గంగాస్నాన మాహాత్మ్యము

వసువు పలికెను: ఓ మోహినీ! పురాణములలో తత్త్వదర్శులగు మునులు చెప్పిన గంగాదర్శన ఫలమును చెప్పెదను వినుము. గరుడుని దర్శనమువలన సర్పములు విషహీనములగునట్లు గంగా దర్శనము వలన పాపరహితులగుదురు. గంగను దర్శించిన, స్పృశించిన, స్నానమాడినవారికి ముందు ఏడుతరములను, తరువాత ఏడుతరముల వారికంటే ఇతరులను తరింపచేయును. దర్శన స్పర్శన పానముల వలన గంగా నామసంకీర్తనము వలన నూర్లవేల పురుషులను తరింపచేయును. సాటిలేని జ్ఞానము, ఐశ్వర్యము, ప్రతిష్ఠ, ఆయుష్యము, యశస్సు, శుభాశ్రమవాసము గంగాదర్శనము వలన కలుగును. గంగాదర్శనము వలన ఇంద్రియ చాంచల్యము, వ్యసనములు, పాపములు, దీనత్వము నశించును. శాశ్వత పదమును కోరు నరుడు గంగను మాటిమాటికి చూడవలయును. మాటిమాటికి తాకవలెను. వాపీకూపతటాక ప్రపాదీతర తీర్థములలోకల పుణ్యమంతయూ గంగా దర్శనము వలన కలుగును. పరమాత్మ దర్శనము వలన కలుగు పుణ్యము భక్తిచే గంగను దర్శించిన వారికి కలుగును. నైమిశ కురుక్షేత్ర నర్మదాపుష్కర స్నానస్పర్శనాదుల వలన కలుగు ఫలము కలియుగమున గంగాదర్శనము వలన కలుగును. పురాణములలో చెప్పబడిన గంగా సర్పర్శన ఫలమును ఇపుడు చెప్పెదను. అశుభకర్మలను చేయుచు సంసారసాగరమున మునిగియుండి నరకమున పడుచున్నవారిని గంగాస్మరణము ఉద్ధరించును. సహస్రయోజనదూరమున ఉన్ననూ గంగను స్మరించువాడు దుష్కృత్యములను చేయువాడైనను ఉత్తమ గతిని పొందును. గంగాస్మరణ మాత్రముననే పాపసంఘాత పంజరము వజ్రాయుధముచే కొట్టబడిన పర్వతమువలే వేయి ప్రక్కలుగా చీలిపోవును. నడుచుచు, నిలుచుచు, పడుకొనుచు, ధ్యానించుచు, మేలుకొనుచు, తినుచు, నవ్వుచు, ఏడ్చుచు, ఎప్పుడూ గంగను స్మరించువాడు సంసార బంధ వినిర్ముక్తుడగును. సహస్ర యోజన దూరమున ఉన్న వారుకూడా గంగా, గంగా అని ఆక్రోశించుచు గంగను స్మరించువారు పాపములు నుండి విముక్తులగుదురు. గంగను స్మరించువారు, గంగా భక్తిపరులు సమస్త మహాపాపముల నుండి విముక్తులు అగుదురు. గంగను స్మరించు స్త్రీలకు భవనములు, విచిత్రా భరణములు, ఆరోగ్యము, ధన సంపదలు కలుగును. దూరమున ఉన్న నరుడు మనసుతో గంగను స్మరించువాడు సహస్ర చాంద్రాయణ వ్రతఫలమును పొందును. శతయోజనముల దూరమున నున్నవాడు కూడా గంగా గంగాయని జపించినచో సర్వపాప వినిర్ముక్తుడై విష్ణు లోకమును చేరును. గంగా కీర్తనము వలన పాపములు తొలగును. దర్శనము వలన శుభములు కలుగును. స్నానమాడి, గంగా జలమును పానము చేసినచో ఏడు తరములకు ముక్తి కలుగును. ప్రసంగ వశమున గంగను కీర్తించిననూ ముందు ఏడు తరములను, తరువాత ఏడు తరములను, ఆ తరువాత ఏడు తరములను కూడా తరింపచేయును. అశ్రద్ధచే అయినను పుణ్యవాహినియగు గంగ నామాను కీర్తనము చేసినవాడుకూడా స్వర్గమును పొందును, సర్వావస్థలను పొందినవాడు, సర్వధర్మ వర్జితుడు, కూడా గంగనామ సంకీర్తనము వలన శుభకరమగు గతిని పొందును. బ్రహ్మ ఘాతకుడు గురుఘాతకుడు, గోఘ్నుడు, సర్వపాతక సంస్పృష్టుడు కూడా గంగా జలమును స్పృశించి సర్వపాతక వినిర్ముక్తుడగును. నేనెపుడు గంగను దర్శించగలను, ఎప్పుడు గంగలో స్నానము చేయగలను అని అభిలషించువారి కులమును గంగ తరింపచేయును. ఇక ఇప్పుడు గంగాస్నాన ఫలమును చెప్పెదను. దీనిని వినినంతనే సర్వపాప వినిర్ముక్తుడగును. గంగా స్నానముచేసిన వానికి వెంటనే పాపములు నశించును. అపూర్వ పుణ్యము కూడా లభించును. గంగా పవిత్ర జలములలో నిశ్చల మనస్సుచే స్నానము చేసినవారికి సర్వ శుభములు కలుగును.

