములలో పరమోత్తమమైన, సర్వలోకోప కారకమగు మహాతంత్రమును నీవు చెప్పితివి. బాగుబాగు. ఇపుడు ఉత్తమమగు పురాణాఖ్యానమును వినగోరుచున్నాను. నీవు సర్వజ్ఞుడవు కావున ఏ యే పురాణమున ఏ యే అఖ్యానములు ఉన్నవో తెలుపుము పురాణాఖ్యానము అంతటిని తెలియునట్లుగా చెప్పుము.

సూత మహర్షి: ఓ బ్రాహ్మణోత్తములారా! నారదుడు పలికిన శుభకరమగు ఆ మాటను వినిన సనత్కుమారుడు పురాణాఖ్యాన ప్రశ్నకు బదులుగా ఇట్లు పలికెను.

సనత్కుమార మహర్షి పలికెను: ఓ నారదా! నానా కల్పసముద్భవము. నానా కథా సమాయుక్తము, అద్భుతము, బహువిస్తరము అగు పురాణాఖ్యానము సనాతన మహర్షికి తెలిసినంత ఇతరులకు తెలియదు. కావున నీవు బహుకల్పములు తెలిసిన వారందరిలో శ్రేష్టుడైన సనాతన మహర్షిని అడుగుము. ఇట్లు నారదమహర్షి సనత్కుమార మహర్షి మాటలను విని సనాతన మహర్షికి నమస్కరించి వినయముతో ఇట్లు పలికెను.

నారద మహర్షి పలికెను: బ్రాహ్మణోత్తమా! పురాణజ్ఞులలో శ్రేష్టుడా. జ్ఞాన విజ్ఞాన తత్పర! నామసమగ్రముగా పురాణ విభాగమును తెలియజెప్పుము. ఈ పురాణములను వినినచో అన్ని వినినట్లగును. తెలిసినచో తెలియును. చేసినచో అన్నియూ చేసినట్లగును. వర్ణాశ్రమాచార ధర్మముల సాక్షాత్కారమును పొందును. పురాణములు ఎన్ని? కొలతలో ఎన్ని సంఖ్యల శ్లోకములు కలవి? ఏ ఏ కథలు కలవి? దానినంతటిని నాకు చెప్పుము. చాతుర్వర్ణ్యాశ్రమ కథలను నానావ్రత కథలను సృష్టి క్రమముతో వంశ కథలను చక్కగా తెలిసినవారు నీకంటే ఇతరులు లేరు. కావున నీవు నాకు సర్వసందేహభంజకమగు పురాణాఖ్యానమును తెలియజేయుము.

సూత ఉవాచ: అంతట జ్ఞానశ్రేష్ఠుడగు సనాతన మహర్షి నారద భాషితమును విని క్షణకాలము నారాయణుని ధ్యానించి ఇట్లు పలికెను.

సనాతన మహర్షి పలికెను: ఓ మునిసత్తమా? పురాణ కథలను తెలియుటకు కోరిక కలుగుట చాలా మంచిది. పూర్వము బ్రహ్మదేవుడు పుత్ర స్నేహముతో మరీచ్యాది ఋషులకు చెప్పిన దానిని నీకు చెప్పెదను. ఒకప్పుడు బ్రహ్మపుత్రుడు మరీచి మహర్షి స్వాధ్యాయ శ్రుతసంపన్నుడు, వేదవేదాంగపారగుడు లోకభావనుడు తన తండ్రియగు బ్రహ్మను సమీపించి భక్తిచే నమస్కరించి నీవు నన్ను అడిగిన పురాణాఖ్యానమును ప్రశ్నించెను.

మరీచి పలికెను: ఓ భగవంతుడా! దేవదేవేశ! లోకముల సృష్టిలయకారణా! సర్వజ్ఞా! సర్వ కళ్యాణా! సర్వాధ్యక్ష్యా! నీకు నమస్కారము. ఓ తండ్రీ! నిన్ను సేవించు నాకు పురాణ స్వరూపమును, లక్షణమును, ప్రమాణమును, చెప్పువానిని, అడుగువాని గురించి తెలుపుము.

