నారద మహా పురాణము
కాష్ఠీల చరితము
కాష్ఠీల పలికెను: భార్యయగు రాక్షసి పలికిన ధర్మ సంయుతమగు ఆ మాటలను విని రాజ కుమారి ఏనుగు మూపునుండి క్రిందికి దిగెను. బ్రాహ్మణుడు దిగిన వెంటనే ఆ ఏనుగు మరల చక్కని రూపముగల యువతిగా మారెను. ఆ రాక్షసి చంద్రముఖి బాగుగా బలిసిన ఎత్తుగా ఉన్న స్తనములు కలదాయెను. ఆ రాజకుమారి కూడా తన తండ్రి నగరమును చేరి నగర రక్షకునితో ఇట్లు పలికెను. నీవు నా తండ్రి వద్దకు వెళ్ళుము. పూర్వము అపహరించబడిన రత్నావళీ దేవి వచ్చినదని తెలుపుము. నేను శయ్యపై నిద్రించుచుండగా రాత్రి యందు రాక్షసునిచే అపహరించ బడితిని. మరల నేను సురక్షితముగా ప్రాణములతో చేరితిని. నీవు ఊరడిల్లుము. నా కొరకు దుఃఖించకుము. గంగా జలమువలె పవిత్రముగా ఉంటిని. నీకు కీర్తిని తల్లి సౌశీల్యమును తెలుపు దాననుగా ఉంటిని అని తెలుపుము. ఆ రాజకుమారి మాటలను విని సుబాహువను పేరుగల పురపాలకుడు శీఘ్రముగా సుద్యుమ్న మహారాజు సమీపమునకు చేరెను. నమస్కరించి రాజుచే కుశలమడుగబడి ఆదరముతో రాజుతో ఇట్లు పలికెను. ఓ రాజా! పూర్వము అపహరించబడిన నీ పుత్రిక రత్నావళి ఒక యువతితో బ్రాహ్మణునితో మరల వచ్చినది. నగరము వెలుపల నిలిచినది. తెలుపుటకు వచ్చితిని. పాపరహితనుగా వచ్చితినని తెలియుము అని తెలుపుచున్నది. నా తండ్రి సుకృతవంతుడని చెప్పుచున్నది. ఇట్లు పురపాలకుడు చెప్పిన మాటలను వినిన వెంటనే మహారాజు అమాత్య సహితముగా భార్యా సహితుడై బ్రాహ్మణులతో కలిసి నగరము నుండి బయలుదేరెను. ఆ మహారాజు నగరము వెలుపలకు వెళ్ళి గంగాతీరమున నిలిచియున్న భాస్కర సన్నిభ ద్విజ స్త్రీ సంయుతయగు రత్నావళిని చూచెను. ఆ కుమారి సహజ భూషణములచే భూషించబడిన భూషణ ప్రియ, వాడని పూవువలె నున్న, తప్తకాంచన సన్నిభయగు రాకుమారిని చూచెను. దూరమునుండి చూచి సమీపించి రాజు పుత్రికను అలింగనము చేసుకొనెను. రత్నావళి కూడా సంతోషముచే ఆలింగనము చేసుకొని తండ్రికి నమస్కరించెను. తరువాత సంతోషముతో నున్న తల్లిని సంతోషముతో కలిసి తండ్రితో ఇట్లు పలికెను. ఓ తండ్రీ! నేను చెలులతో కలిసి రత్నశాలయందు నిదురించి ఉంటిని. ఉత్తర దిక్కున శిరము నుంచి పాదప్రక్షాళనము కావించక మంచముపై పరుండి వివాహ మును గూర్చి ఆలోచించు చుండగా నిశీధ కాలమున రాక్షసుడు అపహరించెను. ఆ రాక్షసుడు నన్ను తీసుకొని సముద్ర మధ్య భాగమున నున్న పర్వతగుహలోని తన ఇంటికి చేర్చెను. నానారత్న