మహేశ మంత్ర కథనము

సనత్కుమార మహర్షి పలికెను: ఇక ఇపుడు సర్వార్థ సాధకమగు మహేశమంత్రమును చెప్పెదను. ఈ మంత్రోపాసన వలన మానవుడు భుక్తిముక్తులను పొందగలడు. ‘నమః శివాయ’ అనునది పంచాక్షర మంత్రము. ‘క్షం’ అనుదానిని మొదట చేర్చినచో షడక్షర మంత్రమగును. వాయు దేవుడు ముని. పంక్తి ఛందస్సు. ఈశ్వరుడు దేవత. సాధకుడు మంత్రములోని షడక్షరములచే షడంగములను న్యాసము చేయవలెను. మంత్ర వర్ణాదికములను మంత్రమూర్తులను యధాక్రమముగా న్యాసము కావించవలెను. తర్జనీ మధ్యమ కనిష్ఠక అంతుష్ఠములందు తత్పురుష అఘోరభవ వామేశ సంజ్ఞలుండును. వక్త్ర హృత్పాద గుహ్యములందు శిరస్సున, తూర్పు దక్షిణ పశ్చిమోత్తర మధ్య వక్త్రములందు అయిదింటి యందు మంత్రాంగ న్యాసమును గావించి తరువాత రక్షణ కొరకు గోలకన్యాసమును చేయవలెను. హృదయమున, వక్త్రము, భుజములందు, ఊరువులందు కంఠనాభి పార్శ్వద్వయములందు, పృష్ఠమున హృదయమున శిరస్సున, వదననేత్ర నాసికలయందు, బాహువులందు, పాదసంధులందు న్యాసమును చేయవలెను. శిరోవదన హృత్కుక్షి ఊరు పాదద్వయ హృదయ వక్త్రాంబుజ టంకమ్మగా భయంకరములందు, వక్త్రాంస హృత్పపాదోరు జఠరములందు క్రమముగా న్యాసమును కావించవలెను. ఈ స్థానములందు మూల మంత్రము యొక్క అక్షర షట్కమును యథావిధిగా న్యాసమును గావించవలెను. మూర్థ ఫాలోదరాంస హృదయములందు అవర్ణములను మరల న్యాసము కావించవలెను. తరువాత ఈ మంత్రముచే వ్యాపకముగా ఆచరించవలెను. అనంత రూపునకు, జ్యోతిర్లింగా మృతాత్మకు, చతుర్మూర్తి వసువునకు, ఛాయాభాసితాంగునకు శంభువునకు నమస్కారము. ఇట్లు అంగన్యాసమును గావించి పార్వతీపతిని ధ్యానించవలెను. మహేశ్వరుని రజతాద్రి సన్నికావుని, చారుచంద్రావతంసుని, రత్నాకల్పోజ్జ్వలాంగుని, పరశ్వధవరాభీతి మృగహస్తుని, శుభాననుని, పద్మాసీనుని, అంతటా దేవతల సమూహములచే స్తోత్రము చేయబడుచున్న వానిని, వ్యాఘ్ర చర్మధారిని, విశ్వాద్యుని, విశ్వరూపిని, త్రినేత్రుని, పంచవక్త్రుని, సర్వభీతిహరుని, శివుని ధ్యానించవలయును. మూడు లక్షల జపమును చేయవలెను. మూడువేలు పాయసముచే హోమమును గావించవలెను. అపుడు సాధకాభీష్ట ప్రదమగు మంత్రము సిద్ధించును. తరువాత వామాది నవశక్తి యుతమగు పీఠమున దేవుని పూజించవలెను. వామా, జ్యేష్ఠా, రౌద్రీ, కాలీ, కలప దారికా, వికారిణీ, బలాద్యా, వికరిణీ, బలప్రమథనీ, సర్వభూత దమనీ, మనోన్మనీ, అనునవి శక్తులు. “ఓం నమో భగవతే సకలాది గుణాత్మశక్తి భక్తాయ అనంతాయయోగ పీఠాత్మనే నమః” అను మంత్రముచే గిరిజాపతికి ఆసనమును కల్పించవలెను. మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తి యందు శివుని ఆవాహన కావించి పూజించవలెను. కర్ణిక అందు మూర్తులను ఈశుని ఈశాన దిగ్గజమును పూజించవలెను. శుద్ధ స్ఫటిక సంకాశుడగు ఈశుని పూజించవలెను. దిక్కున తత్పురుషాధికులను పీతాంజన శ్వేత రక్తవర్ణులను ప్రధాన సదృశాయుధులను, చతుర్వక్త్రులను యధావిధిగా పూజించవలెను. కోణములందు తేజోరూపులగు నివృత్త్యాద్యులను యధాక్రమముగా పూజించవలెను. కేసరములలో నున్న అంగములను విఘ్ణేశులను పన్నగులను పూజించవలెను. సుఖనాముడగు అనంతుని, శివోత్తముని, ఏకనేత్రుని, ఏకరుద్రుని, త్రిమూర్తిని, తరువాత శ్రీకంఠుని, శిఖండిని క్రమముగా రక్తహీత సితావక్త కృష్ణ రక్తాంజనా సిత వర్ణులను, కిరీటార్పిత బాలేన్దులను పద్మస్థులను, భూషణాన్వితులను, త్రినేత్రులను, శూలవజ్రాస్త్ర చాపహస్తులను మనోరములను పూజించవలెను. తరువాత ఉత్తరాది దిక్కులందు రుద్రుని, చండేశ్వరుని పూజించవలెను. తరువాత నంది మహాకాల గణేశ వృషభములను పూజించవలెను. తరువాత భృంగిని, రిటిని, స్కందుని, పద్మాసనస్థులనగా స్వర్ణ తోయారుణ శ్యామ ముక్తేందు సిత పాటల వర్ణులను పూజించవలెను. తరువాత వజ్రాద్యాయుధ సంయుతులగు ఇంద్రాదులను పూజించవలెను. ఇట్లు ఈశ్వరుని పూజించి ప్రతినిత్యము వేయి జపమును చేయవలెను. ఇట్లు జపించినచో సర్వపాప వినిర్ముక్తుడై అభీష్టమును పొందగలడు. రెండువేలు జపించినచో రోగముక్తుడగును. మూడువేలు జపించినచో దీర్ఘాయుష్యమును పొందును. ఇట్లు ఒక్కొక్క వేయి అధికముగా జపించినచో సర్వాభీష్టములను పొందును. నేయి కలిపిన శుద్ధతిలలచే లక్ష హోమమును చేసినచో ఉత్పాతముల వలన కలుగు క్లేశములన్నియూ నశించును. కోటి జపించినచో సాక్షాత్తుగా శివుడే అగును.

