నృసింహోపాసనామంత్ర గాయత్ర్యాది నిరూపణము

సనత్కుమార మహర్షి పలికెను: ఓ నారదా! దివ్యములగు నారసింహ మంత్రములను చెప్పెదను వినుము. ఈ మంత్రోపాసన చేతనే బ్రహ్మాది దేవతలు సృష్ట్యాది కర్మలను చేయగలుగుచున్నారు. సంవర్తకుడు చంద్రమౌళి మంత్రము వహ్ని విభూషితము. ఈ మంత్రము ఏకాక్షరము, సేవించువారికి కల్పవృక్షము. ఈ మంత్రమునకు ముని అత్రి మహర్షి జగతీ ఛందస్సు నారసింహస్వామి దేవత అఖిలాభీష్ట ప్రాప్తికి వినియోగము. క్షం బీజము. ఈ శక్తి పడ్దీర్ఘముతో షడంగన్యాసమును చేయవలెను. సూర్య చంద్రాగ్ని నేత్రుడు, శరచ్చంద్ర వర్ణుడు, చేతులలో చక్ర అభయ వరములను ధరించువాడు అయిన నృహరిని స్మరించవలెను. లక్ష జపమును చేయవలెను. దశాంశమును మృత పాయసములచే హోమమును చేయవలెను. వైష్ణవ పీఠమున పూజించవలెను. కేసరములందు అంగపూజను గావించవలెను. దిక్కోణములందు గరుడుని, శంకరుని, ఆదిశేషుని, బ్రహ్మను, శ్రీని, హ్రీని, ధృతిని, పుష్టిని, కోణపత్రములందు పూజించవలెను. దంతచ్ఛదములందు నారసింహులను పూజించవలెను. కృష్ణుడు, రుద్రుడు, మహా ఘోరుడు, భీముడు, భీషణుడు, ఉజ్జ్వలుడు, కరాలుడు, వికరాలుడు, దైత్యాంతకుడు, మధుసూదనుడు, రక్తాక్షుడు, పింగలాక్షుడు, అంజనుడు, దీప్తరుచి, సుఘోరకుడు, సుహనువు, విశ్వకుడు, రాక్షసాంతకుడు, విశాలకుడు, ధూమ్రకేశుడు, హయగ్రీవుడు, ఘనస్వనుడు, మేఘవర్ణుడు, కుంభకర్ణుడు, కృతాంతుడు, తీవ్రతేజుడు, అగ్నివర్ణుడు, మహోగ్రుడు, విశ్వవిభూషణుడు, విఘ్నక్షముడు, మహాసేనుడు అని ముప్పది రెండు నారసింహులు చెప్పబడిరి. వీరికి వెలుపల ఆయుధములచే కూడిన దిక్పాలకులను పూజించవలెను. ఇట్లు మంత్ర సిద్ధిని పొంది అభీష్టములను సాధించవలెను. ప్రద్యుమ్నునిచే కూడిన విష్ణువు శార్ఙిసాగ్ని, వీరుడు, మహాపద్ముడు, ప్రకాశించు విష్ణువును, భృగ్వీశుడు జలము, పద్మాసనము. హరి వాసుదేవుడు, విష్ణుయుతుడగు వైకుంఠుడు, గదాధారి సేందువు, భయంకరుడు భద్రుడగు నృసింహుని, మృత్యుమృత్యువును, శౌరి నారాయణ సహితుడగు భానువు. ఇట్లు ఇరువది రెండు వర్ణములుగల మంత్రము నరసింహ మంత్ర సామ్రాజ్య ప్రదము. ఈ మంత్రము సర్వేష్ట దాయకము. హుం బీజము ఇం అనునది శక్తి, అఖిలాప్తికి విని యోగము. నాలుగు నాలుగు ఎనిమిది ఆరు ఆరు జంట అక్షరములచే షడంగముల నేర్పరిచి శిరస్సున, ఫాలమున, నేత్రములలో, ముఖ బాహ్వంఘ్రి సంధి యుగములలో, కుక్షియందు, హృదయము నందు, గళమున, పార్శ్వద్వయమున, పృష్ఠమున, కకుత్తున మంత్రోద్భవ వర్ణములను ప్రణవాంతి రితములను చేసి న్యాసము చేయవలెను. నృసింహస్వామి సన్నిధిని చేర్చు న్యాసము పది విధములు. కరచరణ అష్టా ద్యంగుళుల అందు విడివిడిగా ఆద్యంత పర్వములలో, సర్వాంగుళులయందు న్యాసము చేసి మిగిలిన దానిని తలములయందు వ్యాసము చేయవలెను. శిరమున, లోటమున, భ్రూ మధ్యమున, నేత్రములలో, కర్ణములలో, కపోలములందు, కర్ణమూలములందు, చిబుకమున, ఊర్థ్వాధరోష్ఠములందు, కంఠమున, ఘోణమున, భుజములయందు, హృదయమున నాభిమండలమున, పాదములయందు, పాదతలములందు, కటియందు మేఢ్రమున, ఊరువు లందు, జాను జంఘలయందు, గుల్పమున, పాదకరాంగుళులందు, సర్వసంధులందు, రోమములందు, రక్తాస్థిమజ్జలందు, తనువునందు వివేకముకలవాడై వ్యాసము చేయవలెను. వరణములను పదమునందు, గుల్ఫజానుకటి నాభిహృదయ స్థలములందు, బాహువులందు, కంఠమునందు, చిబుకమునందు, ఓష్ఠమునందు, గండస్థలములందు న్యాసము చేయవలెను. కర్ణములందు, వదనములందు, నాసాపుటమున, నేత్రమున మూర్థములో వ్యాసము చేయవలెను. పదములను ముఖమున, మూర్థములో, నాసికయందు