బ్రహ్మ పలికెను: నాయనా. పురాణ సముచ్చయమును చెప్పెదను వినుము. ఈ పురాణ సముచ్చయము తెలిసినచో చరాచర సహితమగు వాఙ్మయమంతయూ తెలియును. మొదట అన్ని కల్పములలో ఒకటే పురాణము ఉండెడిది. ఇదియే చతుర్వర్గమూలము. నూరుకోట్ల శ్లోకములు కల విస్తృత గ్రంథము. సర్వ శాస్త్రములు ఈ పురాణము నుండియే ప్రవర్తించినవి. ఎంతకాలము గడచిననూ పురాణమును ఎవ్వరూ గ్రహించకపోవుటను చూచి మహామతియగు శ్రీహరి ద్వాపర యుగమున వ్యాసునిగా అవతరించి నాలుగు లక్షల శ్లోకములుగా, పదునెనిమిది పురాణములుగా భూలోకమున అవతరింపచేసెను. ఇప్పటికి దేవలోకమున పురాణము శతకోటి ప్రవిస్తరముగా ఉన్నది. ఈ పురాణసారమునే నాలుగు లక్షల శ్లోకములలో వర్ణించిరి. బ్రహ్మపురాణము, పద్మపురాణము, విష్ణుపురాణము, వాయుపురాణము, భాగవతపురాణము, నారదీయ పురాణము, మార్కండేయ పురాణము, అగ్నిపురాణము, భవిష్యపురాణము, బ్రహ్మవైవర్త పురాణము, లింగపురాణము, వరాహపురాణము, స్కాందపురాణము, వామనపురాణము, కూర్మపురాణము, మత్స్యపురాణము, గరుడపురాణము, బ్రహ్మాండపురాణము అని పురాణములు పదునెనిమిది. ఒకే కథానక సూత్రము వక్తకు శ్రోతకు ఉండును. దానినంతటిని సంగ్రహముగా చెప్పెదను వినుము.

ఆ పురాణములలో మొదటిది సర్వలోకహితమును కలిగించునది బ్రహ్మపురాణము. వేదజ్ఞుడు మహానుభావుడగు వ్యాసమహర్షిచే చెప్పబడినది. ఈ బ్రహ్మపురాణమే అన్ని పురాణములలో మొదటిది. ధర్మకార్థమోక్షముల నిచ్చునది. నానాఖ్యాన ఇతిహాసముతో కూడినది. పదివేల శ్లోకములు కలది. ఈ బ్రహ్మపురాణమున దేవ దానవుల ఉత్పత్తి. దక్షాది ప్రజాపతుల ఉత్పత్తి, లోకేశ్వరుడుగు సూర్యభగవానుని పరమ పవిత్రము మహాపాతక నాశకమగు వంశానుకీర్తనము, పరమానంద స్వరూపుడగు శ్రీ మహావిష్ణువు నాలుగు రూపములుగా అవతరించిన శ్రీరామచంద్రుని కథ, సోమ వంశ వర్ణనము, జగదీశుడగు శ్రీకృష్ణ చరితము, సర్వద్వీపముల సర్వవర్షముల వర్ణన, పాతాళ స్వర్గముల వర్ణన, అను నరక కథలు, సూర్యస్తుతి కథ, పార్వతీదేవి పుట్టుక, వివాహము, దక్షప్రజాపతి కథ, ఏకామ్రక్షేత్ర వర్ణనము, ఈ కథలు చెప్పబడినవి. ఇంతటితో బ్రహ్మ పురాణమున పూర్వభాగము సమాప్తమగును. ఇక ఉత్తర భాగమున పురుషోత్తమ వర్ణనము. తీర్థయాత్రా విధాన విస్తార వర్ణనము. సవిస్తరముగా కృష్ణ చరితము, యమలోక వర్ణనము, పితృ శ్రాద్ధ విధానము, వర్ణాశ్రమ ధర్మముల విపుల వర్ణనము బ్రహ్మవాద సదుద్దేశము, పురాణ ప్రశంస, విపులముగా వర్ణించబడినవి. విష్ణుధర్మ అఖ్యానము, ప్రళయవర్ణనము, యోగసాంఖ్య సమాఖ్యానములు చెప్పబడినవి. ఇట్లు బ్రహ్మపురాణము రెండు భాగములుగా చెప్పబడినది. ఈ బ్రహ్మపురాణము సర్వ పాపహారము. సర్వసౌఖ్య ప్రదాయకము. సూతశానక సంవాదము. భుక్తిముక్తి ప్రదాయకము. వైశాఖ పూర్ణిమ తిథియందు ఈ బ్రహ్మ పురాణము సర్వ పాపహరము. సర్వ సౌఖ్యప్రదాయకము. సూత శౌనక సంవాదము. భుక్తి ముక్తి ప్రదాయకము. వైశాఖ పూర్ణిమ తిథియందు ఈ బ్రహ్మపురాణమును వ్రాసి బంగారముతో గోవుతో భక్తితో బ్రాహ్మణునకు దానము చేయవలెను. పౌరాణికుని చక్కగా పూజించి వస్త్రభోజ్య భూషణాదులను ఇచ్చి బ్రహ్మపురాణమును ఇచ్చినచో సూర్యచంద్రులుండు వరకు బ్రహ్మలోకమున నివసించును. బ్రహ్మపురాణమున ఉన్న కథాను క్రమణికను చదివినవాడు, వినినవాడు అన్ని పురాణములను చెప్పుటవలన వినుటవలన కలుగు ఫలితమును పొందును. బ్రహ్మపురాణమును సంపూర్ణముగా జితేంద్రియుడై వినినవాడు హవిస్సును మాత్రమే భుజించి నియమబద్ధముగా ఉండినచో బ్రహ్మలోకమును పొందును. ఇంతయేల? బ్రహ్మపురాణ సంకీర్తనము వలన కోరికలను అన్నింటిని పొందును. (4/92)