నారద మహా పురాణము
కార్తికమాస మాహాత్యము
వసిష్ఠ మహర్షి పలికెను: ఇట్లు ధర్మాంగద మహారాజు తండ్రి ఆజ్ఞచే హరివాసరమును పాలించుచు రాజ్యమును చేయుచుండెను. ధర్మాంగదుని రాజ్యమున ధర్మమున నిలువని వాడొకడు కూడా లేకుండెను. సుఖము లేనివాడు కాని, సంతానము లేనివాడుకాని, రోగికాని అతని రాజ్యమున లేకుండెను. ధర్మాంగదుని రాజ్యములోని ప్రజలందరూ సంతోషముతో ఉండిరి. భూమి నిధుల నిచ్చుచుండెను. ఆవులు తన దూడలను తృప్తిపరిచి ఘటముల కొలది పాలనిచ్చుచుండెను. ప్రతి పుటమున తేనె ద్రోణ మాత్రముగా ప్రతి వృక్షమున లభించుచుండెను. భూమి సంతోషముతో సర్వవిధ ధాన్యములను ఇచ్చుచుండెను. త్రేతాంతమున ద్వాపర యుగమున కూడా కృతయుగముతో పోటీపడుచుండెను. వర్ష ఋతువు గడిచి ఆకాశము నిర్మలముగా ఉండెను. సుగంధముకల పైరులు పంటకొచ్చి ప్రకాశించుచుండెను. అంతటా నదులు మధ్యమ ప్రవాహములు కలిగి ఉండెను. నదీ తీరములలో మొలచి పూచిన కాశపుష్పములచే తెల్లని వెంట్రుకలుగల స్త్రీ వలె శోభించెను. లోక మంతయూ చంద్రకాంతివలె తెల్లనాయెను. దివాకరుడు ఎక్కువ తీవ్రముగా లేదు. ఆ సమయమున చాలా మంది ప్రజలు తీర్థ స్నానములకు బయలుదేరిరి. అంతటా రాజులు విజయయాత్రకు బయలు దేరిరి. ఆశ్వయుజ మాసాంతమున జగద్గురువగు శ్రీ మహా విష్ణువు యొక్క ప్రబోధ సమయమున మోహినీ దేవి కామ పీడితయై సర్వ భావముచే బహు విధ సౌఖ్యములతో రుక్మాంగద మహారాజును రమింపచేసెను. వనములలో, పర్వత శిఖరములలో, నదీ సంగమములలో పద్మములతో కూడియున్న సరస్సులలో, మలయపర్వతమున, మందరపర్వతమున, వింధ్యపర్వతమున, మహేంద్ర పర్వతమున, విబుధాలయమున, సహ్య పర్వతమున, హిమవత్పర్వతమున, కైలాస పర్వతమున ఇతర పర్వత ప్రాంతములందు, స్వర్గ స్థానాదులలో దివ్య రూపముగల మోహిని ప్రతిదినము రాజును రమింప చేసెను. రుక్మాంగద మహారాజు కూడా మోహినిని పొంది అన్ని పనులను వదిలెను. కాని ఒక ఏకాదశీ వ్రతమును మాత్రమును ఉపేక్షించలేదు. దశమి నుండి మూడు దినములు రాజు మోహినితో క్రీడించుట ఆపివేయును. ఇట్లు రుక్మాంగదుడు క్రీడించుచుండగా సంవత్సరము గడిచినది. అంతట కాలజ్ఞులకు శ్రేష్ఠము శుభప్రదమగు కార్తిక మాసము వచ్చినది. శ్రీ మహా విష్ణువునకు నిద్రను తొలగించునది కావున కార్తిక మాసము పుణ్యదాయకము. ఈ మాసమున విష్ణుభక్తులగు మానవులు చేయు సుకృత మంతయూ అక్షయము అగును. విష్ణులోక ప్రదాయకమగును. కార్తిక మాసముతో సమానమగు మాసము లేదు. కృతయుగముతో సమానమగు యుగములేదు. దయా తుల్యమగు ధర్మము లేదు. కంటితో సమమగు వెలుగులేదు. వేదసమమగు శాస్త్రము, గంగాసమమగు తీర్థము, భూదాన సదృశమగు దానము, భార్యా సమమగు సుఖము, కృషి సమమగు ధనము కామధేనువువంటి లాభము, ఉపవాసమున కంటే వేరు తపము, అంతరింద్రియ నిగ్రహము వంటి శుభము, జిహ్వ వలన పొందు తృప్తి వంటి తృప్తి, బ్రాహ్మణనముడు, ధర్మముతో సమమగు మిత్రుడు, సత్యముతో సాటివచ్చు యశము, ఆరోగ్యముతో సమానమగు ఐశ్వర్యము, కేశవునిమించిన దైవము, కార్తికముతో సమమగు పావనమైనది ఈ లోకమున ఇంకొకటి లేదు. కార్తికము చాలా ఉత్తమమగు మాసము. విష్ణువునకుకూడా ప్రియమగు మాసము. దామోదర ప్రియమగు కార్తీక మాసమును వ్రతరహితముగా గడిపినవాడు సర్వధర్మ బహిష్కృతుడై పశువుగా జన్మించును.
మాంధాత పలికెను: రుక్మాంగద మహారాజు కార్తిక మాసము రాగానే మోహముతో ఉన్న మోహినిని ఎట్లు అనుభవించెను? విష్ణు భక్తుడు, శ్రుతిపరుడు, రాజులలో ఉత్తముడు, పుణ్యతమము అయిన కార్తిక మాసమున ఏమి చేసెను?
వసిష్ఠ మహర్షి పలికెను: హరిని మేల్కొల్పు కార్తిక మాసము వచ్చుట చూచిన ముగ్ధుడగు రాజేంద్రుడు మోహినితో ఇట్లు పలికెను. ఓ దేవీ! నీతో చాలా సంవత్సరములు రమించితిని. నీకు అవమానము కలుగునను భయముచే నేను ఏమియు అనలేదు. కాని ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. తెలియుము. నీతో కలిసియున్న నాకు చాలా సంవత్సరములు చాలా కార్తికములు గడిచినవి. ఒక ఏకాదశీ వ్రతము తప్ప కార్తిక మాసము వ్రత రహితముగా గడిచినది. కావున ఈ కార్తికమును వ్రతముతో సేవించదలుచుకున్నాను. కార్తికమును వ్రత రహితముగా గడిపిన మానవులు ఆచరించు ఇష్టాపూర్త ధర్మములు కూడా వ్యర్థములు. వేట యందు ఆసక్తిగల, మాంస భుజులగు రాజులు కూడా కార్తిక మాసమున మాంసమును విడిచి విష్ణు లోకమును చేరిరి. సామాన్యముగా భుజించువాటిని కార్తిక మాసమున విడిచినచో విష్ణు రూపమును పొందెదరు. ఎంత ధనమున్ననూ, హృదయమునకు ఆయాసమును కలిగించు దానములెన్ని ఉన్ననూ కార్తిక మాసమున దీప దానముతో స్వర్గమును పొందును. ఆ దీపదానము చేయలేనివాడైనచో భక్తి భావముతో పరులు దీపమును వెలిగించవలెను. ఇట్లు పరదీప ప్రబోధనము సర్వ దానాధికమని జ్ఞానులు చెప్పుచున్నారు. అన్ని దానములు ఒకవైపు, దీపదానము మరియొక వైపు ఉంచినచో దీపదానము సర్వశ్రేష్ఠము. కార్తిక మాసముతో సమానమగునది, దీప దానమునకంటె ఉత్తమ మగునది. పరదీప ప్రబోధనము. కావున భక్తి భావముచే పరదీప ప్రబోధనమును గావించిన సర్వ దానాధిక ఫలమును పొందును. శ్రీ విష్ణునాభి సరోరుహమునందు కార్తీక తిథిని గావించి జన్మ నుండి చేసిన అన్ని పాపముల నుండి విముక్తి పొందును. ఈ విషయమున సంశయముతో పనిలేదు. కార్తిక మాసమున వ్రత ఉపవాస నియమములతో గడుపువాడు దేవ విమానముచే ఉత్తమ గతిని పొందును. కావున ఓ మోహినీ! నీవు నాయందు మోహమును విడిచి వెంటనే నాకు అనుజ్ఞ నొసగుము. కార్తిక వ్రతమును ఆచరించెదను. ఓ పంకజాక్షీ! నీ స్తనముల పూజను విరమించి వ్రతధరుడనై శ్రీహరిని పూజించెదను.
