నారద మహా పురాణము
మార్కండేయ వర్ణనము
నారదుడు పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! భగవానుడగు శ్రీమన్నారాయణుడు మృకండు మహర్షికి ఎట్లు పుత్రుడాయెను? భార్గవ వంశమున పుట్టిన శ్రీహరి ఏమి చేసెను? ఈ విషయమునంతటిని నాకు తెలుపుము. చిరంజీవియగు మార్కండేయ మహాముని ప్రళయ కాలమున శ్రీమహావిష్ణు మాయను చూచెనని పురాణములలో వినబడు చున్నది.
సనకమహర్షి పలికెను: ఓ నారదమహర్షీ! విష్ణుభక్తితో కూడినది సనాతనమైనది అయిన మార్కండేయ మహర్షి కథను చెప్పెదను వినుము. మృకండు మహర్షి తపస్సు పూర్తిచేసి వివాహము చేసుకొని శాంతుడై, దాంతుడై కృతార్థత నొంది గృహస్థాశ్రమముపే ఆశ్రయించి ఉండెను. మృకండు మహర్షి భార్య పరమ పవిత్రురాలు, సమర్థురాలు; ఎపుడూ పతిభక్తి కలిగి ఉండెను. కర్మతో మనస్సుతో మాటతో త్రికరణశుద్ధిగా భర్తను సేవించు పరమ పతివ్రత. సరి అయిన సమయమున మృకండు మహర్షి భార్య హరి తేజోంశమును కలిగించు గర్భమును ధరించెను. పదినెలలు గడిచిన తరువాత పరమ తేజస్వీయగు పుత్రుని ప్రసవించెను. మంచి లక్షణములతో ఉన్న పుత్రుని చూచి మృకండు మహర్షి సంతోషించెను. విధి పూర్వకముగా శుభకరమైన జాతకర్మను చేయించెను. శుక్ల పక్షమున చంద్రుడువలె ఆ బాలుడు పెరుగుచుండెను. తరువాత అయిదవ ఏట మృకండు మహర్షి ఆనందముతో ఉపనయనము చేసి ధర్మసంహితయగు వైదిక శిక్షను బోధించెను. ఓ పుత్రా! ఎప్పుడూ విధిపూర్వకముగా బ్రాహ్మణులకు నమస్కారము చేయవలయును. మూడుమార్లు అర్ఘ్యప్రదానముచే సూర్యుని పూజించి వేదాధ్యయన పూర్వకముగా వైదిక కర్మను ఆచరించవలయును. ఎప్పుడూ బ్రహ్మచర్యముచే తపస్సుచే శ్రీహరిని పూజించవలయును. దుష్టులతో మాట్లాడుట మొదలగు నిషిద్ధ కర్మలను వదలవలయును. ఎప్పుడూ విష్ణుభక్తి పరులగు సజ్జనులతో కలిసి ఉండవలయును. ఎవరినీ ద్వేషించరాదు. అందరికీ హితమునే ఆచరించవలయును. యజ్ఞములను, వేదాధ్యయనమును, దానములను ఎప్పుడూ చేయవలయును అని ఇట్లు మార్కండేయ మహర్షికి తండ్రి వైదిక శిక్ష నుపదేశించెను.