మయమగు గుహలో నన్ను ఉంచెను. అచట నన్ను వివాహమాడు ఉపాయమును ఆలోచించు చుండెను. ఆ రాక్షసుని భార్యయే ఈ సుందరాంగి. ఈ రాక్షసి అంతకుపూర్వమే దైవ యోగమున అటకు చేరిన ఈ బ్రాహ్మణునిచే తన భర్తయగు రాక్షసుని చంపించెను. ఇంద్రుని శక్తిని బ్రాహ్మణు నకిచ్చి ఆ శక్తిచే రాక్షసుని సంహరింపచేసెను. ఈ రాక్షసి ధర్మ దూషకుడగు తన భర్తనుచూచి ఈ బ్రాహ్మణునిచే సంవాదముచేసి, బ్రాహ్మణుని రూపమును చూచి మోహించి తన భర్తను సంహరింప చేసి తాను వివాహమాడెను. ఇట్లు బ్రాహ్మణుని భర్తగా చేసుకొని ఆడయేనుగు రూపమును ధరించి గృహములోని సంపదనంతా తీసుకొని నన్ను కూడా తను మూపుపై కూర్చోబెట్టి మీకు అప్పగించుటకు నీ మందిరమునకు వచ్చెను. ఇట్లు ఆ రాక్షసుని నుండి నన్ను ఈమె కాపాడెను. కావున బ్రాహ్మణునితో ఈ రాక్షసిని చక్కగా సత్కరించి పూజించవలెను. ఈమె అనుమతిని పొంది నన్ను ఈ బ్రాహ్మణునకు అర్పించుము. నేను ఇతనితో కలిసి ఏకాసనమున కూర్చొని వచ్చితిని కావున ఇతను నాకు భర్త ఆయెను. స్త్రీ ఏ పురుషునితో ఏకాసనగతయగునో అతనే ఆమెకు భర్తయగును. ఇతరుడు కాజాలడని పురాణములలో చెప్పబడియున్నది. నేను బ్రాహ్మణునితోకలిసి ఈమె మూపుపై ప్రీతితో కూర్చొంటిని. కావున ధర్మానుసారముగా ఇతనే నా భర్తయని నా అభిప్రాయము. కావున ఈమెను ఓదార్చి శాస్త్రాగమ విధానమును అనుసరించి ఈ బ్రాహ్మణునికి నన్ను అర్పించుము. నేను ఇతరుని నా భర్తగా వరించజాలను అనెను. అంతట సుద్యుమ్నమహారాజు పుత్రిక మాటలను విని సుందరాంగి యగు రాక్షస యువతిని వినయముచే నమ్రుడై ఓదార్చసాగెను. ధర్మభీతయగు నా పుత్రిక నిన్నే శరణుపొందినది. నీవు మొదటి పతిని చంపిన కారణముతోనే ఈమె నా పుత్రిక నిన్ను ఆశ్రయించి ఉన్నది. నీవు భర్తగా చేసుకొనిన ఇతనిని ఈమె భర్తగా కోరుచున్నది. నేను నమస్కరించి నిన్ను యాచించుచున్నాను. కావున నీవు అంగీకరించి నా పుత్రిక సహాయకురాలిగా స్వీకరించుము. నీ మాటచే నా పుత్రిక ఈ విప్రునికి భార్య అగుగాక. సవతి భావమును విడిచి నా పుత్రికను కాపాడుము. నా పుత్రికకు, నా భార్యకు, నా సైన్యమునకు, ప్రజలకు, నగరమునకు, రాజ్యమునకు, నాకు నీవే యజమానురాలవు కమ్ము. ఈ నా పుత్రిక యెప్పుడు నీ మాట యందే నిలిచి ఉండును అని ఇట్లు పలికిన సుద్యుమ్న మహారాజు మాటలను వినిన రాక్షసి పరిశుద్ధమగు మనసుచే ఆమోదించి కన్యాదానమును చేయుటకు సిద్ధముగా ఉన్న మహారాజుతో ఇట్లు పలికెను.
