కామాక్షా మాహాత్మ్యము

మోహిని పలికెను: మానవుల పాపములను తొలగించి పుణ్యమును ప్రసాదించు కామోదాఖ్యానమును వింటిని. ఇక ఇప్పుడు కామాక్షా మాహాత్మ్యమును వినగోరుచున్నాను.

వసువు పలికెను: ఉత్తమురాలగు కామాక్షాదేవి పూర్వ దిక్కున సాగర తీరమున కలదు. మానవులకు సిద్ధిని ప్రసాదించును. ఇచటికి వెళ్ళి నియమిత భోజనుడై కామాక్షను పూజించి ఒకరాత్రి ఉన్నచో కామాక్షాదేవిని చేరగలడు. ఈ దేవి భీమరూపముతో మానవులకు దర్శనము నిచ్చును. ఆమెను చూచి భయపడనివాడు మాత్రమే వాంఛితార్థ సిద్ధిని పొందగలడు. దేవరాజ్ఞి భయంకర రూపిణియగు కామాక్షిని చూచి ఆసనమునుండి చలించినవాడు పతనమగును, ఇచటనే పార్వతీపుత్రుడగు సిద్ధనాధు డుండును. ఇతను ఉగ్రమగు తపమును ఆచరించుచు లోకులకు కనబడడు. కృతత్రేతా ద్వాపర యుగములలో అందరిచే చూడబడెడివాడు. కలియుగమున ఒకపాదము గడుచువరకు అంతర్థాన ముగా ఉండును. ఒక పాదము గడిచిన తరువాత ఘోరమగు భూమండలమున ప్రత్యక్షమై సకలజను లను సాధించును. మోహనాద్యు పాయ ములచే మ్లేఛ్ఛప్రాయులగు జనులను తన వశమున నుంచు కొని కలి మూడు పాదములను గడుపును. ఇచటికి వెళ్ళి భక్తి భావసమన్వితుడై కామాక్షాదేవిని పూజించు సిద్ధేశుని ఒక సంవత్సరము ధ్యానించినచో స్వప్నమున సిద్ధేశుని దర్శించును. దర్శనాం తమున సిద్ధేశుడు సూచించిన లోకత్రయమునగల సకల వస్తువులను తీర్చుచు సంచరించును. ఇచట నుండు మత్స్యనాధుడు విజ్ఞానపారంగతుడు ఘోర తపము నాచరించుచు లోకాభిమతములను ప్రసాదించుచు దృష్టిగోచరుడుగాన యుండును. ఈ మత్స్యనాథుడు అడ్డులేనిగతి కలవాడై సకలలోకములను అనేక యుగములు తిరుగుచు కాలవేగమున అభిభూతుడు కాక ఇపుడు కూడా తపములో ఉండెను. పూర్వభవమున ఒక బ్రాహ్మణుని పుత్రుడు, గండాంత జాతుడుండెను. ఇతను పుట్టగానే తండ్రి పుష్కర ద్వీపమున సముద్రమున విడిచెను. సముద్రమున ప్రవేశించగనే విధి నియోగము వలన ఒక మత్స్యము మ్రింగెను. ఆ మత్స్యాదరముననే ఇతను చాలా యుగములు జరామరణములు లేక ఉండెను. అంతట ఒక సమయమున ప్రియురాలి కోరికచే శివుడు పార్వతీ దేవితో కలిసి తత్వోపదేశమును చేయుటకు లోకా లోకాచలమునకు వెళ్ళెను. ఈ పర్వత శృంగమున మణిప్రకాశమున శ్రీహరియందు మనసునుంచి ఒక క్షణార్థము గడిపి తాపత్రయముచే ప్రాణులను మోహింపచేసి శక్తిచే పార్వతీదేవిని ప్రబోధించి ద్వాదశాక్షరార్థ నిజ స్వరూపమగు పరమ రహస్యమును ఉపదేశించెను. అంతట ఆ పార్వతీదేవి మారాంతకుడగు శివునికి నమస్కరించి తత్త్వము తెలియక నిలిచియున్నంతలో మహాసముద్రమున ఉన్న మత్స్యము త్వరగా ఎగిరి ఆ శృంగముల చేరెను. మత్స్యాదరమున ఉన్న బాలుడు తత్త్వసిద్ధిని పొంది అఖిల బంధ విముక్తుడై మత్స్యోదరము నుండి బయలు వెడలి పార్వతీ పరమేశ్వరుల ముందు నిలిచి నమస్కరించెను. అంతయూ తెలిసియున్ననూ మహేశ్వరుడు అ బాలకుని మత్స్యాదర ప్రవేశమునకు కారణమును అడిగెను. ఆ బాలకుడు వారి ముందు జరిగిన వృత్తాంతము నంతటిని వివరించెను. అంతట పార్వతీ దేవి ఆ వృత్తాంతమును విని ప్రసన్నురాలై మహేశ్వరుని అనుమతిని పొంది అతనిని పుత్రునిగా చేసుకొని తన వడిలో నిడుకొని మోమును ముద్దాడెను. అభితత్త్వము తెలిసిన ఈ సిద్ధ నాథుడగు మత్స్యనాథుడు నా పుత్రుడు. ఇపుడు ఇతను తన ఇష్టానుసారముగా అన్ని లోకములలో తిరుగుచు కీర్తిని మాకు ఆనందనమును విస్తరింపచేయుగాక అని పార్వతీదేవి పలికెను. అప్పటి నుండి పార్వతీ పుత్రుడగు ఈ మత్స్యనాధుడు యధేష్టముగా సకల లోకములను తిరుగుచు సిద్ధ పీఠమును చేరి తపస్సులో ఉండెను. ఈ సిద్ధనాథుని మనసులో ధ్యానించినవారు సమస్త కామములను పొందును. సమగ్ర విద్యను పొంది తన వాక్యజాతమును పండిత వర్గము నంతనూ నిలుపును. జగత్పవిత్రమగు ఈ కథను వినినవారు ఇహమున అన్ని కామనలను పొంది దేవతల పూజలనంది స్వర్గమును చేరును. ఇట్లు శ్రీసిద్ధనాథ చరిత్ర యుతమగు కామాక్షా మాహాత్మ్యమును సకల పాప నాశనమున నీకు తెలిపితిని. ఇంకేమి చెప్పవలయునో తెలుపుము. (II/69)