నేత్రమునందు, కర్ణములందు, ఆస్యమునందు, హృదయమునందు, నాభియందు, పాదములను సర్వాంగములందు న్యాసము చేయవలెను. అర్థ ద్వయము మూర్థయందు, పాదము నుండి హృదయము వరకు తదంగములను, ఉగ్రాది పదములను న్యాసముచేసి మృత్యుమృత్యుంనమామ్యహం అనునది అంతమునందుకల వాటిని ఆస్యఘ్రాణ చక్షుః శ్రోత్ర పక్ష్మలయందు, హృదయమున, నాభియందు, కట్యాది పాదాంత మున నవాంగ న్యాసము చేయవలెను. వారాది నారసింహులను కూడా మొదట చెప్పినట్లు న్యాసము చేయవలెను. నృసింహాదులనుకూడా పూర్వోక్త విధముగా న్యాసము చేయవలయును. చంద్రాగ్ని వేద షడ్రామ నేత్ర దిగ్బాహు భూమితములుగా వర్ణములను విభజించి పత్రవర్ణములను క్రమముగా ఆయా స్థానములలో ఉంచవలెను. మూలమున మూలమునుండి నాభ్యంతము, నాభినుండి హృదయము వరకు, హృదయము నుండి భ్రూయుగ్మము వరకు, నేత్రత్రయమున, మస్తకమున, బాహువులందు, అంగుళు లందు, ప్రాణమున మూర్ధాది పాద పర్యంతమున నామములను అనుసరించి వ్యాసము చేయవలెను. దీనిని హరిన్యాస మందురు. హరిన్యాస ప్రభావము ఒక్క శ్రీహరికి మాత్రమే తెలియును. ఇట్లు వ్యాసవిధిని అనుష్ఠించి హృదయమున నృహరిని ధ్యానమును చేయవలెను.

కంఠమున తగిలి ఉన్న శోభించు బాహువులను తాకు కేశములు గలవాడు, పద్మమును చక్రమును ధరించువాడు, నఖాగ్రములచే రాక్షసాధిపతిని భేదించినవాడు, జ్వాలామాలా సమన్వితుడు. దీప్త జిహ్వుడు, త్రినేత్రుడు, దంష్ట్రాలచే భయంకరమగు వదనము కలవాడు అగు నృసింహుడు స్థలాంబు గగనాదులలో ఉండువాడు మమ్ములను ఎప్పుడూ కాపాడు గావుత. ఇట్లు ధ్యానము గావించి మహానుభావుడైన నృసింహస్వామి ముద్రను చూపవలయును. చిబుకమును ఓష్ఠములను సమానముగా జాను మధ్యమున నుంచి, చేతులను భూమికి తగిలించి, మాటిమాటికి కంపించుచు, ముఖమును అవలించినట్లుగా తెరిచి నాలుకను బయటకు చాచవలెను. దీనిని నారసింహముద్ర అందురు. ఇది చాలా ప్రధానము. వామాంగుష్ఠమున కనిష్ఠాంగుళీ త్రయమును బంధించి త్రిశూలము వలె ఊర్థ్వముఖముగాచేసి నృసింహ ముద్రను చేయవలయును. అంగుష్ఠములచే రెండు చేతుల కష్ఠములను ఆక్రమించి, మిగిలిన వేళ్ళను అధోముఖములుగా చేయవలెను. రెండు చేతులను అధో ముఖములుగా చేసి నాభిదేశమున చాచి, తర్జనలచే భుజములను తాకవలెను. దీనిని అంత్రణ ముద్రిక అందురు. హస్తములను ఊర్థ్వ ముఖములుగా చేసి మధ్యమున తలములను యోజించి వామ అనామికయందు దక్షిణా నామికను ఉంచవలెను. తర్జనులను వెనుక కలిపి అంగుష్ఠములను తర్జనియందు తాకించినచో చక్రముద్ర అగును. ఈ చక్రముద్రను నృసింహస్వామి సమీపమున చూపవలెను. ఇట్లు చక్రముద్ర నాచరించి తర్జనులచే మధ్యమములను పీడించవలెను. ఇది దంష్ట్రముద్ర అనబడును. ఇది సర్వపాపములను నశింపచేయును. ఈ ముద్రలు నృసింహ మంత్రములు అన్నింటిలో సమ్మతములు. మంత్రమును అక్షర లక్ష జపించవలెను. దశాంశమును నేతితో కలిసిన పాయసములచే అగ్నిలో హోమమును చేయవలెను. పూర్వోక్త పీఠమున అర్చన గావించవలెను. మొదట అంగములను ఆరాధించి దిక్పత్రములందు గరుడాదులను శ్రీ ప్రభృతులను పూజించి, వెలుపల విదిక్కులందు లోకపాలులను పూజించవలెను. ఇట్లు సాధించబడిన మంత్రము సర్వకామములను పూర్తిచేయును. సౌమ్య కార్యమున సౌమ్ముని స్మరించవలెను. క్రూరకార్యమున క్రూరుని సమర్పించవలెను. మృత్యు మృత్యుం అను మంత్రమున మొదటి మృత్యుపదమునకు మొదట శత్రునామమును ఉచ్చరించి శ్రీనృహరి నిశిత దంష్ట్రాగ్రములచే నములుచున్నట్లు స్మరించవలెను. ప్రతిదినము అష్టోత్తర శతమును జపించవలెను. ఇట్లు జపించినచో నలుబది రోజులలో శత్రువు యమాతిధి కాగలడు. ఇక ఇప్పుడు ధ్యాన భేదములను సర్వసిద్ధి ప్రదాయకములను చెప్పెదను వినుము.

