నారద మహా పురాణము
రామాది ఉపాసనా వర్ణనము
సనత్కుమార మహర్షి పలికెను: ఇపుడిక సిద్ధిదాయకములగు శ్రీరామ మంత్రములను చెప్పెదను. ఈ మంత్రములను ఆరాధించుటవలన మానవులు సంసారసాగరమును తరించెదరు. ఉత్తమ మంత్రములు అన్నింటిలో విష్ణుమంత్రములు శ్రేష్ఠములు. గాణాపత్య, సౌర శాక్త మంత్రములలో ఉత్తమము వైష్ణవ మంత్రము. వైష్ణవమంత్రముల కంటే రామ మంత్రములు కోటి కోటి గుణాధి కములు. విష్ణుశయ్యాస్థితుడగు వహ్ని ఇందు భూషిత మస్తకుడు. ‘రామాయ’ అనునది హృదయాం తముగాగల ఈ మంత్రము మహాపాప రాశులను నశింపచేయును. రామ మంత్రములలే అన్నింటిలో అతి శ్రేష్టమైనది ఈ రామ షడక్షరి తెలిసి తెలియకచేసిన బ్రహ్మహత్యా సహస్రములు, స్వర్ణస్తేయ సురాపాన గురుతల్పాదికములగు మహాపాపములు వేలకోట్ల ఉపపాతకములు అన్నియూ ఈ మంత్రోచ్చారణవలన వెంటనేనశించిపోవును. ఈ మంత్రమునకు మునిబ్రహ్మ, గాయత్రీ ఛందస్సు, శ్రీరాముడు దేవత. బీజము ఆద్యము హృదయము శక్తి అఖిలాప్తికి వినియోగము షడ్దీర్ఘ భాజమగు బీజముచే షడంగ న్యాసమును చేయవలెను. బ్రహ్మ రంధ్రమున, భ్రూ మధ్యమున, హృదయనాభి గుహ్య పాదములందు క్రమముగా మంత్రవరన్యాసమును చేసి కేశవాదులను న్యాసము చేయవలెను. పీఠన్యాసాదికము నాచరించి హృదయమున శ్రీరామచంద్రుని ధ్యానించవలెను. కాలాంభోధరమువలె సుందరుడు, వీరాసన సమస్థితుడు, దక్షిణహస్తమున జ్ఞానముద్రను ధరించి వామహస్తమును జానువుపై నుంచినవాడు, పద్మహస్త విద్యుత్సన్ని భయగు సీత వామపార్శ్వమున నుండి రాముని ముఖమును చూచుచు బహవిధభూషణ భూషితయగు సీతతో నున్న రాముని ధ్యానించి అక్షర లక్షలు జపించి దశాంశమును అగ్నిలో కమలములతో హోమముచేసి బ్రాహ్మణులకు భోజనమును పెట్టవలెను. విమలాది సమన్వితమగు వైష్ణవపీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తియందు అవాహనముచేసి పూజించవలెను. వామ భాగమున ఆసీనురాలగు సీతను ఆమె మంత్రముచే పూజించవలెను. రమాసీతాయై తరువాత ద్వితాంతము సీతా మంత్రము. అగ్ని వలన శార్ణమును పూజించి, పార్శ్వ ద్వయమున శరములను పూజించవలయును. కేశరములందు షడంగములను, పత్రములందు హనుమంతుని, సుగ్రీవుని, భరతుని, విభీషణుని, లక్ష్మణాంగ దశతృఘ్నులను జాంబవంతుని క్రమముగా, మాటలాడుచున్న ముందు పుస్తకమును ధరించియున్న హనుమంతుని, రెండు పార్శ్వములలో చామరములను ధరించియున్న భరత శత్రుఘ్నులను వెనుక భాగమున ఛత్రమును ధరించియున్న లక్ష్మణుని అర్చించవలెను. తరువాత అష్టపత్రమున సృష్టిని జపించుచున్న విజయుని, సురాష్ట్రుని, రాష్ట్రపాలుని, అరోపుని, ధర్మపాలకుని, సుమంతుని, చక్కగా పూజించి, ఆయుధోపేతులగు లోకేశులను పూజించవలెను. ఇట్లు రాముని ఆరాధించినవాడు జీవన్ముక్తుడు అగును. చందనము కలిపిన జాతీ పుష్పములచే సావధానముగా హోమమును చేయవలెను. అట్లు చేసిన రాజులు పశులగుదురు. ధనధాన్యాది సిద్ధికి కమలముచే హోమమును చేయవలెను. నేతితో కలిసిన నీల కమలములచే హోమమును గావించిన సకల జగత్తు వశమగును. నేయికలిపిన శత పర్వములచే హోమమును గావించిన రోగములు తొలగి