నామమాహత్మ్యము

నారద మహర్షి పలికెను: “తత్త్వార్థములు తెలిసిన ఓ మహామునీ! మీరు నేనడిగిన దానినంతయు చెప్పితిరి. ఇపుడు యుగముల స్థితిని లక్షణమును వినగోరుచున్నాను.”

సనకమహర్షి పలికెను: “ఓ మునీ! నీవు లోకోపకారకుడవు, మహాప్రాజ్ఞుడవు, బాగుగా ప్రశ్నించితివి. అన్ని లోకములకు ఉపకరించు యుగధర్మములను చెప్పెదను. ఈ భూ లోకమున ఒక సమయమున ధర్మము వృద్ధి పొందును. ఒక సమయమున క్షీణించును. కృత త్రేతా ద్వాపర కలులు అను నాలుగు యుగములు, పన్నెండు దివ్యవత్సరములచే సంధ్యా సంధ్యాంశ యుక్తములుగా యుగములు సమములుగా నుండును. తత్త్వదర్శులు ఈ యుగములను కాలముచే తెలియవలయునని చెప్పిరి. మొదటిది కృతయుగము, రెండవది త్రేతాయుగము, మూడవది ద్వాపరయుగము, నాలుగవది కలియుగము. కృతయుగమున దేవదానవ గంధర్వ యక్ష రాక్షస పన్నగులు లేకుండిరి. అందరూ దేవసములుగా ఉండిరి. అందరూ తుష్టి పుష్టి కలవారు. ధర్మ మార్గ పరాయణులు. కృతయుగమున క్రయ విక్రయములు లేకుండెను. వేదవిభాగము కూడా కృత యుగమున లేదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు స్వాచారపరులుగా ఉండిరి. ఎపుడూ నారాయణ ధ్యానపరాయణులు, తపోధ్యాన పరాయణులు కామాది దోష రహితులు, శమాది గుణ సంపన్నులు. ధర్మసాధన చిత్తులు, అసూయా రహితులు, దంభాచారము లేనివారు, సత్యవాక్యరతులు, నాలుగు ఆశ్రమ ధర్మములను ఆచరించువారు, వేదాధ్యయనసంపన్నులు, సర్వశాస్త్ర విచక్షణులు, నాలుగు ఆశ్రమములయందును తగిన కర్మనాచరించుచు కాలానుగుణముగా కోరకనే ఫలములనుపొంది ఉత్తమగతిని పొందెదరు. కృతయుగమున శ్రీమన్నారాయణుడు శుక్లవర్ణుడు సునిర్మలుడు. ఇక త్రేతాయుగ ధర్మములను చెప్పెదను వినుడు. ఓ మునిసత్తమా! త్రేతాయుగమున ధర్మము పాండుర వర్ణమును పొందును. శ్రీహరి రక్తవర్ణుడు అగును. జనులు కొంచెము కష్టములను పొందెదరు. అందరూ క్రియా యోగ రతులు యజ్ఞకర్మ నిష్ఠులు, సత్యవ్రతులు, ధ్యానపరులు, ఎప్పుడూ ధ్యానపరాయణులుగా ఉందురు. ద్వాపర యుగమున ధర్మము రెండు పాదములు ఉండును. హరి పీతవర్ణుడు అగును. వేద విభాగము జరుగును. ద్వాపర యుగమున కొందరు ద్విజులు అధర్మ నిరతులు అగుదురు. బ్రాహ్మణాది వర్ణములలో కొందరు రాగాది దుర్గుణములు కలవారు అగుదురు. స్వర్గాపవర్గముల కొఱకు కొందరు బ్రాహ్మణ యజ్ఞములను ఆచరింతురు. కొందరు ధనాదికమును కోరువారు కొందరు కల్మష చిత్తులుగా ఉందురు. ద్వాపరయుగమున ధర్మాధర్మములు సమముగా ఉండును. అధర్మ ప్రభావముచే ప్రజలు క్షయమునొందెదరు. కొందరు అల్పాయుష్యము కలవారు అగుదురు. కొందరు పుణ్యమార్గమును అనుసరించు వారిని చూచి అసూయ చెందెదరు. ఇక కలియుగ స్వరూపమును చెప్పెదను వినుము. కలియుగమున ధర్మము ఒక పాదముతో ఉండును. తామస యుగము కావున శ్రీహరి కృష్ణ వర్ణమును పొందును. ఎవరో ఒకరు ధర్మాత్ముడు యజ్ఞాచారపరుడు అగును. ఎవరో ఒక పుణ్యాత్ముడు క్రియాయోగ పరుడు అగును. ధర్మపరుని చూచి అందరూ అసూయ చెందెదరు. వ్రతాచారములు జ్ఞానయజ్ఞాదులు నశించిపోవును. అధర్మము ప్రవర్తించుటచే ఉపద్రవములు సంభవించును. అందరూ అసూయాపరులు దంభాచార పరాయణులు అల్పాయుష్కులుగా కలియుగమున ఉందురు.”