పవిత్ర గంగా జలములలో స్నానమాడువారికి కలుగు ఫలము నూరు యాగములను చేసిన వారికి కూడా కలుగదు. గంగా జలముచే ప్రోక్షితుడగువాడు ఉదయకాల సూర్యుడు తీవ్రంధకారమును నశింపచేయునట్లు పాపములను నశింపచేయును. గంగా జలమున ఒక మారు స్నానము ఆచరించినవాడు కూడా అశ్వమేధయాగ ఫలమును పొందును. గంగా స్నానమాత్రమున అనేక జన్మ సంచితముల పాపములు నశించి పుణ్య భాజనులగుదురు. ఇతర ప్రదేశములలో చేసిన పాపము గంగాతీరమున నశించును. పగలు సంధ్యవేళ, రాత్రిపూట ప్రయత్నముచే గంగా స్నానమును చేసినవాడు, గంగా జలమును తీసుకొని వచ్చి ఇంట్లో స్నానమాడిన వాడు కూడా అశ్వమేధ యాగ ఫలమును పొందును గంగాస్నానము వలన సర్వతీర్థగత పుణ్యమును, సర్వదేవాలయ పుణ్యమును పొందకలుగును. మమాపాతకయుతుడైనను, సర్వపాతకయుక్తుడైననూ యధావిధిగా గంగా స్నానమును ఆచరించినవాడు సర్వపాతక వినిర్ముక్తుడగును. గంగా స్నానమునకు మించిన ఫలములేదు. ఉండబోదు. కలియుగమున గంగా స్నానము విశేషముగా పాపములను హరించును. భక్తిచే గంగా స్నానమును చేసినవారు కామజ దోషములను మనోవాక్కాయ దోషములను హరించి స్వర్గమున దేవతలవలే ఆనందింతురు. గంగా జలమున ఒక సంవత్సరము స్నానము చేయువాడు విష్ణు లోకమున ఒక కల్పకాలము నివసించును. మరణ పర్యంతము ప్రతిదినము గంగా స్నానము చేయువాడు సమస్త పాప వినిర్ముక్తుడై సమస్త కులహితముగా సమస్త భోగములను అనుభవించి విష్ణులోకమున రెండు పదార్థములు విరాజిల్లును. ఇచట విచారించవలసిన పనిలేదు. నిత్యము నిరంతరము గంగా స్నానమును చేసినవాడు ఇచటనే జీవన్ముక్తుడగును. మరణించిన పిదప పరమ పదమును చేరును. ప్రాతఃకాల స్నానమునకంటే మధ్యాహ్న స్నానము దశగుణ ఫలమును కల్పించును. మధ్యాహ్న స్నానమున కంటే సాయంకాల స్నానము శతగుణ ఫలము నిచ్చును. శివ సన్నిధిలో గంగా స్నానమాచరించిన అనంతఫలప్రదము. కోటి కపిలా దానముల కంటే గంగా స్నానము అనంత ఫలప్రదము. కురుక్షేత్ర సమముగా గంగాజలము, హరి ద్వారమున ప్రయాగలో, సాగర సంగమమున విశేషించి ఫలప్రదము, నా కిరణములచే తపించబడిన గంగా జలమున స్నానమాడినవారు నా మండలమును ఛేదించుకొని మోక్షమును చేరెదరని సూర్యుని వాక్యము. ఇంట్లో ఉన్నవాడు కూడా స్నాన సమయము గంగను స్మరించినచో స్వర్గమును పొందునని వరుణుడు చెప్పెను. (II/39)