హనుమత్ మంత్ర కథనము

సనత్కుమార మహర్షి పలికెను: ఇపుడు సర్వాభీష్ట ప్రదములగు హనుమన్మంత్రస్తములను చెప్పెదను. ఈ మంత్రములను ఉపాసించిన మానవులు హనుమంతుని ఆచరణ కలవారగుదురు. ఈ మంత్రము స్వరేందుసంయుక్తము. గగనము భగాన్వితములగు హసపాగ్నిని నిశాధీశులు ద్వితీయ బీజముగా చెప్పబడిరి. భగ ఇందు అఢ్యములగు స్వఫాగ్నులు తృతీయ బీజము. వియద్భృగ్వగ్ని మన్విందు యుక్తము చతుర్థ బీజము. భగచంద్రాఢ్యవియద్భృగుస్వకాగ్నులు పంచమ బీజము. మన్వింద్యాఢ్యములు హసలు షష్టబీజము. ఈ బీజముల తరువాత చతుర్థీ విభక్తి అంత హనుమత్పదముఉండును. చివర నమః పదమున్న ఈ మంత్రరాజము ద్వాదశాక్షరి. ఈ మంత్రమునకు ముని రామచంద్రుడు, జగతీ ఛందస్సు. హనుమంతుడు దేవతా షష్ఠము బీజము ద్వితీయము శక్తి. షడ్బీజములచే షడంగములను శిరోఫాలనేత్రముఖ గల బాహుద్వయ హృదయకుక్షి నాభిధ్వజజాను పాదద్వయములందు క్రమముగా న్యాసము చేయవలెను. షడ్బీజములను పాదద్వయమున, శిరమున, ఫాలమున, ముఖమున, హృదయమున, నాభియందు, ఊరువులయందు, జంఘలందు, పాదములందు క్రమముగా న్యాసము చేయవలెను. తరువాత అంజనీ గర్భ సంభూతుడగు కపీశ్వరుని ధ్యానించవలెను. ఉదయించు కోటి సూర్యుల తేజస్సు కలవాడు, జగత్ప్రక్షోభ కారకుడు, శ్రీరామపాదముల ధ్యానమున నిష్ఠ కలవాడు, సుగ్రీవ ప్రముఖ అర్చితుడు, నాదముచే రాక్షసులను భయపెట్టుచున్న హనుమంతుని స్మరించవలెను. ఇట్లు ధ్యానము చేసి ఇంద్రియ నిగ్రహముతో పన్నెండు వేలు జపించవలెను. దశాంశమును పయోదధ్యాజ్యమిశ్రితములగు పాయసములచే హోమమును గావించవలెను. పూర్వోక్త వైష్ణవ పీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, అవాహన గావించి పాద్యాద్యుపాయనములచే పూజించి, కేసరములందు అందెపూజను, పత్రములందు పూజను కావించవలెను. రామభక్తుడు, మహాతేజోవంతుడు, కపిరాజు, మహాబలుడు, ద్రోణాద్రిహారకుడు, మేరుపీఠార్చనకారకుడు, దక్షిణాశాఖానుడు, సర్వవిఘ్న వినాశకుడు, అను నామములతో దళాగ్రములందు చక్కగా పూజించి అర్చించవలెను. సుగ్రీవుని, అంగదుని, వీలుని, జాంబవంతుని, నలుని, సుషేణుని, ద్వివిదుని, మైందుని, లోకపాలకులను అర్చించవలెను. వజ్రాదులను కూడా పూజించి మంత్రసిద్ధిని పొందవలెను. పది దినములు ప్రతి రాత్రి మంత్రమును తొమ్మిది వందలుమార్లు జపించవలెను. అట్లు జపించినవారికి రాజుల వలన శత్రువుల వలన కలుగు భయము తొలగిపోవును. మాతులుంగ ఆమ్ర కదళీ ఫలములచే ఒక వేయి హోమముగావించి ఇరువది రెండు మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు భోజనమునిడినచో భూత విషగ్రహ రోగాది ఉపద్రవములు విద్వేషి గ్రహ దానవులు వెంటనే నశించును. నూట ఎనిమిది మార్లు మంత్రించిన జలము విషమును నశింపచేయును. భూత అపస్మారకృత్యల వలన కలుగు జ్వరము ఈ మంత్రముచే మంత్రించబడిన భస్మముచేకాని, జలముచేకాని జ్వరమువచ్చిన వానిని కోపముచే కొట్టినచో మూడు రోజులలో జ్వరము తొలగి ఆనందమును పొందును, ఈ మంత్రముచే మంత్రించబడిన ఔషధమునుకాని జలమును కాని భుజించిన అన్ని రోగములను పారదోలి వెంటనే సుఖమును పొందును. మంత్రించబడిన భస్మమును శరీరమున పూసుకొని, మంత్రించబడిన జలమును త్రాగి యుద్ధమునకు బయలుదేరినచో, శస్త్రాస్త్రములచే బాధించబడరు. శస్త్రము