నారదమహర్షి పలికెను: “ఓ మునిసత్తమా! తాము యుగధర్మములను సంగ్రహముగా చెప్పితిరి. ధర్మవిదులైన మీరు కలియుగ ధర్మమును వివరముగా తెలుపుడు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఏ ఆహారమును తీసుకొందురు? ఏ ఆచారమును అవలం బించెదరు?”

సనకమహర్షి పలికెను: సర్వలోకోపకారమును చేయగోరు మునిశ్రేష్ఠా! ఉన్నవి ఉన్నట్లుగా విస్తరముగా కలిధర్మములను చెప్పెదను. వినుము. శ్రీహరి కృష్ణవర్ణమును పొందగా, అన్ని ధర్మములు నశించును. కావున కలియుగము సర్వపాతక సంకరమగు మహా ఘోరముగా తెలియుము. ఘోరమైన కలియుగమున బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అందరు ధర్మపరాఙ్ముఖులు అగుదురు. వేదపరాఙ్ముఖులగుదురు. అందరూ కపటముతో ధర్మ రతులవలె కనపడుదురు. అసూయా పరులగుదురు. పండితులు వ్యర్థముగా అహంకారము కలవారై సత్యహీనులు అగుదురు. నేనే అందరిలో అధికుడనని అందరూ వాదింతురు. అందరూ అధర్మలోలురు, వితండ్రులు అగుదురు. కావుననే కలియుగమున అందరూ అల్పాయుష్కులు అగుదురు. అల్పాయుష్కులు అగుటచే విద్యాభ్యాసమును చేయజాలరు. విద్యాభ్యాసము లేనందున అధర్మము ప్రవర్తించును. పాపతత్పరులై ప్రజలు విపరీతముగా (పెద్దల ముందు చిన్నలు) మరణింతురు. బ్రాహ్మణాది వర్ణ సంకరము జరుగును. కామ క్రోధపరులు, మూఢులు, వృథా సంతాప పీడితులుగా మారి కలియుగమున అన్నివర్ణముల వారు శూద్రతుల్యులు అగుదురు. ఉత్తములు నీచులు అగుదురు. నీచులు ఉత్తములుగా పరిగణింప బడుదురు. రాజులు ద్రవ్యమును అర్జించుట యందు ఆసక్తులై అన్యాయవర్తనులై ఎక్కువ పన్నులు వేసి ప్రజలను పీడింతురు. ద్విజులు శూద్రుల శవవాహనులు అగుదురు. జార ధర్మమును అవలంబించి భర్తలు ధర్మస్త్రీల సంగమమును చేతురు. తండ్రిని పుత్రుడు, భర్తను భార్య ద్వేషించును. అందరూ పరస్త్రీ సంగమాసక్తులు పరద్రవ్యాపహారకులు అగుదురు. మత్స్యమాంసమును అమ్ముదురు. దూడలేని గోవులకు పాలుపిండి అమ్మి బ్రతుకుదురు. ఘోరమగు కలియుగమున అందరూ పాపరతులౌదురు. అసూయాపరులై సజ్జనులను పరిహసింతురు. నదీతీరములలో గడ్డపారలతో త్రవ్వి చెట్లను నాటెదరు. పృథివి నిస్సారమగును. బీజములు ఫలములు నశించును. స్త్రీలు వేశ్యలవలె అలంకరించుకొనుట యందు అసక్తులౌదురు. బ్రాహ్మణులు ధర్మమును, స్త్రీలు భగమును అమ్ముకుందురు. మరికొందరు ద్విజులు శూద్రాచారపరులై వేదములను అమ్ముకుందురు. సాధువుల ధనమును, విధవల ధనమును అపహరింతురు. ద్రవ్యముపై ఆశ కలిగి బ్రాహ్మణులు