మహానుభావుడైన మార్కండేయమహర్షి ధర్మమునందు ప్రీతికలవాడై, అన్ని ప్రాణులయందు దయగలవాడై, ఎప్పుడూ శ్రీహరిని ధ్యానించుచు ధర్మమును ఆచరించుచుండెను. ఆత్మజ్ఞానము కలవాడు, సత్యసంధుడు, సూర్యునివంటి కాంతిగలవాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, శాంతుడు, గొప్పజ్ఞానము కలవాడు, అన్ని తత్త్వముల అర్థమును బాగుగా తెలిసినవాడు కావున శ్రీమన్నారాయణుని ప్రీతి కొఱకు ఉత్తమమైన తపస్సును చేసెను. జ్ఞానియైన మార్కండేయునిచే ఆరాధించబడిన జగన్నాథుడగు శ్రీహరి పురాణ సంహితను రచించు వరమును ఇచ్చెను. పురాణ సంహితను చేసినవాడు కావుననే మార్కండేయ మహర్షి నారాయణుడని చెప్పబడినది. దేవదేవుడైన శ్రీమన్నారాయణునకు మహాభక్తుడు చిరంజీవి అగు మార్కండేయ మహర్షికి తన ప్రభావమును చూపగోరిన శ్రీమన్నా రాయణుడు ప్రళయకాలమున ప్రపంచమంతా జలమయమైనను మార్కండేయ మహర్షిని మాత్రము సంహరించక అట్లే మిగిల్చెను. విష్ణుభక్తి కలవాడు, జ్ఞానియగు మృకండుని పుత్రుడు మహా భయంకరమైన ఆ జలముతో రాలిన ఆకువలె శ్రీహరి శయనించి ఉన్నంత వరకు అట్లే ఉండెను.
ఓ నారదమునీంద్రా! మార్కండేయ మహర్షి శ్రీమహావిష్ణువు సమీపమున ఉన్న కాలప్రమాణమును చెప్పెదను వినుము. పదునైదు నిమేషములు ఒక కాష్ఠ అనబడును. ముప్పదికాష్టలు ఒక కల. ముప్పది కలలు ఒక క్షణము. ఆరుక్షణములు ఒక ఘటిక. రెండు ఘటికలు ఒక ముహూర్తము. ముప్పది ముహూర్తములు ఒక దినము. ముప్పది దినములు ఒక మాసము. ఈ మాసము రెండు పక్షములతో కూడినది అగును. రెండు మాసములు ఒక ఋతువు. మూడు ఋతువులు ఒక అయనము. రెండు అయనములు ఒక సంవత్సరము. ఈ సంవత్సరము దేవతలకు ఒక దినము. ఉత్తరాయణము పగలు, దక్షిణాయనము రాత్రి. మానవుల ఒక మాసము పితృ దేవతలకు ఒక దినము. ఆ ప్రమాణమును అనుసరించి సూర్యచంద్ర సంయోగము జరిగినచో ఉత్తమ కల్పమని తెలియ వలయును. దేవతల మాసమున పన్నెండు వేల సంవత్సరములు దైవత యుగము. రెండువేల దేవయుగములు ఒక బ్రహ్మయుగము. అవే రెండు మనుష్య కల్పములు డెబ్బది యొక్క దివ్యయుగములు ఒక మన్వంస్తరము. పదునాలుగు మన్వంతరములు బ్రహ్మకు పగలు. రాత్రి కూడా పగటి ప్రమాణముగానే ఉండును. 28 మన్వంతరకాలములు గడిచిన పిదప మూడు లోకములు నశించును. మానవ కాలమాన ప్రకారము కాలప్రమాణము చెప్పెదను వినుము. నాలుగు వేల యుగములు బ్రహ్మకు ఒక దివసము. ఈ ప్రమాణమును అనుసరించి మాసము సంవత్సరము తెలియవలయును. రెండు పరార్థముల కాలము విష్ణువునకు పగలు. అంతయే కాలము రాత్రి. మృకండు పుత్రుడగు మార్కండేయుడు విష్ణుశక్తిచే మహాభయంకరమైన జలప్రళయమున ఎండుటాకువలె ఇంతకాలముండెను. ఇంత కాలము పరమాత్మను ధ్యానించుచుండెను.