శక్తి రుద్ధమగు షడక్షర మంత్రము. అట్లే అష్టాక్షర మంత్రము కూడా కలదు. ఈ మంత్రమునకు ఋషి, ఛందస్సు పూర్వ మంత్రమునకు వలెనే ఉందురు. ఉమాపతి దేవత. అంగములన్నియూ పూర్వోక్తములే. ప్రశాంతుడగు ఈశ్వరుని ధ్యానించవలెను. బంధూక పుష్పసన్నిభుడు, త్రినేత్రుడు, బాలేందుధరుడు, చిరునవ్వు ముఖముగలవాడు, కరములలో శూలమును కపాలమును, వరదా భయములను ధరించువాడు, చారుభూషణ, భూషితుడు, వామోరువున ఉన్న పార్వతిని బాహువులచే ఆశ్లేషించి ఉన్న ఈశ్వరుని మనసుచే హృదయమున ధ్యానించవలెను. తొమ్మిది లక్షలు జపించవలెను. తొమ్మిదివేలు యధావిధిగా మధుప్లుతములగు అరగ్వధ సమిధలచే హోమమును చేయవలెను. ప్రాగుక్త పీఠమున గంధ పుష్పములచే ఉమాపతిని పూజించవలెను. పూర్వమువలె అంగావృత్తులచే హృల్లేఖాదులను పూజించవలెను. మధ్య ప్రాగ్దక్షిణోదీచ్య పశ్చిమ దిక్కులందు యధావిధిగా పూజించవలెను. పూర్వాది పత్రములందు వృషభాదులను యధాక్రమముగా పూజించవలెను. శూలటం కాక్షవలయ కమండలులచే శోభించు హస్తములు కలవాడు, రక్తాకారుడు, త్రినయనుడు అగు చండేశుని పూజించవలెను. తరువాత చక్రశంఖాభయాభీష్టకరురాలు మరకత ప్రభయగు దుర్గను సౌమ్యను త్రినేత్రను చారుభూషణను పూజించవలెను. కల్పశాఖాంతరమున ఘంటాధారిని, ద్వాదశినేత్రుని, బాలార్క సన్నిభుని, శిశువును, సుందరుని షణ్ముఖుని పూజించవలెను. తరువాత సౌమ్యుడగు నందిని పూజించవలెను. తరువాత రత్న భూషణ మండితుని పరశ్వధవరా భీతిటంకధారిని శ్యామ విగ్రహుని, పాశాంకుశ వరాభీష్టధారిని, కుంకుమసంకాశుని విఘ్న నాయకుని పూజించవలెను. తరువాత చంద్రార్థ కృతశేఖరుడు, శ్యాముడు, రక్తోత్పలకరుడు, వామాంకన్యస్త సత్కరుడు, ద్వినేత్రుడు, రక్తవస్త్రాఢ్యుడు అగు సేనాపతిని పూజించవలెను. తరువాత యధోక్త లక్షణములుకల బ్రాహ్మీ మొదలగు అష్టమాతృకలను పూజించవలెను. తరువాత వారి వారి దిక్కులందు ఇంద్రాది లోకపాలురకు వారి ఆయుధములను బయట పూజించవలెను. ఇట్లు సాధకుడు ఉమాపతియగు శంకరుని పూజించినచో అన్ని లోకములలో అతను సౌభాగ్యశ్రేయస్సులలో ఉత్తముడగును.