వ్రతముల నాచరించరు. ధర్మాచరణమును వదిలి వృధావాదముననే ఆయాసమును పొందెదరు. ద్విజులు దంభము కొఱకు పితృశ్రాద్ధాదికము నాచరింతురు. నరాధములు అయోగ్యులకే దానములు చేతురు, పాలమీది ఆశతో ఆవులయెడ ప్రీతిని చూపెదరు. బ్రాహ్మణులు స్నానశౌచాదికములు ఆచరించరు. ద్విజాధములు అకాలమున కర్మల నాచరింతురు. సాధునించాపరులు విప్రనిందా పరులుందురు. ఏ ఒక్కని మనస్సు విష్ణుభక్తి పరముకాదు. యాగము చేయు బ్రాహ్మణులనే ధనము కొఱకు రాజకింకరులు కొట్టెదరు. ఘోరమైన కలియుగమున నరులందరు దానహీనులగుదురు. ద్విజులు పతితుల నుండి కూడా దానములను స్వీకరించెదరు.

కలియుగమున ప్రథమ పాదమున కూడా మానవులు శ్రీహరిని నిందింతురు. కలియుగాంతమున ఒక్కడు కూడా శ్రీహరి నామమును పలుకడు. శూద్ర స్త్రీ సంగమమున విధవాసంగమమున అసక్తులౌదురు. శూద్రాన్నమును భుజించుటయందు ఆసక్తులౌదురు. బ్రహ్మచర్య గృహస్థాది ఆశ్రమ చతుష్టయమును నిందించుచు వేదవిహిత సన్మార్గమును వదిలి దురాచారమును దుర్మార్గమును అనుసరించుచు పాషండులగుదురు. శూద్రులు ద్విజులను సేవించరు. పాషండులు చండాలులు ద్విజధర్మములను స్వీకరించెదరు. కాషాయ వస్త్రములను ధరించి జటాధారులై భస్మమును ధరించిన శూద్రులు ధర్మములను బోధించెదరు. కూటయక్తి పరాయణులు అగుదురు. ద్విజులు స్వాచారమును విడిచి పరపాకాన్నమును భుజించుచుందురు. శూద్రులు దురాత్ములై పరివ్రాజకు లౌదురు. కలియుగమున లజ్జావిహీన జీవనమును గడుపుదురు. ధర్మహీనులగు పాషండులు, కాపాలులు, అధములగు భిక్షువులు కలియుగమున ఉత్కచ జీవులగుదురు. ఓ బ్రాహ్మణోత్తమా! ధర్మమును నశింపచేయు స్వభావముగల ద్విజులకు శూద్రులు ఉత్తమాసనమును అధిరోహించి ధర్మ ప్రవచనమును చేతురు. వీరు ఇతరులు నగ్నముగా రక్తవస్త్రులుగా పాషండులు వేద దూషకులుగా తిరుగుచుందురు. మానవులు గీత వాద్యములలో కుశలులై క్షుద్ర ధర్మముల నాశ్రయించుచు ధర్మ విధ్వంసకులు అగుదురు. అస్వధనులు వ్యర్థలింగులు వ్యర్థాహంకారదూషితులు పరద్రవ్యాపహారకులగుదురు. నిత్యము ప్రతిగ్రహశీలురు జగత్తును చెడుదారిలో పయనింపచేయువారుగా ఆత్మస్తుతిపరులు పర నిందాపరులుగా అందరూ ఉందురు. నమ్మినవారిని చంపువారు దయాధర్మవిహీనులు క్రూరులు అగుదురు. కలియుగమున మానవులు అధర్మ బంధువులు అగుదురు. కలియుగాంతమున మానవులకు పరమాయువు పదునారు సంవత్సరములు ఉండును. స్త్రీలు అయిదు సంవత్సరముల వయసులో ప్రసవింతురు. ఏడెనిమిది సంవత్సరముల వయసువరకే యువకులుగా