నారద మహా పురాణము
ద్వాదశమాసస్థ ద్వాదశీవ్రత నిరూపణము
సనాతన మహర్షి పలికెను: ఓ పుణ్యాత్ముడా ఇపుడు నీకు ద్వాదశివ్రతములను చెప్పెదను. ఈ వ్రతములను ఆచరించువారు శ్రీ మహావిష్ణువునకు ప్రీతిపాత్రులగుదురు. చైత్ర శుక్లద్వాదశినాడు మదన వ్రతము ఆచరించవలెను. తెల్లని బియ్యముతో నింపిన కొత్త కలశమును స్థాపించవలెను. ఆ కలశము చుట్టు నానా ఫలమును, చెఱుకుగడలను ఉంచవలెను. రెండు తెల్లని వస్త్రములతో కప్పవలెను. తెల్లని చందనమును పూయవలెను. నానా భక్ష్యములను ఉంచవలెను. శక్తి కొలది బంగారమును ఉంచవలెను. ఆ కలశము మీద గుడముతో కూడిన తామ్ర పత్రమును ఉంచవలెను. ఆ పత్రము మీద కామరూపియగు అచ్యుతుని స్థాపించి ఉపవశించి మరునాడు గంధాద్యుపచారములతో పూజించవలెను. మరల ప్రొద్దున పూజించి బ్రాహ్మణునకు దానమును గావించవలెను. బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణను ఈయవలెను. ఇట్లు ఈ వ్రతమును ఒక సంవత్సరము గావించి మృతధేను సమన్వితముగా సర్వోపస్కార సహితమగు శయ్యను గురువునకు దానము చేయవలయును. కాంచనమును, కామదేవుని, శ్వేతగోవును, వస్త్రములను బ్రాహ్మణ దంపతులను పూజించి సమర్పించవలెను. ఈ దానమును గావించునపుడు, కామరూపియగు శ్రీహరి ప్రీతిచెందు గాక' అని పలుకవలెను. ఇట్లు ఈ మదన ద్వాదశీవ్రతమును యధావిధిగా నాచరించిన వారు సర్వపాపవినిర్ముక్తులై హరి సామ్యమును పొందెదరు. ఈ ద్వాదశినాడే భర్తృ ద్వాదశికా వ్రతముకూడా చెప్పబడి ఉన్నది. చక్కగా ఏర్పరచబడిన శయ్యను అమర్చి ఆ శయ్యపై పుష్పములతో మండపమును నిర్మించి ఆ మండపముపై శ్రీసహితుడగు హరిని స్థాపించి గంధాద్యుప చారమును చేసి, మరునాడు ప్రాతఃకాలమున శయ్యతోపాటు బంగారముతో చేసిన బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలతో సంతోషింపచేసి విడిచిపుచ్చవలయును. ఇట్లు వ్రతమును ఆచరించువారి దాంపత్యము స్థిరముగా ఉండును. ఏడు జన్మలలో ఉభయలోక భోగములను అనుభవించును. వైశాఖ శుక్ల ద్వాదశినాడు ఉపవసించి, జితేంద్రియుడై భక్తిచే మాధవుని గంధాద్యుపచారములచే పూజించి తృప్తిని కలిగించు మధురమగు పక్వాన్నమును ఉదకుంభ సహితముగా మాధవుడు ప్రీతిచెందుగాక అని బ్రాహ్మణునకు దానము గావించవలెను. జ్యేష్ఠ శుక్ల ద్వాదశినాడు త్రివిక్రముని గంధాదులతో పూజించి మధురాన్నయుతమగు కరకమును బ్రాహ్మణునకు సమర్పించవలెను. వ్రతమును ఆచరించువాడు ఏకభుక్తముగా ఉండవలెను. ఈ వ్రతముతో సంతోషించిన దేవదేవుడగు త్రివిక్రముడు ఇహమున సకల భోగములను, అంతమున మోక్షమును ప్రసాదించును. ఆషాఢ శుక్ల ద్వాదశినాడు పన్నెండు మంది బ్రాహ్మణులను క్రమముగా గంధాదులతో పూజించి మధురాన్నమును భుజింపచేసి వారికి వస్త్రములను, దండములను, బ్రహ్మసూత్రములను ముద్రికలను పాత్రలను భక్తితో విష్ణువు ప్రీతి చెందుగాక అని దానము గావించవలయును.