సాంత సద్యాంత సంయుక్తము, బిందు భూషిత మస్తకము ప్రాసాదము అను మంత్రము సేవించు వారికి సర్వాభీష్ట ఫలప్రదము. షడ్దీర్ఘయుక్త బీజములచే షడంగ కల్పన చేయవలెను. ఈ మంత్రమునకు కూడా షడక్షర మంత్రమువలె మున్యాదులు చెప్పబడిరి. సాధకుడు అంగుష్ఠాదులందు ఈశానాదులకు వ్యాసము కావించవలెను. ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు అని క్రమముగా తెలియవలెను. ఉకారాదులకు పంచహ్రస్వములచే విలోమములను సంయుతముగా ఆయా యంగుళములచే ఆయా బీజములను వ్యాసము చేయవలెను. శిరోవదన హృద్గుహ్య పాదదేశమున యధాక్రమముగా ఊర్థ్వప్రాగ్దక్షిణోదీచ్య పశ్చిమ ముఖములందు న్యాసము చేయవలెను. తరువాత ప్రాజ్ఞుడు తన శరీరమునందు ముప్పది ఎనిమిది కలలను న్యాసము గావించవలెను. ఈశానాది ఋక్కులను క్రమమును అనుసరించి అంగుష్ఠాది కనిష్ఠాన్తము అంగుళముల యందు న్యాసమును గావించవలెను. మరల అదే ఋక్కులను మూర్ధ్వస్య హృదయ పాదముల యందు ఉంచవలెను. మరల వక్త్రమూర్ధాదులందు అంగకల్పన గావించవలెను. తార పంచకమును ఉచ్ఛరించి “సర్వజ్ఞాయ నమః” అని హృదయమున, అమృత తేజోమాలిని తృప్తాయ బ్రహ్మశిరసే అని శిరస్సున “జ్వలితం శిఖి. శిఖాయా నాది బోధాయ” అని శిఖ యందు, “వజ్రిణే వజ్రహస్తాయ స్వతంత్రాయ కవచమ్” అని కవచమున “సౌంఖాం హౌంతోం గుహ్య శక్తియే” అని నేత్రమున, “శ్లీపశుం హుంఫట్” అని అస్త్రమును ఇట్లు షడంగ కల్పన చేయవలెను. పూర్వ దక్షిణ పశ్చాత్ ప్రాక్ సౌమ్య మధ్యములను అయిదు దిక్కులందు, అయిదు వక్త్రములందు ఈశాన కలలను అయిదింటిని న్యాసమును గావించవలెను. “ఈశాన స్సర్వ విద్యానాం” అనునది శశినీ అనుపేరుగల ప్రథమ కళ. “ఈశ్వర స్సర్వ భూతానాం” అనునది మంగళా రెండవ కల. “బ్రహ్మాధిపతిః బ్రహ్మణోఽధిపతి” అనునది బ్రహ్మెష్టద యను మూడవకల “బ్రహ్మా శివోమే అస్తు” అనునది మరీచి యను నాలుగవ కళ సదాశివుని అందు ఉంచవలెను. అయిదవ కళ అంశుమాలిని యనునది. ఇవి అన్నియు ప్రణవాదులు నమోంతములుగా చెప్పుకొనవలెను. పూర్వ పశ్చిమయా మ్యోదఙ్ వక్త్రము లందు నాలుగు పురుష కలలను న్యాసమును గావించవలెను “తత్పురుషాయ విద్మహే” అనుది మొదటికల. దీనిని శాంతి అందురు. “మహా దేవాయ ధీమహి” అనునది రెండవది. “తన్నో రుద్రః” అనునది తృతీయ. “ప్రచోదయాత్” అనునది నాలుగవది. ఈ నాలుగు మొదట ప్రణవము చివరకు అనునవి కలుగు ఉండును. హృదయమున, భుజద్వయమున, నాభియందు, కుక్షియందు, పృష్ఠమున, వక్షస్థలమున, ఉరస్సున ఎనిమిది కలలను యధావిధిగా న్యాసమును చేయవలెను. ‘అఘోరేభ్యః’ అనునది మొదటి కల. “అధఘోరేభ్యః” అనునది మోహయను రెండవ కళ, ‘అఘోర’ అనునది క్షమా, అను మూడవ కళ. “ఘోరతరేభ్యః” అనునది నాలుగవకళ. ‘సర్వేభ్యః’ అనునది అయిదవకళ. “సర్వశర్వేభ్యః’ అనునది అరవకళ. “నమస్తే అస్తు” అని క్షుధా అను ఏడవకళ. “రుద్రరూపేభ్యః’ అని తృషాయను అష్టమీకల. ఇవన్నియూ ధ్రువాదికములు నమోన్వితములుగా ఉండును. గుహ్యయుగ్మ ఊరు యుగ్మములందు జాను జంఘస్ఫిజములందు, కటియందు, పార్శ్వద్వయము నందు పదమూడు వామకలలను వ్యాసము గావించవలెను. “ఓం వామదేవాయ నమః’ ‘ అని మొదటి కలను రుజాయందురు. “ఓం జ్యేష్ఠాయ నమః”, అనునది రక్షాయను రెండవ కళ. “ఓం శ్రేష్ఠాయ నమః” అనునది మూడవది ‘ఓం కాలాయ నమః’ అనునది నాలుగవది. “ఓం బలాయ నమః” అనునది ఏడవది. “ఓం వికరణాయ నమః” అనునది ఎనిమిదవది. “ఓం బలాయ నమః” అనునది తొమ్మిదవది. “ఓం ప్రమథనాయ నమః” అనునది పదియవ కళ. “ఓం సర్వభూత దమనాయ నమః” అనునది పదకొండవ కళ. “ఓం నమః” అనునది పన్నెండవ కళ. “ఓం మనోన్మన్యై నమః” అనునది జ్వరాయను పదమూడవ కళ. పాద బాహుస్తన నాసమూర్ధా భుజ యుగ్మములందు వ్యాసము చేయవలెను. సద్యోజాత భవములగు ఎనిమిది మంత్రములు కలలుంచవలెను. “సద్యో జాతం ప్రపద్యామి” అనునది సిద్ధియను మొదటి కల. “సద్యోజాతాయ నమః” అనునది వృద్ధియను రెండవ కళ. “ఓం భవాయ నమః” అనునది మూడవది “ఓం అభవాయ నమః” అనునది నాలుగవది. లక్ష్మీ అనునది. “ఓం నాతి భవాయ నమః” అనునది అయిదవది. “ఓం భవాయ నమః” అనునది ప్రాజ్ఞా అను ఆరవకళ. “ఓం అభవాయ నమః” అనునది ఏడవది. “ఓం ఉద్భవాయ నమః” అనునది ఎనిమిదవ కళ. ఇట్లు మొత్తము ముప్పది ఎనిమిది కలలు చెప్పబడినవి. ఇందులో అయిదు బ్రహ్మ పదాదికములు. ఇట్లు న్యానదేహుడగు వాడు స్వయముగా గంగాధరుడగును. అపుడు సావధానమనస్కుడై ఇట్లు సదాశివుని ధ్యానించవలెను. నిత పీత అనిత శ్వేత జపావర్ణములు కల అయిదు ముఖములతో నేత్రములతో ఉన్నవాడు, బాలేందు శేఖరుడు, కోటి పూర్ణేందునిభుడు, శూలటంక కృపాణ వజ్రాగ్న్యహిపతులను ధరించువాడు సర్వభూషణ భూషితుడు, ఘంటాపాశ వరాభయములను ధరించువాడుగానున్న సదాశివుని ధ్యానించి మంత్రమును అయిదు లక్షలు జపించవలెను. తేనె కలిపిన గన్నేరు పూవులచే హోమమును చేయవలెను. పూర్వోక్త పీఠమున పూజించవలెను. మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి దేవుని ఆవాహన గావించి ఆమూర్తియందు ఆవరణలచే పూజించవలయును. శక్తిని డమరుకాభయ వరములను ధరించువానిని త్రినేత్రుని ఈశానుని శుభ్రవర్ణుని ఈశాన్య దిక్కున పూజించవలెను. పరశు ఏణ వరాభీతులను ధరించువాడు విద్యుదుజ్జ్వలుడు, చతుర్ముఖుడు, త్రినేత్రుడు అగు తత్పురుషుని తూర్పు దిక్కున పూజించవలెను. అక్షస్రజమును, వేద పాశములను ఋషిని డమరుకను, ఖట్వాంగమును, నిశిత శూలమును, కపాలమును ధరించువాడు, అంజనాభుడు, చతుర్వక్త్రుడు, భీమదంతుడు భయావహుడు, త్రినేత్రుడు అగు అఘోరుని దక్షిణ దిక్కున పూజించవలెను. కుంకుమ సంకాశుడు, చతుర్వక్త్రుడు, త్రిలోచనుడు, హరిణాక్ష గుణాభీతి వరహస్తుడు, చతుర్ముఖుడు బాలేందు శేఖరుడు యగు వామదేవుని పశ్చిమమున పూజించవలెను. కర్పూరేందు నిభుడు సౌమ్యుడు త్రిలోచనుడు వరాభయాక్ష వలయ కుఠారములను ధరించువాడు, విలాసి, స్మేర వక్త్రుడు అగు సద్యోజాతుని ఉత్తరమున పూజించవలెను. కోణములందు నివృత్త్యాదులగు తేజోరూపులగు కలలను క్రమముగా పూజించవలెను. చుట్టూ పత్రములందు అనంతాదులగు విఘ్నేశ్వరులను పూజించవలెను. తరువాత బాహ్యమున ఉమాదికమును. ఆయుధ సహితులగు ఇంద్రాదులను పూజించవలెను. ఇట్లు ఉత్తమ భక్తి కలవాడై దేవేశుని చక్కగా పూజించి నృత్యగీతాదులచే సుందరములగు స్తోత్రములచే దేవేశుని సంతోషింపజేయవలెను.