ఉందురు. ఆ తరువాత వృద్ధులగుదురు. అందరూ స్వకర్మను త్యాగము చేయుదురు. కృతఘ్నులు ఇతరవృత్తుల నాశ్రయించువారగుదురు. కలియుగమున ద్విజులు నిత్యము యాచకులగుదురు. ఇతరులను అవమానించుటలో ఆసక్తి కలవారు, పరావమానముతో ఆనందించువారు, ఇతరుల గృహనివాసులు వారు, అచటివారిని నిందించువారు, వ్యర్థముగా గర్వించువారు నిత్యము మాతాపితరులను గురువులను నిందించువారు అయి ఉందురు. నోటితో ధర్మమును చెప్పుచు మనసులో పాపములను ఆలోచింతురు. ధనవిద్యా యౌవనాదులచే మత్తులై అన్ని దుఃఖములచే వ్యాకులులౌదురు. వ్యాధితస్కర దుర్భిక్షములచే పీడించబడుదురు. అతివంచకులౌదురు. తాము చేయుచున్న పాపములను ఆలోచించకనే వ్యర్థముగా తమను తాము పోషించుకొనుచుందురు. పాపాత్ములు ధర్మమార్గ ప్రవర్తకులను దూషింతురు. ధర్మకార్యరతులను పరిహసింతురు. కలియుగమున మ్లేచ్ఛజాతులవారు ప్రభువులౌదురు. శూద్రులు భిక్షాటనమును చేతురు. ద్విజులు శూద్రులను సేవింతురు. కలియుగమున వర్ణసంకర మేర్పడి శిష్యుడు గురువు, తండ్రి, కొడుకు, భార్య, భర్త అనువారు ఎవ్వరూ ఉండరు. కలియుగమున ధనవంతులు కూడా యాచకులు అగుదురు. ద్విజులు రసవిక్రయిలౌదురు. ద్విజులు ధర్మమను కవచమును కప్పుకొని, మునివేషమును ధరించి అమ్మరాని వాటిని అమ్ముచు సంగమించరాని స్త్రీలను సంగమించుచు, వేదములను ధర్మ శాస్త్రములను నిందించుచు శూద్రవృత్తిచే జీవించుచు నరకార్హులగుదురు. అనావృష్టి ఏర్పడగా ఆకాశమువైపు చూపులను నిలుపుచు కలియుగమున మానవులందరూ అకలి భయముచే దీనులౌదురు. కరువుచే మిక్కిలి పీడించబడుచు కందమూల ఫలహారములతో తమనుతాము పోషించుకొందురు. కామార్తులు, హ్రస్వదేహులు, లోభులు, అధర్మ తత్పరులుగా నుందురు. కలియుగమున ఇంచుమించు అందరు అల్పభాగ్యులు బహుసంతాన వంతులౌదురు. స్త్రీలు తమను తాము పోషించుకొందురు. వేశ్యలు సౌందర్యమును పెంచుకొనుటకు ప్రయత్నింతురు. స్త్రీలు భర్త మాటను లెక్కించక ఎప్పుడూ ఇతరుల ఇండ్లలో ఉండుటలో ఆసక్తిని చూపుదురు. దుశ్శీలురై దుశ్శీలురతో స్నేహమునుచేతురు. పురుషుల విషయమున కులస్త్రీల అసద్వ్యవహారమును ఆచరింతురు. చోరులు భయముచే కట్టెలతో తలుపులు యంత్రములను సిద్ధము చేసుకుందురు. కరువుచే పన్నుల బాధలచే మిక్కిలి పీడితులై గోధుమలు యవలు పుష్కలముగా పండు ప్రదేశములకు వలస వెళ్ళెదరు. మనసులో అకార్యములను ఆలోచిస్తూ, శుభకార్యములను పలుకుచుందురు. కలియుగమున మానవులు తమ కార్యము సిద్ధించువరకు బంధుత్వమును