దీర్ఘాయుష్మంతుడగును. ఎఱ్ఱకలువలచే హోమమును గావించినచో వాంఛిత ధనమును పొందును. మోదుగు పూలచే హోమమును చేసినచో మేధావి అగును. ఈ మంత్రముచే మంత్రించబడిన జలమును ఒక సంవత్సరము పానము చేసినచో కవివర్యుడగును. ఈ మంత్రముచే మంత్రించబడిన అన్నమును తినినచో మహారోగములు నశించును. ఆయా రోగములకు నిర్దేశించబడిన ఔషధముచే హోమము కావించినచో ఆ రోగము తొలగిపోవును. నదీతీరమున కాని కోష్ఠమున కాని పయోవ్రతుడై లక్ష జపించవలెను. నేయి కలిపిన పాయసముచే హోమమును చేసినచో విద్యానిధి అగును. అధికారము నుండి తొలగినవాడు శాకాహారుడై ఇతర తీర్థమున లక్ష జపించి బిల్వపుష్పములచే దశాంశము హోమమును గావించినచో వెంటనే తన అధికారము తిరిగి లభించును. ఉపవాసము చేసి గంగా తీరమున నిలిచి లక్ష జపముచేసి దశాంశమును కమలములచే కాని బిల్వ పుష్పములచే కాని హోమము గావించినచో రాజ్యసంపదను పొందును. మార్గశీర్ష మాసమున కందమూల ఫలాశనుడై జలమున నిలిచి లక్ష జపముచేసి దశాంశమును పాయసముచే హోమము కావించినచో శ్రీరామచంద్రుని వంటి పుత్రుడు కాని పౌత్రుడు కాని కలుగును. ఇంకను ఈ మంత్ర విషయమున చాలా ప్రయోగములున్నవి. కాని ప్రయోగము చేయువారికి పరలోకము కలుగదు. షట్కోణ వసుపత్రమున బాహ్యార్క దళమును లిఖించవలెను. షట్కోణములందు షడక్షరములను వ్రాయవలెను. అష్టపత్రము నందు అష్టాక్షరములను ప్రణవ సహితములుగా వ్రాయవలెను. రవి దళమున కామ బీజమును, మధ్యమున మంత్రా వృతమును, బాహ్యమున సుదర్శనా వృతమును, దిక్కులలో యుగావృతమును లిఖించవలెను. వజ్రములచే శోభించు భూగృహమున కందర్పాంకుశ పాశములచే భూమి యందు కోణాకారముగా లిఖించినది యంత్రరాజముగా పేర్కొనబడినది. భూర్జపత్రమున లిఖించిన యంత్రమున అష్ట గంధములచే లేపనము గావించి యథోక్త విధిగా పూజించవలెను. షట్కోణములందు దలార్కాబ్జములను ఇష్టవృతయుగ్మముగా, కేశరములందు అష్టపత్రముయొక్క స్వర ద్వంద్వమును లిఖించవలెను. ఇట్లు లికించిన యంత్రమును శుభదినమున కంఠమున కాని, దక్షిణభుజమునకానీ, శిరమున కాని ధరించినచో సర్వపాపములు నశించును. శుభ దినము, శుభ నక్షత్రమున, శుభ ప్రదేశమున శల్యవర్జి తమున వశ్యాకర్షణ విద్వేష ద్రావణ ఉచ్చాటనాదికమును, పుష్యద్వయము, పునర్వసు, అర్త్రామఘా నక్షత్రములలో యథాక్రమముగా దూర్వచే ఏర్పరిచిన లేఖనిని వశీకరణమున, ఆకర్షణకు కరంజమున మారణమున నరాస్థిజమున స్తంభనమున రాజ వృక్షజమున, శాంతి పుష్టి ఆయుష్యము కొఱకు సర్వాపన్నివారణకు, విభ్రమోత్పాతనమునకు శిలయందు వ్రాయవలెను. విద్వేష విషయమున ఖరచర్మముపై ఉచ్చాటనము ధ్వజముపై వ్రాయవలెను. శత్రువులకు జ్వరసంతాప శోకమారణ కర్మలకొఱకు పీతవస్త్రమున లిఖించవలెను. వశీకరణకొఱకు, ఆకర్షణ కొరకు అష్టగంధములచే యథావిధిగా పూజించవలెను. తాడోచ్చాటనాదికమునకు చితాంగారాదులచే చేయవలెను. విష్మాక్షీర యోగముచే మారణము తథ్యము. ఇట్లు యంత్రరాజమును లిఖించి గంధపుష్పాదులచే పూజించవలెను. యంత్రమును త్రిలోహవేష్టనము గావించి ధరించవలెను. ఈ మంత్రమునకు ఠద్వంద్వము బీజము. ఈ మంత్రము షడక్షరములు కలది.