సమయము రాగానే శ్రీమన్నారాయణుడు యోగ నిద్రను విడిచి బ్రహ్మరూపమున చరాచరమైన ఈ ప్రపంచమును సృష్టించెను. జలము ఏపసంహరించబడుటను, జగత్తు సృష్టించబడుటను చూచిన మార్కండేయ మహర్షి ఆశ్చర్యమును చెంది పరమానందముతో శ్రీహరి పాదపద్మములకు నమస్కరించెను. మార్కండేయ మహర్షి శిరసున దోసిలి యొగ్గి ఇష్టమైన వాక్కులతో సదానంద రూపుని స్తోత్రము చేసెను.
మార్కండేయ మహర్షి పలికెను: వికారమును చెందనివాడు, వేయి శిరస్సులు కలవాడు, ఆదిదేవుడు, ఇతరము ఆధారముగా లేనివాడు, వాసుదేవుడు అయిన శ్రీమన్నారాయణునికి నమస్కరించుచున్నాను. ఇంతటివాడు అని కొలుచుటకు వీలులేనివాడు, తిరుగులేనివాడు, ఎప్పుడూ సదానంద స్వరూపుడు, ఊహకందనివాడు, నిర్దేశించరానివాడు అయిన జనార్దనునికి నమస్కరించుచున్నాను. నాశములేనివాడు, పరముడు, నిత్యుడు, ప్రపంచమును చూచువాడు, ప్రపంచమునకు కారణభూతుడు, సర్వతత్త్వ స్వరూపుడు, శాంతుడు అయిన జనార్దనునికి నమస్కరించుచున్నాను. పురాణ పురుషుడు, సిద్ధస్వరూపుడు, అన్ని జ్ఞానములకు ఆధారభూతుడు, పరములన్నింటి పరరూపుడు అయిన జనార్దనునికి నమస్కరించుచున్నాను. పరంజ్యోతి పరంధాముడు, పవిత్రుడు, పరమస్థానభూతుడు సర్వైకరూపుడు, పరముడు అయిన జనార్దనునికి నమస్కరించుచున్నాను. సదానంద చిన్మాత్రుడు, పరములకంటే పరముడు, సర్వరూపుడు, సనాతనుడు, శ్రేష్ఠుడు అయిన జనార్దనునికి నమస్కరించుచున్నాను. సగుణుడు, నిర్గుణుడు, శాంతుడు, మాయాతీతుడు, గొప్పమాయ కలవాడు, రూపములేనివాడు బహురూపుడు అయిన జనార్దనునికి నమస్కరించుచున్నాను. ఈ ప్రపంచమును సృష్టించి, రక్షించి సంహరించు ఆదిదేవుడగు జనార్దనునికి నమస్కరించుచున్నాను. ఓ పరేశా! పరమానంద స్వరూపా! శరణాగతవత్సల! కరుణాసముద్రమా, మనస్సుకందనివాడా! నన్ను కాపాడుము. నీకు నమస్కారము అని ఇట్లు స్తోత్రము చేయుచున్న మార్కండేయ మహర్షిని గూర్చి జగద్గురువైన శంఖచక్రగదాధరుడు మిక్కిలి ప్రీతితో ఇట్లు పలికెను.
శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను: ఈ లోకమున భగవంతునియందు మనసు నిలిపిన వారు పరమభాగవతులు. వారి విషయమున నేనెప్పుడూ సంతోషముతో ఉండి వారిని సర్వ కాలములలో కాపాడుచుందును. ఓ బ్రాహ్మణోత్తమా! నేనే నా స్వరూపమును మరుగుపరచి ఎపుడూ భగవద్భక్తుల రూపముతో ఈ లోకములను కాపాడుచుందును.
మార్కండేయ మహర్షి పలికెను: భగవద్భక్తులు ఎట్లుందురు? ఏ పని చేసినచో భగవద్భక్తులు (భాగవతులు) అగుదురు. ఈ విషయమును తెలుసుకొనవలెనని నాకు చాలా కుతూహలముగా ఉన్నది. కావున వినగోరుచున్నాను.