కలుపుకొందురు. భిక్షువులు కూడా మిత్రాది స్నేహ సంబంధముచే బంధితులగుదురు. సన్యాసులు అన్నోపాధి నిమిత్తమున శిష్యులను కూర్చుకొందురు. స్త్రీలు రెండుచేతులతో తలను గోకుచుందురు. పెద్దల ఆజ్ఞను భర్త ఆజ్ఞను ఉల్లంఘింతురు. బ్రాహ్మణులు పాషండుల మాటలను పలుకుచు, పాషండులతో స్నేహమును గరపునపుడు కలివృద్ధి చెందును. ప్రజలు యజ్ఞములను ఆచరించునపుడు, బ్రాహ్మణులు హోమమును చేయనపుడు కలివృద్ధి చెందినదని వివేకులు ఊహించవలయును. అధర్మము వృద్ధిచెందును. బాలురు కూడా మృతి చెందుదురు. అన్ని ధర్మములు నశించగా జగత్తు సంపద్రహితము అగును. ఓ బ్రాహ్మణోత్తమా ఇట్లు కలి స్వరూపమును నీకు వివరించితిని. హరిభక్తి పరులను మాత్రము కలి బాధించజాలదు.

కృత యుగములో తపము, త్రేతాయుగములో ధ్యానము, ద్వాపర యుగములో యజ్ఞము కలియుగములో దానము ఉత్తమములు. కృతయుగములో పది సంవత్సరములలో త్రేతాయుగములో ఒక సంవత్సరములో, ద్వాపర యుగములో ఒక మాసములో చేయు దానిని కలియుగములో ఒక దినములో చేయవచ్చును. కృతయుగములో ధ్యానము చేయుచు, త్రేతాయుగములో యజ్ఞములు చేయుచు, ద్వాపర యుగములో అర్చించుచు పొందు దానిని కలియుగమున శ్రీహరి నామసంకీర్తనచే పొందవచ్చును. రాత్రింబవళ్ళు హరినామమును కీర్తించు మానవులు, హరిని పూజించు మానవులను కలి బాధించదు. ఘోరమగు కలియుగమున హరినామపరులు మాత్రమే కృతకృత్యులు. వారిని కలి బాధించ జాలదు. హరి పూజాపరులు హరినామ పరాయణులు శివతుల్యులే. ఈ విషయమున ఆలోచించవలసిన పనిలేదు. ఘోరమైన కలియుగమున సమస్త జగదాధారుడు పరమార్థ స్వరూపుడు అగు విష్ణువును ధ్యానించినచో బాధలపాలు కారు. సర్వ ధర్మ వర్ణితమగు కలియుగమున ఒకమారు కేశవుని అర్చించువారు భాగ్యవంతులు. కలియుగమున వేదోక్తకర్మలు న్యూనాతిరిక్తములైనచో శ్రీహరి స్మరణము మాత్రమే పరిపూర్ణత్వమును లభింపచేయును. హరే, కేశవ! గోవింద! వాసుదేవ! జగన్మయ! అని నిత్యము స్మరించు వారిని కలి బాధించదు. శివశంకర! రుద్ర! ఈశ! నీలకంఠ! త్రిలోచన! అని కీర్తించువారిని కూడా కలిబాధించజాలదు. మహాదేవ! విరూపాక్ష! గంగాధర! మృడవ్యయ అని స్మరించు వారు కలి యుగమున కృతార్థులు. జనార్దన! జగన్నాథ! పీతాంబరధర! అచ్యుత! అని స్మరించువారికి కలిభయము కలుగదు. ఘోరమైన కలియుగమున సంసారమున పుత్రధార ధనాదులు సులభములు. కాని హరిభక్తి మాత్రము దుర్లభము. కర్మ శ్రద్ధా విహీనులు, పాఖండులు, వేదనిందకులు, అధర్మనిరతులైనను హరిస్మరణము చేసినచో నరకార్హులు