ఇక ఇపుడు సిద్ధిదాయకమగు మహాసుదర్శన మంత్రమును చెప్పెదను.
“సుదర్శన! మహాచక్రరాజేశ్వర! దుష్టాంతక! దుష్టభయానక!
దుష్ట భయంకర! ఛిన్ధి! ఛిన్ధి! భిన్ధి! భిన్ధి! విదారయ విదారయ!
పరమంత్రాన్ గ్రస! గ్రస! భక్షయ భక్షయ! త్రాసయ! త్రాసయ!
స్వాహా!” అనునది మంత్రము. అరువది ఎనిమిది అక్షరములు గలది. ఈ మంత్రము యంత్రసంవేష్టనమునకు ఉపయోగించును. “ఓమ్ నమో భగవతే రఘునందనాయ రక్షోఘ్న విశదాయ మధుర ప్రసన్న వరదానాయ అమిత తేజసే బాలాయ రామాయ విష్ణవే నమః” అనునది నలుబది ఏడు అక్షరములు గల మంత్రము. దీనిని మాలామంత్రమందురు. ఈ మంత్రమునకు విశ్వామిత్ర మహర్షి ముని. గాయత్రీ ఛందస్సు శ్రీరాముడు దేవత ధ్రువ బీజము ఠద్వయము శక్తి షడ్దీర్ఘస్వరయుగ్మ బీజముచే అంగన్యాసమును గావించవలెను. ఈ మంత్రమునకు ధ్యాన పూజాదిక మంతయు పూర్వమువలె ఆచరించవలెను. ఇట్లు ఆరాధించబడిన ఈ మంత్రము సర్వ కామములను ఇచ్చును. స్వకామ సత్య వాగ్ల లక్ష్మీ తారాఢ్యము పంచ వర్ణకము. షడక్షర మంత్రము షడ్విధము చతుర్వర్గ ఫల ప్రదము. బ్రహ్మ సంమోహనము, దక్షిణామూర్తి శక్తి అగస్త్యుడు శ్రీ శివుడు మునులు. తేజోకామ బీజానికి విశ్వామిత్రుడు ఋషి, గాయత్రీ ఛందస్సు శ్రీరాముడు దేవత. బీజశక్తి అధ మాంత్యము. మంత్రవర్ణములచే షడంగన్యాసము చేయవలెను. షడ్దీర్ఘయుక్త బీజములచే మంత్రవర్ణ న్యాసము చేయవలెను. కల్పవృక్షమూలమున సువర్ణమయ మండపమున పుష్పకవి మానాంతర్భాగమున సింహాసనము పై భాగమున అష్టదల పద్మమున ఇంద్రనీల సమప్రభుడు, వీరాసనస మాసీనుడు జ్ఞానముద్రోపశోభితుడు వామోరున్యస్త హస్తుడు, సీతాలక్ష్మణ సేవితుడు రత్నాకల్పుడగు శ్రీరామ విభుని ధ్యానించి అక్షర లక్ష మంత్రమును జపించవలయును. లేదా స్మారాది మంత్రములను జయాభుడగు హరిని స్మరించవలెను. కామ్యకర్మలయందు ప్రయోగములను, పూజను షడక్షర మంత్రమువలె చేయవలెను. “ఓం రామచన్ర్దాయ నమః” “ఓం రామభద్రాయ నమః” అనునవి రెండు మంత్రములు. అష్టాక్షరములు కలవి తారాంత్యములైనచో నవాక్షరములు కలవి. ఈ మంత్రములకు పూజాదికమంతటిని షడక్షరివలెనే చేయవలెను. “ఓం జానకీ వల్లభాయ నమః” అనునది దశాక్షరీ మంత్రము. ఈ మంత్రమునకు వశిష్ఠమహర్షి ముని స్వరాట్ఛన్దస్సు. దేవత సీతాపతి ఆదిమబీజము. స్వాహాశక్తి, షడంగన్యాసమును యథోక్తముగా నాచరించవలెను. శిరోలలాట భ్రూమధ్యతాలు కంఠ హృదయ నాభి అంగ్రి జానుపాదములందు మంత్రముల దశాక్షరములను న్యాసము