సంపదను కోరువాడు పూర్వము చెప్పబడిన శుక్లవర్ణుడగు నృసింహస్వామిని ధ్యానము చేయవలెను. ఆ నృసింహస్వామి వామాంకమున పద్మ హస్తయగు లక్ష్మిచే ఆలింగనము చేయబడి ఉన్నవాడుగా ధ్యానము చేయబడవలెను. విషమృత్యుప రోగాది ఉపద్రవాది శాంతికొఱకు కాలానల సమప్రభుడు, మహాభయంకరుడు, పేగులను మాలగా ధరించినవాడు, రౌద్రుడు, కంఠహారములచే భూషితుడు, నాగయజ్ఞోపవీతుడు, పంచ ముఖములచే శోభితుడు, చంద్రమౌళి, నీలకంఠుడు, ప్రతివక్త్రుడు, త్రినేత్రములు గలవాడు పరిఘలవంటి పది భుజములచే సుశోభితుడు, జపమాలను, గదను, పద్మమును, ఆవుపాలవంటి శంఖమును, ధనువును, ముసలమును, చక్రమును ధరించిన వాడు, ఖడ్గమును, శూలమును, బాణమును ధరించి రుద్రరూపుడుగా ఉండువాడు. ఇంద్రనీలమణి కాంతిగలవాడు, చంద్రసన్నిభుడు, స్వర్ణకాంతి గలవాడు పూర్వాది ఉత్తర పర్యంతము ఊర్ధ్వాస్యము గలవాడు, సర్వవర్ణుడు అగు నృసింహస్వామిని ఇట్లు ధ్యానమును చేసినచో సర్వవ్యాధి నివారణకాగల సర్వమృత్యుహరుడు దివ్యుడు, స్మరణ మాత్రమున సర్వసిద్ధి ప్రదుడగు అగు నృహరిని ధ్యానము చేయవలయును. మహాకార్యమును సంకల్పించినపుడు పదునారు హస్తములు కలవాడు సర్వలోకేశ్వరుడు, సర్వాభరణ భూషితుడగు నృసింహుని ధ్యానించవలెను. రెండు హస్తములు విదారణ కర్మచేయునవి, రెండు హస్తములు పేగులను వెలికితీయునవి, రెండు హస్తములు శంఖ చక్రములను ధరించునవి, రెండు హస్తములు ధనుర్బాణములను ధరించునవి, రెండు హస్తములు ఖడ్గఖేటములను ధరించునవి. గదాపద్మములను ధరించు హస్తద్వయము. పాశాయశ ధరములగు హస్త ద్వయము, రెండు హస్తములు శత్రు ముకుటార్పితములు. ఇట్లు పదునారు బాహువులు గల ప్రభువగు నృసింహస్వామిని నీలవర్ణుని ఉగ్రకర్మలయందు అనన్య చిత్తముతో ధ్యానించవలెను. ఇంకను మహత్తమ కార్యమునందు ముప్పది రెండు బాహువులు గల నృహరిని ధ్యానించవలెను. సర్వ భూతాధిపతి, సర్వసిద్ధికరుడు, పరుడు నృసింహ స్వామియే. దక్షిణ బాహువులలో చక్రపద్మములను, పరుశువును, పాశమును, హలమును, ముసలమును, అభయమును, అంకుశమును, పట్టిశమును, బిందిపాలమును, ఖడ్గముద్గర తోమరములను ధరించువాడు, వామ భాగమున నుండు హస్తములలో శంఖమును, ఖేటమును, పాశమును, శూలమును, అగ్నిని, వరద ముద్రను, శక్తిని, కుండికను, కార్ముకమును, తర్జనీముద్రను, గదను, డమరు శూర్పకములను, రెండుచేతులచే శత్రువుల జాను మస్తక పీడనమును చేయువాడు, పైన నున్న బాహువులచే అంత్రమాలను ధరించువాడు, క్రిందనున్న బాహువులచే హిరణ్యకశ్యపుని చీల్చువాడు, భక్తులకు ప్రియమును, దైత్యులకు భయమును కలిగించువాడు అయిన మహామృత్యుభయమును తొలగించు నృసింహస్వామిని ఇట్లు స్మరించవలెను. ఇట్లు ధ్యానముచేసి సర్వకార్యార్ధ సిద్ధికి జపమును చేయవలెను. ఇక ఇపుడు శుభకరము, ముఖరోగహరమగు మరియొక ధ్యానమును చెప్పెదను. స్వర్ణవర్ణముగల గరుడునిపై నున్నవాడు, మెరుపు తీగలవంటి జటలు గలవాడు, కోటి పూర్ణేందువర్ణుడు, సుముఖుడు, మూడు నేత్రములతో చూచువాడు, పీతాంబరధారి, మహాభూషణ భూషితుడు, శాంతవిగ్రహుడు, శంఖ చక్రాభయ వరములను ధరించువాడు, కుష్ఠు వ్యాధి మొదలగు వ్యాధులను శమింపచేయువాడు, దేవతలచే వందనములను పొందువాడు, అయిన నృసింహుని ధ్యానము చేయవలెను. శత్రుసేనా నిరోధమును చేయగోరువాడు ప్రయత్నముచే అక్షకాష్ఠములతో జ్వలింపచేసిన అగ్నిలో శత్రుమర్దనుని ధ్యానించుచు, నృసింహదేవుని పుష్పాద్యుపచారములచే పూజించి మూలములతో కూడి మూలశరములతో ఒక వేయి హోమమును చేయవలెను. శత్రువును భక్షించుచున్న స్వామిని జపించవలెను. శత్రువును దహింపచేయుచున్నట్లుగా క్షేపము చేయవలయును. ఇట్లు ఏడు దినములు హోమమును చేసి రాజునకు ఇష్టమగు సైన్యమును యుద్ధమునకు పంపించవలెను. పుర రాష్ట్రములను జయించు