మోహినీ ప్రణయ వర్ణనము

వసిష్ఠ మహర్షి పలికెను: ఇట్లు ప్రియురాళ్ళచే అనుమతిని పొందిన రుక్మాంగద మహారాజు సంతోషించిన వాడై ధర్మాంగదునితో ఇట్లు పలికెను. ఓ పుత్రా! ఎల్లప్పుడూ ప్రమాదరహితుడవై మొదట దుష్టులను వధించి సప్తద్వీపములు గల ఈ భూమండలమును పరిపాలించుము. సత్కాలమున సదాచారమును పరిశీలించుచు, జ్ఞానిపై వాణిజ్యమునందు ప్రీతి కలవాడవై, ఎప్పుడూ పర్యటించుచు, సర్వ కాలములందు దానములను చేయుచు కుటిలత్వమును విడిచి సదాచారమునందు ప్రీతికలవాడవై ఉండుము. ఓ పుత్రా! ఇప్పుడు నీవు చేయవలసిన మరియొక పనిని వినుము. రాజులు ఎప్పుడూ అందరి యందు అవిశ్వాసమునే కలిగి ఉండవలెను. జనుల కోశమును తెలియుచుండవలయును. పూవుల నుండి తుమ్మెద మకరందమును పరిగ్రహించునట్లు పాదరసమువలె అంతటా పరిభ్రమించుచు ప్రజలనుండిధనమును గ్రహించవలయును. ఇక నేను నీచే లభించిన యౌవనమును పొంది చంద్రముఖి, అపూర్వ సౌందర్యరాశి అగు మోహినిని భార్యగా పొంది సప్తద్వీప భూ భారమును నీకప్పగించి సుఖముగా ఆనందించెదను. పుత్రా! మనుష్యలోకమున యౌవనవంతుడు సమర్థుడగు పుత్రుడుండగా దంత భ్రంశమునుచెంది, తలపండి, ముడుతలుపడిన శరీరముకల తండ్రి స్త్రీ సౌఖ్యమును కోరుట సిగ్గును కలిగించు విషయమే. అయిననూ నేను వృద్ధుడనై కూడా యువకుడనే. కావున అన్ని లోకములలో శ్రేష్ఠురాలగు, నా కొరకు దేవతలను కూడా వదలివచ్చిన, మన్మథ బాణ విద్ధయగు ఈ మోహినిని, చారునేత్రను స్వర్ణ వర్ణ దేహను, ఏకాంతశీలుడనై నిండు మనసుతో, రహస్యముగా సుందరములగు సెలయేరులలో నదీ తీరములందు రమించెదను. దేవతలందరిలో శ్రేష్ఠురాలగు ఈ మోహిని నా జీవితముకంటే అధికురాలు. సుఖముగా ఉంచదగినది. లక్ష్మీదేవి కొరకు దేవతలు లోకపాలులు మూఢులైనట్లు ఈ మోహిని కొరకు దేవతలు అందరూ మోహితులైరి. ఇట్లు పలికిన తండ్రి మాటను విని సుబుద్ధియగు ధర్మాంగదుడు జననీ సమేతముగా జనకునికి ప్రణమిల్లి, తండ్రి భోగము కొరకు బహుచిత్త సంచయమును సమకూర్చెను. తండ్రి కొరకు ఆజ్ఞావిధేయులగు దాసులను దాసీ జనమున నియమించి కామబాణార్తుడగు తండ్రికి అన్ని సౌకర్యములను సమకూర్చి భూరక్షణమును ఆచరించెను. ధర్మాంగదుడు రాజులచే స్తుతింపబడుచు, సప్తద్వీప సమన్వితమగు భూమండలమును పర్యటించుచు పరిపాలించుచుండగా ప్రజలు పాపమునందు బుద్దిని విడిచిరి. ఫలములు పుష్పములులేని చెట్లు లేకపోయెను. యవశాలి రహితమగు క్షేత్రములేదు. గోవులు ఘట పూర్ణముగా పాలను ఇచ్చుచున్నవి. ఆ పాలు శర్కరవలె తీయనివి. ఎక్కువ నేయి కలవి. సుఖముగా త్రాగదగిన పాలు. అందరి ఆర్తిని నశింపచేయునవి. పాపములను తొలగించగలవి. పుష్టిని పెంచునవి. ప్రజలలో ఏ ఒక్కరూ సంపదను దాచరు. భర్తతో భార్య పరుషముగా మాటలాడదు. వినయశీలులగు పుత్రులు తండ్రి ఆజ్ఞను పాలించువారు. కోడలు అత్త చేతుల్లో నిలుచును. ప్రజలందరూ బ్రాహ్మణుల ఉపదేశములో నిలుచువారు. బ్రాహ్మణులు వేదోక్త ధర్మములను ఆచరించువారు. ఏకాదశినాడు ఏ ఒక్కరూ భుజించరు. నదులు ఎండి పోవుటలేదు. భోగములందు కోరికగల మానవులు భోగములను అనుభవించుచున్ననూ వారి సంపదలు తరుగుట లేదు. నదులలోని నీరువలె