ఓ రాజోత్తమా? నీవు పరిశుద్ధమైన భావముచే నన్ను ఆశ్రయించితివి కావున ఈ రాకుమారి ఈ బ్రాహ్మణునకు రెండవ భార్య అగును. నన్ను చక్కగా పూజించవలయును. మొదట దేవాలయమున ఫాల్గుణ శుద్ధ అష్టమినుండి చతుర్దశి వరకు ఏడు దినములు ఉత్సవమును జరుపవలెను. నటులతో, నర్తకులతో గొప్ప గీతవాద్యములతో మైరేయ మాంసరక్తాది బలులతో చక్కగా పూజను గావించుము. ఇట్లు పూజించు నీకు నేనెప్పుడూ రక్షకురాలిగా ఉందును. నీవు నా మాటను పాటించుము. ఇట్లు పలికిన రాక్షసి మాటలను వినిన సుద్యుమ్న మహారాజు ఆమె ప్రీతితో పలికిన మాటలను సంతోష ముగా అంగీకరించెను. రాజు అంగీకరించగనే రాక్షసి సంతోషించెను. బ్రాహ్మణునితో ఈ రాజ కుమారిని కూడా భార్యగా చేసుకొనుము అని పలికెను. నేను ఈర్ష్యను విడిచి ఈమెతో ఉందును. ఈమె నాకు సోదరి కాగలదు. ఇట్లు రాక్షసి మాటతో రాజపుత్రికను వివాహమాడి బహుధనరాశులతో కరిణీ రూపమున ఉన్న రాక్షసిని అధిరోహించి, మహోదయ పురమునకు వెళ్ళెను. అంతట నేను నీ భర్త బహు రత్నములను తీసుకొని ఇద్దరు భార్యలతో వచ్చెనని వింటిని. అంతట నేను బంధువర్గముతో తల్లిదండ్రులతో సఖీగణముతో కలిసి మర్మములను భేదించు పరుష వాక్యములచే దూషించబడితిని. ధనము యందు ఆశకలదానా! ఇప్పుడు సంపదలు చేకూరిన భర్తను ఎట్లు సమీపించెదవు? పూర్వము ధనహీనుడని నీవే విడిచితివికదా? స్త్రీలకు తండ్రిసంపదలు చంచల ములు. భర్త సంపాదించిన సంపదలు స్థిరములని చెప్పబడును. పూర్వము పరుష పదజాలముచే నిందించి ఇపుడెట్లు మాటలాడగలవు? నీకు అతని ఇంటిలో ప్రవేశముకూడా దుర్లభము కాగలదు. ఒకవేళ వెళ్ళిననూ అచట నీవు భర్తతో శయనించుట దురాచారముగల నీకు సుఖప్రదము కాజాలదు. లోకాపవాద భయముచే నీ భర్త నిన్ను స్వీకరించిననూ నీ మీద స్నేహశూన్యమగు మనసు కలవాడు కావున నీతో కలియజాలడు. స్నేహశూన్యమగు మనసుకల దంపతుల కలయికకంటె మించిన దుఃఖప్రదము మనోవైకల్యకారి మరియొక్కటి ఉండజాలదు. ఇట్లు పలు విధములగు మాటలను వినిన నేను అధోముఖినై, నీరు నిండిన కనులతో చాలా దుఃఖించితిని. నేను మొదట నా చేతి కంకణము నీయకపోతిని. కటిసూత్రమును నూపురములను ఈయజాలకపోతిని. అట్లు ఇచ్చినచో నా పతి సంతోషించి ఉండెడివాడు. పతియే భార్య ధనమునకు జీవితమునకు స్వామి అని లోకమున చెప్పబడుచున్నది. నేను అట్టి ధనమును అపహరించి వచ్చితిని. ఇప్పుడు నాకేదిగతి? ఇప్పుడు నేనతని ఇంటికి ఎట్లు వెళ్ళగలను? ఎట్లు మాటలాడగలను? అతడు నన్నెట్లు విశ్వసించును? ఇట్లు పరితప్తమనసుచే చింతించుచు బంధువర్గ పరివేష్టితనై ఉంటిని. ఇంతలో తెల్లని ఛత్రముతో అలంకరించబడి సుకోమలము బలిష్ఠులగు పురుషులచే మోయబడుచున్న పల్లకి అచటికి వచ్చెను. ఆ పురుషులొచ్చి నాతో ఇట్లు పలికిరి. నీ భర్త నిన్ను ఆహ్వానించుచున్నాడు. సంతోషముచే త్వరగా రమ్ము. నీ భర్త ధనరాశులతో రత్నరాశులతో ఇద్దరు భార్యలతో వచ్చియున్నాడు. గృహమున ప్రవేశించిన వెంటనే తండ్రి