నారద మహా పురాణము
విష్ణు సేవాప్రభావము
సనక మహర్షి పలికెను: వేదమాలి పుత్రులగు యజ్ఞమాలి సుమాలుల చరితమును ఇపుడు చెప్పెదను. పెద్దవాడగు యజ్ఞమాలి తన ధనమును రెండు భాగములుగా విభజించి ఒక భాగమును చిన్నవాడగు సుమాలికిచ్చెను. సుమాలి వ్యసనలోలుడై ధనమును అంతటిని అపాత్రదానములచే నశింపచేసెను. ప్రతినిత్యము గీతవాద్యములందు ఆసక్తుడై మద్యపానరతుడై వేశ్యా విలాసముల యందు ఆశపడి పరదారారతుడాయెను. పిత్రార్జితమైన ధనమంతయూ వ్యయము కాగా పరద్రవ్యమును అపహరించి వేశ్యాలోలుడాయెను. సుమాలి దుర్వృత్తమును చూచి మహామతియైన యజ్ఞమాలి దుఃఖితుడై తమ్మునితో ఇట్లు పలికెను. సోదరా! మన కులములో పుట్టిన నీవు దురాచారమును అవలంబించి కష్టపడుట తగదు. ఈ కలుములలో నీవు ఒక్కడవే దుష్టాత్ముడవు మహాపాపరతుడవు అగుచున్నావు. ఈ దుర్వృత్తమును మానుము. ఇట్లు పలుమార్లు వారించుచున్న అన్న మీద ఆగ్రహించిన సుమాలి యజ్ఞమాలిని చంపుటకు నిశ్చయించి ఖడ్గహస్తుడై అన్న కేశములను పట్టుకొనెను. అంతట నగరమున భయంకరమైన మహానాదము కలిగెను. నగర ప్రజలు కోపించినవారై సుమాలిని బంధించిరి. సజ్జనుడగు యజ్ఞమాలి నాగరులను ప్రార్థించి నుమాలిని విడిపించెను. మరల తన ధనమును రెండు భాగములుగా విభజించి ఒక భాగమును సుమాలికిచ్చెను. అంతమూఢుడైన సుమాలి ఆ ధనమును కూడా మూర్ఖులగు పాషండచండాలులతో కలిసి అనుభవించెను. దుర్జనుల సంపదలు దుర్జనులచే మాత్రమే అనుభవించబడును. వేపచెట్టు పండ్లను కాకులు మాత్రమే భుజించును కదా! యజ్ఞమాలి ఇచ్చిన ధనమును కూడా సుమాలి వ్యయము చేసెను. మద్యపానమత్తుడై గోమాంసాదులను భక్షించెను. బంధుజనులచే వెలివేయబడి, రాజుచే శిక్షించబడి, చండాలస్త్రీలతో కూడి నిర్జన అరణ్యమున ప్రవేశించెను. మంచిబుద్ధి గల యజ్ఞమాలి మాత్రము ఎప్పుడూ ధర్మరతుడై నిరంతరాయముగా అన్నదానమును చేయుచుండ సత్సంగతివలన పాపములు తొలగెను. తండ్రి త్రవ్వించిన తటాకాదులను పుణ్యక్రియా పరాయణుడై నిత్యము కాపాడుచుండెను. ధర్మమార్గప్రవర్తకుడై మహానుభావుడగు యజ్ఞమాలి సత్పాత్రదానముచే ధనమునంతయూ వ్యయము చేసెను. సజ్జనుల సంపదలు సజ్జనుల భోగమునకు ఉపయోగపడును. కల్పవృక్షఫలములను అమరులు మాత్రమే అనుభవింతురు కదా! ధర్మకార్యములకు ధనమును వ్యయము చేసిన యజ్ఞమాలి ప్రతినిత్యము విష్ణ్వాలయమున పరిచర్యలను చేయుచుండెను.