వలన కలుగు గాయము, వ్రణమువలన ఏర్పడిన గాయము, ఖడ్గాదుల వలన కలుగు గాయము మూడు మార్లు జపించిన భస్మమును స్పృశింపచేసినచో మానును. సూర్యాస్త మయమునుండి సూర్యోదయము వరకు ఏడు దినములు జపించి భస్మమును కీలమును తీసుకొని మంత్రించి శత్రుద్వారమున రహస్యముగా భూమిలో స్థాపించవలెను. ఇట్లు చేసినచో వారిలో వారు కలహించుకొని పలాయన మగుదురు. ఈ మంత్రముచే మంత్రించబడిన చందనమునుకాని, భస్మమునుకాని భక్ష్యాదులలో కలిపి ఎవనికి భుజించుటకు ఇచ్చిన, వాడు దాసునివలె అగును. క్రూర జంతువులు కూడా ఇట్లే వశవర్తులు అగును. ఈశాన్యదిక్కున ఉన్న కరంజ తరుమూల భాగముచే హనుమంతుని ప్రతిమను అంగుష్ఠ మాత్రముగా చేసి, ప్రాణ ప్రతిష్ఠను చేసి సిందూరాదులచే పూజించి గృహాభిముఖముగా ద్వారమున మంత్రమును ఉచ్చరించుచు భూమిలో స్థాపించవలయును. ఇట్లు చేసినచో ఆ ఇంటిలో ఎప్పుడు గ్రహ, అభిచార, రోగ, అగ్ని, విష, చోర నృపులవలన కలుగు ఉపద్రవములు కలుగవు. మరియు ఆ గృహము ధన ధాన్య పుత్రాదులచే సమృద్ధము అగును. రాత్రిపూట అరణ్యములో భస్మముచేకాని మట్టిచేకాని ప్రయత్నముచే శత్రు ప్రతికృతునిచేసి హృదయమున పేరును వ్రాసి, ప్రాణ ప్రతిష్ఠను చేసి, మంత్రమును ఉచ్చరించుచూ శస్త్రములచే భేదించవలయును. మంత్రాంతమున శత్రు నామమును ఉచ్చరించి ‘ఛిన్ది ఛిన్ది’ అని పలుకవలెను. తరువాత ‘మారయ’ అని పలుకవలెను. దంతములచే ఓష్ఠములను పీడించుచు, అరచేతులను వత్తి ఆ ప్రతిమను వదిలి తన గృహమునకు వెళ్ళవలెను. ఇట్లు ఏడురోజులు చేసినచో శత్రువు మృతి చెందును. శ్మశానమున వెంట్రుకలు విరబోసి రాజికాలవణములచే ఉమ్మెత్త పూవులచే పండ్లచే, నఖరోమ విషములచే కాకి, గుడ్లగూబ గద్దల రెక్కల ఈకలచే శ్లేష్మాంతరాక్షజములగు సమిధలచే దక్షిణాభిముఖుడై హోమమును మూడు వందలు చేయవలయును. ఇట్లు ప్రతిరాత్రి ఏడు దినములు చేసినచో బలవంతుడగు శత్రువును సంహరించును. శ్మశానమున మూడు దినములు రాత్రులలో ఆరొందలు జపించవలయును. అంతట భేతాళుడు కింకరునిగా ఉండి సాధకుడు చెప్పిన దానిని చేయుచుండును. మంత్రించబడిన భస్మమును కాని, జలమును కాని రాత్రియందు సహస్రావృత్తిని దినత్రయము జరిపి స్థూలములైన, లేదా కృశించిన ప్రతిమలలో చలనము కలుగును. అష్టమినాడు కాని, చతుర్దశినాడు కాని, భౌమవారమున కాని, ఆదివారమున కాని పట్టమున హనుమంతుని ప్రతిమను నూనె కలిపిన మాషములచే పరిశుద్ధాత్ముడై సుందరముగా ఏర్పరచవలెను. ఆ ప్రతిమకు వామభాగమున తైల దీపమును, దక్షిణ భాగమున ఘృతదీపమును ఉంచి మూలమంత్రముచే ఆవాహనగావించి ప్రాణ ప్రతిష్ఠను గావించి పాద్యాదులను సమర్పించవలెను. రక్తచందన పుష్పములచే సిందూరాదులచే అర్చించవలెను. ధూపదీపములనిచ్చి నైవేద్యములను సమర్పించవలెను. ఆపూప మోదకములను శాకవటకాదులను నేతితో సమర్పించి మూలమంత్రముచే అఖండితములు అగు అహిలతా దళములను ఇరువదేడింటిని మూడు భాగములను చేసి వక్కలచే మూల మంత్రోచ్చారణే సమర్పించవలెను. ఇట్లు చక్కగా పూజించి మంత్రజ్ఞుడు వేయి మార్లు జపించవలెను. తరువాత కర్పూర హారతినిచ్చి బహువిధముల స్తుతించి నిజాభిలాషను నివేదించి యథావిధిగా విసర్జన చేయవలెను. నైవేద్యాన్నమును ఏడుగురు బ్రాహ్మణులచే భుజింపచేసి నివేదిత