తారము మాయా వియద్బిందు మనుస్వర సమన్వితముగా పంచాఓరయుక్తమగు అష్టాక్షరీ మంత్రము తంత్ర శాస్త్ర సమ్మతము. ఈ మంత్రమునకు అంగన్యాసాదికము అంతటిని పంచాక్షరీ మంత్రమునకు వలెనే ఆచరించవలెను. సిందూర సంకాశుడు శోభించు రత్నకిరీటము కలవాడు, చంద్రమౌళి, దివ్య భూషాంగరాగములు కలవాడు, నాగ యజ్ఞోపవీతమును ధరించినవాడు. వామోరువున ఉన్న ప్రియురాలి స్తనములపై ఉంచిన చేయి కలవాడు. వేదటంకేష్టా భయధారి అగు శివుని ధ్యానించవలెను. మంత్రమును ఎనిమిది లక్షలు జపించవలెను. ఎనిమిదివేలు నేయితో కలిపిన పాయసముతో హోమమును గావించవలెను. పీఠమున మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి మొదట అంగములచే ఆవరణ పూజను గావించి, తరువాత ఉమాదులతో కూడియున్న వారిని పూజించి, లోకనాయకుల నారాధించి, వారి ఆయుధములను పూజించవలెను. ఇట్లు సాధ కోత్తముడు ప్రతిదినము పూజించవలెను. ఇట్లు చేసినచో పుత్ర పౌత్ర ధనాదులను పొంది ఆనందించును. ఓంకారము లం సవర్ణేందు భృగువు సర్గ సమన్వితము అక్షరాత్మకమగునది మృత్యుంజయ మంత్రముగా చెప్పబడినది. (ఓం లం త్ర్యంబకాయ నమః) అనునది. ఈ మంత్రమునకు కహోల ఋషి గాయత్రీ ఛందస్సు. మహా దేవుడగు మృత్యుంజయుడు దేవత. దీర్ఘ యుక్తమగు భృగువుచే షడంగ న్యాసమును చేయవలెయును. సూర్య చంద్రాగ్ని నేత్రుడు, స్మితాస్యుడు, యుగ్మ పద్మగుడు, ముద్రాపాశైణాక్షసూత్రల సత్పాణి, శశిప్రభుడు, ఫాలేందు విగలత్పీయూష ప్లుతాంగుడు, హారాదులచే నిజకాంతిచే అలంకృతుడగు విశ్వమోహనుని ధ్యానించవలెను. మంత్రమును ఆరు లక్షలు జపించవలెను. దశాంశమును శుద్ధ దుగ్ధాజ్య సమభి ప్లుతములగు అమృత కలశములచే హోమమును గావించవలెను. మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి పీఠమున శివుని పూజించవలెను. అంగావరణములను పూజించి లోకపాలకులను పూజించవలెను. తరువాత బాహ్య ప్రదేశమున వారి ఆయుధములను పూజించవలెను. ఇట్లు జప పూజాదికములచే మంత్రము సిద్ధించిన తరువాత అభీష్ట ఫలసిద్ధి కొరకు కల్పోక్త విధానముచే ప్రయోగములను ఆచరించవలెను. ప్రతిదినము ఆదరముచే క్షీరసిక్తములగు సుధాఖండములచే హోమమును వేయిచొప్పున ఒకనెల చేసినచో ఆయుష్యమును, ధనమును పుత్రులను పొందును. సుధామిశ్రితములగు క్షీరములు నేయి, పాలు హవిస్సు మొదలగు ఏడు ద్రవ్యములను ఏడు వారములలో క్రమముగా వేయి హోమమును గావించి ప్రతిదినము ఏడుకంటే ఎక్కువ మందిని బ్రాహ్మణులను మధుర పదార్థయుక్తముగా భోజనమును చేయించవలెను. ఋత్విజులకు పాలనిచ్చు అరుణ వర్ణముగల గోవును దక్షిణగా నీయవలెను. గురువును దైవబుద్ధిచే ధనాదులను సమర్పించి ప్రీతుని కావించవలెను. ఈ విధానముగా ఆచరించినచో కృత్యాద్రోహ జ్వరాదులచే విముక్తుడగును. నూరు సంవత్సరములు ఆరోగ్యానందములచే జీవించును. అభిచారమున, జ్వరమున, స్తంభనమున, ఘోరోన్మాదమున, శిరోవ్యాధియందు, అసాధ్యమగు రోగము నందు, క్ష్వేడార్తి యందు మోహ దాహ మహాభయములందు ఈ హోమము శాంతిని ప్రసాదించి సర్వాభయ ప్రదానము గావించును. ఈ ద్రవ్యములచే మూడు వేళలలో యథావిధిగా హోమము ఆచరించవలెను. వేద పారగులగు బ్రాహ్మణులను మధుర పదార్థములచే భోజనము చేయించవలెను. ఇట్లు చేసినచో దీర్ఘాయుష్యమును కోరిన సంపదను పొందగలడు. పండితుడు ప్రతిదినము గరకతో ఏకాదశాహుతుల నీయవలెను. ఇట్లు చేసినచో అపమృత్యువును జయించి ఆయురారోగ్యములు వృద్ధి పొందును. మూడు వేళలలో సుధావల్లీ కాశ్మీరవకుల సమిధలచే హోమమును కావించినచో మృత్యు భయము వీటి సర్వ రోగములు తొలగి ఆనందించును. ఆవాలచే హోమమును కావించినచో మహా జ్వరము నశించును. ఉత్తరేణి సమిధలచే చేయు హోమము సర్వరోగ నివారకము.