కొంతకాలమునకు యజ్ఞమాలి సుమాలి వార్ధక్యమును పొందిరి. ఇద్దరూ ఒకే సమయమున మరణించిరి. మహానుభావుడు హరిపూజాపరుడు అయిన యజ్ఞమాలికై శ్రీహరి ద్వారపాలకులతో కూడియున్న దివ్య విమానమును పంపెను. మహామతియగు యజ్ఞమాలి దివ్య విమానము అధిరోహించి దేవతాగణములు పూజించుచుండగా, మునీశ్వరులు స్తుతించుచుండగా గంధర్వులు గానము చేయుచుండగా అప్సరోగణములు సేవించుచుండగా కామధేనువు పోషించుచుండగా, చిత్రాభరణ భూషితుడై కోమలములైన తులసీమాలలచే అలకరించబడి తేజోనిధియై దివ్యమైన విష్ణులోకమునకు వెళ్ళుచు మార్గమధ్యమున తమ్ముని చూచెను. యమభటులు కొట్టుచుండగా ఆకలిదప్పులచే పీడించబడుచు, ప్రేతరూపుడైన నగ్నముగా దుఃఖితుడై పాశబద్ధుడై ఇటునటు పరుగిడుచు అనాథవలె విలపించుచు, ఆక్రోశించుచు, రోదించుచున్న వానిని చూచి మనసున వ్యధచెందెను. యజ్ఞమాలి దయాన్వితుడై దగ్గరలో ఉన్న విష్ణుదూతలను ఇట్లు భటులచే బాధించ బడువాడెవ్వడు అని అడిగెను. అట్లు చేతులు జోడించి అడిగిన మహాతేజస్వియగు యజ్ఞమాలికి విష్ణుదూతలు, ఇతను నీ తమ్ముడు పాపాత్ముడగు సుమాలి, అని తెలిపిరి. విష్ణుదూతలు చెప్పిన మాటలను వినిన యజ్ఞమాలి మనసులో దుఃఖించి, మరల వారిని అడిగెను. ఇతను చేసిన పాపములు నుండి ఎట్లు విముక్తి లభించును? మీరు నాకు బంధువులు కావున ఆ ఉపాయమును తెలుపుడు. ఏడడుగులు కలిసి నడిచినచో సఖ్యమని ధర్మకోవిదులు చెప్పియున్నారు. సజ్జనులకు ప్రతిపదమున మైత్రి అని కదా ధర్మ నిర్ణయము. కావున నన్ను తినిపోవుటకు వచ్చిన మీరు నాకు బాంధవులు. నా సోదరుడగు సుమాలి కూడా మోక్షమును పొందునుపాయమును తెలుపుడు” అని ఇట్లు పలికిన యజ్ఞమాలి మాటలను వినిన విష్ణుదూతలు దయాళువులు కావున చిరునవ్వుతో హరిప్రియుడగు యజ్ఞమాలితో ఇట్లు పలికిరి.