మోహిని పలికెను: ఓ రాజ సత్తమా? ఈ కార్తిక మాసము సర్వ పుణ్యకరమని చెప్పితివి కదా? కావున కార్తిక మాస మాహాత్మ్యమును సవిస్తరముగా తెలుపుము. ఈ కార్తిక మాస వ్రతము, మాహాత్మ్యము విశేషముగా ఎక్కడ చెప్పబడినదో చెప్పుము. కార్తిక మాహాత్మ్యమును విని నా ఇష్ట ప్రకారముగా ఆచరింతును.
రుక్మాంగద మహారాజు పలికెను: ఓ సుందరముఖీ! కార్తిక మాస మాహాత్మ్యమును తెలిపెదను. అపుడు నీకు శ్రీహరిని పూజించుటలో భక్తి కలుగును. కార్తీక మాసమున కృచ్ఛ్రవ్రతమును ఆచరించువాడు, లేదా ప్రాజాపత్యము నాచరించువాడు, ఏకాంతరోప వాసమును చేయువాడు, త్రిరాత్రములు ఉపవసించువాడు, దశాహముకాని, పక్షముకాని, మానముకాని ఉపవాసముతో గడుపువాడు శ్రీహరి యొక్క పరమ పదమును పొందును. ఏక భుక్తమును ఆచరించుటచే అనగా రాత్రి మాత్రమే భోజనము చేయువాడు, అయాచిత వ్రతమును ఆచరించువాడు కూడా శ్రీహరి పదమును పొందును. ఈ మాసమున భూమియందు దీపమాలను చేయువాడు, అయాచిత వ్రతమును ఆచరించువాడు కూడా శ్రీహరి పదమును పొందును. ఈ మాసమున భూమి యందు దీపమాలను చేయువాడు, విశేషించి పుష్కర తీర్థమున కాని, ద్వారవతి యందుకాని, వారాహ క్షేత్రమున కాని ఆచరించుటచే పరమ పదమును ప్రసాదించును. ఈ కార్తిక మాసము వ్రతదాన అర్చనాదులచే విశేషభక్తి ప్రదము. ఈ కార్తికమున ఏకాదశి మరీ పుణ్యప్రదము. భీష్మ పంచకము విశేష ఫలప్రదము. జాగరణతో ఈ మాసమున ఏకాదశీ వ్రతము ఆచరించువాడు ఎంత పాపము ఆచరించిన వాడైననూ, మరల తల్లి కడుపులో ఉండడు. ఈ ఏకాదశినాడు సాంఖ్యయోగము లేకనే మండలమును చూడగలవాడు పరమపదమును పొందును. కార్తిక మాసమున మండలమును చూచి, లేదా వరాహ క్షేత్రమున వరాహస్వామిని దర్శించి, లేదా కోక వరాహమును దర్శించి, మరల జన్మ పొందడు. కాయిక వాచిక మానసిక పాపముల నుండి విముక్తుడగును. కుబ్జ క్షేత్రమున శ్రీధర మండలమును దర్శించవలెను. కార్తీక మాసమున తైలమును, తేనెను, మాంసమును, స్త్రీలను పరిత్యజించ వలెను. విష్ణు తత్పరుడు