పురాణ మహిమ వర్ణనము

సూత మహర్షి పలికెను: ఇట్లు నారద మహర్షి ఆ కుమారుల నుండి చక్కగా అన్ని విషయములు నడిగి తెలుసుకొని వారిని చక్కగా పూజించెను. అంతట ఆ కుమారులు తమ తమ నిత్య కృత్యములను చక్కగా పూర్తి చేసుకొని మహేశ్వరుని లోకమునకు వెళ్ళిరి. అచట అగ్నిసూర్య సన్నిభులగు వామదేవాది మునీంద్రులచే సురాసురేంద్రులచే పూజించబడుచున్న శంకరునికి నమస్కరించి అతని ఆజ్ఞచే భూమిపై కూర్చుండిరి. అచట శివునివలన జీవబంధమోచకము అఖిల శాస్త్రసారమగు శివాగమమును విని జ్ఞాన ఘనస్వరూపులగు ఆ కుమారులు పురారికి నమస్కరించి తండ్రియగు బ్రహ్మ లోకమునకు వెళ్ళిరి. బ్రహ్మపాద పద్మములకు ప్రణమిల్లి బ్రహ్మచే గౌరవించబడి, ఆశీర్వాద మును పొంది, పరమపావనలగు కుమారులు లోకములోని తీర్థములలో సంచరించుచున్నారు. తరువాత వారు బదరీవనాంతమున సురేంద్ర వర్గములచే సేవించబడుతున్న, వీతరాగులగు యతులచే ధ్యానించబడు, అవ్యయమగు విష్ణు పాదపద్మములను ధ్యానించిరి. నారదమహర్షి కూడా కుమారు వలన విజ్ఞాన సహితమగు జ్ఞానమును పొంది మిక్కిలి ప్రీతిచెందెను. అపుడు నారదమహర్షి గంగాతీరమునుండి బ్రహ్మలోకమునకువచ్చి బ్రహ్మకు నమస్కరించి అతనిచే సత్కరించబడి కూర్చొ నెను. కుమారులవలన వినిన విజ్ఞానము తమదు జ్ఞానమునంతను యధాతధముగా వినిపించెను. దానిని వినిన బ్రహ్మకూడా సంతసించెను. అంతట నారదమహర్షి బ్రహ్మకు నమస్కరించి ఆశీర్వాద ములను పొంది మునిసిద్ధ నిషేవితమగు కైలాసమును చేరెను. ఆ కైలాసము నానా ఆశ్చర్యమయము, సర్వ ఋతుపుష్పయుత వృక్షములచే మందారపారిజాత చంపకాశోక వనంబుల వృక్షములచే, ఇతరములగు పలు వృక్షములచే ఆవరించడియున్న నానా పక్షిగణములచే ఆశ్రయించబడిన వాయు వుచే ఊగుచున్న శాఖలచే బాటసారులను పిలుచుచున్నట్లున్న వృక్షములచే, నానా మృగగణాకీర్ణము, సిద్ధకిన్నల సంకురము, స్వచ్ఛ సలిలములుగల స్వర్ణపద్మ ప్రకాశముచే విలసిల్లుచున్న సరస్సులచే శోభించబడుచున్న సారములచే, హంసలచే, చక్రవాకములచే ధ్వనించబడుచున్న, ఆకాశగంగా పాతధ్వనులచే కూడి ఉన్నది. కుచకుంకుమలచే పింగళ వర్ణములుగల అలకనందా జలములలో క్రీడించు అప్సరో స్త్రీలచే కూడియున్న పుష్కరోద్ధృతములగు జలములను పరిమళముచే మదించిన యేనుగులు ఆడయేనుగులపై చల్లి స్నానము చేయించుచున్నా, తెల్లని మేఘము వంటి కైలాస పర్వత శృంగమునందు నీలమేఘ నిభము శతయోజన వ్యాప్తమగు వట వృక్షమును చూచెను. ఆ వటవృక్షము క్రింద యోగి మండల మధ్యమున కూర్చొనియున్న, వ్యాఘ్ర చర్మాంబరధారి, కపర్ది, విరూపాక్షుడు, భూతి భూషిత సర్వాంగుడు, నాగభూషణ భూషితుడు, రుద్రాక్షమాలా శోభితుడు, చంద్రశేఖరుడు అగు శంకరుని చూచిన నారదుడు భక్తితో శిరసును వంచి జగదీశ్వరుని పాదములకు నమస్కరించెను. తరువాత వృషధ్వజుని ప్రసన్న మనసుచే, వాక్కుతో స్తోత్రము చేసి, యోగులచే సత్కరించబడి, శివాజ్ఞచే అసనముపై కూర్చెండెను. అంతట జగద్గురువు నారదుని కుశలము అడిగెను. నారదుడు తమ అనుగ్రహముతో అంతా కుశలమే అని చెప్పెను. అచటి యోగులందరూ వినుచుండగా జీవబంధ మోచకమగు శివాగమమును నారదుడు అడిగెను. అంతట శివుడు నారదుని భక్తిచే సంతోషించి ఆశ్రితవత్సలుడు కావున అష్టాంగ సంయుక్తమగు జ్ఞానమును ఉపదేశించెను. లోకమంగళకరుడగు శంకరుని వలన శివ జ్ఞానమును పొంది ప్రసన్న మనస్కుడై నమస్కరించి శ్రీమన్నారాయణుని సన్నిధికి చేరెను. అచట కూడా నారదుడు గతాగత పరాయణుడు సిద్ధయోగి సేవితుడు