శ్రావణ శుక్ల ద్వాదశినాడు శ్రీధరుని భక్తితో గంధాద్యుపచారములతో పూజించి, బ్రాహ్మణోత్తములను దధితో చక్కగా భోజనముచేయించి, వెండిని దక్షణగా ఇచ్చినమస్కరించి విడువవలయును. ఈ వ్రతముతో దేవేశుడగు శ్రీధరుడు ప్రీతి చెందుగాక అని పలుకవలెను. భాద్రపద శుక్లద్వాదశినాడు వామనుని చక్కగా పూజించి వామనుని ముందు పన్నెండు మంది బ్రాహ్మణులను పాయసముతో భుజింపచేసి సువర్ణమును దక్షిణగా ఇచ్చి శ్రీమహావిష్ణువునకు ప్రీతి పాత్రుడగును. ఆశ్వయుజ శుద్ధ ద్వాదశినాడు పద్మనాభుని గంధాద్యుపచారములతో పూజించి, పద్మనాభుని ముందు బ్రాహ్మణులను మధురాన్నముతో భుజింపచేసి సువర్ణమును దక్షిణగా ఈయవలెను. ఈ వ్రతముతో సంతోషించిన పద్మనాభుడు ఇహమున వాంఛిత సకల భోగములను శ్వేతద్వీప గతిని ఇచ్చును. కార్తిక కృష్ణ ద్వాదశినాడు గోవత్సద్వాదశీవ్రతము చెప్పబడినది. ద్వాదశినాడు తామ్రపాత్రపై సుగంధముగల చందనాదులతో వత్ససహితమగు గోవును లిఖించి పుష్పమాలతో పూజించి, యధా విధిగా పుష్పాక్షత తిలలో అర్ఘ్యమునిచ్చి ఈ మంత్రముతో గోపాదమున జలమును విడువవలయును. క్షీరసాగర సంజాతా! సురాసుర నమస్కృతా సర్వదేవమయా దేవీ సర్వదేవాలంకృతా గోవులకు మాతా మా మాతా ఈ అర్ఘ్యమును గ్రహించుము. నీకు నమస్కారము తరువాత మాషాది సంసిద్ధములగు వంటకములను నివేదన చేయవలెను. ఇట్లు తమతమ విభవానుసారముగా అయిదు కాని పది కాని ఒకటికాని గోవులను ఓ సురభీ! జగన్మాతా నిత్యము విష్ణు పదమున నుండు దానా సర్వ దేవస్వరూపిణీ నేనిచ్చు ఈ గ్రాసమును భుజించుము. సర్వ దేవ స్వరూపిణి! సర్వ దేవాలంకృతా నా అభిలాషను సఫలము చేయుము అని పలికి గ్రాసము ఈయవలెను. ఈ దినమున తైలపక్వమును, స్థాలీపక్వమును, గోక్షీరమును, గోఘృతమును, గోధధి, తక్రమును విడువవలెను. కార్తిక శుక్లద్వాదశి నాడు సావధానముతో దామోదరుని గంధాద్యుపచారములతో చక్కగా పూజించి, దామోదరుని ముందు పన్నెండు బ్రాహ్మణులను పక్వాన్నముతో భుజింపచేయవలెను. తరువాత నీటితో నింపిన కుంభములను వస్త్రచ్ఛన్నము గావించి చక్కగా పూజించి మోదక స్వర్ణములను ప్రీతితో వారికి సమర్పించవలెను. ఇట్లు చేసినచో శ్రీమహావిష్ణువునకు ప్రీతిపాత్రుడగును. అఖిల భోగములను అనుభవించి దేహాంతమున విష్ణు సాయుజ్యమును పొందును. ఈ దినముననే నీరాజనవ్రతము కూడా చెప్పబడినది. దానిని తెలియుము. సాయంకాలమున నిదురించి లేచిన జగన్నాధుని చక్కగా అలంకరించి, తాను అలంకరించు కొని కొత్తగా అగ్నిని కల్పించి, మంత్రములతో పూజించి, జ్వలించి జ్వలించిన