విష్ణు మాహాత్మ్యము

నారద మహర్షి పలికెను: “ఓ మహానుభావా! పుణ్యపురుషుడగు ఉత్తంకమహర్షి చేసిన స్తోత్రమేది? శ్రీహరి ఎట్లు సంతోషించెను? ఏ వరమును పొందెను?”

సనక మహర్షి పలికెను: “హరిధ్యానపరాయణుడగు బ్రాహ్మణోత్తముడగు ఉత్తంకుడు శ్రీహరిపాదోదక మాహాత్మ్యమును చూచి భక్తిచే స్తోత్రము చేసెను.”

ఉత్తంక మహర్షి పలికెను: “జగన్నివాసుడు జగదేక బంధువు ఆదిదేవుడు అగు నారాయణునికి నమస్కరించుచున్నాను. శంఖ చక్ర శార్ఙఖడ్గధారి మహానుభావుడు, తలచువారి ఆర్తిని నశింప చేయువాడు అగు శ్రీహరి, కోపము నుండి పుట్టిన రుద్రుడు ఈ జగత్తును నశింప చేయుచున్నాడు. అట్టి ఆదిదేవునికి ప్రతినిత్యము నమస్కరించుచున్నాను. లక్ష్మీపతి పద్మ దళాయతాక్షుడు విచిత్రవీర్యుడు సమస్త జగత్తునకు ముఖ్యహేతువు, వేదాంతవేద్యుడు పురాణపురుషుడు, తేజోనిధి అగు విష్ణువును నేను శరణు పొందితిని. ఆత్మభూతుడు, అక్షరుడు, సర్వగతుడు, అచ్యుత నామధేయుడు, జ్ఞానాత్మకుడు, జ్ఞానులకు శరణ్యుడు, జ్ఞానైకవేద్యుడు ఆదిభగవానుడు వ్యష్టి సమష్టిరూపుడు ప్రసన్నుడు అగుగావుత. ఆనంతవీర్యుడు, గుణజాతిహీనుడు గుణాత్మకుడు, జ్ఞానవిదులలో శ్రేష్ఠుడు, నిత్యుడు, ప్రపన్నార్తిహరుడు, పరమాత్మ, దయాసముద్రుడు నాయెడ వరడు అగుగావుత. స్థూల సూక్ష్మాది విశేష భేదములచే తాను సృజించిన జగత్తున యథావిధిగా ప్రవేశించినవాడు, సమస్తమగు అనంతసారస్వరూపుడు, అగు నీకంటే పరము మరొకటి లేదు. నీవే పరాత్మవు. నీ శుద్ధ రూపము అగోచరము. మాయా విహీనము గుణజాతి హీనము, నిరంజనము నిర్మలము, అప్రమేయము, సజ్జనులచే పరమార్ధముగా చూడబడువాడవు నీవు మాత్రమే. బంగారము ఒకటైనను ఆభరణముల ఉపాధిచే భిన్నముగా తోచునో అట్లే అఖిలాత్మకుడగు సర్వేశ్వరుడు ఒకడైనను ఉపాధి భేదముచే భిన్నముగా తోచును. నీమాయచే మోహాకులమగు మనస్సు కలవారై ప్రసిద్ధమైన ఆత్మస్వరూపమును చూడజాలకున్నారు. మాయ తొలగినచో వారే సర్వాత్మకమగు ఆత్మరూపముగా చూచుచున్నారు. జ్యోతిస్వరూపుని విభుని సాటిలేనివానిని శ్రీమహావిష్ణువునకు నమస్కరించుచున్నాను. ఈ జగత్తు సమస్తము నీ నుండి కలిగి నీలో నిలుచుచున్నది. ఈ చైతన్యము నీ నుండి కలిగినది. చైతన్య స్వరూపుడవు అగు నీకు నమస్కారము. అప్రమేయుడు అనాధారుడు ఆధార ఆధేయ స్వరూపుడు, పరమానంద చిన్మాత్రుడు అగు వాసుదేవునికి నమస్కరించుచున్నాను. యోగులచే సేవించబడువాడు, హృదయ కుహరమున నివసించువాడు, యోగములకు ఆదిభూతుడు, ప్రణవమున నివసించువాడు అగు శ్రీహరికి నమస్కరించుచున్నాను. నాదాత్మకుని, నాదబీజుని, ప్రణవాత్మకుని, అవ్యయుని, సద్భావుని, సచ్చిదానందుని తీక్ష్ణ చక్రము గలవానికి నమస్కరించుచున్నాను. అజరుడు, సాక్షి అవాఙ్మానస గోచరుడు, నిరంజనుడు, అనంతాఖ్యుడు అగు విష్ణురూపునికి నమస్కరించుచున్నాను. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, సత్త్వము, తేజస్సు, బలము ధృతి ఇవియన్నియు వాసుదేవ స్వరూపములుగా చెప్పెదరు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు వాసుదేవ స్వరూపములుగా చెప్పుదురు. విద్యాస్వరూపుడు అవిద్యాస్వరూపుడు పరాత్పరతరుడని చెప్పెదరు. ఆద్యంతములేనివాడు శాంతుడు, సర్వధాత, అచ్యుతుడు అగు శ్రీహరిని శరణువేడిన మహానుభావులకు శాశ్వతమగు ముక్తి తప్పదు. శ్రేష్ఠుడు, శేష్ఠతరుడు, వరదుడు, పురాణపురుషుడు, సనాతనుడు, సర్వగతుడు, సమస్తరూపుడు అగు శ్రీహరికి మాటిమాటికి నమస్కరించుచున్నాను. శ్రీహరి పాదోదకము భవరోగమునకు ఔషధము. అతని పాదరజము విమలత్వమును ప్రసాదించును. శ్రీహరి నామము దుష్కర్మలను నివారించును. అట్టి అప్రమేయుని పరమపురుషుని సేవించుచున్నాను.