కార్తిక మాసమున నిష్పావములను పరిత్యజించవలెను. ఇట్లు చేసినచో సంవత్సరకాలమున చేసిన పాపములనుండి విముక్తుడగును. పొరపాటున ఒకమారు భుజించినచో రాజవంశమున పుట్టును. కార్తిక మాసమున సూకర మాంసమును భుజించువాడు అరువది వేల సంవత్సరములు గౌరవ నరకమున పాకము గావించబడును. అట నుండి వెలువడి మలమును భుజించు గ్రామ సూకరముగా పుట్టును. కార్తిక మాసమున మాంసమును భుజించినవాడు చండాలునిగా పుట్టును. కొద్ది వ్రతమును స్వీకరించిననూ కార్తిక మాసము సర్వ పాపములను నశింప చేయును. కార్తిక మాసమున వ్రతమును స్వీకరించిన వానికి మరల జన్మ ఉండదు. కావున సర్వవిధ ప్రయత్నములచే కార్తిక మాసమున వ్రతమును స్వీకరించవలయును. వ్రతమును స్వీకరించనివాడు చేయునది అంతయూ వ్యర్థమగును. కార్తిక మాసమున దీక్షను స్వీకరించని వాడు పశువుగా పుట్టును. కార్తిక మాస వ్రతమును గృహమున ఆచరించరాదు. కార్తిక తిథిని విశేషించి అచరించరాదు. తీర్థమున ఆకార్తిక తిథిని అచరించినవాడు శ్రీహరి పదమును చేరును. కార్తిక శుక్ల ఏకాదశినాడు వ్రతమును ఆచరించి, ద్వాదశి ప్రాతః కాలమున శుభకరములగు కలశములను దానము గావించి, శ్రీహరి మందిరమును చేరును. సంవత్సర కాలము వ్రతముల ఆనాచరించువారికి కూడా సమాప్తి చేయవలసిన కాలము కార్తిక మాసమని చెప్పియుండిరి. శ్రీహరి నాభి సరోరుహమునందు, ఈ మాసమున అయిదు దినములు వివాహమునకు ప్రశస్తములు. ఉత్తరాయణ కాలము కాకున్ననూ, లగ్నశుద్ధి లేకున్ననూ, వివాహములు జరిగినచో పుత్ర పౌత్ర ప్రవర్ధకములు. కావున ఓ మోహినీ! కార్తిక మాసమున అశేష పాపనాశము కొరకు, నీకు ప్రీతి పెరుగుట కొరకు వ్రతమును స్వీకరించెదను.
మోహినీ దేవి పలికెను: సాటిలేని కార్తిక మాహాత్మ్యమును తెలిపితివి. అటులే చాతుర్మాస్య వ్రత విధిని ఉద్యాపనను కూడా తెలుపుము. ఓ రాజా? వ్రతములు ఏ విధానముచే పరిపూర్ణములు అగును. ఏ విధానముచే వ్రతము యొక్క పుణ్య ఫలము వ్యర్థము కాదో ఆ విధానమును కూడా తెలుపుము.