“ఓం దక్షిణా మూర్తయే తుభ్యం వటమూల నివాసినే”.

ధ్యానై కనిరతాంగాయ నమో రుద్రాయ శంభవే హుంఫట్”

అను ఈ మంత్రము ముప్పది ఆరు అక్షరములు కలది. సర్వాభీష్ట ఫలప్రదము. శుకమహర్షి ముని. అనుష్టుప్ఛందస్సు. దక్షిణామూర్తి నామముగల శంభువు దేవత. తారాశక్తి యుతములగు హ్రీమాద్యంతముల షట్ సప్త అష్ట వర్ణములందు హృదయాద్యంగ కల్పన గావించవలెను. శిరస్సున, ఫాలమున, నేత్రములందు, కర్ణములందు, గండయుగ్మమున, నాసికయందు, ఆస్యదోస్సంధులందు గలము, స్తనహృన్నాభి మండలములందు, కటి ప్రదేశమున గుహ్యమున, మరల పాదసంధులందు మంత్ర వర్ణన్యాసమును కావించవలెను. తరువాత దేహమున తారశక్తులచే వ్యాపకము ఆచరించవలెను. సుందరమగు హిమాచల తటమున, సిద్ధ కిన్నర సేవితమున, వివిధ ద్రుమశాఖలచే అంతట ఆ తపమును వారించుచోట పూలతో నిండిన తీగలచే చుట్టబడిన చెట్లు గల ప్రాంతమున, శిలా వివరముల నుండి వెలువడు సెలయేళ్ల నుండి వచ్చు చల్లని గాలి గలిగినచోట, గానము చేయుచున్న దేవాంగనా సంఘములు కలిగి, నాట్యము చేయుచున్న నెమళ్లు కలిగి కోకిల కూతలచే దిక్కులు ధ్వనించుచుండగా పరస్పరము వైరమును విడిచిన మృగములచే సేవించబడుచున్న ప్రదేశమున జలజ స్థలజ పుష్పములచే సుగంధము గలదై ఆది ఋషులగు శుకాదులచే ఆనందముగా సేవించబడుచున్న, అంగనా సహితులగు పురందరాదులచే చూడబడుచున్న ప్రదేశమున, గొప్ప నీడ గలిగి, పద్మరాగ ఫలోజ్జ్వలమగు, గారుత్మత పత్రములు దట్టముగా వ్యాపించి యున్న నవరత్న మయములకు ఊడలు వ్రేలాడుచున్న సంసార తాపవిచ్ఛేద కుశలమగు ఛాయకల అద్భుతమగువట వృక్షమూలమున సుసంక్లుప్తము శుభము అగు రత్న సింహాసనమున ఆసీనుడైయున్న అసితాభుని, శరచ్చంద్ర నిభాననుని, కైలాసాద్రినిభుని, త్రినేత్రుని, చంద్రకాంతి కపర్దుని, నాసాగ్రా లోకనపరుని, వీరాసన సమస్థితుని, ఛద్రాటక కురంగాఢ్య జానుస్థ కరపల్లవుని, కక్షా బద్ధ భుజంగుని, సుప్రసన్నుడగు హరుని స్మరించవలయును. ఆరు లక్షల ఇరవై వేలు జపించవలెను. దశాంశము పాలు కలిపిన శుద్ధ తిలలచే హోమమును గావించవలెను. పంచాక్షరోక్త పీఠమున యధావిధిగా పూజించవలెను. భిక్షాహారుడై ఒకనెల ఈ మంత్రమును జపించవలెను. ప్రతి దినము నాలుగువేలు జపించినచో వాక్సంపదను పొందును. ఈ మంత్రముచే జపించిన పాలను మూడు మార్లు త్రాగి దక్షిణామూర్తిని ధ్యానించినచో శాస్త్రములను వ్యాఖ్యానము చేయగల పాండిత్యమును పొందును.