అగ్నిలో హోమముకావించి రౌప్యదీపక యానమునందు గంధ పుష్పాదులచే అర్చించిన దానితో శ్రీహరికి నీరాజనమును కావించవలెను. శ్రీహరి వెంట అక్కడే ఉన్న లక్ష్మీదేవిని, సరస్వతిని, చండికను, సూర్యుని, శంకరుని, గౌరీదేవిని, యక్షుని, గణపతిని, నవగ్రహములను, మాతృదేవతలను, పితరులను పర్వతములను, సర్పములను, అందరికి క్రమముగా నీరాజనము ఈయవలెను. గోవులను నీరాజనము గావించవలెను. మహష్యాదులకు మండలమును గావించవలెను. నమశ్శబ్దములచే జయశబ్దములచే, ఘంటా శంఖాదిధ్వనులచే, సింధూరము పూయబడిన శృంగములను, చిత్రాంగముల బహువిధ వర్ణములతో, నీరాజన మహోత్సవములతో గోవుల కోలాహలము జరుగుచుండగా, సలక్షణములగు అశ్వములను, మదించిన గజములను, సర్వవిధములగు రాజ చిహ్నములగు ఛత్రాదులను పూజించి స్వయముగా ఆదరముతో నీరాజనము నిచ్చి, శంఖభేర్యాది ఘోషములతో నానారత్న నిర్మితమగు సింహాసనమును చక్కగా అలంకరించుకొని కూర్చుండవలెను. తరువాత సర్వలక్షణలక్షితయగు వేశ్యకాని, కులాంగన కాని రాజుగారి శిరస్సుపై మెల్లగా నీరాజనము ఈయవలెను. ఇట్లు మహారాజులు లేదా ధనవంతులు ఆరోగ్యమును కోరువారు ప్రతి సంవత్సరము ఈ మహాశాంతిని జరుపవలెను. ఇట్లు సర్వోత్తమమగు నీరాజన శాంతిని జరిపిన రాష్ట్రమున, పురమున రోగములు నశించి ఆరోగ్యము విలసిల్లును.
మార్గశీర్ష శుక్ల ద్వాదశినాడు సర్వోత్తమమగు సాధ్యవ్రతమును ఆచరించ వలయును. మనోభవుడు, ప్రాణుడు, నరుడు, వీర్యవంతుడు, చితి, హయము, నృపుడు, హంస, నారాయణుడు, విభువు, ప్రభువు అని పన్నెండుమంది సాధ్యులనబడుదురు. ఈ పన్నెండుమందిని తండులములతో కల్పించి గంధ పుష్పాదులచే పూజించవలెను. తరువాత పన్నెండు మంది బ్రాహ్మణులను భుజింపచేసి, మంచి దక్షిణలను ఇచ్చి, నారాయణుడు ప్రీతిచెందుగాక అని వారిని విడువవలెను. ఈ దినముననే ద్వాదశాది వ్రతముకూడా చెప్పబడినది. ఈ వ్రతమున ద్వాదశాదిత్యులను పూజించవలెను. ధాత, మిత్రుడు, అర్యమా, పూషా, శుక్రుడు, అంశుడు, వరుణుడు, భగుడు, త్వష్టా, వివస్వాన్, సవితా, విష్ణువు అనువారలు ద్వాదశాదిత్యులు, ప్రతి మాసమున శుక్ల ద్వాదశి నాడు ద్వాదశాదిత్యులను శ్రద్ధతో పూజించి ఒక సంవత్సరము వ్రతమును ఆచరించవలెను. వ్రతాంతమున ద్వాదశ సువర్ణ ప్రతిమలను యధావిధిగా పూజించి, పన్నెండు మంది బ్రాహ్మణోత్తములను మధురాన్నములతో భుజింపచేసి చక్కగా సత్కరించి వారికి ఒక్కొక్క ప్రతిమను అర్పించవలెను. ఈ ద్వాదశాదిత్య వ్రతమును ఆచరించినవాడు ద్వాదశాదిత్యము అనబడు సూర్యలోకమును పొంది, అచట చాలాకాలము