నారద మహా పురాణము
(బల్లి) గోధా విముక్తి
వసిష్ఠ మహర్షి పలికెను: ఓ రాజా! మోహినీ రుక్మాంగదులు గిరి దుర్గము నుండి బయలుదేరి బహువిధ భావములను మనోహరములను పర్వత సంభవములను చూచుచుండిరి. అచట కొన్ని పగడములవలె ఉన్నవి. కొన్ని వెండివలె ఉన్నవి. కొందరు నీలసమములు. కొన్ని కాంచన సన్ని భములు. కొన్ని స్ఫటిక వర్ణప్రభలు, మరికొన్ని హరితాళ నిభలు. అవి అన్నియు ఇతర స్థావరముల తోవలె పరస్పరము సంశ్లేషమును పొంది ఉన్నవి. భూమిమీద చేరి వజ్రమువలె వాడియగు డెక్కతో భూమిని త్రవ్వుచున్న ఉత్తమాశ్వమును చూచెను. వాడి డెక్కతో ఆ అశ్వము భూమిని త్రవ్వుచుండగా భూ అంతర్భాగమున ఒక బల్లి ఉండెను. బయటికి వచ్చుచు గుఱ్ఱపుడెక్కతో చీల్చ బడెను. చీల్చబడుచుండగా రాజు చూచుచుండెను. అయ్యో! చనిపోయెను అనుచు పరుగెత్తెను. వెంటనే సుకుమారమగు ఒక పత్రముతో ఆ బల్లిని ప్రక్కకు జరిపెను. గడ్డిమీదపడవేసెను. మూర్ఛిల్లిన బల్లిని చూచి మోహినితో పద్మాక్షీ! త్వరగా జలమును తెమ్ము! బల్లిపై చల్లెదను అని పలికెను. భర్త మాటతో మోహిని త్వరగా నీరును తెచ్చెను. అతడు ఆ జలమును బల్లిపై చల్లెను. చల్లని నీరు చల్లుటచే బల్లికి స్పృహ కలిగెను. గాయములు అన్నిటిపై చల్లని నీరు చల్లెను. తడిబట్టతో శరీరమును తుడిచెను. అట్లు స్పృహ వచ్చిన బల్లి ఎదురుగా రాజును చూచి వేదనతో అర్హురాలై మెల్లమెల్లగా ఇట్లు పలికెను. “ఓ మహావీరా! రుక్మాంగద మహారాజా! నా కధను తెలియుము. నేను శాకల నగరమున ఒక బ్రాహ్మణోత్తముని భార్యగా ఉంటిని. రూపముతో యౌవనముతో ఉన్ననూ, నా భర్తకు ఇష్టురాలను కాకపోతిని. ఎపుడు నాయందు ద్వేషముతో నిష్ఠురముగా మాటలాడు చుండెను. ఇతరుల నెవ్వరినీ ద్వేషించెడివాడు కాడు. అపుడు నేను కోపముగల దాననై భర్తలచే విడువబడిన యువతులను వశీకరణ మంత్రముకాని, ఔషధము కాని లభించు ప్రదేశమును అడిగితిని. వారు నీకు భర్త వశము కాగలడు. మాకు భర్తలు విడిచిన అవమానము తొలగుటచే నమ్మకము ఏర్పడినది. సన్యసించిన భర్తలు కూడా ఔషధములచే వశులైరి. నీవు కూడా ఆమె వద్దకు వెళ్ళుము. అడుగుము. నీకు మంచి ఔషధమును ఈయగలదు. ఈ విషయమున సందేహించ వలదు. నీ భర్త నీకు దాసుడగును. అపుడు నేను వారి మాటలతో ఆమె ఇంటి మార్గమును తెలుసుకొని వెళ్లితిని. అచట శతస్తంభ సమాయుక్తము, కాంతి మత్సుధతో కూడి ఉన్న భవనమున ప్రవేశించి తేజోవంతురాలగు బ్రహ్మచారిణిని చూచితిని. దీర్ఘ వస్త్రమును కప్పుకొని సంధ్యారాగ వర్ణముతో నుండెను. పరిచారికలు వీవనలతో వీచు చుండిరి. ఆమెపేరు భగమాలిని. చేతిలో జపమాలను ధరించి సర్వవశ్యకరము, సర్వ క్షోభకరమును జపించుచుండెను. అపుడు నేను ఆమెకు నమస్కరించి పాదముల యందు ఒక ఉంగరమును ఉంచితిని. ఆమె నన్నడుగకనే నా భర్త నన్ను అవమానించెనని తెలుసుకొనెను. అపుడు ఆ తాపసి