“ఓం నమోభగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రయచ్ఛస్వాహా” అను ఈ మంత్రము ఇరువది రెండక్షరములు కలది. చతుర్ముఖ బ్రహ్మ ఋషి, గాయత్రీ ఛందస్సు. ఓంకార సహితమగు దీర్ఘ స్వరములలో (ఆరు) అంగకల్పన చేయవలెను. లేదా మంత్రములోని ఆరు పదములచే అయినను చేయవచ్చును. “ఫ్లోం, రీం, క్లీం” అనునది బీజత్రయాన్వితంత్రము. ఇది నీలకంఠ మంత్రము అనబడును. ఇది విషద్వయమును పూరించును. “హరహరస్వాహా” అనునది హృదయము “కపర్దినేనమః” అనునది శిరోమంత్రము. “నీలకంఠాయస్వాహా” అనునది శిఖామంత్రము. “కాలకూటవిషభక్షణాయ హుంపట్” అనునది కవచమంత్రము. “నీలకంఠినే స్వాహా” అనునది అస్త్రమంత్రము. ఇవి మంత్రమునకు పంచాంగములు, శిరస్సున కంఠమున, హృదయమున, క్రమముగా బీజత్రయ న్యాసమును కావించవలెను. పదివేల బాలార్కుల తేజస్సుకలవాడు, జటా జూటేందు శోభితుడు, నాగభూషుడు, జపమాలను, శూలమును, బ్రహ్మకపాలమును, ఖట్వాంగమును ధరించువాడు, త్రినేత్రుడగు శివుని ధ్యానించవలెను. మంత్రమును మూడు లక్షలు జపించి దశాంశమును నేయి కలిపిన హవిస్సుతో సంస్కృతాగ్నిలో హోమమును చేయవలెను. శైవపీఠమున నీలకంఠుని పూజించవలెను. మృత్యుంజయ విధానముచే విషద్వయ వినాశుని పూజించవలెను. అగ్ని సంవర్తనాదిత్య అనిలులు షష్ఠి బిందుమత్, చింతామణి అను పేరుగల బీజము సర్వసమృద్ధి ప్రదము. ఈ బీజమునకు కశ్యపుడు మహర్షి, అనుష్ఠుప్చందస్సు. అర్థ నారీశ్వరుడు దేవత రేఫాదులగు ఆరు వ్యంజనములచే అంగన్యాసమును చేయవలెను. త్రినేత్రుడు నీలమణి సన్నిభుడు, శూలపాకములను, కపాలములను, రక్తోత్పలములను ధరించువాడు, చారుభూషణుడు, బాలేన్దుబద్ధముకుటుడు అగు అర్థనారీశ్వరుని ధ్యానించవలయును. ఒక లక్ష జపించవలెను. పీఠమున శైవాంగావరణలచే పూజించవలెను. వృషాది మాతృకలను, సాయుధులగు లోకపాలకులను పూజించవలెను. ప్రాసాదాద్య మంత్రమును రోగశాంతికి పదివేలు జపించవలెను. స్వాహావృత్తమగు నీ బీజము స్రవించు అమృతము వంటిది. దీనిని ధ్యానించినచో అనగా (అం) అను బీజము ధ్యానించినచో క్ష్వేడరోగము శాంతించును. ప్రతిలోమ స్వరాఢ్యము వహ్ని గృహమున నున్న బీజము రేఫాది వ్యంజనోల్లాసి, బహిర్భాగమున షట్కోణాభివృత్తమును స్మరించినచో భూతార్తునకు భూతశాంతి జరుగును. పీడితాంగమున స్మరించినచో ఆయా పీడను తొలగించును. “ఓం నమః పశుపతయే, ఓం నమో భూతాధిపతయే, నమో రుద్రాయ, నమో రుద్రాయ ఖడ్గ రావణ విహర విహర నరీనృత్య సరీ నృత్య శ్మశాన భస్మాంచిత శరణ్యాయ ఘంటా కపాల మాలాది ధరాయ, వాఘ్ర చర్మ పరిధానాయ శశాంక కృతశేఖరాయ, కృష్ణ సర్ప యజ్ఞోపవీతినే బల బల చలా చాలా నివర్తక పాలినే హనుహను భూతాంస్త్రాసయ త్రాసయ, మండల మధ్యే కట కట రుద్రాంకుశేన శమయ ప్రవేశయ ప్రవేశయ, ఆవేశయ ఆవేశయ చండాని ధరాధిపతి రుద్రోయం జ్ఞాపయతి స్వాహా” అనునది ఖడ్గ రావణ మంత్రము. నూటా డెబ్బది అక్షరములు గలది. “భూతాధి పతయే స్వాహా” అనునది పూజా మంత్రము. ఇది సిద్ధ మంత్రముగా చెప్పబడినది. కావున జపించినంత మాత్రముననే సిద్ధించును. ఇరువది వేలు జపించిన తరువాత భూతాది నిర్బంధమున సమర్థుడగును. “హ్రీం స్ఫుర స్ఫుర, ప్రస్ఫుర ప్రస్ఫుర, ఘాతయ ఘాతయ హుంఫట్” అనునది చివర చేర్చిన యాబది ఒక అక్షరములుగల ఈ మహామంత్రము అఘోరాస్త్రము అనబడును. ఈ మంత్రమును అఘోరముని. త్రివృచ్ఛందస్సు. అఘోర రుద్రుడు దేవత. అయిదింటిచే హృదయమును, ఆరింటిచే శిరమును, పదింటిచే శిఖను, తొమ్మిదింటిచే కవచమును ఎనిమిదింటిచే నేత్రమును, పదింటిచే అస్త్రమును చేయవలెను. శిరోనేత్రాస్య కంఠములందు, హృదయ నాభ్యూరువులందు జాను జంఘ పదద్వంద్వములందు రుద్రభిన్నాక్షరములచే న్యాసమును గావించవలెను. ఈ న్యాసమును 5, 6, 8, 6, 2, 2, 4, 6, 3 వర్ణములచే చేయవలెను. శ్యాముడు, త్రినేత్రుడు, సర్వాఢ్యుడు, రక్త వస్త్రాంగ రాగకుడు, నానా శస్త్రధరుడు అగు అఘోరుడును పేరుగల సదా శివుని ధ్యానించవలెను. ఈ మంత్రము భూత భేతాళ నిగ్రహ సమర్థము.