సకల భోగములను అనుభవించి భూలోకమున ధర్మాత్ముడు రోగశూన్యుడు అగు మనుష్యునిగా జన్మించును. మరల వ్రతపుణ్యవశమున మరల వ్రతము చేయును. ఈ పుణ్యలోకముతో సూర్యమండలమును ఛేదించుకొని నిరంజనము, నిరాకారము నిర్ద్వంద్వము అగు పరబ్రహ్మను చేరును. ఈ దినముననే అఖండ వ్రతము చెప్పబడినది. బంగారముతో జనార్దనమూర్తిని నిర్మించి, గంధపుష్పాదులచే పూజించి, ఆ మూర్తియందు, ప్రతిమాసము పన్నెండుమంది బ్రాహ్మణులను భుజింపచేయవలెను. వ్రతము నాచరించువాడు జితేంద్రియుడై రాత్రి భోజనమును మాత్రమే చేయవలెను. సంవత్సరాంతమున ఆ జనార్దనమూర్తిని చక్కగా పూజించి ధేను సహితముగా గురువునకు సమర్పించి ఇట్లు ప్రార్థించవలయును. నేను నూరు జన్మలలో ఏ కొద్ది అఖండ వ్రతమును ఆచరించిననూ పూజ్యుడా! మీ అనుగ్రహము వలన ఇప్పుడు అఖండమును ఇచ్చట ఉండనిండు. తరువాత పన్నెండు మంది బ్రాహ్మణులను ఖండములతో పాయసములతో చక్కగా భుజింపచేసి సువర్ణ దక్షిణను ఇచ్చి నమస్కరించవలెను. ఇట్లు వ్రతమును ఆచరించి జనార్దనుని సంతోషింపచేసిన స్వర్ణ విమానముతో విష్ణులోకమును చేరును. పుష్య బహుళ ద్వాదశినాడు రూప వ్రతము చెప్పబడినది. దశమి తిధిన యధావిధిగా స్నానమాచరించి, శ్వేతగోవు యొక్క కాని ఒకే రంగుకల గోవు యొక్కకాని పేడను భూమిమీద పడకముందే ఆకాశము నుండియే స్వీకరించవలెను. ఆ గోమయముతో నూట ఎనిమిది ముద్దలను చేసి తామ్రపాత్ర యందు కాని మృణ్మయ పాత్రయందు కాని ఉంచి పట్టుకొని ఎండలో ఆరబెట్టవలెను. ఏకాదశినాడు ఉపవసించి శ్రీమహావిష్ణువు యొక్క సువర్ణ ప్రతిమను యధావిధిగా చక్కగా పూజించి, ఆ రాత్రి మంగళగీతములతో, వాద్యములతో, స్తోత్రపాఠములతో, జపాదులతో జాగరణ చేయవలెను. తరువాత ద్వాదశినాడు ప్రాతఃకాలమున తిలపాత్రపై నున్న ప్రతిమను, జలపూర్ణ ఘటమున నుంచి షోడశోపచారములచే పూజించి కట్టెలను వరిపిడి చేసి కొత్తగా అగ్నిని ఉత్పత్తిచేసి, యధావిధిగా పూజించి ఒక్కొక్క ఎండిన గోమయ పిండమును (పిడకను) నువ్వులతో నేయితో కలిపి ద్వాదశాక్షర మంత్రముచే (ఓం నమోభగవతే వాసుదేవాయ) అష్టోత్తర శతమును హోమము కావించవలెను. తరువాత ప్రీతితో ఆనందముతో బ్రాహ్మణులను పాయసాన్నములను భుజింపచేయవలెను. ఘట సహితముగా సువర్ణ ప్రతిమను గురువునకు అర్పించవలెను. బ్రాహ్మణులకు శక్తిననుసరించి దక్షిణలనిచ్చి, నమస్కరించి విడిచిపెట్టవలెను. ఇట్లు ఈ వ్రతమును ఆదరముతో ఆచరించి స్త్రీ కాని పురుషుడు కాని చక్కని రూపమును సౌభాగ్యమును పొందును. ఈ విషయమున ఆలోచించవలసిన అవసరము లేదు.