విష్ణుదూతల పలికిరి: “ఓ మహానుభావా! నారాయణ పరాయణా! యజ్ఞమాలీ! సుమాలి మోక్షమును చెందు ఉపాయమును నీకు చెప్పెదము. నీవు పూర్వజన్మలో చేసిన మహాపుణ్యమును సంగ్రహముగా చెప్పెదను వినుము. నీవు పూర్వజన్మలో విశ్వంభరుడు అను పేరుగల వైశ్యజాతీయుడవు. నీవు లెక్కించలేని మహాపాపములను ఎన్నింటినో చేసితివి. సత్కర్మవాసనాహీనుడవై తల్లిదండ్రులను ద్వేషించుచుంటివి. ఒకపుడు బంధువులందరూ వెలివేయగా శోకసంతాపముచే పీడించబడి ఆకలిచే పరితపించుచు హరి మందిరమును చేరితివి. ఆ సమయమున ఆచట మహావర్షము కురిసినది. ఆ ప్రాంతమంతయూ బురదమైనది. అపుడు నీవు అచట నివసించగోరి ఆ బురదను దూరము చేసి శుభ్రపరిచితివి. నీవు చేసిన పని హరిమందిరమును అలుకుటగా అయినది. నీవు ఆ రాత్రి ఆ దేవాలయముననే ఉంటివి. ఒక మహాసర్పము కాటువేయగా మరణించితివి. అట్లు విష్ణ్వాలయమున అలుకుటలను సుకృత ప్రభావముచే బ్రాహ్మణజన్మ హరిభక్తి లభించినది. కోటి కల్పములు హరి సన్నిధిన నివసించి జ్ఞానముపొంది మోక్షమును పొందగలవు. మహాపాపి అయిన నీ తమ్ముని పాపవిముక్తుని చేయగోరుచున్నావు. ఆ ఉపాయమును చెప్పెదము. తెలియుము. నీవు ఈ జన్మలో హరిమందిరమును అలికిన ప్రదేశమున గోచర్మ మాత్రప్రదేశమును అలుకుట వలన కలిగిన పుణ్యమును నీ సోదరునికి దానము చేసి ఉద్ధరించుము. ఇట్లు విష్ణుదూతలు పలుకగా దయాపరుడగు యజ్ఞమాలి ఆ ఫలమును సుమాలికి అర్పించెను. అన్నగారు దానము చేసిన పుణ్యముచే సుమాలి పాపవిముక్తుడాయెను. యమదూతలు సుమాలిని విడిచి పారిపోగా. ఆ విమానమును అధిరోహించి ఆనందించెను. ఇట్లు ఆ సోదరులిరువురు దేవతాసమూహముచే నమస్కరించబడుచు, పరస్పరము అలింగనమును చేసుకొని అనందించిరి. యజ్ఞమాలి సుమాలులు మహర్షులచే స్తోత్రము చేయబడుచు, గంధర్వులచే గానము చేయబడుచు విష్ణులోకమునకు చేరిరి. ఆ విష్ణులోకమున యజ్ఞమాలిసుమాలులు సంతోషముతో ఒక కల్పము నివసించిరి. విష్ణులోకమున బహుభోగములను అనుభవించి అచటనే జ్ఞానమును పొంది మోక్షమును పొందెను. మహానుభావుడగు సుమాలి విష్ణులోకమున ఆనందముతో నివసించి మరల భూలోకమున బ్రాహ్మణత్వము నొందెను. పరమపవిత్రమైన కులములో పుట్టిన సుమాలి గుణవంతుడు వేదసారగుడు సర్వసంపత్సమేతుడు, హరిభక్తి పరాయణుడుగా ఉండి హరినామ సంకీర్తనమును చేయుచు, గంగాతీరమును చేరెను. గంగానదిలో స్నానము చేసి ప్రభువైన విశ్వేశ్వరుని దర్శించి యోగులకు కూడా దుర్లభమగు మోక్షమును పొందెను. ఓ మునీశ్వరా! నీకు దేవాలయమున ఉపలేపనము చేయుటవలన కలుగు మహాత్మ్యమును చెప్పితిని. కావున అన్ని విధములా ప్రయత్నించి జగన్నాథుని పూజించవలయును. సంకల్పములేని, కోరికలేక శ్రీహరిని పూజించిననూ ఎప్పుడూ సంసారబంధము కలుగును. హరి భక్తిరతులైన వారిని హరిబుద్ధిచే పూజించినచో బ్రహ్మవిష్ణుమహేశ్వరులు సంతోషింతురు. హరిభక్తి పరులతో కలిసి ఉన్నవారిని కలిసిననూ, మహాపాతకులైనను అన్ని పాపములనుండి విముక్తులు అగుదురు. హరిపూజాపరులను హరినామసంకీర్తనము చేయువారిని సేవించువారు పాపులైనను పరమపదమును పొందెదరు. (1/36)