తారము వాంతము ధరాసంస్థము వామనేత్రేందు భూషితము పాశీ బకము కర్ణనేత్ర వరాస్త్రాంతమగు ఈ మంత్రము ఆరు అక్షరములు కలది. ఇది పాశుపత మంత్రము. క్షుద్రగ్రహ నివారకము. ఆరు వర్ణములచే ఆరు అంగములను కల్పించవలెను. ప్రత్యంగా కల్పనలో హుంఫడంతములచే చేయవలెను. మధ్యాహ్న సూర్యసంకాశుడు, భయంకరుడు, త్రినేత్రుడు, పన్నగ భూషణుడు, నానా శస్త్రధరుడు, చతుర్వక్త్రుడు, అగు పశుపతిని ధ్యానించవలెను. మంత్రమును అక్షరలక్ష (ఆరులక్షలు) జపించవలెను. దశాంశము గోఘృతముచే సంస్కృతాగ్నిలో హోమమును చేయవలెను. ఈ మంత్రముచే మంత్రించబడిన జలమును గ్రహగ్రస్తుని ముఖమున నుంచవలెను. మహామంత్ర ప్రభావము వలన వెంటనే గ్రహ విముక్తుడగును. యుద్ధమున ఈ మంత్రముచే మంత్రించబడిన బాణములను ప్రయోగించినచో అర్జునునివలె సకల శత్రువులను జయించును. “ఓం హం క్షేత్రపాలాయ నమః” అనునది ఎనిమిది అక్షరములు గలది క్షేత్రపాల మంత్రము. షడ్దీర్ఘయుక్త బీజముచే షడంగన్యాసమును చేయవలెను. నీలాద్రి సన్నిభుడు, దిగంబరుడు, సర్పభూషణుడు, త్రిలోచనుడు, పింగోర్ధ్వకేశుడు, కపాల గదాధారిని స్మరించవలయును. మన్త్రమును ఒక లక్ష జపించవలెను. దశాంశము ఘృతసిక్త చరువుతో హోమమును గావించవలెను. తరువాత క్షేత్రమున అర్చించవలెను. ధర్మాదులచే కల్పించిన పీఠమున ఆదరముచే సాంగావరణములను పూజించవలెను. తరువాత సరిపరివారుడైన క్షేత్రపాలునకు ఈ మంత్రముచే బలిని అర్పించవలెను. “ఏహి ఏహి విద్విషం పురుషం భంజయ భంజయ నర్తయ నర్తయ విఘ్న విఘ్న మహా భైరవ! క్షేత్రపాల బలిం గృహ్ణ గృహ్ణ స్వాహా” అనునది బలి మంత్రము. ఈ మంత్రము సర్వకామ ఫల ప్రదము. సాధకుడు రాత్రులందు సోపదేశముగా బృహత్పిండములను చేసి యధోక్త క్షేత్రపాలకుని ధ్యానించి క్షేత్రపాలుని హస్తమున బలిని అర్పించవలెను. ఈ బలిచే సంతోషించిన క్షేత్రపాలుడు కాంతిని, మేధను, బలారోగ్యములను, తేజస్సును, పుష్ఠిని, యశస్సును, సంపదను ఇచ్చును.

 “ఓం బటుకాయ ఆపదుద్ధరణం కురుకురు వటుకాయ స్వాహా” అనునది ఇరువది రెండక్షరముల మంత్రము. 24, 7, 4, 1 అక్షరములచే అంగన్యాసమును చేయవలెను. బాలుడు, స్ఫటిక సంకాశుడు, స్ఫటికలోలసితాననుడు, దివ్యాభరణ భూషితుడు త్రినేత్రుడు, దండ త్రిశూలధారి, సుప్రసన్నుడు, భక్తాభయకరుడగు బటుకుని ధ్యానించవలెను. హవిస్సును భుజించుచు జితేంద్రియుడై అక్షర లక్షలు జపించవలెను. దశాంశమును మధుర సంప్లుత తిలలచే హోమమును చేయవలెను. ధర్మాది కల్పిత పీఠమున అతి శోభనమగు పంకజమున లోక త్రికోణములుగల షట్కోణమున వ్యోమ పంకజ సంయుతమున సాంగావరణములతో ఆదరముచే వటుకుని పూజించవలెను. ప్రతిదినము శత్రుపక్ష రుధిరమును మాంసమును గణములతో కలిపి సారమయ సమన్వితుడవై భక్షించుము అను అర్థముగల ‘శత్రు పక్షస్య రుధిరం పిశితం చ దినే దినే భక్షయస్వగణై స్సార్థం సారమేయ సమన్వితః’ అన ఈ బలిమంత్రము శత్రనామాంకితముగా బలిని అర్పించవలెను. ఈ బలిచే సంతుష్టుడైన బటుకుడు పరసైన్యమును ఛేదించి కోపముచే గణములకు శత్రుమాంసమును విభజించి ఇచ్చును. “శ్రీం హ్రీం ఫట్” అనునది చండమంత్రము. త్రివర్ణాత్మకముగా చెప్పబడినది. ఈ మంత్రమునకు త్రితముని. అనుష్టుప్చన్దస్సు. చండేశుడు దేవత. “దీప్త ఫట్” అనునది హృదయము జ్వలపట్ అనునది నేత్రము. “సర్వ జ్వాలిని ఫట్” అనునది కవచము. ఇట్లు షడంగ న్యాసమును గావించి దేవుని ధ్యానించవలెను. రక్తదేహుడు, త్రినేత్రుడు, రక్తాంబరావృతుడు. త్రిశూలాక్షమాలాటంక కమండలుధారియగు చండేశుని ధ్యానించవలెను. మూడు లక్షలు జపించవలెను. దశాంశమును మధురత్రయ సంక్తములగు పరిశుద్ధతిల తండులములచే హోమమును గావించవలెను. పంచాక్షరోక్త పీఠమున మూర్తిని మూలమంత్రముచే సంకల్పించవలెను. “అం చండేశ్వరాయ నమః” అనునది చండీశ్వర పూజా మంత్రము. అంగమాతృకాలోక పాలాయుధములకు అవరణపూజ గావించవలెను. దైవమంత్రనిష్ణాతుడు మాత్రమే చండీశ్వర మంత్రమును జపించవలెను. సర్వాభీష్టములను పొంది ఇహపరములలో ఆనందించును.

