నారద మహా పురాణము
రుక్మాంగద వచనము
రుక్మాంగద మహారాజు పలికెను: ఓ పుత్రా! నా కీర్తి నశించిన నశించ నిమ్ము! నేను అసత్య వాక్కును అయిన కానిమ్ము. ఘోరమగు నరకము వచ్చిన రానిమ్ము. కాని ఏకాదశినాడు నేను ఎట్లు భుజించగలను? ఈ మోహినీ దేవి బ్రహ్మలోకమునకు వెళ్ళనిమ్ము. మూర్ఖురాలు, దుర్బుద్ధి అగు ఈ మోహిని మాటి మాటికి నాతో నాకే కోరిక లేదు. రాజ్యముతో పనిలేదు. రాజ్యముతో పనిలేదు. కేవలము ఏకాదశినాడు రాజు భుజించుటయే కావలయును అని పలుకుచున్నది. నాకు క్రిమి జన్మ వచ్చిననూ రానిమ్ము. కాని నేను మాత్రము ఏకాదశినాడు భుజించజాలను. ఈ లోకమున చాలా పెద్ద దుందుభి ప్రజలకు బోధించు చున్నది. ఆ దుందుభి ఎట్లు వ్యర్థమగును? తినరాని దానినితిని, పొందరాని స్త్రీని పొంది, పానము చేయరాని దానిని పానముచేసి నూరు సంవత్సరములు బ్రతికిన ఏమి ప్రయోజనము?
ఈ భూమండలమున రాజనీతిని వదిలి, రాజ్యాధికారమును కూడా వదిలెదను. అసత్య వాక్కును అపనిందను కూడా భరించెదను. ప్రజలందరూ ధిక్కరించి ననూ ఏకాదశినాడు మాత్రము భుజించను. మోహినీ వియోగముచే మరణము సంభవించిననూ మేలేకాని ఏకాదశినాడు మాత్రము భుజించను. అతి దుఃఖముతో యమలోక మార్గమున ప్రజలను పంపుచు యమధర్మరాజునకు సంతోషమెట్లు కలిగించగలను? నేను ఏకాదశినాడు భుజించినచో ఇదివరకు శూన్యములుగా చేయబడిన నరకశ్రేణులు ఇపుడు పరిపూర్ణములు అగును. సమర్థుడైకూడా శత్రువులకు ఆనందము కలిగించువానిని ఏ తల్లీ గర్భమున ధరించరాదు. ఈ మోహిని ఏకాదశినాడు భుజించుటనే యాచించుచున్నది. సురాసురులు యాచించిననూ ఆ వరమును ఈయ జాలను. విషమునైనను త్రాగెదను. అగ్నిలో కూడా దూకెదను. పర్వతాగ్రమునుండి క్రింద పడెదను. ఆకాశ మున ప్రకాశించు ఖడ్గముచే నా శిరస్సునుకూడా ఖండించుకొందును. కాని రుక్మాంగద మహారాజు మాత్రము ఏకాదశి నాడు భుజించడు. ఏకాదశి ఉపవాసము చేతనే రుక్మాంగద నామము మూడు లోకములలో ప్రసిద్ది గాంచినది. అదియే నేను సంపాదించిన యశము. అట్టి నేను ఏకాదశినాడు భోజనముచేసి నేను సంపాదించిన కీర్తిని నేనే ఎట్లు నశింపచేతును. ఈ మోహిని మరణించిననూ, వెడలిపోయిననూ, పతనమైననూ, ఖండఖండములుగా నశించిననూ, ఇటనుండి విరమించిననూ, నా నిశ్చయము మాత్రము మోహినీ కారణమున మాత్రము మారజాలదు. నా ప్రజలతో భార్యా పుత్రులతో నా జీవితమును కూడా విడిచెదను కాని పరమ పవిత్రమగు ఏకాదశీ దినమున మాత్రము నేను భోజనము చేయ జాలను. (II/26)