పుష్య శుక్ల ద్వాదశినాడు సుజన్మ ద్వాదశీ వ్రతమును ఆచరించవలెను. అనాడు యథావిధిగా స్నానమాచరించి వార్షిక వ్రతమును స్వీకరించవలయును. మొదట గోశృంగ జలమును త్రాగి గోవునకు ప్రదక్షిణము గావించి ప్రతిమాసమున శుక్ల ద్వాదశినాడు ఇట్లు దానమును గావించవలెను. ఘృత ప్రస్థమున క్రమముగా వ్రీహులు యవలు రెండొంతులు, హోమతిలలు, ఆఢకార్థము, పయోఘటము, ఒకమాసము వెండి, తృప్తిని కలిగించు మిష్టపక్వము, ఛత్రము, మాసార్థహోమ ప్రస్థము, ఉత్తమ ఫాణితము, చందనము, పలికము, వస్త్రము, పంచహస్త పరిమితము. వస్తువులను మానికదానము గావించి, యధాక్రమముగా గోమూత్రమును, జలమును నేతిని, శాకమును నాలుగు విధములుగు వండినదానిని, పెరుగు కలిపిన క్షీరమును, ప్రతిమాసము ప్రాశన గావించవలెను. ఇట్లు ఒక సంవత్సర కాలము వ్రతమును ఆచరించి సూర్యుని బంగారు ప్రతిమను నిర్మించి తామ్రపాత్రలో నుంచి, యధావిధిగా పూజించి ధేను సహితముగా స్వర్ణ ప్రతిమను గురువునకు సమర్పించి నమస్కరించవలెను. పన్నెండు మంది బ్రాహ్మణులను భుజింపచేసి వారికి దక్షిణ నీయవలెను. ఇట్లు వ్రతమును ఆచరించినచో ఉత్తమ కులమున రోగ రహితుడుగా, ధన ధాన్యయుతుడుగా, ఇంద్రియ నిగ్రహముతో పూజించి సాలగ్రామ ముఖమున సువర్ణము నుంచి వెండిపాత్రలో సాలగ్రామమునుంచి, తెల్లని రెండు వస్త్రములచే కప్పి వేదజ్ఞునకు దానముచేసి, అతనికి భోజనము పెట్టవలెయును. ఇట్లుచేసి ఏకభుక్తముగా నుండి విష్ణువును ధ్యానించుచు ఇహలోక భోగములను అనుభవించి విష్ణు లోకమును చేరును. ఫాల్గుణ శుక్ల ద్వాదశినాడు శ్రీహరి సువర్ణప్రతిమను గంధపుష్పాదులచే పూజించి వేదజ్ఞునకు ఈయవలయును. పన్నెండు మంది బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణనిచ్చి, విడిచి తాను బంధువులతో కలిసి భుజించవలెను. త్రిస్పృశ, ఉన్నీలనీ పక్షవర్ధానీ, వంజులీ, జయా, విజయా, యజనీ అపరాజితా అను ఈ ఎనిమిది ద్వాదశులు పాపనాశకములు. కావున ఎప్పుడూ ఉపవసించవలెను.
శ్రీనారదమహర్షి పలికెను: ఈ ద్వాదశులకు లక్షణమేమిటి? ఫలమేమిటి. ఇట్లే పుణ్యప్రదములు ఇంకను ఏవికలవు? వాటినన్నింటిని నాకు తెలుపుడు.
సూతమహర్షి పలికెను: ఇట్లు నారదమహర్షి సనాతనమహర్షిని అడుగగా సనాతన మహర్షి పరమ భాగవతోత్తముడగు నారదుని ప్రశంసించి ఇట్లు పలికెను.
