నారద మహా పురాణము
సర్మదా తీర్థ మాహాత్మ్యము
మోహిని పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! నేను ఉత్తమమగు సేతుమాహాత్మ్యమును వింటిని. ఇప్పుడు నర్మదాతీర్థ సంగ్రహమును వినగోరుచున్నాను.
వసువు పలికెను: ఓ మోహినీ! చెప్పెదను వినుము నర్మదానదికి రెండు తీరములందు నాలుగు వందల తీర్థములు కలవు. ఉత్తరతీరమున పదకొండు, దక్షిణ తీరమున ముప్పది, దేవసాగర సంగమమున ముప్పది యైదు. చుట్టూ ఓంకార తీర్థము. అమర కంటక పర్వతమునకు క్రోశద్వయమున అన్ని దిక్కులలో సార్థకోటిత్రయి కలదు. కపిలా సంగమమున ఒకకోటి తీర్థములు కలవు. అశోకవనికయందు లక్ష తీర్థములు కలవు. అంగార గర్తమునందు నూరు, కుబ్జయందు పదివేలు, వాయు సంగమమున సహస్రము, సరస్వతి యందు నూరు, శుక్లతీర్థమున రెండు వందలు, విష్ణు తీర్థమున వేయి, మాహిష్మతియందు వేయి, శూలభేదమున పదివేలు, దేవ గ్రామమున వేయి, ఉలూకమున ఏడొందలు, మణి నదీ సంగమమున నూట ఎనిమిది, వైద్యనాధమున ఘటేశ్వరమున కూడా అన్నియు రేవాసాగర సంగమమున సార్థ లక్ష తీర్థములు ఎనుబది ఎనిమిదివేలు, వ్యాస తీర్థమున ద్వీప శతకము, కరంజా సంగమమున పదివేల ఎనిమిది, ఏరండీ, సంగమమున నూట ఎనిమిది, ధూత పాపమున అరువది యెనిమిది, కోకిరమున సార్ధ కోటి, రోమ కేశమున సహస్రము ద్వాదశార్కమున సహస్రము, లక్షాష్టకమున రెండు వేలు, శుక్ల తీర్థమున సర్వ సంగమములందు నూట ఎనిమిది, కావేరీ సంగమమున అయిదొందలు, భృగు క్షేత్రమున కోటి తీర్థములు భార భూతియందు నూట ఎనిమిది. అమ్రా దేశమున సార్థశతము, విమలేశమున లక్ష తీర్థములు కలవు. ఇట్లు నార్మదమున సార్థకోటి తీర్థములు కలవు. దశాదిత్య తీర్థమున తొమ్మిది, కపిల తీర్థమున ఎనిమిది, నంది తీర్థమున కోటి ఎనిమిది, నాగాగ్నిసిద్ధా వర్తములు ఏడు, కేదారేంద్రియ వాగీశ నంది దైవతకములు అయిదు, యమేశ వైద్య నాధులు, వామనాంగార కేశ్వరులు సారస్వతులు మునీంద్రులు దాంకేశులు గౌతములు, నలుగురు విమలేశ్వరులు మువ్వురు, సహస్ర యజ్ఞభీష్మేశులు, స్వర్ణతీర్థములు, ధౌతపాపకరంజేశులు ఋణముక్తి గుహసంజ్ఞకములు. దశాశ్వమేధము, నంద, మన్మధేశము, భార్గవము, పరాశరయోని సంజ్ఞము, వ్యాసాఖ్యపితృ నందికలు, గోపీశ మారుతేశాఖ్యములు, జంగలేశాఖ్య శుక్లకము, అక్షరేశము, పిప్పలేశము, మాండవ్య దీపకేశ్వరము, ఉత్తరేశము, అశోకేశము, యోధనేశము, రౌహిణము, ద్విసంఖ్యాకమగులంకేశము ప్రత్యేకముగా చెప్పబడినవి. ఇవి మొత్తము పందొమ్మి వందలు. విడివిడిగా ఒక్కొక్కటి పుణ్య ప్రదము. స్తబకము లందున్న తీర్థములు రెండు వందల పదునాలుగు. ఇవన్నియు శైవ తీర్థములు. వైష్ణవ తీర్థములు ఇరువది రెండు. అన్నియూ బ్రహ్మతీర్థములే. శాక్తతీర్థములు ఇరువది యెనిమిది. వీటిలో మాతృ దేవతలవి మూడు సరస్వతివి లక్ష్మివి రెండు, మిగిలిన పదునారు పార్వతీ తీర్థములు. ఇట్లే ఒకటి క్షేత్ర పాలతీర్థముకలదు. ఇచట అవాంతర తీర్థములు రహస్య తీర్థములు, ప్రకాశ తీర్థములు అన్నియూ కలిసి మూడు కోట్ల ఏబది లక్షలని వాయుదేవుడు చెప్పియున్నాడు. స్వర్గమున భూలోకమున అంతరిక్షమునకల తీర్థములన్నియూ ఇచట కలవు. ఈ తీర్థములలో ఏదో ఒక తీర్థమున స్నానమాడిన పరిశుద్ధుడు ఉత్తమ గతిని పొందును. నర్మదా తీరమున చేసిన దంతయూ అక్షయము అగును. సరస్వతీ జలము మూడు దినములలో యమునా జలము ఏడు దినములలో, ఒక స్నానముచే గంగా జలము, దర్శన మాత్రముననే నర్మదా జలము పావనము చేయును. ఇట్లు నీకు నర్మదా తీర్థ సంగ్రహమును చెప్పితిని. ఈ తీర్థసంగ్రహమును లిఖించి నిత్యము పూజించి ఇంటిలో మారీ అగ్ని, రాజ చోర శత్రు రోగ భయములు కలుగవు. ఆ గృహము నిరంతరము ధన ధాన్య సమృద్ధిని కలిగి యుండును. పుత్ర పౌత్రులతో వివాహాది శుభకార్యములచే నిరంతము శోభిల్లుచుండును. (II/77)