పర్ణములను విభజించి వారికీయవలెను. యథాశక్తిగా దక్షిణను సమర్పించి వారిని పంపవలయును. తరువాత ఇష్టులతో కలిసి తాను వాఙ్నయమముతో భుజించవలయును. ఆ దినమున భూమి శయ్యను ఏర్పరచి బ్రహ్మచర్యమును అవలంబించవలెను. ఇట్లు ఆచరించిన మనుజుడు హనుమంతుని అనుగ్రహముచే సకలా భీష్టములను పొందగలడు. భూమి మీద హనుమత్ప్రతిమను లిఖించి, ఆ ప్రతిమముందు మంత్రమును సాధించదలచిన వాని పేరును ద్వితీయాంతముగా వ్రాసి, దాని తరువాత “విమోచయ విమోచయ” అని వ్రాయవలెను. వామహస్తముచే తుడిచి మరల వ్రాయవలెను. ఇట్లు నూట ఎనిమిది మార్లు వ్రాసి తుడువవలెను. ఇట్లు చేసినచో మహాకారాగార బంధమునుండి విముక్తుడగును. ఇట్లు పల్లవమును లిఖించుచు ఇతర కార్యములను చేయవలెను. ఇతరములను వశము చేసుకొనవలయునన్న ఆవాలచే హోమమును చేయవలెను. శత్రత్వమున మినుములచే హోమమును చేయవలెను. కుంకుమచేకాని, ఇధ్మ కాష్ఠములచేకాని, మిరియాలచేకానీ, జీలకఱ్రవేకాని, పెరుగుచేకాని, పాలచేకాని, నేయిచేకాని చేయవలెను. శూల రోగమున నూనె కలిపిన కరంజవాలూరి సమిధలచే కాని, తైల మిశ్రితములగు నిర్గుడీ సమిధలచే కాని, సౌభాగ్యమునకు చందనములచే కాని, ఇంద్రలోచనములచే కాని, లవంగములచేకాని, వస్త్ర ప్రాప్తికి సుగంధ పుష్పములచే, అయాధాన్యముల ప్రాప్తికి ఆయాధాన్యములచే హోమమును చేయవలెను. రాజీలవణమిశ్రితములైన శత్రుపాద రజములచే ఏడుదినములు హోమమును గావించినచో శత్రువు యమలోకమును చేరును. ధాన్యముచే హోమమును చేసినచో ధాన్యము లభించును. అన్నముచే హోమము గావించిన అన్నసమృద్ధి కలుగును. గేదెలు ఆవులు సమృద్ధిగా కలుగుటకు తిలాజ్యక్షీర మధువులచే హోమమును చేయవలెను. ఇంకనూ ఏమి చెప్పవలెను. విషభయమున, వ్యాధియందు, శాంతియందు, మోహమందు, మారణమున, వివాదమున, స్తంభనమున, ద్యూతమున, భూతభయమున, సంకటమున, వశీకరణమున, యుద్ధమున క్షత్రియందు, దివ్యములైన బంధ మోక్షములందు, మహారణ్యమున ఈ మంత్రమును సాధించిన నరులకు శ్రేయస్సు చేకూరును.

ఇక ఇపుడు సర్వసిద్ది ప్రదాయకమగు హనుమత్ యంత్రమును చెప్పెదను. లాంగులా కార సంయుక్తముగా వలయత్రయమును లిఖించవలెను. పాశబీజమున ప్రవేశింపచేసి మధ్య భాగమున సాధ్యనామమును లిఖించవలెను. పైభాగమున అష్టదళములను లిఖించి పత్రములందు కవచమును లిఖించవలెను. బయటి భాగమున దంతమును లిఖించి పత్రములందు కవచమును లిఖించవలెను. బయటి భాగమున దంతమును లిఖించి, దానివెలుపల చతురస్రమును, చతురస్ర రేఖాగ్రభాగమున త్రిశూలములను లిఖించవలెను. భూపురాష్ట వజ్రములలో ‘సౌం’ అను బీజమును లిఖించవలెను. కోణములయందు అంకుశమును లిఖించి మాలామంత్రముచే పరివేష్టించవలెను. దీనినంతటిని యంత్ర వలయత్రితయముచే వేష్టనము చేయవలెను. శిలయందుకాని, ఫలకమునందుకాని, తాళపత్రమునందుకాని, భూర్జ పత్రమునందుకాని గోరోచన కస్తూరి కుంకుమలచే ఈ యంత్రమును వ్రాసి నిరాహారుడై, ఇంద్రియములను జయించి, హనుమంతునికి ప్రాణప్రతిష్ట చేసి యథావిధిగా పూజించవలెను. సమస్త దుఃఖ నాశనమునకై ఈ యంత్రమును ధరించవలెను. మారణ, జ్వర, అభిచారాది సర్వోప ద్రవములు ఈ యంత్ర ధారణము వలన నశించును. స్త్రీలు బాలులు ధరించినచో సర్వలోకము వశ్యమగును. ఈ యంత్రమును చూచిన వెంటనే భూతకృత్యాపిశాచాదులు పారిపోవును.