రక్షతో కూడిన ఈ చూర్ణము సర్వప్రాణులను వశము చేయును. నీవు నీ భర్తకి ఇమ్ము. భర్తకంఠమును మాత్రము కాపాడుము. భర్త నీవశమగును. ఇతర స్త్రీని కోరడు అని పలికెను. అంతట నేను రక్షా చూర్ణమును తీసుకొని ఇంటికి వెళ్ళితిని. ప్రదోష కాలమున రక్షా చూర్ణమును పాలతో కలిపి భర్తకు ఇచ్చితిని. కంఠ విషయమున రక్ష చేసితిని. ఇంక ఇతరమును గురించి ఆలోచించలేదు. రక్షాచూర్ణము త్రాగిననాడే అతనికి క్షయ రోగము సంక్రమించినది. రోజురోజుకు క్షీణించసాగెను. గుహ్యమున పుండుపుట్టి, దాని నుండి క్రిములు పుట్టినవి. కొన్ని దినములు గడిచిన తరువాత సూర్యుని ముందు దీపమువలె కాంతి హీనుడు ఆయెను. కలతతో పగలు, రాత్రి ఆక్రోశించుచు నాతో ఇట్లనెను. ప్రియురాలా! నేను నీకు దాసుడనుగుదును. నిన్నే శరణు వేడుచున్న నన్ను కాపాడుము. పరస్త్రీని కోరను అతని ఆక్రందననువిని భయముతో వణుకుచు యోగిని వద్దకు వెళ్ళి జరిగినది అంతయు నివేదించితిని. నా భర్త సంతాపమును తొలగించమని ప్రార్థించితిని. అపుడామె దాహశాంతి కొరకు మరొక ఔషధము ఇచ్చెను. ఆ ఔషధమును భర్తకీయగా రోగము శాంతించెను. మొదటి చూర్ణము వలన కలిగిన దాహము శాంతించెను. అప్పటి నుండి నా భర్త నావశము అయ్యెను. కొంతకాలమునకు నేను మరణించి నరకముకు చేరితిని. పదిహేను యుగములు రాగి మూకుడులో నువ్వుగింజంత ఖండములుగా నా శరీరమును చేసి కాల్చబడితిని. కొంచెము పాతకము మిగిలియుండగా భూమి మీద పుట్టితిని. యమధర్మరాజు నన్ను బల్లిగా పుట్టించెను. ఈ రూపముతో ఇచటనే పదివేల ఏండ్ల నుండి ఉంటిని. ఇట్లు భర్తను వశమున ఉంచుకొనుటకు ప్రయత్నించు ప్రతి స్త్రీ ధర్మాచరణము వ్యర్థమై, దురాచారపరురాలై రాగి మూకుడులో కాల్చబడును. భర్తయే నాథుడు. భర్తయేగతి. భర్తయే దైవము, గురువు. అట్టి భర్తను వశమున ఉంచుకొనవలెనని ప్రయత్నించు స్త్రీ ఎట్లు సుఖము నొందగలదు. కుష్ఠు రోగము కలదై నూరు జన్మలు పశుపక్ష్యాదులుగా పుట్టును. కావున స్త్రీలు భర్తమాటను పాటించవలెను. కావున నేను మరల కూడా కుత్సిత జన్మనే పొందెదను. రోజు నిన్ను శరణువేడిన నన్ను ఉద్ధరించుము. పాపమును నశింపచేయు గంగా సరయూ సంగమమున విజయ అనబడు శ్రవణ ద్వాదశీ వ్రతము ఆచరించితివి. ఆ ద్వాదశి ప్రేతత్వముక్తి ప్రదాయిని, అభీష్ట ఫలదాయిని, శ్రీహరిని స్మరించు ఇంట్లో సర్వతీర్థ ఫలప్రాప్తి కలుగును. విజయాద్వాదశిన చేసిన దానము, జపము, హోమము, దేవపూజ అన్నియూ అక్షయము లగును. కావున విజయా ద్వాదశీ వ్రత ఫలమునునాకిమ్ము. ద్వాదశినాడు ఉపవశించి, త్రయోదశిన పారణముచేసిన ద్వాదశ వత్సరోపవాస ఫలమును పొందును. నీవీ భూమి మీద దయామూర్తివి. కావున నాయందు దయ జూపి యమ మార్గమును ధ్వంసము చేయువాడవు గావున దుఃఖించు నన్ను కాపాడుము అని ఇట్లు పలికిన బల్లి మాటలను విని మోహిని ఇట్లనెను.