ఇంటిలో నున్న నిన్ను తోడ్కొని వచ్చుటకు మమ్ములను పంపెను. అని చెప్పగా అంత నేను సిగ్గుపడి నా పతి చేసిన పనిని చూచి ఏ సమాధానమును చెప్పక కొంతసేపు మౌనముగా ఉంటిని. అంతట నన్ను బంధువర్గము మాటిమాటికి బోధించినది. సమ్మానముతో భర్త ఆహ్వానించినపుడు అతని వద్దకు వెళ్ళవలెను. భర్త పిలిచినపుడు అతని వద్దకు వెళ్ళని భార్య పదిహేను జన్మలు ఆడకాకిగా పుట్టును. ఇట్లు బోధించి నన్ను ఓదార్చి నన్ను తీసుకొని త్వరగా పల్లకిలో కూర్చుండబెట్టి వెళ్ళుము వెళ్ళుము అని మాటిమాటికి పలికిరి. అంతట ఆ పురుషులు పల్లకిని భుజములపై నిడుకొని వేగముగా నా భర్త నివసించియున్న మహోదయ పురమునకు గొనిపోయిరి. నేను నా భర్త గృహమును అంతటా బంగారముతో నిండియున్న దానిని, ఉత్తమ ఆసనములతో, భోజ్యములతో, వస్త్రములతో కూడియున్న దానిని చూచితిని. అంతట ఆ రాక్షసీదేవి, రాకుమారి ప్రీతితో నన్ను పూజించిరి. భర్త వాక్యముతో నేను ప్రీతి చెంది ఆదరముతో స్నానముచేసి భుజించితిని. సూర్యాస్తమయము తరువాత నా భర్త నన్ను పిలిచి చాలాసేపు ఆలింగనము చేసుకొని పర్యంకమున కూర్చోబెట్టెను. తరువాత రాక్షసిని రాజపుత్రిని పిలిచి నా భర్త ఇట్లు పలికెను.
మీరు భక్తితో ఈమె పాదసేవ చేయవలెను. ఈమె నా మొదటి భార్య. మీ ఇద్దరి కంటే పెద్దది. ఇట్లు నా భర్త చెప్పగా వారిద్దరు నా పాదములను గ్రహించిరి. సవతి భావమును, ఈర్ష్యను విడిచివేసిరి. అంతట సేవకులను పిలిచి నా భర్త ఇట్లు పలికెను. రాక్షసుని గుహనుండి నేను పొందిన సంపదను, రాజకుమారిని వివాహమాడినపుడు పొందిన సంపదను మొత్తమును భక్తి భావముతో తీసుకొనిరండు. ఆలస్యమును చేయకుడు. ఓ సేవకులారా? ఆ సంపదకంతటికి ఈమెయె యజ మానురాలు. నా భర్త మాటతో సేవకులు త్వరగా ధనమును కొనివచ్చిరి. నా పతి ప్రీతితో దానిని అంతటిని నాకు సమర్పించెను. స్వచ్ఛమైన చిత్తముతో వస్త్ర భూషణాదులచే సత్కరించి రాక్షసి, రాజపుత్రికలు చూచుచుండగనే పర్యంకమున నున్న నన్ను బిగియార కౌగలించి అధరమును చుంబించెను. ఇట్లు ఆశ్చర్యకరమగు భర్త చేసిన దేహవిత్త సమర్పణను, ఉల్లాసమును కలిగించు మాటలను, చేతితో చేసిన కుచమర్దనమును చూసి ఖడ్గముచే ఛేదించబడిన గోవువలె నా ప్రాణములు నన్ను విడిచి పోయెను. తరువాత నేను యముడు విధించిన నరకయాతనను బహుదుఃఖముతో అనుభవించి ఇపుడు కాష్ఠీలగా పుట్టితిని. మరల నేను పశు జన్మ నందెదను. ఇట్లు వేల జన్మలు ఎత్తగలను. ఇట్లు భర్తకు తన విత్తమును జీవితమును అర్పించని స్త్రీ ఇట్టి స్థితినే పొందగలదు. కావున ఇట్లు తెలిసి ఎల్లప్పుడూ భర్త కొఱకే విత్తమును జీవితమును రక్షించవలయును. భర్తయే తల్లి, తండ్రి, ధనము, బ్రతుకు, గురువు, ఆధారము. ఎన్నో సుకృతములు చేసిన స్త్రీ మాత్రమే భర్తతో తన శరీరమును కూడా దహింపచేసి విష్ణు పదమును చేరును. విత్తమునందు దేహమునందు లోభముగల స్త్రీ యమలోకమును, దుష్ట జన్మలను పొందును. (II/30)