ఇక ఇప్పుడు మాలా మంత్రమును చెప్పెదను. మొదట తారము తరువాత వాక్కు లక్ష్మి దీర్ఘత్రయాన్వితా మాయా మొదట చెప్పిన పంచ కూటములు ధ్రువము హృదయము. “ఓం నమో హనుమతే ప్రకటపరాక్రమ! ఆక్రాంత దిజ్మండల యశోవితాన! ధవళీకృత జగత్త్రితయ! వజ్రదేహ! జ్వలదగ్ని సూర్యకోటి సమప్రభ తనూరుహ! రుద్రావతార! లంకాపురీ దహన! ఉదధిలంఘన! దశగ్రీవశిరఃకృతాంతక! సీతాశ్వసన! వాయుసుత! అంజనా గర్భసంభూత! శ్రీరామలక్ష్మణాన్విత! నందంతికర! సైన్యప్రాకార! సుగ్రీవసఖ్యక! రణవాలినిబర్హణకారణ! ద్రోణ పర్వతోత్పాటన! అశోక వనవీధీదారణ! అక్షకుమారక చ్ఛేదన! వనరక్షకరసమూహవిభంజన! బ్రహ్మస్త్ర బ్రహ్మశక్తిగ్రసన! లక్ష్మణ శక్తి భేద నివారణ! విశల్క ఓషధి సమానయన! బాలోదిత భానుమండల గ్రసన! మేఘనాద హోమ విధ్వంసన! ఇంద్రజిద్వధ కారణ! సీతారక్షక! రాక్షసీ సంఘ విచారణ! కుంభకర్ణాది వధ పరాయణ! శ్రీరామ భక్తి తత్పర! సముద్రవ్యోమద్రుమలంఘన! మహాసామర్థ్య! మహాతేజఃపుంజ విరాజమాన! స్వామి వచనసంపాదితార్జున సంయుగ సహాయ! కుమార బ్రహ్మచారీ! గంభీరోదయ దక్షిణాపథ మార్తాండ! మేరు పర్వత పీఠికార్చన! సకల మంత్రమ! ఆచార్య! మమ సర్వగ్రహ వినాశన! సర్వజ్వరోచ్చాటన! సర్వవిషవినాశన! సర్వాపత్తినివారణ! సర్వదుష్ట నిబర్హణ! సర్వవ్యాధి ఆది భయనివారణ! సర్వశత్రుచ్ఛేదన! మమ పరస్యచ త్రిభువన పుంస్త్రీ నపుంసకాత్మక సర్వజీవ జాతం వశయ! వశయ! మమాజ్జాకారకం సంపాదయ! సంపాదయ!” అని పఠించి నానా నామధేయములు గల సర్వరాజులను పఠించవలెను. “పరివారాన్ మమ సేవకాన్ కురు కురు సర్వశస్త్రాస్తవిషాణి విధ్వంసయ! విధ్వంసయ!” తరువాత లజ్జా దీర్ఘత్రయోపేత మగు హోత్రయమును ఏహిద్వయమును, పంచకూటములను విలోమముగా ఉచ్చరించి “సర్వ శత్రూన్ హన! హన! పర బలాని పర సైన్యాని క్షోభయ! క్షోభయ! మమ సర్వ కార్య జాతం సాధయ సాధయ! సర్వ దుష్ట దుర్జన ముఖాని కీలయ! కీలయ!” అని పలికి తరువాత ధౌతత్రయమును వర్మత్రితయమును, ఫట్ త్రయమును, హాం త్రయమును, పలికి “స్వాహా” అని చివరికి పలికిన ఇది మాలామంత్రమగును. సకలాభీష్టప్రదము 588 వర్ణములు గల మంత్రమిది. సర్వేష్టసాధకము మహాభయమున, మహోత్సాతమున ఈ మంత్రము దుఃఖ నాశకము. ద్వాదశాక్షరి యొక్క షట్కూటమును వదిలి ఆది బీజమును కలిపి పంచ కూటాత్మకమగు ఈ మంత్రము సర్వాభీష్ట ప్రదాయకము. ఈ మంత్రమునకు రామచంద్రుడు ముని, గాయత్రీ ఛందస్సు, హనుమంతుడు దేవత. అఖిలాప్తికి వినియోగము చేయవలెను. సంపూర్ణ పంచబీజములతో షడంగములను కల్పించవలెను. “రామ దూతాయ” “లక్ష్మణ ప్రాణదాత్రే “అంజనీసుతాయ” “సీతాశోక వినాశాయ” “లంకా ప్రాసాద భంజనాయ” “హనుమతే” అను వాటిలో మొదటి అయిదు బీజాదులగును. ఇవియే షడంగమంత్రములు. ధ్యాన పూజాదికమంతయు పూర్వమువలె ఆనాచరించవలెను. ప్రణవము వాగ్భవము పద్మామాయా దీర్ఘత్రయా న్వితము పంచకూటములుగల ఈ మంత్రము ఏకాదశాక్షరములు గలది సర్వసిద్ధి ప్రదము. ఈ మంత్రము నకుకూడా ధ్యాన పూజాదికమంతయు పూర్వమువలె నాచరించ వలయును. ఈ మంత్రము ఆరాధించినచో సర్వాభీష్టములను ఒసంగును.