అగు నారాయణుని సంతోషపరిచెను. ఓ బ్రాహ్మణోత్తములారా? ఇట్లు మీకు నారదీయ మహాపురాణమును ఉపాఖ్యాన సమన్వితము, వేదసమము, సర్వశాస్త్ర నిదర్శనము, చతుష్పాద సమాయుక్తము, వినువారికి జ్ఞానమును పెంచు దానిని చెప్పితిని. ఈ నారదీయ పురాణమును శివాలయమున కాని, బ్రాహ్మణ సమాజమున కాని, విష్ణ్వాలయమున కాని, మధురయందు, ప్రయాగ యందు, పురుషోత్తమ క్షేత్రమున, సేతుక్షేత్రమున, కాంచియందు, ద్వారకయందు, గంగాద్వారమున, కుశస్థలమున, పుష్కరములందు, నదీతీరమున, ఏదో యొక పవిత్ర ప్రదేశమున భక్తికలవాడై కీర్తించినచో సర్వ యజ్ఞ ఫలమును, సర్వతీర్థ ఫలమును, సర్వదాన ఫలమును, సర్వతపః ఫలమును, పొందును. ఉపవాసముతో, హవిస్సును భుజించి కాని, జితేంద్రియుడై చెప్పువాడు వినువాడు నారాయణ పరాయణుడు కాని, శివభక్తి పరాయణుడుకాని సకలసిద్ధులను పొందును. ఈ నారద పురాణమున సకల పుణ్యములు, సకల సిద్ధులు కలవు. చదువువారికి వినువారికి సకలపాపములను సమసింపచేయును. మానవులకు కలిదోషమును హరించును. సర్వ సంపదలను వృద్ధి పొందించును. సర్వాభీష్ట ప్రదము. సర్వజ్ఞాన ప్రకాశకము. శైవులకు, వైష్ణవులకు, శాక్తులకు, సూర్య సేవకులకు గణపతి భక్తులకు, వర్ణాశ్రమావలంబులకు, అన్ని తపస్సులకు, అన్ని వ్రతములకు, కలుగు అన్ని ఫలములను ప్రకాశింపచేయునది. మంత్రముల, యంత్రముల వేదాంగముల, ఆగమముల, సాంఖ్యముల, వేదముల సంగ్రహమిది. ఈ పురాణమును భక్తితో చదువువారికి, వినువారికి, దేవాదులకుకూడా దుర్లభములగు వాంఛితకామనలు ఫలించును. వేద సమ్మితమగు ఈ నారదీయ పురాణమును విని, చెప్పువానిని ధనరత్నాంశుకాదులచే, భూమి దానములచే, గోదానములచే, రత్నదానములచే, హస్తి అశ్వ, రథ దానములచే పూజించవలెను. గురువును సంతోష పరచవలయును. ధర్మసంగ్రహమగు ఈ పురాణమును వ్యాఖ్యానము చేయువాడు నరులకు చతుర్వర్గ ప్రదాత కావున అతనితో సమానమగు గురువెవరుండును? ఇట్లు ధర్మోపదేశమును చేయు గురువునకు కాయవాఙ్మనస్సులతో ధనాదులతో సర్వకాలములందు ప్రియము ఆచరించ వలెను. పురాణమును యథావిధిగా విని హోమమును ఆచరించి, దేవతాపూజ గావించి మృష్టాన్న పాయసములతో నూరుమంది బ్రాహ్మణులను భుజింపచేసి శక్తికొలది దక్షిణలను ఇచ్చినచోవారి భక్తికి మాధవుడు ప్రీతిచెందును. నదులలో గంగానది, సరస్సులలో పుష్కరము, పురములలో కాశీ, పర్వతములలో మేరువు, దేవతలలో నారాయణుడు, యుగములలో కృతయుగము, వేదములలో సామవేదము, పశువులలో ధేనువు, నరులలో బ్రాహ్మణులు, ఖాద్యములలో అన్నము, పానీయములలో జలము మృగములలో సింహము, పురుషుడు, అశ్వత్థము, ప్రహ్లాదుడు, ముఖము, ఉచ్చైశ్రవము, వసంతము, జపము, శేషుడు, అర్యమ, ధనువు, అగ్ని, విష్ణువు, ఇంద్రుడు, కపిలుడు, ఆకృతి, కవి, అర్జునుడు, హనుమంతుడు, దర్భ, చిత్తము, చిత్రరధుడు, అంబుజము, ఊర్వశి కాంచనము ఎట్లు తమజాతిలో శ్రేష్ఠములో అట్లే పురాణములలో నారదీయము శ్రేష్ఠము. ఓ బ్రాహ్మణోత్తములారా? మీకు శాంతికలుగుగాక. శుభము కలుగుగాక. ఇక నేను గురువుగారగు వ్యాస మహర్షి వద్దకు వెళ్ళెదను అని చెప్పగా శౌనకాది మహర్షులు సూతమహర్షిని చక్కగా పూజించిరి. గురువును దర్శించుటకు అనుమతించిరి. ఇక శౌనకాది ఋషివర్యులు కూడా సావధానముగా వినిన దానిని చక్కగా అనుష్టించి అచటనే ఉండిరి. కలికల్మష విషనాశనము అగు శ్రీహరిని జపపూజన విధి భేషజములతో సేవించువాడు నిష్కల్మష మనసుతో యాగ ఫలమును పొంది అభీప్సిత లోకమును పొందును. (4/125)