సంపదలు పెరుచున్నవి. దూర్వాతృణము జలముచే పెరుగుచున్నది. ధర్మాంగద మహారాజు రాజ్యపాలన చేయుచుండగా సమస్త లోకము ధన్యత నందెను. భోగానుభవముచే సౌఖ్యములను పొందుచున్నారు. హరి దినమును సేవించుటచే గడుపుచున్నారు. రాజ్యములలో ఎవ్వరూ దొంగల భయముచే తలుపులు మూయుట లేదు. స్వేచ్ఛాచారులు లేరు. గోపాలకులకు ఇతర వృత్తులను ఇచ్చుటలేదు. గోవులు పుష్కలముగా బహుఘట పూర్ణములుగా పాలనిచ్చును. దూడలయందు ప్రీతి కలవి. శాంతిని కలిగించునవిగా ఉన్నవి. నాగలిచే దున్నకనే క్షేత్రములన్నియూ సస్యములు పెరిగి పండుచున్నవి. తల్లుల చనుబాలతో శిశువులు పుష్టిని పొందుచున్నారు. భర్తల అనురాగముచే భార్యలు సంతుష్టలు. రాజులచే ప్రజలు, ప్రజలచే రాజులు పుష్టి తుష్టి కలవారుగా నుండిరి. సత్యముచే కూడిన ధర్మము పుష్టినొందెను. శ్రీహరి యందు భక్తికల ధర్మాంగద మహారాజు ధర్మప్రీతి కలవాడై పరిపాలన చేయుచుండగా ప్రజలు సంతోషముతో ఉండిరి. కాలము సుఖదాయకముగా గడుచు చుండెను. లోకమంతయూ రోగ రహితము. సంపద్యుతము. వర్ష సమృద్ధి ఉత్సవ సమృద్ధి కలిగియున్నది. రుక్మాంగద మహారాజు కూడా మోహినీ దేవి చేష్టలచే సౌఖ్యము కలవాడై మోహముతో ఉండెను. రుక్మాంగద మహారాజు మోహినీ మోహములో పరవశుడై పగలును, రాత్రిని, పక్షమును, మాసమును, సంవత్సరమును తెలియజాలకపోయెను. శుభకరముల చేష్టలుకల బ్రహ్మపుత్రికయగు మోహినీ సంగమమున మిక్కిలి మోహముతో నుండెను. రుక్మాంగద మహారాజునకు మోహినీ సంభోగమున శక్తి అధికమాయెను. మోహినిని అనుభవించుచున్నపుడల్లా అతని బలము అధికముకా జొచ్చెను. శుక్ల పక్షమున చంద్రుని వలె రుక్మాంగదునికి మోహినీ సంగమమున శక్తి ప్రతిదినము తరుగుట లేదు. అమృతపానమును చేసిన దేవతలవలె మోహినిని స్పృశించుచు స్పృశించుచు పునర్నవత్వమును పొందుచుండెను. మనోహరముగా పానము సేవించుచు, మధుర పదయుక్తముగా గానమును వినుచు రూపవతుల రూపమును చూచుచు, మోహినీదేవి వక్త్రమును తాకుచు, ఉన్నతములు, సుఖముతో బాగుగా బలిసియున్న, మాంసముతో వృద్ధి చెందిన, బంగారు కలశముల వలెనున్న, హార భూషణములచే కప్పబడియున్న మోహినీదేవి యొక్క ఘనములగు స్తనములను చేతితో మర్దించుచు ఎక్కువగా పెరుగని త్రివళులను మనోహరముగా లోమశరాణి శోభితముగా ఉండుటచే స్తనరూపమును పొందుటచే మోహినీ గాత్రములందు దృష్టిని నిలిపెను. బ్రహ్మ స్వయముగా మోహింప చేయుటకు స్త్రీలు మనసారా అశించు సుందర రూపమును మోహినికి సమకూర్చెను. ఏనుగు తొండము వంటి పిక్కలు రోమ రహితములు, కాంచన సన్నిభములు, పలువరుస చంద్రకాంతి సన్నిభములు, జనమోహకములగు నిగూఢ గుల్ఫములు. సుందర విశాల నేత్రములు మోహినీ దేవి యొక్క రూపమును ఆపాదమస్తకమును చూచుచు దేవతలు అందరిలో తానే అధికునిగా భావించెను. తనను కృతార్థునిగా తలంచెను. ఆహా! ఈ సుందరి విశాలనేత్ర అడిగిన దేదైనను తప్పక ఈయ తగినది. సుందరమగు ఈమె సమాగమము కొరకు నా సంపద నంతటిని ఈయగలను. దుర్లభమైన దానినైనను, ఇతరులకు ఈయరాని దైనను ఈమె కోరినచో ఈయదగినదే. ఈయరాని నా ప్రాణ మును కూడా ఈయగలను. ఒక్క నా కుమారుని తప్ప ఇక దేనినైననూ ఈమె కోరినచో ఈయగలవాడను. (II/19)