సనాతనమహర్షి పలికెను: సోదరా, సాధు జనులు సంశయమును తొలగించునట్లుగా చక్కగా అడిగితివి. ఇపుడు నేను ఈ మహాద్వాదశుల లక్షణములను ఫలములను చక్కగా చెప్పెదను. సూర్యోదయమునకు ముందే ఏకాదశి నివృత్తయైనచో ఆ ద్వాదశిత్రిస్ర్పశా అనబడును. మహాఫలదాయిని అగును. ఈ ద్వాదశినాడు ఉపవసించి గోవిందుని పూజించినవాడు సహస్రాశ్వమేధ ఫలములను పొందును. అరుణోదయ కాలమున ఏకాదశి విద్ధయైనచో, ఆ ఏకాదశిని విడిచి ద్వాదశినాడు ఉపవసించవలెను. ఆనాడు వాసుదేవుని చక్కగా పూజావిధానముతో పూజించి సహస్ర రాజసూయ యజ్ఞఫలమును పొందును. ఈ ద్వాదశి ఉన్మీలితా అందురు. సూర్యోదయ కాలమున దశమి ఏకాదశిని స్పృశించినచో ఆ ఏకాదశి వంజులికా అనబడును. దానిని విడిచి ద్వాదశిన ఉపవసించవలెను. ఈనాడు సంకర్షణ దేవుని గంధాద్యుపచారములచే భక్తితో చక్కగా పూజించవలెను. ఇది అందరికి అభయప్రదము. ఈ ద్వాదశి మహాద్వాదశి సర్వయజ్ఞ ఫలప్రద. సర్వపాపహార. సర్వ సంపత్ప్రదాయిని. పూర్ణిమా అమావాస్యలు వృద్ధిచెంది యున్నచో వచ్చు ద్వాదశి పక్ష వర్ధని యందురు. ఇది మహాఫలప్రద. ఈనాడు జగత్పతి యగు ప్రద్యుమ్నుని పూజించవలెను. శుక్ల పక్షమున ద్వాదశి మఘా నక్షత్రయుక్త మైనచో దానిని జయా అందురు. ఈ ద్వాదశి సర్వశత్రు వినాశిని. ఈనాడు సర్వకామ ప్రదుడు సర్వ సౌభాగ్యదాయకుడు రమాపతియగు అనిరుద్ధుని పూజించవలెను. శుక్ల పక్షమున ద్వాదశి శ్రవణా నక్షత్రయుక్త మగుచో విజయా అనబడును. ఈనాడు సర్వభోగ పరాయణుడు సర్వసౌఖ్య ప్రదుడగు గదాధరుని పూజించవలెను. ఈనాడు ఉపవసించినవాడు సర్వతీర్థ ఫలమును పొందును. శుక్ల ద్వాదశి రోహిణీ నక్షత్రయుక్త మైనచో జయన్తి యనబడును. ఇది మహాపుణ్యప్రదా. ఈనాడు సర్వసిద్ధిప్రదుడగు వామనుని పూజించవలెను. ఈనాడు ఉపవసించినచో సర్వవ్రత ఫలప్రదము. సర్వదాన ఫలప్రదము. భుక్తిముక్తి ప్రదాయిని. శుక్ల పక్షద్వాదశి పుష్యమీ నక్షత్ర యుక్తమైనచో అపరాజితా యనబడును. ఇది సర్వజ్ఞాన ప్రదాయిని. ఈనాడు అనామయుడు, సర్వైశ్వర్య ప్రదుడు, పుత్రపౌత్ర వివర్ధనుడు, సంసార పాశవిచ్ఛత్తికారకుడు జ్ఞానసాగరుడగు నారాయణుని పూజించవలెను. ఈనాడు ఉపవసించి బ్రాహ్మణులను భుజింపచేసినచో ముక్తుడు అగును. ఆషాఢ శుక్ల ద్వాదశి అనూరాధా నక్షత్ర యుక్తమైనచో వ్రతద్వయమును చేయవలెను. ఒకదేవతగా రెండు వ్రతములు చేయుట ఈ విషయమున దోషముకాదు. భాద్రపద శుక్ల ద్వాదశి శ్రవణా నక్షత్రయుక్తమైనచో, కార్తిక శుద్ధ ద్వాదశి రేవతీ నక్షత్ర యుక్తమైనచో వ్రతద్వయము ఆచరించవలెను. ఈ ద్వాదశులకంటే ఇతర ద్వాదశులలో ఏక భుక్తము ఆచరించ వలెను. సహజముగా ఈ వ్రతము సకలపాతక నాశనము. ద్వాదశీ సహితముగా ఏకాదశీ వ్రతము నిత్యము. ఈ వ్రతమునకు ఉద్యాపనము లేదు. జీవితాంతము ఆచరించవలెను. (4/121)