రుక్మాంగద మహారాజు పలికెను: ఓ ప్రియురాలా? ఏక భుక్తము చేయుచు రాత్రి భోజనము చేయువారు బ్రాహ్మ ణుని షడ్రసములచే భుజింపచేయవలెను. అయాచిత వ్రతమును ఆచరించినవారు బంగారముతో వృషభమును దానము చేయవలెను. మాంసాహారమును త్యజించిన వారు దక్షిణతో గోదానమును గావించవలెను. ధాత్రీస్నాన వ్రతమును ఆచరించిన వారు దధిపాయసములను దానము గావించవలెను. ఫలనియమమును ఆచరించు వారు ఫలదానమును కావించవలెను. తైలమును త్యజించినవారు మృతమును, ఘృతమును త్యజించినవారు పాలను దానముచేయవలెను. ధాన్యమును పరిత్యజించిన వారు శాలి దానమును కాని వదిలిన ధాన్యమును కాని దానము చేయవలెను. భూశయనము నాచరించినవారు తూలికా గండకాన్వితముగా శయ్యాదానమును చేయవలెను. పత్ర భోజన వ్రతము నాచరించినవారు మృత సహితమగు భోజన పాత్రను దానమును చేయవలెను. మౌన వ్రతము నాచరించినవారు బంగారముతో ఘంటను కాని తిలలను కాని దానము చేయవలెను. దంపతులను భుజింపచేసి ఇద్దరికి శయ్యను సకల భోగములతో దక్షిణతో వ్రత పరిపూర్తికి దానము కావించవలెను. ప్రాతః స్న్నాన వ్రతముల ఆనాచరించినవారు అశ్వదానమును, స్నేహ వ్రతము నాచరించినవారు ఘృత సక్తులను దానమును చేయవలెను. నఖములను కేశములను ధరించినవారు దర్పణ దానమును చేయవలెను. పాదరక్షలను త్యజించినవారు పాదత్రాణములచే దానమును చేయవలెను. లవణ త్యాగము చేసినవారు గోదానమును చేయవలెను. మాంసమును త్యజించినవారు దూడతోపాటు కపిలా దానమును చేయవలెను. నిత్య దీప దాన వ్రతము ఆచరించినవారు అభీష్ట వ్రత పరిపూర్తి కొరకు కాంచన దీపపాత్రను కాని, తామ్ర దీప పాత్రను కాని ఘృత సహితముగా దీప దానమును చేయవలయును. వస్త్రములను ఛత్రమును కూడా శ్రీహరి భక్తునకు దానము చేయవలెను. ఏకాంతర ఉపవాస వ్రతము ఆచరించిన వారు క్షౌమ వస్త్రమును దానము చేయవలెను. త్రిరాత్ర వ్రతము నాచరించినవారు కాంచన సహితముగా సాలంకృత శయ్యా దానమును చేయవలెను. షడ్రాత్రోపవాస వ్రతము ఆచరించినవారు ఛత్ర సహితమగు శిబికను (పల్లకిని) వాహ పురుషులతో పాటు మీనమును వృషభమును దానమును చేయవలెను. ఏకభుక్త వ్రతమును ఆచరించినవారు అజావికాది దానములను చేయవలెను. ఫలహార వ్రతము నాచరించినవారు సువర్ణ దానమును చేయవలెను. శాకాహార వ్రతము ఆచరించినవారు సువర్ణ సహితముగా ఘృత దానమును చేయవలెను. సర్వ రస త్యాగమును చేసినవారు, చెప్పని వాటిని త్యజించినవారు కూడా తమ శక్తి కొలది రజిత పాత్రనుకాని, సువర్ణపాత్రనుకాని దానము చేయవలెను. యదోక్త విధిగా దానమును చేయనివారు, యధోక్త విధి నాచరించని వారు కూడా విష్ణు స్మరణ పూర్వకముగా ప్రియ వాక్యములను పలుకవలెను. బ్రాహ్మణ వాక్యములను వ్యర్ధమని భావించువారు, దక్షిణా దానము చేయని వారు కూడా నరకమును పొందెదరు. వ్రత లోపమును పొంది కుష్టురోగిగా కాని, అంధునిగా కాని పుట్టును. బ్రాహ్మణుల వాక్యములలోనే దేవతలు పుణ్య తీర్థములు, యజ్ఞములు నిలిచియున్నవి. కావున విద్వాంసుడెవ్వడు బ్రాహ్మణ వాక్యమును లంఘించజాలడు. శ్రేయస్కాముడు కూడా అతిక్రమించజాలడు. పూర్వకాలమున శ్రీహరి బ్రహ్మకు తెలిపిన పరమ రహస్య యుతమగు ఈ వ్రత విధానమును నీకు తెలిపితిని. ఈ విధానమును నీకు తెలిపితిని. ఈ వ్రతము ఫల ప్రదము. శ్రీహరికి సంతోష కారణము. (II/22)