శ్రీమన్నారాయణ భగవానుడు పలికెను: ఓ మార్కండేయ మహామునీ! భాగవతుల లక్షణమును చెప్పెదను, వినుము. భాగవతోత్తముల ప్రభావమును నూరు కోట్ల సంవత్సరములలో కూడా చెప్ప శక్యముకాదు. అన్ని ప్రాణులకు హితమును కోరువారు, అసూయలేనివారు, మాత్సర్యములేనివారు, ఇంద్రియ నిగ్రహముకలవారు, ఆశలేనివారు, శాంతస్వభావులు భాగవతులు అనబడుదురు. పనితో మనసుతో మాటతో ఇతరులను పీడించనివారు, ఇతరులనుండి దేనినీ గ్రహించనివారు భాగవతులు అనబడుదురు. సత్కథలను వినుటలో సాత్త్విక బుద్ధికలవారు, సత్కథా భక్తులు, శ్రీమహావిష్ణు భక్తులు బాగవతోత్తములు అనబడుదురు. తల్లి దండ్రులను గంగా పరమేశ్వర బుద్దితో సేవించువారు భాగవతోత్తము లనబడుదురు. దేవుని అర్చించుటలో ప్రీతి కలవారు. దేవతార్చనను సాధించువారు. దేవతార్చనను చూచి ఆమోదించువారు భాగవతోత్తములు అనబడుదురు. యతులను సన్యాసులను సేవించుటలో ఆసక్తిగలవారు పరులను నిందించనివారు భాగవతోత్తములనబడుదురు. అందరికి హితమును బోధించువారు, గుణములను మాత్రమే గ్రహించువారు భాగవతోత్తములు అనబడుదురు. తమవలె అన్ని ప్రాణులను చూచువారు శత్రువులను మిత్రులను సమముగా చూచువారు భాగవతోత్తములు అనబడుదురు. ధర్మశాస్త్రములను బోధించువారు, సత్యవాక్యమునే చెప్పువారు, సత్పురుషులను సేవించు వారు భాగవతోత్తములు అనబడుదురు. పురాణములను వ్యాఖ్యానము చేయువారు పురాణములను వినువారు పురాణములను చెప్పువారియందు భక్తి కలవారు భాగవతోత్తములు అనబడుదురు. గోవులను బ్రాహ్మణులను సేవించువారు, తీర్థయాత్రలయందాసక్తి కలవారు భాగవతోత్తములు అనబడుదురు. ఇతరుల అభివృద్ధిని చూచి అభినందించువారు, హరి నామ కీర్తన చేయువారు పరమభాగవతోత్తములు. ఉద్యానవనములను నిర్మించువారు, తటాకములను రక్షించువారు, సరస్సులను, బావులను ఏర్పరచువారు, పరమ భాగవతోత్తములు. తటాకములను, దేవాలయములను నిర్మించువారు, గాయత్రీ మంత్ర జపమునందు ప్రీతి కలవారు పరమభాగవతోత్తములు. శ్రీహరి నామములను విని అభినందించి, ఆనందించి శరీరమున పులకలు వచ్చువారు పరమ భాగవతోత్తములు. తులసీవనమును చూచి నమస్కరించువారు, తులసీకాష్ఠములను చెవులలో ధరించువారు భాగవతోత్తములు. తులసీ గంధమును వాసన చూచి ఆనందించువారు, తులసీ మూల మృత్తికను వాసన చూచి ఆనందివారు భాగవోత్తములు ఆశ్రమాచారములయందు శ్రద్ధ కలవారు, అతిథులను పూజించువారు, వేదార్థమును చెప్పువారు భాగవతోత్తములు. శివుని యందు ప్రీతి కలవారు, శివుని యందు మనసును లగ్నము చేసినవారు, శివ పాదార్చనలో