ఇచ్ఛగలవారు శుభ లగ్నమున పంపవలెను. ఆ సైన్యముముందు భాగమున శత్రు సమూహమును వధించుచున్న నృసింహదేవుని స్మరించుచు సైన్యము శత్రువును జయించి విజయలక్ష్మితో అనందముగా తిరిగివచ్చువరకు జపము చేయవలెను. తరువాత జయమును చేకొన్న రాజు జపము చేసిన మంత్రజ్ఞుని సంతోషముచే వైభవములతో ప్రీతిని పొందించవలెయును. గజాశ్వ రధ రత్నములచే గ్రామ క్షేత్ర ధనాదులచే సంతోషపరచవలెయును. జపము చేసినవాడు సంతోషించనిచో రాజునకు గొప్ప అనర్ధము సంభవించును. రాజభస్మమును లేపనము చేసికొనినచో మూషిక వృశ్చికాదులవలన భయము తొలగును. సర్వరోగముల నుండి విముక్తిని పొందును. చేమంతీ పుష్పములచే హోమమును గావించినచో మహా సంపదలను పొందును. మేడి సమిధలచే హోమమును గావించినచో ధాన్య సమృద్ధి కలుగును. లక్ష అపూపములచే హోమమును గావించినచో కుబేరునితో సమానుడగును. కోపించిన రాజు సమీపమున అష్టోత్తర శతజపమును చేయవలెను. వెంటనే నిర్మలత్వమును పొంది అనుగ్రహమును సంపాదించగలుగును. మల్లెపూవులతో హోమమును గావించిన అభివృద్ధి. అరటి పూవులచే చేసిన విఘ్ననాశము సంభవించును. తులసీపత్రములచే హోమమును గావించిన గొప్ప కీర్తిని పొందును. వరి పొలములతో హోమము గావించినచో సకల జగము వశమగును. ఇప్ప పూవులతో హోమము గావించినచో సకల జగత్త్సంభనమును గావించగలుగును. దధిమధు ఆజ్యమిశ్రమగు చతురంగుళ పరిమాణముగల గుడూచిచే పదివేల హోమమును గావించినచో అన్ని రోగములను జయించి నూరు సంవత్సరములు జీవించును. శనివారమున రాగి చెట్టును తాకి అష్టోత్తర శతమును జపించినచో అపమృత్యువును జయించి నూరు సంవత్సరములు జీవించును.

ఇక ఇపుడు నీకు త్రైలోక్య మోహన యంత్రమును చెప్పెదను. ఈ యంత్రమును ధరించినంత మాత్రముననే అన్ని సంపదలు కలుగును. తెల్లని భూర్జపత్రమున ముప్పది రెండు సింహములు గల పద్మములను లిఖించవలెను. మధ్య సింహమున స్వబీజమును పూర్వమువలె లిఖించవలెను. శ్రీ బీజముతో చుట్టి వలయ త్రయమును గూర్చి పాశాంకుశములతో సంవేష్టనముగావించి ఉత్తమ యంత్రమును పూజించవలెను. త్రైలోక్య మోహనమను యంత్రము సర్వకామార్థ సాధకము. సర్వ చక్రేశ్వరేశ్వరుడు, మహారాజు అగు చక్ర రాజమును ధరించుట వలన సర్వ ప్రదేశములందు జయమునుపొందును. ఇది ముమ్మాటికి నిశ్చయము. సంశయము లేదు. ఇక ఇపుడు మరొక యంత్రమును చెప్పెదను. ఇది సర్వసిద్ధి ప్రదము. మృదువుగా సుందరముగా కర్ణికా యుతముగా అష్టదళ యంత్రమును లిఖించవలయును. ప్రణవముతో కూడిన మూల మంత్రమున ఆ యంత్రమున లిఖించవలయును. మధ్య భాగమున నరసింహ ఏకాక్షరిని లిఖించవలెను. ఆ యంత్రము వెలుపల దారముతో చుట్టి ఎనిమిది వేల జపమును చేయవలెను. తరువాత బంగారము వెండి రాగులతో చక్కగా చుట్టవలయును. దానిపై లక్కపూత పూసి మరల మంత్రముచే మంత్రించవలెను. కంఠమున కాని, భుజమున కాని శిఖయందు కాని ధరించవలెను. ఇట్లు చేసినచో నర నారీజనము నరేంద్రులు అందరూ వశులగుదురు. దుష్టులగు పిశాచోరగ రాక్షసులు యంత్రధారకుని బాధించజాలరు. యంత్రరాజానుగ్రహమున అంతటా జయమునుపొందును. ఇక ఇపుడు సర్వ వశంకరమైన మరియొక యంత్రమును గూర్చి చెప్పెదను. ద్వాదశార మహాచక్రమును పూర్వమువలె లిఖించవలయును. ద్వాదశమాత్ర సంపన్నదళముచే లిఖించవలెను. మధ్య భాగములో శక్తి యుక్తమగు మంత్రమును శ్రీ బీజముతో వేష్టనము చేయవలెను. సురాసుర వశంకరమగు కాలాంతకము చక్రమును సర్వ శత్రు నివారకమును భూర్జ పత్రమున లిఖించవలెను. ఈ యంత్రమును ధరించినంత మాత్రమున అంతటా విజయమును పొందును. ఇక ఇపుడు సర్వేష్ట ప్రదమగు జ్వాలామాలి యంత్రమును గూర్చి చెప్పెదను. చతుర్ధానమగు భగవచ్ఛబ్దము బీజము హృదయము. తరువాత నరసింహాయ అని. జ్వాలినే మాలినే దీప్త దంష్ట్రాయ అగ్నినేత్రాయ సర్వాది రక్షోఘ్నాయ సర్వ భూహారి వినాశనాయ, సర్వజ్వర వినాశనాయ దహదహ, పచపచ, రక్ష రక్ష అని కూర్చ వర్మ అస్తఠద్వయాంతముగా ధ్రువాదికమును చెప్పవలెను. ఈ జ్వాలామాలి మంత్రము అరువది యెనిమిది అక్షరములు కలది. పదమూడక్షరములచే పూర్వోక్తముగా పుణ్యాదికము నాచరించవలెను. పదకొండు పంక్తులచే పద్దెనిమిది అక్షరములచే, పన్నెండు కరణములచే అంగములను కల్పించవలెను. పూర్వమున చెప్పిన రూపముగల జ్వాలామాలి నారసింహుని స్మరించవలెను. మంత్రమును లక్ష జపించి దశాంశము కపిల గోఘృతముచే హోమమును కావించవలెను. ఈ మంత్రము రౌద్రాపస్మార భూతాదినాశకము. మాయ ప్రాణము నరసింహదేవుడు సృష్టి బ్రహ్మాస్త్రముగా చెప్పబడినది. ఈ మంత్రము షడక్షరము సర్వాభీష్ట ప్రదాయకము. ఈ మంత్రమునకు బ్రహ్మముని, పంక్తి ఛందస్సు. నరసింహస్వామి దేవత. షడ్దీర్ఘయుతమగు బీజముచే షడంగములను ఆచరించవలెను. పూర్వోక్త విధానమున ధ్యానమును పూజను గావించవలెను. ఈ మంత్రము సిద్ధించినచో నరులకు సర్వసిద్ధులు కలుగును. రమాబీజాది బీజములు కలది, అనుష్టు ప్ఛన్దస్సు, ముప్పది మూడు వర్ణములు కలది. ఈ మంత్రముముని ప్రజాపతి. అనుష్టుప్ఛందస్సు. లక్ష్మీనరసింహస్వామి దేవత. అన్ని పదములచే కల్పన కావించవలెను. ఇట్లు పంచాంగన్యాసమును కావించి ఆత్మ రక్షణను ఆచరించవలెను. దక్షిణ బాహువును స్పృశించుచు శరభ మంత్రమును జపించవలెను. ప్రణవము హృదయము “శివాయ మహతే శరభాయ’ అనునది వహ్ని ప్రియాంతమగు మంత్రము రక్షకొఱకు చెప్పబడినది. లేదా రామ మంత్రాంతమున రెండక్షకారములను పఠించవలెను. లేదా కేశవాదినామములచే ప్రయత్నించి రక్షను చేయవలెను. కేశవుడు పాదములను, నారాయణుడు జంఘలము కాపాడుగావుత, మాధవుడు కటిని, గోవిందుడు గుహ్యమును, విష్ణువు నాభిని, మధుసూదనుడు జఠరమును త్రివిక్రముడు ఊరువులను, నరుడు హృదయమును, శ్రీధరుడు కంఠమును, హృషీకేశుడు ముఖమును కాపాడుగావుత. పద్మనాభుడు స్తనములను, దామోదరుడు శిరస్సును కాపాడుగావుత. ఇట్లు సాధకుడు జపకాలమున అంగాన్యాసమును గావించినచో భూతభేతాళగ్రహ రాక్షసులనుండి భయము లేనివాడగును. మరల సావధానమనస్కుడై ధ్యానము చేయుచు న్యాసమును గావించవలెను. బంగారు కాంతిగల, చక్రాయుధడగు కేశవుడు ముందు భాగమున కాపాడుగావుత. వెనుకభాగమున నీలమేఘశ్యాముడుగు, శంఖధారి అగు నారాయణుడు, ఊర్ధ్వభాగమున ఇందీవరశ్యాముడు గదాధారి అగు మాధవుడు, దక్షిణ పార్శ్వమున చంద్రప్రభుడు ధనుర్ధారియగు గోవిందుడు, ఉత్తర పార్శ్వమున పద్మ కింజల్క సన్నిభుడు హలధారియగు విష్ణువు, ఆగ్నేయ భాగమున అరవిందాక్షుడు ముసలధారి అగు మధుసూదనుడు, నైఋత దిగ్బాగమున జ్వలనప్రభుడు ఖడ్గపాణియగు త్రివిక్రముడు, వాయవ్య భాగమున తరుణా దిత్య సన్నిభుడు వజ్రధారియగు మాధవుడు, ఈశాన్య దిగ్భాగమున పుండరీకాక్షుడు, పట్టిశ ఆయుధుడగు శ్రీధరుడు, ఊర్ధ్వభాగమున ముద్గర ధారయగు హృషీకేశుడు, అధోభాగమున సూర్య సమప్రభుడగు పద్మనాభుడు, సర్వాయుధుడు, సర్వశక్తి, సర్వాంగుడు, సర్వతోముఖుడు ఇంద్రనీల మణిప్రభుడు, అపరాజితుడు పాశహస్తుడు అగు దామోదరుడైన శ్రీహరి బాహ్యాభ్యంతరములందు కాపాడుగావుత. ఇట్లు అంతటా ఛిద్రరహితమగు ద్వాదశనామ పంజరమున నేను ప్రవేశించితిని. నాకు ఎప్పుడూ ఏ భయమూ లేదు. ఇట్లు అంతటా రక్షను ఏర్పరచుకొనినవాడు ఇతరులకు దుర్థర్షుడగును. అన్ని నారసింహ మంత్రములలో ఈ విధియే ఆచరించవలెను. తరువాత పూర్వోక్త విధిననుసరించి ధ్యాన పూజాదికము ఆచరించవలెను. ఓ పుండరీకాక్షా! నీవు అంతటా జయించువాడవు. ఓ విశ్వభావనా! నీకు నమస్కారము. ఓ హృషీకేశా మహాపురుషా! నీకు నమస్కారము. ఇట్లు ప్రార్ధన చేసి, జపించి పఠించి విసర్జనగావించవలెను. ఇట్లు మంత్రసిద్ధిని పొందినవాడు సర్వ సంపదలకు నిలయుడు అగును.