కారు. వేదమార్గ బాహ్యులు పాపకర్ములు, మనశ్శుద్ధివిహీనులు అయిన జనులకు హరినామ మొక్కటే నిష్కృతి. స్థావర జంగమాత్మకమగు ఈ ప్రపంచమంతయు దైవాధీనము. కావున దైవప్రేరణ ఎట్లున్నదో అట్లే చేయును. కలియుగమున వేద విహితములైన కర్మలను శక్తి మేరకు ఆచరించి నారాయణ పరాయణుడై శ్రీమహావిష్ణువునకు అర్పించవలయును. పరమాత్మయగు శ్రీమహా విష్ణువునకు అర్పించబడిన కర్మలు హరిస్మరణ మాత్రమున పరిపూర్ణములగును. హరిభక్తిరతులకు పాపబంధము సంభవించదు. కావుననే దుర్జనులకు హరిభక్తిరతులకు పాపబంధము సంభవించదు. కావుననే దుర్జనులకు హరిభక్తి దుర్లభము. ఘోరము భయంకరమగు కలియుగమున శ్రీహరి భక్తిపరులు సత్సంగరహితులైననూ భాగ్యవంతులే. హరిస్మరణ నిష్ఠులకు శివనామ రతాత్ములకు సమస్త కార్యములు పరిపూర్ణత్వమును పొందును. హరిభక్తిపరులు భాగ్యమే భాగ్యము. వారు దేవతల పూజలను కూడా అందుకొందురు. ఇంక ఇతరమునేల చెప్పవలయును. కావున సమస్త లోకవాసులకు హితమును చెప్పుచున్నాను. హరి నామ స్మరణమును చేయువారిని కలి బాధించదు. శ్రీహరి నామము మాత్రమే నాకు జీవనము. కలియుగమున హరి నామము తప్ప మరియొక గతి లేనేలేదు.

సూతమహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తములారా! ఇట్లు సనకమహర్షిచే ప్రబోధితుడగు నారదమహర్షి పరమానందమును పొంది మళ్ళీ ఇట్లు పలికెను.

నారద మహర్షి పలికెను: పూజ్యుడా! సర్వశాస్త్రజ్ఞుడా! దయానిధివైన నీవు సనాతనము జగజ్జ్యోతి యగు పరబ్రహ్మ స్వరూపమును తెలియజేసితివి. ఇదియే ఉత్తమ పుణ్యము. ఇదియే ఉత్తమ తపము. సర్వపాప వినాశకుడగు పుండరీకాక్షుని స్మరించుటయే ఉత్తమ యజ్ఞము. ఓ మహర్షీ! బహువిధమగు ఈ జగత్తు అంతయూ, ఒకే చిత్తుచే ప్రకాశితము అని దృష్టాంతము లేకనే ఎట్లు విశ్వసించవలయును? కావున దేనిచే ఎట్లు ఏ బోధచే తెలియునో చింతించు చిత్తము స్థైర్యము నెట్లు పొందునో ఆ విధమును కూడా తెలియజేయుము. అని ఇట్లు మహానుభావుడైన నారదుడు పలికిన మాటలను వినిన సనక మహర్షి పరమాత్మయగు నారాయణుని స్మరించుచు ఇట్లు బదులు పలికెను.

సనకమహర్షి పలికెను: “ఓ బ్రాహ్మణోత్తమా! నేను ధ్యానములో నిమగ్నుడనగుచున్నాను. నీవు కోరిన విషయములను సనందనమహర్షిని ప్రశ్నించుము. ఆర్యవంద్యుడగు సనందన మహర్షి వేదాంతశాస్త్రమున కుశలుడు నీ సందేహమును తీర్చగలడు” అని ఇట్లు సనకమహర్షి పలికిన మాటలను వినిన నారదమహర్షి సనందనమహర్షిని మోక్షధర్మములను అడుగ సంకల్పించెను. (1/41)

మొదటిపాదము సమాప్తము.