ప్రతి ప్రాణి తాను చేసిన కర్మ ఫలమునే సుఖదుఃఖ రూపముగా అనుభవించును. కావున భర్తకు ద్రోహము చేసిన ఈమెతో మనకేమి పని? రక్షా చూర్ణమునిచ్చి భర్తను వశముచేసుకున్న పాతకి ఈమె. మంచివారికి చేసినది కీర్తిని ఇచ్చును. పాపులకు చేసిన ఇద్దరూ భ్రష్టులు అగుదురు. శర్కర కలిపిన పాలను పాముకు ఇచ్చిన విషమును పెంచినట్లు, పాపులకు చేసిన మేలు హానిని చేయును. కావున ఈ పాతకిని విడువుము. మనము నగరమునకు వెళ్ళెదము. బ్రతుకంతా ఇతరులకు మేలు చేసినవారికి సౌఖ్యము నశించును.
రుక్మాంగద మహారాజు పలికెను: ఓ బ్రహ్మ పుత్రికా? నీవెట్లు ఇటువంటి మాటను పలుకుచున్నావు. ఇది సాధువుల పనికాదు. తన సుఖమును మాత్రమే చూచు కొందరు పాపులు పరులను బాధించెదరు. పరోపకారమును చేయుటకు ఇష్టపడరు. చంద్రుడు, సూర్యుడు, మేఘము, భూమి, అగ్ని, జలము, చందనము, వృక్షములు, సత్పురుషులు పరోపకారమునకే సృజించ బడుదురు. పూర్వకాలమున హరిశంద్రుడు అను మహారాజు అసత్యమునకు భయపడి భార్యను విక్రయించి, చండాల గృహమున నివసించి ఘోర దుఃఖమును పొందెను. అతని సత్య వ్రతమునకు సంతసించిన ఇంద్రాది దేవతలు అతనిని వరమును కోరమని అడిగిరి. అప్పుడు హరిశ్చంద్ర మహారాజు బ్రహ్మాది దేవతలను గూర్చి ఇట్లు పలికెను. దేవతలు నాయెడ సంతోషించినచో నా నగరము వృక్షములతో, సర్పములతో బాల వృద్ధ యువ నర నారీ యుతముగా పశుపక్ష్యాదియుతముగా పాపములను ఆచరించియున్ననూ, స్వర్గముకు చేరవలెను. అయోధ్యా నగరములోనివారు చేసిన పాపమును నేను స్వీకరించి నరకమునకు వెళ్ళెదను. నా ప్రజలను వదిలి నేనొంటిగా స్వర్గమునకు వెళ్ళజాలను అని అనగా అతని స్థిర నిశ్చయమును గ్రహించి ఇంద్రాదులు అయోధ్యా పురవాసులందరు హరిశ్చంద్ర మహారాజుతో స్వర్గమునకు చేర్చబడిరి. హరిశ్చంద్ర మహారాజు కూడా కామగతిగల విమానముతో దేవతలచే పూజించబడుచు స్వర్గమున విరాజిల్లెను. దధీచిమహర్షి అస్థిదానమును చేసెను. శిబిచక్రవర్తి కూడా కపోతమును కాపాడుటకు డేగకు తన శరీర మాంసమును ఖండించి ఇచ్చెను. పూర్వకాలమున జీమూతవాహనుడను రాజు పాములను కాపాడుటకై తన జీవితమునే అర్పించెను. కావున రాజులు దయాపరులు కావలెను. మేఘము పవిత్ర స్థలమున అపవిత్ర ప్రదేశమున కూడా వర్షించును. చండాలులను పతితులను కూడా చంద్రుడు ఆనందింప చేయును. కావున దౌహిత్రులు నహుషుని ఉద్ధరించినటుల, ఈ బల్లిని నా పుణ్యములచే ఉద్ధరింతును అని ఇట్లు మోహినితో పలికి రుక్మాంగద మహారాజు బల్లితో ఇట్లు పలికెను. ఓ గోధా! నేను విజయవ్రతాచరణము వలన కలిగిన పుణ్యమును నీకిచ్చితిని. కావున అన్ని పాపములనుండి విముక్తిని పొంది విష్ణు లోకమును చేరుము. రుక్మాంగద మహారాజు ఆమాటను పలికిన వెంటనే ఆ బల్లి తన దేహమును విడిచి దివ్యాభరణ భూషితురాలై, రుక్మాంగదుని అనుజ్ఞను పొంది, పది దిక్కులను ప్రకాశింపచేయుచు ఆకాశమున పాపిటను కల్పించి విష్ణు లోకమును చేరెను. యోగులకు మాత్రమే చేరదగినది అగ్నివలె తేజోమయము, ఉత్తమములలో కెల్ల పరమోత్తమము పరమాత్మ భూతము అగు విష్ణు లోకమున రుక్మాంగద మహారాజు చేసిన పుణ్యము జగత్తును ప్రకాశించుచు ఉత్తమ దీపముగా బల్లి రూపమును విడిచి దివ్య దేహమున విలసిల్లెను. (II/14)