చేయవలెను. అయోధ్యా నగరమున రత్నచిత్రసువర్ణ మండపమున మందార పుష్పబద్ధ వితానమున తోరణయుతమైన సింహాసనమున పుష్పకోపరి భాగమున నున్న వానిని, రాక్షసులచే వానరులచే దేవతలచే విమానముల నుండి స్తుతించబడు వానిని, వినయశీలురగు మునులచే సేవించబడువానిని, వామభాగమున సీతాదేవిచే శోభించువానిని, లక్ష్మణ సహితుని, శ్యామాంగుని, ప్రసన్నవదనుని, సర్వాభరణ భూషితుని, రామచంద్రుని ధ్యానించి అక్షరలక్ష జపము నాచరించవలెను. దశాంశమును కమలములచే హోమమును గావించవలెయును. పూజాదికమును షడక్షరి మంత్రము వలె చేయవలెను. “రామాయ ధనుష్పాణయే స్వాహా” అను మంత్రము దశాక్షరములు కలది. ఈ మంత్రమునకు ముని బ్రహ్మ విరాట్ఛన్దస్సు. రాక్షసమర్ధనుడగు రామచంద్రుడు దేవత. బీజము అద్యము, ద్విఠము శక్తి. బీజముచే అంగన్యాసమును చేయవలెను. వర్ణన్యాసమును, ధ్యానమును, పురశ్చర్య అర్చనాదికమును దశాక్షర మంత్రమునకువలె చేయవలెను. చాప బాణధరుడగు రాముని స్మరించవలయును. “ఓం నమో భగవతే రామచంద్రాయ” “ఓం నమో భగవతే రామభద్రాయ” అనునవి ద్వాదశాక్షరి మంత్రములు, ఋషి ధ్యానాదికమును పూర్వమువలె నాచరించవలెను. రామనామము శ్రీ పూర్వము, జయపూర్వమని రెండు విధములు. ఇట్లు చేసినచో పైమంత్రములు త్రయోదశాక్షరములు కలవగును. బ్రహ్మముని, విరాట్ఛన్దస్సు పాపసమూహ నాశకుడగు రాముడు దేవత. మూడు పదములచే ద్విరావృత్తిచే షడంగ న్యాసమును చేయవలెను. ఈ మంత్రమునకు ధ్యానార్చనాదికమును అంతటిని దశాక్షరోక్తముగా ఆచరించవలెను.
“ఓం నమో భగవతే రామాయ మహాపురుషాయ నమః” అను మంత్రము పదునెనిమిది అక్షరములుకలది. ఈ మంత్రమునకు విశ్వామిత్రుడు మహర్షి ధృతి చంధస్సు. రాముడు దేవత ఓం అనునది బీజము. నమః అనునది శక్తి. 1, 3, 4, 3, 6, 2 మంత్ర వర్ణములచే షడంగన్యాసము చేయవలెను. నిశ్శాణభేరీపటహ శంఖతూర్యాది ధ్వనులచే చుట్టూ నృత్యము జరుగుచుండగా, జయమంగళ నాదములు చెలరేగుచుండగా, చందన అగరు కస్తూరీ కర్పూరాది పరిమళ వస్తువులు నిండగా పైవిధముల పుష్పముల సువాసనలను వాయువు తెచ్చుచుండగా, పాడుచున్న దేవగంధర్వ స్త్రీలచే శోభించుచుండగా, సింహాసనమున పుష్పకోపరి భాగమున సమాసీనుడైన సీతా లక్ష్మణ సహితుడు, జయామకుట శోభితుడు, చాపబాణధరుడు, శ్యామసుందరుడు, సుగ్రీవ విభీషణాది సహితుడు త్రైలోక్య రక్షకుడు యుద్ధమునకు వచ్చిన రావణుని చంపినవాడు అగు రామ చంద్రుని ధ్యానించి అక్షర లక్షజపించి, దశాంశమును నేయి కలిపిన