“జయ జయ శ్రీనృసింహ” అనునది అష్టాక్షర మంత్రరాజము. ఈ మంత్రమునకు మునిబ్రహ్మ, గాయత్రీ ఛందస్సు. జయ నృసింహస్వామి దేవత. సర్వాభీష్ట ప్రదాయకుడు. సేందువగు గోవింద పూర్వముతో సేంద్వాకాశముతో షడ్డీర్ఘాధ్యముతో షడంగన్యాసమును చేయవలయును. తరువాత హృదయమున చంద్రశేఖరుడగు నృసింహస్వామిని ధ్యానము చేయవలెను. శ్రీమంతుడగు నృసింహ శరీరా! జగదేక బంధూ! శ్రీ నీలకంఠ! కరుణార్ణవ! సామరాజ! సూర్యచంద్రాగ్నినేత్ర పినాకపాణీ! శ్రీ చంద్రశేఖర! రమాపతీ! విష్ణో! కాపాడుము. ఇట్లు ధ్యానముచేసి ఎనిమిది లక్షల జపమును చేయవలెను. దశాంశము నేయి కలిసిన పాయసాన్నముచే హోమము గావించవలెను. మొదటివలె అర్చన చేయవలయును. మాయాతారము స్వబీజాంతమున కర్ణోగ్రవీర శబ్దమును పలుకవలెను. “మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర ఘోర ఘోరతర తనురూప ప్రచట ప్రచట కహ కహ బంధ బంధ ఘాతయ ఘాతయ” అని కవచాస్త్రములను ఉచ్చరించవలెను. భయంకరుడు భద్రస్వరూపుడు మృత్యు మృత్యువు అగు నృసింహునికి నమస్కరించవలెను. ఈ మంత్రము ఎనుబది అయిదు అక్షరములు కలది. సేవించువారికి ఇష్టమును కలిగించును. అఘోర బ్రహ్మలు ఋషులు త్రిష్టుప్ అనుష్టుప్ ఛందస్సులు. ఘోరనృసింహుడు దేవత. అనుష్టుభ విధానముగా ధ్యానార్చనాదికమును ఆచరించవలెను. విశేషించి ఈ మంత్రరాజము సర్వ రక్షాకరముగా ప్రసిద్ధిపొందినది. “జయ జయ నరసింహ” అను అష్టాక్షరీ మంత్రము బీజము. ఈ మంత్రమునకు ప్రజాపతి ఋషి, అనుష్టుప్ఛన్దస్సు, విచారణ నరసింహస్వామి దేవత ‘జం’ బీజము హం శక్రి అఖిలాప్తికి వినియోగము. దీర్ఘాఢ్యమగు నృసింహ మంత్రముతో షడంగన్యాసమును కావించవలెను. శత్రువక్షో విదారణుడగు నృసింహస్వామిని రౌద్రరూపుని ధ్యానము చేయవలెను. నఖదంష్ట్రాయుధుడు, భక్తాభయప్రదుడు, శ్రీనికేతనుడు, తప్తహాటక కేశాంత జ్వలత్పావకలోచనుడు, వజ్రాధిక నఖస్పర్ముడగు ఓ దివ్యసింహా! నీకు నమస్కారము బ్రహ్మముని, అనుష్టుప్ ఛందస్సు ముప్పది రెండక్షరములు గల ఈ మంత్రమునకు దివ్యనారసింహుడు దేవత. నాలుగు పాదములతో పంచాంగ న్యాసమును చేయవలెను. ధ్యాన పూజాదికమును అంతటిని పూర్వమువలె ఆచరించవలెను. పూర్వోక్త కార్యములు అన్నియు సిద్ధించును.