సద్రూపుని అసద్రూపుని, సదసద్రూపుని, అవ్యయుని, అన్నిటికంటే విలక్షణుని, శ్రేష్ఠములన్నిటిలో, శ్రేష్ఠతరుని భజించెదను. నిరంజనుని నిరాకారుని పరిపూర్ణుని, ఆకాశమధ్యగుని, విద్య, అవిద్యలకంటే పరుని హృత్వద్మవాసుని స్వయం ప్రకాశుని, అనిర్దేశ్యుని, మహత్తులకంటే మహత్తరుని, అణువు కంటే అణువును, సర్వోపాధివర్జితుని, నిత్యుని, పరమానందుని, సనాతనుని, పరబ్రహ్మను, జగన్నివాసుని శ్రీమహా విష్ణువును శరణు కోరితిని, క్రియానిష్ఠులచే భజించబడువానిని, యోగులచే చూడబడువానిని, పూజ్యులందరికంటే పరమపూజ్యుని, శాంతుని శరణుపొందితిని, విద్వాంసులచేత కూడ చూడ శక్యముకానివానిని, ఈ అంతఃకరణ సంయోగముచే జీవుడు అనబడువాడు, అవిద్యా తత్కార్య రహితుడై పరమాత్మగా కీర్తించబడువాడు, సర్వాత్మకుడు సర్వహేతువు, సర్వకర్మఫలప్రదుడు, శ్రేష్ఠుడు, శ్రేష్ఠతరుడు, పరాత్పరుడగువానికి ప్రణమించుచున్నాను. సర్వజ్ఞుని, సర్వగతుని, శాంతుని సర్వాంత ర్యామిని, శ్రీహరిని, జ్ఞానాత్మకుని, జ్ఞానవిధిని, జ్ఞానసంస్థుని విభువును భజింతును, వేద నిధిని, మురారిని, వేదాంత విజ్ఞానముచే నిశ్చయించబడిన స్వరూపము గలవానిని, సూర్యచంద్రులవలె కాంతివంతము అగు నేత్రములు గలవానిని, ఇంద్రుని, పక్షిరూపుని, సర్వజగన్నాథుని, సర్వేశ్వరుని, సర్వగతుని, మహానుభావుని, వేదస్వరూపుని, వేదవిదులలో శ్రేష్ఠుని, వాఙ్మనములచే ధ్యానించ శక్యము కానివానిని, అనంతశక్తిని జ్ఞానైకవేద్యుడగు పురుషుని భజించెదను.

ఇంద్రాగ్నియమ నిరృతి, వరుణ, వాయు, చంద్ర, శివ, సూర్య కుబేరాది దిక్పాలుర రూపములచే పరిపూర్ణభావుడై లోకములను పాలించు అప్రమేయుని శరణు పొందుచున్నాను. సహస్రశీర్షుని, సహస్రపాదుని, సహస్రబాహువును, సహస్రనేత్రుని, సమస్త యజ్ఞములచే పూజించబడు వానిని, సంతోషప్రదుని, ఉగ్రవీర్యుని, ఆదిదేవునికి నమస్కరించుచున్నాను. కాలస్వరూపుని, కాలవిభాగ హేతువును, గుణత్రయాతీతుని, గుణజ్ఞుని గుణప్రియుని, కామదుని, సంగరహితుని, ఇంద్రియాతీతుని, విశ్వ బాహువును, నిస్పృహుని, నిష్కాముని, ఉత్కృష్టుని, మనసునకు గోచరము కానివానిని మనో మయుని, అన్నమయుని, నిస్సంగుని, విజ్ఞానభేదుని, రూపమును పొందినవానిని, వాచామగోచరుని, ప్రాణమయుని భజింతును. స్వరూపమును, బలమును, ప్రభావమును, కర్మలను, ప్రమాణములను బ్రహ్మాది దేవతలు కూడా తెలియరు. అట్టి ఆత్మరూపుని ఎట్లు స్తుతించెదను. సంసార సాగరమునపడి దీనుడనై, మోహాకులుడనై అనేక కామములచే బద్ధుడనై అపకీర్తిని పొందును, పిశునుడను, కృతఘ్నుడను, సదా అపవిత్రుని, పాపరతుని, విశేషక్రోధము గలవానిని భయాకులును అగు నన్ను కాపాడుము. దయానిధివగు నిన్ను శరణువేడుచున్నాను” అని ఇట్లు ఉత్తంకునిచే ప్రార్థించబడిన దయానిధియగు శ్రీపతి తేజోనిధి భగవానుడు ప్రత్యక్షమాయెను.