“నమో భగవతే అనంత చంద్రశేఖరాంజనేయాయ మహాబలాయ స్వాహా” అను ఈ మంత్రము పదునెనిమిది అక్షరములు కలది. ఈశ్వరుడు ముని అనుష్టుమ్ ఛందస్సు. పవనాత్మజుడు అగు హనుమంతుడు దేవత ‘హం’ బీజము స్వాహాశక్తి ఆంజనేయాయ అనునది హృదయము. రుద్రమూర్తయే అనునది శిరస్సు. వాయుపుత్రాయ అనునది శిఖ. అగ్ని గర్భాయ అనునది కవచము. రామదూతాయ అనునది నేత్రము. బ్రహ్మస్త్రాయ అనునది అస్త్రము. చక్కగా పుటము పెట్టిన బంగారు వన్నె కలవాడు, అంజలిబద్ధుడు, చలత్కుండల దీప్తాస్యుడు, పద్మాక్షుడగు మారుతిని స్మరించవలయును. ఇట్లు ధ్యానముచేసి పదివేలు జపించి దశాంశమును తిలలచే హోమమును చేయవలయును. పూర్వోక్త విధానముతో వైష్ణవ పీఠమున పూజించవలయును. ప్రతిదినము అష్టోత్తర శతమును జపించుచు రాత్రి మాత్రమే భోజనము చేయుచు జితేంద్రియుడై ఉన్నచో క్షుద్రరోగముల నుండి విముక్తి పొందును. మహారోగ నివృత్తికి ప్రతిదినము సహస్రము జపించవలయును. రాక్షస సమూహములను సంహరించుచున్న పాపనాశకుడగు హనుమంతుని ధ్యానించి ప్రతి దినము పదివేలు జపించినచో త్వరలో శత్రువును జయించును. సుగ్రీవునితో రాముని కలుపుచున్న హనుమంతుని స్మరించి పదివేలు జపించినచో శత్రువులచే సంధి కుదురును. లంకాదహనమును గావించుచున్న ఆంజనేయుని ధ్యానించి పదివేలు జపించినచో, త్వరలో శత్రుగ్రామములను దహింపజేయును. ప్రయాణ సమయమున హనుమంతుని ధ్యానించి మంత్రమును జపించినచో వెళ్ళినచోట త్వరగా తన అభీష్టమును సాధించుకొని తిరిగి ఇల్లు చేరును. జపతత్పరుడై ఇంటిలో ప్రతి నిత్యము ఆంజనేయుని అర్చించువాడు ఆరోగ్యమును, సంపదను, కాంతిని, ఉపద్రవ రాహిత్యమును పొందును. ఈ మంత్రమును స్మరించినచో అరణ్యమున వ్యాఘ్ర చోర భయము నుండి కాపాడబడును. నిదురించు సమయమున ఈ మంత్రమును స్మరించినచో దుస్స్వప్న చోర భయములు తొలగును.