“ఓమ్ నమో భగవతే నరసింహాయ తేజస్తేజే ఆవిరావిర్భవ వజ్రనఖ వజ్రదంష్ట్ర కర్మ త్రాసయ త్రాసయ, ఆక్రందయ అక్రందయ, తమోగ్ర సగ్రస స్వాహా అభయ మాత్మని భూయిష్టా ధ్రువమ్” అనునది మంత్రము. ఈ మంత్రము అరువది రెండు అక్షరములు గలది. మున్యాదికము సర్వము పూర్వమువలెనే చెప్పుకొనవలెను. “ఓమ్ నమో భగవతే నరసింహాయ” అనునది ఈ మంత్రమునకు బీజము. రూపాయ అనునది తారము ‘స్వః’ అనునది బీజము. “ఓమ్ నమో భగవతే కూర్మరూపాయ, వరాహరూపాయ నరసింహరూపాయ, వామనరూపాయ, రామాయ కృష్ణాయ కల్కినే జయజయ శాలగ్రామ నివాసినే దివ్య సింహాయ స్వయంభువే పురుషాయ స్వాహా” అను మంత్రము మహా సామ్రాజ్య ప్రదము. ఈ నృసింహమంత్రము నూరక్షరములు కలది. అత్రి మహర్షి అతిజగతీ ఛంధము దశావతారుడగు నృహరిదేవతా. ‘ఖం’ బీజము అవ్యయ శక్తి షడ్డీర్ఘాఢ్య బీజముతో అంగ న్యాసముచేసి భావన చేయవలెను. అనేక చంద్ర ప్రతిముడు, లక్ష్మీ ముఖము నందు చూపు నిలిపినవాడు దశావతారములు కలవాడు అయిన నరసింహస్వామి ఆనందమును విస్తరించుగావుత. పదివేల జపముచేసి దశాంశము పాయసముతో హోమమును గావించవలెను. పూర్వోక్త పీఠమున మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి పూజించవలెను. మొదటి అంగములను తరువాత దిగంతములందు మత్స్యాదులను పూజించవలెను. ఇంద్రాదులను, వజ్రాదులను పూజించి ఇష్టమును పొందవలెను. ఇక ఇపుడు తంత్రములందు రహస్యముగా దాచబడియున్న సహస్రాక్షర మహా మంత్రమును చెప్పెదను వినుము. ఈ మంత్రము మాయావతారము. రమాకామ బీజము. “క్రోధమూర్తే! నృసింహా! మహాపురుష! ప్రధాన ధర్మాధర్మ నిగడ నిర్మోచన! కాలపురుష! కాలాంతకదృక్ స్వేశ్వరాదృక్ జలశ్రాంతనివిష్ట! చైతన్య చిత్సదాభాసక! కాలాద్యతీత! నిత్యోదిత! ఉదయాస్త మయాక్రాంత మహాకారుణిక! హృదయాబ్జ చతుదిల నివిష్టిత! చైతన్యాత్మన్! చతురాత్మన్! ద్వాదశాత్మన్! చతుర్వింశాత్మన్! పంచవింశాత్మన్! ఓం! హరిసహస్రమూర్తే! ఏహ్యేహి! భగవన్నృసింహ పురుష! క్రోధేశ్వర రస! సహస్రవందితపాద! కల్పాంతాగ్ని సహస్ర కోటాభ్య! మహా దేవనికాయ! దశశత యజ్ఞతల! అమల అమల పింగళేక్షణ! సహస్ర దంష్ట్ర! దంష్ట్రాయుధః నఖాయుధ! దాన వేంద్రాంతక! వహ్ని వర్ణ శోణిత! సంసక్తి విగ్రహ! భూతాపస్మార యాతుధాన సురాసుర వంద్య మాన పాదపంకజ! భగవాన్! వ్యోమచక్రచర! ప్రభవాప్యయ రూపేణో త్తిష్టోత్తిష్ఠ అవిద్యానిచయం దహ దహ! జ్ఞానైశ్వర్యం ప్రకాశయ! ప్రకాశయ! ఓం సర్వజ్ఞ! అరోష జంభా జృంభవ తారక! సత్యపురుష !సదసన్మధ్యనివిష్ట! మమ దుస్స్వప్న భయం నిగడ భయం కాంతార భయం విషజ్వర ఢాకినీ కృత్యాధ్వరేవతీ భయం, అశని భయం, దుర్భిక్ష భయం, మారీచ భయం, మారీచ భయం, ఛాయాస్కందాపస్మార భయం, చౌర భయం, జలస్వప్నాగ్ని భయం, గజసింహ భుజంగ భయం, జన్మ జరామరణ భయం నిర్మోచయ నిర్మోచయ, ప్రశమయ ప్రశమయ, జ్ఞేయ రూపధారణ నృసింహా బృహత్సామ పురుష సర్వభయ నివారణ అష్టాష్టక చతుష్షష్టి చేటికాభయం, విద్యా వృతస్త్రయస్త్రం శద్దేవతా కోటి నమిత పదపంకజ సహస్రవదన సహస్రోదర సహస్రేక్షణ సహస్రపద సహస్రభుజ సహస్రజిహ్వ సహస్రలలాట సహస్రాయుధధర నమః ప్రకాశక పురమథన సర్వమంత్ర రాజేశ్వర విహాయసగతిప్రద పాతాలగతిప్రద యంత్రమర్ధన ఘోరాట్ట హాసహసిత విశ్వావాస వాసుదేవ అక్రూర హయముఖ పరమహంస విశ్వేశ విశ్వవిడంబన నివిష్ట ప్రాదుర్భావకారక హృషీకేశ స్వచ్ఛంద నిశ్శేషజీవగ్రాసక మహాపిశితా సృక్ లింపట ఖేచర సిద్ధి ప్రదాయక అజేయ అవ్యయ అవ్యక్త బ్రహ్మాండోదర బ్రహ్మసహస్ర కోటి స్రగ్రుండ మూలపండితముండ మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన త్రైలోక్యాక్రమణ పాదశాలిక రామత్రయ విష్ణురూప ధర తత్త్వతయ ప్రణవాధార తచ్చిఖానివిష్ట స్వాహాస్వధావషట్” ఇది నృసింహ సహస్రాక్షరి తరువాత నేత్రవర్శాస్త్రములను ఉచ్చరించవలయును. “ప్రాణాధార అదిదేవ ప్రాణాపాన నివిష్టిత పాంచ రాత్రిక దితిజవినిధనకర మహామాయా అమోఘ దర్యదైత్యేంద్ర దర్పదళన తేజోరాశికి తేజస్వర పురురూపాయ సత్యపూరుష” అని పలుకవలయును. అస్త్రతారము అచ్యుతాస్త్రము తారము వాక్కుచే ‘సుదేవ ఫట్’ అనునది.