ఓ నారదా! దివ్యమగు మహేశ్వర స్తోత్రమును చెప్పెదను వినుము. ఈ స్తోత్రమును పఠించినంత మాత్రముననే సర్వమంత్రములు సిద్ధించును.

ధరాంబగ్ని మరుద్వ్యోమ మఖేశ ఇందు అర్క మూర్తయే |

 సర్వభూతాంతరస్థాయ శంకరాయ నమో నమః ||

 శ్రుత్యన్తకృతవాసాయ శ్రుతయే శ్రుతి జన్మనే |

అతీంద్రియాయ మహేసే శాశ్వతాయ నమో నమః

స్థూల సూక్ష్మ విభాగాభ్యామనిర్దేశ్యాయ శంభవే |

 భవాయ భవసంభూతదుఃఖ హంత్రే నమోనమః ||

 తర్కమార్గాతిదూరాయ తవసాం ఫలదాయినే |

చతుర్వర్గవదాన్యాయ సర్వజ్ఞాయ నమోనమః ||

 ఆదిమధ్యాంత శూన్యాయ నిరస్తాశేషఖీతయే |

 యోగిధ్యేయాయ మహతే నిర్గుణాయ నమోనమః ||

 విశ్వాత్మనే వివిక్తాయ విలసచ్చంద్రమౌళయే |

కందర్పదర్శనాశాయ కాలహంతే నమోనమః ||

విప్రాశనాయ విహరత్ వృషస్కంధముపేయుషే |

సరిద్దామ సమాబద్ధ కపర్దాయ నమోనమః ||

 శుద్ధాయ శుద్ధభావాయ శుద్ధానామంతరాత్మనే |

 పురాంతకాయ పూర్ణాయ పుణ్యనామ్నే నమోనమః ||

 భక్తాయ నిజభక్తానాం భుక్తిముక్తి ప్రదాయినే |

 నివాససే నివాసాయ విశ్వేషాం వతయే నమః ||

త్రిమూర్తిమూలభూతాయ త్రినేత్రాయ త్రిశూలినే |

 త్రిధామ్నే ధామరూపాయ జన్మదాయ నమోనమః ||

భూజలాగ్ని వాయ్వాకాశ యజ్ఞేశ చంద్రసూర్య మూర్తికి సర్వభూతాంతరాత్మకు శంకరునకు నమస్కారము. వేదాంతములలో నివసించువానికి శ్రుతి స్వరూపునకు, శ్రుతికారణునకు, ఇంద్రియాతీతునకు, తేజోరూపునకు, శాశ్వతునకు నమస్కారము, స్థూలసూక్ష్మ విభాగములచే నిర్దేశించ శక్యము కాని వానికి, శంభువునకు, భవునకు సంసారము వలన కలుగు దుఃఖమును వారించువానికి నమస్కారము. తర్కమార్గమునకు అందనివానికి, తపోఫలదాయికి, చతుర్వర్గ ఫలదాతకు సర్వజ్ఞునకు నమస్కారము. ఆదిమధ్యాంత శూన్యునకు, సకలవిధ భయహారికి, యోగిధ్యేయునకు, మహత్తునకు, నిర్గుణునకు నమస్కారము, విశ్వాత్మునకు, వివిక్తునకు, చంద్రమౌళికి, కందర్పనాశనునకు, కాలహంతకు నమస్కారము. విషభోజనునకు, వృషభస్కంధముపై విహరించువానికి, జటా జూటమున, గంగను ధరించిన వానికి నమస్కారము. పరిశుద్ధునకు, పరిశుద్ధభావునకు, పరిశుద్ధులకు అంతరాత్మగా ఉన్న వానికి, పురాంతకునకు, పూర్జునకు, పవిత్రనామునకు నమస్కారము. భక్తునకు, నిజభక్తులకు, భుక్తిముక్తులను ఇచ్చు వారికి, దిగంబరునకు, విశ్వనివానికి, విశ్వపతికి నమస్కారము. త్రిమూర్తి మూలభూతునకు, త్రినేత్రునకు, త్రిశూలధారికి, త్రిధామునకు, ధామరూపునకు, జన్మనిచ్చువానికి నమస్కారము. దేవాసుర శిరస్సులనందుండు రత్న కిరీటములచే ఎర్రబారిన పాదములు కలవానికి, సుందరునకు, పత్నికి అర్థదేహమును ఇచ్చినవానికి నమస్కారము. ఈ మహేశ్వర స్త్రోత్రము సర్వవిధపాపనాశనము శివసాన్నిధ్యమును ఇచ్చునది. సర్వవిధతంత్ర ప్రకాశకము ఇట్లు చాలా గొప్ప తంత్రశాస్త్రమును సర్వదేవ ప్రకాశమును లోకుల అభిలాషలను పూర్తిచేయు కార్యములను సాధింపచేయు దానిని చెప్పితిని. ఈ తంత్రమున సామాన్యముగా చెప్పబడిన మంత్రములలో లోకోపకారమునకు సిద్ధిప్రదములని తెలియవలెయును. విశేషించి విష్ణు సంబంధించిన మంత్రములు సర్వోత్తమోత్తములు. చతుర్వర్గ ఫలప్రాప్తికి వైష్ణవ మంత్రములనే సాధించవలెను. శ్రీరామ మంత్రములు, శ్రీకృష్ణమంత్రములు సాంగములగు రాస లీలా ప్రభువు మంత్రములు శాక్తములు, సౌర మంత్రములు, గణేశమంత్రములు, శైవములు, శుభావహలుగా చెప్పబడినవి. వీటిలో ఆత్మ సాక్షాత్కారము కొరకు ముక్తిఫలప్రదములను సేవించవలెను. ఓ నారదమునీ! నీవు భక్తితో కోరిన సకలదేవతారాధన రూపమగు తంత్రశాస్త్రమును సమగ్రముగా చెప్పితిని. ఇంకనూ ఏమి వినగోరుచున్నావో తెలుపుము. (3/91)