“శ్రీ హనుమతే రుద్రాత్మకాయ స్వాహా” అను మంత్రము ద్వాదశాక్షరి. ఈ మంత్రము అష్ట సిద్ధులను కలిగించును. ఈ మంత్రమునకు రామచంద్రుడు ముని, జగతీ ఛందస్సు హనుమంతుడు దేవత. ఆద్యబీజము ‘హుం’ అనునది శక్తి షడ్దీర్ఘయుతమగు బీజములచే షడంగములను కల్పించవలెను. మహాపర్వతమును పెకలించి శత్రువు మీదికి లంఘించుచున్న, లాక్షారక్తారుణుడు, రౌద్రుడు, కాలాంతకయమోపముడు, మండుచున్న అగ్నివంటివాడు, జయశీలుడు, కోటిసూర్య సమప్రభుడు, అంగదాది మహావీరులతో పరివేష్టితుడు, రుద్రరూపి, యుద్ధమున ‘దుష్టుడా నిలు నిలు’ అని మహానాదమును చేయువాడు శైవరూపి అగు అంజనేయుని పూజించి ధ్యానించి లక్ష జపించవలెను. దశాంశమును పాలు పెరుగు నెయ్యి కలిపిన ధాన్యముచే హోమమును చేయవలెను. పూర్వోక్తమగు వైష్ణవపీఠమున విమలాదియుతమగు దానిపై మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి హనుమంతుని పూజను విధివిధానముగా చేయవలయును. కేవలము ధ్యానము చేసిన నరులకు కూడా సిద్ధి కలుగును. ఇక ఇప్పుడు లోకహితమును కోరి ఈ మంత్ర సాధనమును చెప్పెదను. ఈ హనుమత్సాధనము పరమ పావనము. మహాపాతక నాశనము. ఇది అత్యంత రహస్యమైనది. మానవులకు శీఘ్రసిద్ధిప్రదము. హనుమంతుని అనుగ్రహముచే మంత్రసిద్ధి పొందినవాడు త్రైలోక్య విజయి కాగలడు. ప్రాతఃకాలమున స్నానము ఆచరించి, నదీతీరమున దర్భాసనమున కూర్చుండి, మూలమంత్రముచే ప్రాణాయామమును షడంగకల్పనను చేయవలయును. అష్ట పుష్పాంజలులను ఇచ్చి, సీతాసహితుడగు రాముని ధ్యానించి, తామ్ర పాత్రమునందు కేసరములతో కూడిన అష్టపత్ర పద్మమును చక్కగా మర్దించిన చందనముచే శలాకతో విభజించవలయును. కర్ణికయందు మహా మంతమును లిఖించి అచట కపీశ్వరుని అవాహించి మూర్తి మంత్రముచే మూర్తిని సంకల్పించి, ధ్యానించి పాద్యాదికమును ఒసంగవలయును. మూల మంత్రముచే గంధపుష్పాదికములను నివేదించి కేసరములందు షడంగములను కల్పించి, దళములందు సుగ్రీవుని, లక్ష్మణుని, అంగదుని, నలనీలులను, జాంబవంతుని, కుముదుని, కేసరీశుని చక్కగా అర్చించవలయును. తరువాత దిక్పాలకులను వజ్రాదులను పూజించవలెను. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత తన ఇష్టమును సాధించుకొనవచ్చును. నదీతీరమున కాని, అడవియందుకాని, పర్వతమునకాని, ఏకాంతమున కాని సాధకుడు భూమిగ్రహణ పూర్వకముగా సాధించవలెను. జితాహారుడై, జితశ్వాసుడై, జితవాక్కై, జితేంద్రియుడై, దిగ్బంధనాదికమును చేసి న్యాసధ్యానాదిక పూర్వకముగా మంత్రరాజమును లక్ష జపించి, పూర్వమువలె పూజించి, లక్ష ముగిసిన తరువాత దివసమున మహాపూజనమును చేయవలెను. ఏకాగ్ర మనస్సుతో పవనాత్మజుని ధ్యానించి హనుమత్సందర్శనమగు వరకు దివారాత్రములు జపించవలెను. నిశీధకాలమున హనుమంతుడు సాధకుని దార్ధ్యమును గుర్తించి సుప్రసన్నుడై సాధకుని ముందు ప్రత్యక్షమగును. సాధకుడు కోరిన వరమును ఇచ్చును. అట్లు వరమును పొంది సాధకుడు సుఖముగా విహరించవచ్చును. లోకహితమునుకోరి అతిరహస్యము, పరమపవిత్రము, దేవతలకు కూడా దుర్లభము అగు ఈ సాధనమును తెలియజేసితిని.