పాయసముచే హోమమును చేయవలెను. పూజాదికమును పూర్వమువలె నాచరించవలెను. “ఓం నమో సీతాపతయే రామాయ హన హన హుం ఫట్ స్వాహా” అనునది పందొమ్మిది అక్షరముల మంత్రము. సర్వార్ధ సాధకము. విశ్వామిత్రుడు ఋషి అనుష్టుప్ఛన్దస్సు. రామభద్రుడు దేవత. జం అనునది బీజము. నమః అనునది శక్తి మంత్ర వర్ణములచే అంగన్యాసము గావించి పూర్వమువలె ధ్యానమును చేయవలెను. పూజనాదిక మంతయు షడక్షరివలె నాచరించవలెను. “ఓం నమో కమలా రామభద్ర మహేష్వాస రఘువీర నృపోత్తమ దశాస్యాంతక మాం రక్ష దేహి పరమాం శ్రియమ్”. అనునది ముప్పది ఏడక్షరములుగల మంత్రము. బీజములు లేనిచో ముప్పది రెండక్షరములు గల మంత్రమిది. సర్వ ఫలదాయకము. విశ్వామిత్ర మహర్షి ఋషి, అనుష్టుప్ఛన్దస్సు. రామభద్రుడు దేవత, స్వం బీజము. ఇందిరా శక్తి బీజ త్రయాద్యములుగల పదములచే పంచాంగన్యాసము చేయవలయును. శిరస్సున, ఫాలభాగమున, నేత్రములలో, శ్రోత్రములలో గండద్వయమున, నాసికయందు, ఆస్యమున, బాహువులందు, సంధులందు, స్తనములందు, హృదయమున, నాభియందు, కటియందు, మేడ్రమున, పాయుపాద సంధులలో మంత్రాక్షర న్యాసమును కావించవలయును. ధ్యానార్చనాదికమును పూర్వమువలె ఆచరించవలెను. లక్షత్రయ జపము, పాయసహవనము పురశ్చర్య పీత వర్ణుడగు రాముని ధ్యానించి నావధానముచే లక్ష జపము చేయవలెను. దశాంశమును కమలములచే హోమమును గావించి ధనపతి అగును. “ఓం రమారమా దశరథాయ నమః” అనునది ఏకాదశాక్షర మంత్రము. మున్యాదికము పూజాదిక మంతయు పూర్వమువలె ఆచరించవలెను. “త్రైలోక్యనాధాయ నమః” అనునది అష్టాక్షర మంత్రము. న్యాస ధ్యానాదిక మంతయు పూర్వమువలె ఆచరించవలెను. ‘ఆంజనేయగురవే నమః’ అనునది నవాక్షర మంత్రము. ఈ మంత్రమునకు పూజాదికమును పూర్వమువలె ఆచరించవలెను. “రామా యనమః” అనునది పంచాక్షర మంత్రము. మునిధ్యాన పూజాదికమంతయు షడక్షరి మంత్రమువలె ఆచరించవలెను. “రామచంద్రాయ స్వాహా” “రామ భద్రాయ స్వాహా” అను రెండు మంత్రములకు కూడా ముని ధ్యానార్చనాదికము పూర్వమువలె ఆచరించవలెను. శేషాన్వితుడగు వహ్ని చంద్ర భూషితమస్తకుడు రామచంద్రుని ఏకాక్షర మంత్రము. మరియొక కల్పవృక్షము. ముని బ్రహ్మ గాయత్రీ ఛందస్సు శ్రీరామచంద్రుడు దేవత. పడ్దీర్ఘాఢ్యమంత్రముచే షడంగములను ఆచరించవలెను. సరయూ తీరమున మందారవేదికపై పద్మాసనమున, వీరాసనాసీనుడు శ్యామాంగుడు, జ్ఞాన ముద్రోపశోభితుడు, వామోరున్యస్త హస్తుడు సీతాలక్ష్మణ సహితుడు, ఆత్మదర్శి మన్మధాతీత