తారామాయామూర్తికి “ఫట్ వః కామః” అనునది స్వరాదిమము. మూర్తి అస్త్రము బీజము అవ్యయ అనునది విశ్వమూర్తే అస్త్రమవ్యయము. “మాయీ విశ్వాత్మనే” అని షట్ తారము శౌచము తురాత్మను. “ఫట్ తారోఽహం. విశ్వరూపిన్ అనునది అస్త్రము తరువాత హ్రై అనునది తారము పరమాంతమున హ్రంస ఫట్ ప్రణవము పలికిన తరువాత “హ్రః హిరణ్య గర్భరూపధారణ అనుదాని తరువాత ఫట్ అనునది ధ్రువము. “హ్రౌం అనౌపమ్య రూపధారిణే” అనునది అస్త్రము తరువాత ధ్రువము “క్షౌం నృసింహ రూపధారిన్ ఓం క్లం శ్లః” అనునది తరువాత ధ్రువము “క్షౌం” నృసింహ రూపధారిన్ ఓం క్లం శ్లః” అనునది సంకరము ఖండద్వయము ఖాదయద్వయము క్లీం సాధ్యము. అనయ ఆనయ మహాత్మన్ సమ్యగ్దర్శయ దర్శయ” అని షడ్దీర్ఘాఢ్యమగు స్వబీజము క్షపితాంతము కల్మష ఉత్తరాయ ద్వయము పంచబాణ బీజములను ఉచ్చరించవలెను. నృసింహ జ్వాలాత్మనే స్వాహా అని పలుకవలెను. నృసింహకాలాత్మనే స్వాహా” అని ధ్రువము. ఆకాశబీజము, కామబీజము, లక్ష్మీ బీజద్వయము మాయాతారాంతిమమగు ఈ మంత్రము సహస్రాక్షర సమ్మితము. ఈ మంత్రమునకు ముని కపిలమహర్షి జగతీ ఛందస్సు, శ్రీలక్ష్మీ నృసింహస్వామి దేవత క్షౌం బీజము. శక్తి స్వాహా శ్వేత వర్ణము ఉదాత్త స్వరము పరమాత్మ క్షేత్రము అఖిలాప్తి కొఱకు వినియోగము. “క్షః సహస్ర బాహవే సహస్రాయుధ ధరాయ నృసింహాయ స్వాహా అస్త్రాయఫట్” అనునది మంత్రము. ఈ మంత్రముచే కరశుద్ధిని చేసుకొని అంగన్యాసము చేయవలయును. క్షాం అనునది తారము. సహస్రాంతమున క్షర శబ్దము వలన విజృంభితము. “నృసింహాయస్వాహా” అనునది హృదయమంత్రము. మారః క్షీరం మహాతను ప్రభావికర నృసింహాయ స్వాహా అనునది శిరో మంత్రము. క్షూం అనునది తారము. తప్త సింహాయ అనునది నేత్రములనుండి కేశాంతము వరకు ఉచ్చరించవలెను. జ్వలత్యావకలో కూర్మో దీర్ఘో వజ్రాది నఖస్పర్శ దివ్యసింహా భగవన్ మహాధ్వస్త జగద్రూప నృసింహాయస్వాహా అనునది శిఖామంత్రము. తరువాత కవచము.  క్షేం అనునది తారము,

“సహస్రబాహవే సహస్రాయుధాయ నృసింహాయ స్వాహా” అనునది అస్త్ర మంత్రము. తరువాత నృసింహస్వామిని ధ్యానించవలయును. ఉదయించు సహస్ర సూర్యుల కాంతి గలవాడు. త్రినేత్రుడు, భీమభూషణుడు, సుతీక్ష్ణాగ్రభుజుడు దైత్య ధారణకుడగు నృసింహస్వామిని స్మరించవలయును. ఇట్లు ధ్యానముచేసి ఒక సహస్రము నేయి కలిపిన పాయసముచే హోమము చేసినచో మంత్రము సిద్ధించును. పూర్వోక్త వైష్ణవ పీఠమున మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి నృసింహస్వామిని చక్కగా పూజించి తరువాత అంగపూజను గావించవలెను. చక్రమును, శంఖమును, పాశమును, అంకుశమును, కులిశమును, గదాకృపాణక్ష్వేడములను దళములందు పూజించవలెను. లోకపాలకులను వజ్రాదులను పూజించవలెను. ఇట్లు మంత్ర సిద్ధి లభించిన తరువాత ప్రయోగములను చేయవచ్చును. భస్మమును మంత్రించి గ్రహగ్రస్తునికి లేపనము గావించవలెయును. భస్మలేపనము వలననే సర్వగ్రహవినాశము జరుగును. ఈ విధానము చేతనే యక్షరాక్షస కిన్నరులు భూతప్రేత పిశాచములు నశించును. సంశయముతో పనిలేదు.

ఈ మంత్రముచే మంత్రించిన భస్మమును లేపనము చేసినచో పరాభిచారకృత్యములు కూడా నశించును. శుభదినమున సర్వతోభద్రమండల మున కుంభమును స్థాపించి తీర్ధ జలముచే నింపి అష్టోత్తరశతమును జపించవలెను. ఆ జలముచే అభిషేకము చేయబడిన మానవుడు అన్ని ఆపదలనుండి విముక్తుడగును. ఇంకా ఏమి చెప్పవలయును ఈ మంత్రరాజము సకలాభీష్టప్రదము “వజ్రనఖాయ విద్మహే తీక్షదంష్ట్రాయ ధీమహి తన్నో నృసింహః ప్రచోదయాత్” అనునది నృసింహ గాయత్రి. ఈ గాయత్రి సర్వాభీష్ట ప్రదాయిని. ఈ నృసింహ గాయత్రిని స్మరించినంత మాత్రముననే సర్వ పాపక్షయము జరుగును. (3/71)