ఆత్మకు హితకరములగు ఇతర ప్రయోగములను కూడా సాధించవలయును. “శ్రీ పవననంద నాయ స్వాహా” అను మంత్రము దశాక్షరి సర్వకామప్రదము. ఈ మంత్రములకు మున్యాదికము షడంగములు పూర్వమువలెనే తెలియవలయును. కోటి సూర్యసమప్రభుడు, యుద్ధమున రావణుని జయించుటకు లంఘించుచున్న, రణభూమి యందు పడియున్న మహావీరుడగు లక్ష్మణుని చూచి లేచినవానిని, గొప్ప కోపమును కలిగించి గొప్ప పర్వతమును గ్రహించ యత్నించువానిని, దర్పముచే చేయు సింహనాదములచే జగత్రయమును కంపింపచేయుచున్నవాడు, బ్రహ్మాండమంతయు వ్యాపింపచేయు భయంకర శరీరము కలవాడు అగు హనుమంతుని ధ్యానించవలెను. మంత్రమును ఒక లక్ష జపించవలెను. పూర్వమువలె హోమమును చేయవలెను. ఈ మంత్రమునకు పూజనము కూడా పూర్వము వలెనే చెప్పబడినది. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత ఆత్మహితమును సాధించవలెను. ఈ మంత్రమునకు కూడా సాధనము పరమ రహస్యము. సర్వ తంత్రములందు కూడా చక్కగా రక్షింపదగినది. అందరికీ ఈయరాదు. బ్రాహ్మీ ముహూర్తమున లేచి నిత్యకృత్యములను నెరవేర్చుకొని పరిశుద్ధుడై నదికి వెళ్ళి స్నానమాచరించి అష్టతీర్ధములను ఆవహించి, మూల మంత్రమును జపించి పన్నెండు మార్లు ప్రోక్షించవలెను. ఇట్లు స్నానాదికమును ఆచరించి గంగాతీరమున కాని, పర్వత ప్రాంతమున కాని వనమునకాని భూమి గ్రహణ పూర్వకముగా ఆద్య వర్ణములచే పూరకమును, పంచ వర్గములతో కుంభకమును, యాదులచే రేచకమును ఆచరించి ప్రాణాయామము నాచరించి పీఠన్యాసావధిగా భూతశుద్ధ్యాదికమును ఆచరించి, ధ్యానము చేసి పూర్వోక్త విధిచే కపీశ్వరుని చక్కగా పూజించి సాధకుడు కపీశ్వరుని ముందు గొప్ప పూజను ఆచరించవలెను. ఏకాగ్రమనస్సుతో దివారాత్రములు జపించవలెను. రాత్రి మూడుభాగములు మిగిలియుండగా నిశ్చయముగా హనుమంతుడు వచ్చి, అభయమును ఇచ్చి కోరిన వరమును ఒసగును. విద్యను కాని, ధనమునుకాని, రాజ్యమును కాని, శత్రు నిగ్రహమును కాని ఆ క్షణముననే పొందగలడు. ఈ విషయమున సంశయమే లేదు. ఈ లోకమున సకల అభీష్టములను పొంది అంతమున మోక్షమును పొందును. సద్యాచితము వాయుయుగ్మము హనుమంత అని పలికి, ఫలాంతమున ప్రక్రియా నేత్ర యుక్తమగు కానిక తరువాత ధగంతమున ధగితయని పలికి ఆయురాస్వపదమును లోహిత గరుడ పదములచే హేతి బాణ నేత్రాక్షరమగు మంత్రము ఇది. మున్యాదికమంతయూ పూర్వోక్త విధానముగా ఉండును. ఈ మంత్రమున ధ్యానించబడు హనుమంతుడు ప్లీహ రోగమును హరించును. ఈ మంత్రమునకు హనుమంతుడు దేవత, ప్లీహరోగయుక్తము అగు ఉదరమున నాగవల్లీ దళమునుంచి పై భాగమున ఆచ్ఛాదన చేయవలయును. తరువాత ఎనిమిది రెట్లు వస్త్రమునుంచి వంశ శకలమును దానిపై నుంచవలయును. తరువాత కపీశ్వరుని స్మరించవలయును. ఆరణ్య సాణమున పుట్టిన వహ్నియందు యష్టిని తపింపచేయవలెను. బదరీవృక్షజమగు ఆ యష్టిని ఈ మంత్రముచే ఏడు మార్లు జఠరముననున్న వంశ శకలమును తాడనము చేయవలయును. ఇట్లు ఏడుమార్లు కొట్టినచో ప్లీహ రోగము నశించును. “ఓం నమో భగవతే ఆంజనేయాయ” అనునది మంత్రము. దీని తరువాత “శృంఖలాం త్రోటయత్రోటయ బంధమోక్షం కురు కురు స్వాహా” అని పలుకవలెను. ఇట్లు మంత్రము పరిపూర్ణము. ఈ మంత్రమునకు ముని ఈశ్వరుడు. అనుష్టుప్ఛన్దస్సు. శృంఖలామోచనుడు పవనాత్మజుడగు హనుమంతుడు దేవత. హం అనునది బీజము, ఠద్వయము శక్తి, బంధమోక్షము వినియోగము. షడ్దీర్ఘవహ్ని యుక్తమగు బీజముచే అంగములను కల్పించవలెను. వామభాగమున వైరిభేదకమగు శైలమును, దక్షిణభాగమునటంకమున ధరించినవాడు, స్వర్ణవర్ణుడు, కుండలియగు హనుమంతుని ధ్యానించవలెను. ఇట్లు ధ్యానముచేసి లక్ష జపించవలెను. దశాంశమును మామిడి చిగురులచే హోమమును చేయవలయును. పూజనమంతయు పూర్వోక్త విధానమున గావించవలెను. మహాకారాగృహము ప్రాప్తించినచో పదివేలు జపించవలెను. త్వరగా కారాగృహము నుండి విముక్తుడై ఆనందించును. ఇక ఇపుడు శుభము. బంధమును విడిపించు యంత్రమును చెప్పెదను.