తేజస్కుడు, శుద్ధస్ఫటిక సంకాశుడు పరమాత్మ అయిన శ్రీరామచంద్రుని మోక్షాభిలాషులు ధ్యానించి మంత్రమును ఆరు లక్షలు జపించవలెను. హోమనిత్యార్చనాదికమును షడక్షర మంత్రమువలె నాచరించవలెను. శేషాసన వహ్నిఖాంతమున ధ్వ్యక్షరమనువు ఏకాక్షర మంత్రమువలె సర్వము ఆచరించవలెను. త్ర్యక్షర మంత్రరాజము సకలాభీష్ట ప్రదము. చంద్ర భద్రాంతము చతురక్షరము ద్వివిధము. ఈ మంత్రములన్నింటిని మునిధ్యానార్చ నాదికము అంతయు ఏకాక్షర మంత్రమువలె ఆచరించవలెను. “ఓం రామాయ హుం ఫట్ స్వాహా” అనునది అష్టాక్షర మంత్రము. మునిధ్యానార్చ నాదికమంతయు షడక్షర మంత్రమువలె నాచరించవలెను. ఇట్లే శివోమారామమంత్రములు అష్టాక్షరములుగల మంత్రములు సర్వాభీష్టప్రదములు. సదాశివుడు ఋషి గాయత్రీ ఛందస్సు శివోమారామచంద్రుడు దేవతా. షడ్వీర్యయుతమగు పంచాక్షరయుక్తమగు ధ్రువముచే షడంగన్యాసము ఆచరించి, హృదయమున సురార్చితుడగు రాముని, సోమార్ధధారి, త్రినేత్రుడు, శూలి, భస్మోద్ధూళిత సర్వాంగుడు కపర్ది అయిన శివుని ధ్యానింతుము. రామాభిరామ, సౌందర్యసీమ, సోమాభరణ, పాశాంకుశ ధనుర్భాణధారిణి, త్రిలోచనయగు సీతను ధ్యానించి అక్షరలక్ష జపించవలెను. బిల్వపత్రములతో, ఫలములతో, పుష్పములతో, పద్మములతో హోమమును చేయవలెను. ఇట్లు చేసినచో దేవతలచే అభిలషించబడు నిధులు సిద్దులు స్వయముగా వచ్చి చేరును. తారము మాయ “భరతాగ్రజరామ మనోభవస్వాహా” అనునది ద్వాదశాక్షరి మంత్రము. ఇది మరియొక కల్పవృక్షముముని అంగిరసుడు. గాయత్రీ ఛందస్సు, శ్రీరామ చంద్రుడు దేవత భువనబీజము స్వాహా శక్తి 1, 1, 7, 1, 3 మంత్రాక్షరములచే షండగన్యాసము నాచరించవలెను. ధ్యానపూజాదిక మంతయు షడక్షరివలె ఆచరించవలెను. “ఓం నమస్సీతాపతయే రామాయ హనహన ఫట్” అనునది షోడశాక్షర మంత్రము. అగస్త్య మహర్షి ముని. బృహతీ ఛందస్సు. శ్రీరామచంద్రుడు దేవత. అహం బీజము, రాం శక్తి 3, 4, 3, 4, 3 వర్ణములచే పంచాంగ కల్పన చేయవలెను. ధ్యాన పూజాదిక మంతయు షడక్షర మంత్రమువలె నాచరించవలెను. “ఓం నమో బ్రహ్మణ్యసేవ్యాయ రామాయ అకుంఠతేజనే ఉత్తమ శ్లోకధుర్యాయ” అనునది మరియొక మంత్రము. శుక్రుడు ఋషి అనుష్టుప్ ఛందస్సు శ్రీరామ చంద్రుడు దేవత. షడక్షరి మంత్రమువలె పానములచే పంచాంగకల్పన చేయవలెను. మంత్రమును ఒక లక్ష జపించవలెను. దశాంశము పాయసముచే హోమము నాచరించవలెను. ఈ మంత్రము సిద్ధించినచో సర్వ పాపములు నశించును. భుక్తి ముక్తులు లభించును.
“దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్” అనునది రామగాయత్రి. ఈ గాయత్రి సర్వాభీష్ట ఫలప్రదాయిని. “పద్మాసీయాతై ఫట్” అనునది షడక్షరి, వాల్మీకి ముని. గాయత్రీ ఛందస్సు, భగవతి సీత దేవత. శ్రీం అనునది బీజము. స్వాహా శక్తి. షడ్దీర్ఘయుక్తమగు బీజముచే అంగకల్పన చేయవలెను. తరువాత త్రైలోక్యపూజిత మహాదేవి తప్తకాంచన సన్నిభ, హస్తద్వయమున పద్మ ద్వయమును ధరించి రత్న భూషణములచే శోభించు దివ్యదేహము గలది, శుభాత్మక, నానావస్త్రధారిణి, చంద్రముఖి, పద్మాక్షి, సంతుష్టాంతరంగ, పావనుడగు రామచంద్రుని చూచుచుండునది, షడ్గుణేశ్వరియగు సీతను ధ్యానించవలెను. ఇట్లు ధ్యానముచేసి మంత్రమును అక్షరలక్ష జపించవలెను. దశాంశమును కమలములతో హోమము చేయవలెను. పూర్వోక్త పీఠమున పూజించవలెను. మూల మంత్రముతో మూర్తిని సంకల్పించి, ఆ మూర్తియందు జానకిని అవాహించి, దక్షిణ భాగమున రామచంద్రుని, అగ్రభాగమున హనుమంతుని, పృష్ఠ భాగమున లక్ష్మణుని పూజించి, షట్కోణములందు అంగపూజ గావించి, పత్రములందు మంత్రిముఖ్యులను బాహ్యభాగమును లోకాధిపతులను, వజ్రాదులను పూజించి సర్వసిద్ధీశ్వరుడగును. చందనము నలదిశ జాతీపుష్పములచే హోమమును గావించిన రాజులు వశులగదురు. కమలములచే హోమము గావించిన జగత్తు వశమగును. మారేడు దళములచే హోమము చేసినచో సంపద, దూర్వాదళములచే హోమము కావించిన రోగములు శాంతించును. ఇంకను ఏమి చెప్పవలెను. సీతారాధన వలన ధనము, ధాన్యము, సౌభాగ్యము పుత్రులు, పౌత్రులు, ఉత్తమ సుఖము, మోక్షము లభించును. “ఓం లక్ష్మణాయ నమః” అనునది సప్తాక్షరీ మంత్రము. ఈ మంత్రమునకు అగస్త్యమహర్షి ముని, గాయత్రీ ఛందస్సు, మహావీరుడగు లక్ష్మణుడు దేవత, నమః అనునది బీజము, శక్తి షడ్దీర్ఘాఢ్యమగు బీజముచే షడంగములు ఆచరించవలెను. బాహుద్వయములు కలవాడు, స్వర్ణనిభదేహుడు, పద్మాక్షుడు, ధనుర్బాణ ధరుడు, రామసేవా సంసక్తమానసుడు అగు లక్ష్మణుని ధ్యానముగావించి మంత్రమునను అక్షరలక్ష జపించవలయును. దశాంశమును తేనెకలిపిన పాయసముచే హోమముగావించి రామపీఠమున పూజించవలెను. రామ మంత్రమువలెనే పూజాదికమును కాగావించవలెను. ఈ మంత్రము సర్వసిద్ధిప్రదము. రామపూజ సంపూర్ణము కావలయునని భావించినచో ఆదరముచే లక్ష్మణార్చన గావించవలెను. శ్రీరామచన్ద్ర మంత్రములలో చాలా భేదములు సిద్ధి ప్రదములు గలవు. ఆ మంత్రసిద్ధిని కోరువారు లక్ష్మణారాధనను తప్పక ఆచరించవలెను. అష్టోత్తర సహస్రముకాని, అష్టోత్తర శతముకాని లక్ష్మణ మంత్రమును సావధానముగా ముముక్షువులు జాడ్యమును వీడి జపించవలెను. లక్ష్మణ మంత్రమును జపించక రామమంత్రమును జపించినవారికి సిద్ధి కలుగకపోగా ప్రతిక్షణము హానియే కలుగుచుండును. ఏకాంతమున లక్ష్మణ మంత్రమును జపించువారు, సర్వపాప వినిర్ముక్తులై సర్వాభీష్టములను పొందెదరు. ఈ మంత్రమునకు ముఖ్యఫలము జయము. రాజ్యప్రాప్తికి ఉత్తమ సాధనము, నష్టరాజ్య ప్రాప్తికి ఈ మంత్రమును ఒక లక్ష సావధాన మనస్కుడై జపించినచో వెంటనే స్వరాజ్యమును పొందును. అనన్యమనస్కుడై అయోధ్యాభిషిక్తుడగు రాముని ధ్యానించుచు, మంత్రమును యాబదివేలు జపించినచో నష్ట రాజ్యము లభించును. నాగపాశ వినిర్ముక్తుడగు