అవిశపూవువన్నెగల వానిని వికసించిన పద్మములవంటి కనులుగలవానిని కిరీట కుండల హారకేయూర శ్రీవత్సకౌస్తుభాది భూషణములను ధరించినవానిని, బంగారు యజ్ఞోపవీతమును ధరించినవానిని, నాసికా ప్రాంతమున ధరించిన ముత్యపు కాంతిచే శోభించు దేహకాంతి గలవానిని, పీతాంబరధారిని, వనమాలా విభూషితుని, కోమలములైన తులసీ దళములచే పూజించబడిన పాదములు గలవానిని, గొప్ప తేజస్సు కలవానిని కింకిణి నూపురాదులచే భూషించబడినవానిని, గరుడధ్వజుని శ్రీహరిని చూచి ఉత్తంకుడు దండవత్ప్రణామములను ఆచరించెను. ఆనంద బాష్పములచే శ్రీహరి పాదములను అభిషేకించెను. “ఓ మురారీ! రక్షించుము! రక్షించుము!” అని పలుకుచు అనన్యచిత్తముతో ధ్యానించెను. దయాపరుడగు శ్రీమహావిష్ణువు ఉత్తంకుని లేపి అలింగనము చేసుకొనెను. వత్సా! వరమును కోరుమని పలికెను. “నేను ప్రసన్నుడనైన పిదప, నీకు సాధించరానిదేదియులేద”ని పలికిన శ్రీహరి మాటలను విని ఉత్తంకుడు మరల మరల నమస్కరించి దేవదేవుడగు జనార్దనునితో ఇట్లు పలికెను. “నన్నేల మోహింపచేయుచున్నావు? నాకు వేరు వరములతో నేమిపని? ఎన్ని జన్మలలో నైనను నీయందు దృఢభక్తి కలుగనిమ్ము” అని శ్రీహరి అట్లే కానిమ్మని పలికి తన శంఖముతో స్పృశించి యోగులకు కూడా దుర్లభమగు దివ్య జ్ఞానమును ప్రసాదించెను. ఉత్తంకుడు మరల స్తోత్రము చేయుచున్న దేవదేవుడగు జానర్ధనుడు ఉత్తంకుని శిరమున హస్తమునుంచి ఇట్లు పలికెను.

శ్రీమన్నారాయణభగవానుడు పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! క్రియాయోగముతో నన్నెల్లపుడు ఆరాధించుము. నరనారాయణ ఆశ్రమమునకు వెళ్ళుము. మోక్షమును పొందగలవు. నీవు చేసిన ఈ స్తోత్రమును చదివినవారు అన్ని కోరికలను పొంది అంతమున మోక్షమును పొందగలరు” అని శ్రీమన్నారాయణుడిట్లు పలికి అచటనే అంతర్థానము చెందెను. తరువాత ఉత్తంకుడు కూడా నరనారాయణ స్థానమును కైపునకు వెళ్ళెను. కావున దేవదేవుడగు చక్రి విషయమున ఎల్లప్పుడు భక్తి చేయవలయును. అన్నిటిలో ఉత్తమమైనది హరిభక్తియే. హరిభక్తి సర్వకామఫలములనిచ్చును. నరనారాయణాశ్రమున ఉత్తంకుడు భక్తి భావముతో శ్రీహరిని పూజించుచు క్రియాయోగపరుడై, జ్ఞానవిజ్ఞాన సంపన్నుడై సంశయచ్ఛేదము గలిగి అందరికి దుర్లభమగు శ్రీమహావిష్ణువు యొక్క పరమ పదమును పొందెను. జగన్నాథుడగు నారాయణుడు భక్తుల గౌరవమును పెంచువాడు ఆయనను పూజించినను నమస్కరించిననూ స్మరించిననూ మోక్షము నొసంగును. కావున అనంతుడు అపరాజితుడు అగు నారాయణ దేవుని ఇహపరములలో ఆనందమును కోరువాడు భక్తిచే పూజించవలయును. సావధానముచే ఈ కథను చదివిననూ వినిననూ సర్వపాపవినిర్ముక్తుడై శ్రీహరిభవనము చేరును. (1/38)