అష్టదళములలోపల సాధ్యానామ సమన్వితముగా షట్కోణమును లిఖించవలెను. షట్కోణములలో ధ్రువమును ‘అంజనేయాయ’ అను పదమును వ్రాయవలెను. అష్టదళములలో ప్రణవమును వాతు వాతు అని వ్రాయవలెను. గోరోచనముచే కుంకుమచే ఈ ఉత్తమ యంత్రమును వ్రాసి శిరస్సున ధరించి పదివేలు జపించవలెను. మట్టిమీద కుడిచేతితో వ్రాసి చెరుపవలెను. ఇట్లు నలుబది రోజులు ప్రతి దినము చేసినచో మహాకారాగారమునుండి విముక్తి లభించును. గగనము, అగ్ని, సూర్యుడు, మర్కట మర్కట అనునది జలము, చంద్రుడు, మకరము పరిముంచతి ముంచతి శృంఖలికా వీటితో కలిసి ముప్పది నాలుగక్షరముల మంత్రము. ఈ మంత్రమును కుడి చేతియందు వ్రాసి వామహస్తముచే చెరిపి మంత్రమును అష్టోత్తర శతమును జపించవలెను. ఇట్లు మూడు సప్తాహములు చేసినచోబద్ధుడు ముక్తుడగును. ఈ మంత్రమునకు మున్యాదికము పూజాదికమంతయు పూర్వమువలె చేయవలెను. ఒక లక్ష జపముచేసి శుభద్రవ్యములచే హోమమును చేయవలెను. పుచ్ఛాకారమగు పవిత్ర వస్త్రమునందు క్షురకమువలన ఏర్పడిన లేఖినిచే గంధాష్టకములచే హనుమంతుని సుందర రూపమును లిఖించవలెను. ఆ మధ్యలో అష్టాక్షరిని దశాక్షరిని శత్రునామ సహితముగా వ్రాయవలయును. ఆ యంత్రమును మంత్రించి శిరమున ధరించి యుద్ధములకు వెళ్ళినచో శత్రు సైన్యమును జయించును. సూర్యచంద్ర గ్రహణములలో పూర్వోక్త యంత్రమును ధ్వజమున వ్రాయవలెను. గ్రహణ స్పర్శ నుండి మోక్షము వరకు మంత్రజ్ఞుడు ధ్వజమును తీసుకుని మాతృకా మంత్రమును జపించవలెను. తరువాత దశాంశమును హోమము గావించవలెను. సంస్కరించబడిన అగ్ని హోత్రములో ఆవాలు కలిపిన నువ్వులతో హోమమును చేసి గజముపై ధ్వజమునుంచి యుద్ధమునకు వెళ్ళవలెను. గజముపైనున్న ధ్వజమును చూచి శత్రువులు పారిపోవుదురు. ఇక ఇప్పుడు మహారక్షాకరమగు హనుమత్ యంత్రమును చెప్పెదను. మొదట అష్టదళపద్మమును లిఖించి సాధ్యనామయుతముగా కర్ణికను వ్రాయవలెను. దాని బయట మాయచే వేష్టించి ప్రాణప్రతిష్ట చేయవలెను. స్వర్ణలేఖినితో చక్కని భూర్జపత్రముపై కాశ్మీర రోచనములచే వ్రాయబడిన యంత్రమును లోహత్రముచే కప్పివైచి చక్కగా సాధించిన యంత్రమును భుజమున కాని శిరస్సును కాని ధరించవలెను. యుద్ధమున, దూత్యమున, వాదమున, వ్యవహారమున జయము లభించును. గ్రహములచే, విఘ్నములచే, విషయములచే, శస్త్రములచే చోరులచే భయముకలుగదు. అన్ని రోగములను పారదోలి నూరు సంవత్సరములు జీవించును. షట్ దీర్ఘయుక్తాకాశము, తార సంపుటమగు అగ్నితో కూడిన ఈ మంత్రము అష్టాక్షరీ మంత్రము “ఓం నమో ఆంజనేయాయ” అనునది. ఇక ఇపుడు మాలా మంత్రమునుచెప్పెదను. “ఓం వజ్రకాయ! వజ్ర తుండ! కపిల! పింగల! ఊర్ధ్వకేశ! మహాబల! రక్తముఖ! తడిజ్జిహ్వ! మహా రౌద్రదంష్ట్ర! ఉత్కటం వహ! వహ! కరాల! మహాధృఢ ప్రహారేణ లంకేశ్వర వధాత్ వాయు మహాసేతుబంధ! మహాశైల ప్రవాహ గగనే చర! ఏహ్యేహి! భగవన్మహాబల పరాక్రమ! భైరవ! అజ్ఞాపయ! ఏహ్యేహి! మహారౌద్ర! దీర్ఘపుచ్చేన వేష్టయ వైరిణమ్ జంభయ జంభయ! హుంఫట్” ఇది మాలామంత్రము. శరనేత్రధరాక్షరము. మాలా మంత్రమునకు అష్టాక్షరికి మునిపూజాదికము పూర్వమువలెనేయుండును. యుద్ధమున జపించిన జయము, వ్యాధిలో వ్యాధినాశనము జరుగును. ఇట్లు వాయు పుత్రుడగు కపీశ్వరుని భజించువాడు దేవతలకు కూడా దుర్లభములగు సకలాభీష్టములను పొందును. ధన ధాన్య పుత్ర పౌత్ర సౌభాగ్య కీర్తి మేధావిద్యాప్రభారాజ్యములను వాద విజయమును, సర్వలోకవశ్యతను యుద్ధజయమును అంజనేయుని అనుగ్రహమువలన పొందును. (3/74)