లక్ష్మణుని ఆదరముచే ధ్యానించి మంత్రమును పదివేలు జపించినచో బంధముక్తుడగును. హనుమంతునిచే తేబడిన ఔషధములచే గతవ్యధుడగు లక్ష్మణుని ధ్యానించి లక్ష జపించినచో అపమృత్యువును జయించును. మేఘనాధుని సంహరించుచున్న లక్ష్మణుని ధ్యానించి లక్ష జపించినచో జయింప శక్యముకాని శత్రు బలమును కూడా త్వరలో జయించును. శూర్పణఖ నాసికను ఛేదించు ప్రయత్నమున నున్న లక్ష్మణుని ధ్యానించి ఒకవేయి జపించినచో ఇంద్రాదులను సైతము జయించును. రామ పాదపద్మములను సేవించుట కొఱకు ప్రయత్నించు లక్ష్మణుని ధ్యానించి ఏకాంతమున లక్ష జపించినచో మహా రోగమునుండి విముక్తుడగును. మూడు మాసములు ఆహార నియమముతో ప్రతి నిత్యము నూట ఎనిమిది పుష్పములచే కాని చినిగిపోని పద్మములచే కాని పూజించి, ఏడువేల మార్లు జపించినచో కుష్టురోగమునుండి వినిర్ముక్తుడగును. ఏకాంతమున ఆహార నియమముతో ఆరు మాసములు ఈ విధానమును అనుసరించినచో క్షయ రోగము నుండి వినిర్ముక్తుడగును. ప్రాతఃకాలమున సావధాన మనస్కుడై మూడుమార్లు మంత్రించిన జలమును మూడు మార్లు మూడువేళలలో త్రాగినచో అన్ని రోగముల నుండి వినిర్ముక్తుడగును. దారిద్ర్యము తొలగి కుబేరుడంతటి వాడగును. విషాది దోషస్పర్శ కూడా కలుగదు. మంత్రించిన జలముచే ప్రతి నిత్యము ముఖ ప్రక్షాళనమును కావించు కొనినచో ముఖా నేత్రాదులకు సంభవించు భయంకర రోగములను జయించగలుగును. మంత్రించిన జలమును త్రాగినచో కుక్షిరోగములు తొలగిపోవును. లక్ష్మణ ప్రతిమను చేసి యథావిధిగా భక్తిచే బ్రాహ్మణునికి దానము గావించినచో సర్వరోగములనుండి ముక్తుడు అగును. కన్యార్థి అయినవాడు విమలాపాణి గ్రహణాసక్తమానసుడై ధ్యానము చేయుచు లక్ష జపించిన దశాంశమును పద్మములచే హోమమును గావించినచో త్వరలో తాను కోరిన కన్య లభించును. దీక్షితుని, జృంభణ అస్త్రాది మంత్రములందు నియతవ్రతుని లక్ష్మణుని ధ్యానించి విధివిధానముచే ప్రతినిత్యము ఏడువేలు జపించుచు మూడు నెలలు నియమమును ఆచరించి పూజాదులను కావించినచో సర్వవిద్యా తత్త్వజ్ఞుడగును. విశ్వామిత్ర యాగమున అద్భుత పరాక్రమమును చూపిన లక్ష్మణుని ధ్యానించి లక్ష జపించినచో మహా భయమునుండి ముక్తుడగును. నిత్యానుష్ఠానమును ఆచరించి ప్రీతి నిత్యము మూడు వేలలా పరిశుద్ధుడై మంత్రమును జపించినచో సర్వపాప వినిర్ముక్తుడై శ్రీ మహావిష్ణు లోకమగు పరమపదమును పొందును. విధివిధానముగా దీక్షితుడై సద్గుణములచే గతకల్మషుడై స్వాచారనియతుడై అంతరింద్రియ నిగ్రహము కలవాడై, గృహస్థుడు బహిరింద్రియములను జయించినవాడై, ఐహికములను అపేక్షింపక నిష్కాముడై లక్ష్మణుని అర్చించినవాడు సర్వపాప పుణ్య రాసులను భస్మముగావించి నిర్మలమనస్కుడై పునరావృత్తి రహితమగు శాశ్వత పరబ్రహ్మ లోకమును పొందును. సకామునిగా పూజించినచో కోరిన కోరికలను పొంది, మనసున తలచిన భోగములను అనుభవించి చాలా జన్మలు పూర్వజన్మ జ్ఞానము కలవాడై అంత్యమున పరమపదమును పొందును.
“శ్రీ భరతాయనమః” అనునది సప్తాక్షరీ మంత్రము. ఈ మంత్రమునకు ఋషి, ఛందస్సు, దేవతా, పూజాదిక మంతయు పూర్వ మంత్రమునకు వలెనే అని తెలియవలెను. “శ్రీ శత్రుఘ్నాయ నమః” అనునది సప్తాక్షర శత్రుఘ్న మంత్రము. సకలాభీష్ట ప్రదము. (3/73)