ఆనందించువారు, త్రిపుండ్రములను ధరించువారు పరమ భాగవతోత్తములు. మహానుభావుడైన శ్రీహరి నామములను, శంకరుని నామములను కీర్తించువారు, రుద్రాక్షలను అలంకరించుకొనువారు భాగవతోత్తములు. బహుదక్షిణలిచ్చి యాగములతో శివుని ఆరాధించువారు. ఉత్తమమైన భక్తితో శ్రీమన్నారాయణుని గూర్చి చేసిన యాగములతో అతనిని ఆరాధించువారు భాగవతోత్తములు. తమకు తెలిసిన శాస్త్రములను ఇతరుల కొఱకు చెప్పువారు, అంతటా గుణములను మాత్రమే చూచువారు భాగవతోత్తములు. పరమేశ్వరుడైన శివుని యందు, పరమాత్మయగు శ్రీమన్నారాయణునియందు సమబుద్ధితో ప్రవర్తించువారు భాగవతోత్తములు. శివుని గూర్చి అగ్నికార్యములను, యాగములను చేయుటయందు ఆసక్తికల వారు, పంచాక్షరిని జపించుటలో ఆసక్తిని చూపువారు శివుని ధ్యానము చేయువారు కూడా భాగవతోత్తములు. మంచినీరును దానము చేయుటలో ఆసక్తినిపొందువారు, అన్నదానమును చేయువారు, ఏకాదశీ వ్రతమును ఆచరించువారు భాగవతోత్తములు. గోదానము చేయువారు, కన్యాదానమును చేయువారు నా ప్రీతి కొరకు పనిచేయువారు భాగవతోత్తములు. ఇచట కొందరు భాగవతోత్తములను గూర్చి చెప్పియుంటిని. నేను కూడా నూరు కోట్ల సంవత్సరములలోనైనను భాగవతోత్తములను గూర్చి సంపూర్ణముగా చెప్పలేను.
ఓ బ్రాహ్మణోత్తమా! కావున నీవు కూడా ఎల్లప్పుడు సుశీలుడవు కమ్ము. అన్ని భూతములకు ప్రాణులకు ఆశ్రయుడవై, ఇంద్రియ నిగ్రహమును అలవర్చుకొని అందరియెడ మైత్రి కలవాడవై, ధర్మమునందే మనసును నిలుపుము. మళ్ళీ వచ్చు ప్రళయము వఱకు సర్వవిధ ధర్మములను ఆచరించుచు, నా స్వరూపమును ధ్యానించుటలో ఆసక్తుడవై పరమ పదమును పొందెదవు. ఇట్లు దేవదేవేశుడు దయానిధియైన శ్రీమన్నారాయణుడు మృకండు మహర్షి పుత్రుడు, తన భక్తుడు అయిన మార్కండేయ మహర్షికి వరమునిచ్చి అక్కడనే అంతర్థానము చెందెను. మహానుభావుడైన మార్కండేయమహర్షి కూడా ఎల్లప్పుడూ హరి భక్తిచే ఆనందించుచు, పరమ ధర్మములను ఆచరించెను. విధిపూర్వకముగా యజ్ఞములచే శ్రీమహావిష్ణువును పూజించెను. పరమ పవిత్రమైన శాలగ్రామ క్షేత్రమున ఉత్తమమైన తపస్సును ఆచరించెను. శ్రీమహావిష్ణువును ధ్యానించుచు కర్మలను క్షీణింప చేసుకొని పరమ పదమును పొందెను. కావున అన్ని ప్రాణులకు హితమును కలిగించుచు శ్రీమహా విష్ణువును పూజించువాడు మనసులో కోరికలను అన్నింటిని పొందగలడు. ఈ విషయమున ఏ మాత్రము సంశయము లేదు.
సనక మహర్షి పలికెను: ఓ బ్రాహ్మణోత్తమా! నీవు అడిగిన భగవద్భక్తి మాహాత్మ్యము నంతటిని చెప్పితిని. ఇంకనూ ఏమి వినగోరుచుంటివో తెలుపుము. (1/5)