వివిధ దేవతా మంత్రవిధి

సనత్కుమార మహర్షి పలికెను: తరువాత శ్వాసానుసారముగా భూమి మీద పాదము నుంచి సముద్రములు మొలనూలుగా ధరించి పర్వతములను స్థనమండలముగల విష్ణుపత్నీ! నీకు నమస్కారము. నా పాదస్పర్శను క్షమించుము అని భూమిని ప్రార్ధించి యథావిధిగా తిరుగవలయును. తరువాత గ్రామమునకు నైఋతి దిక్కునకు వెడలి ఈ మంత్రమును పలుకవలయును. ఋషులు దేవతలు పిశాచములు గుహ్యములు పితృభూత గణములందరూ ఇట నుండి వెళ్ళుడు. నేను మలమోచనమును చేతును అని మూడుమార్లు చప్పట్లు కొట్టి తలకు వస్త్రమును చుట్టి రాత్రి అయినచో దక్షిణా ముఖముగా, పగలు ఉత్తరాభిముఖముగా కూర్చొని మల విసర్జనగావించి మట్టిచే నీటిచే శౌచము నాచరించవలెను. లింగమున ఒకసారి మట్టి, గుదమున మూడుమార్లు వామకారమును పదిమార్లు, చేతులకు ఏడుమార్లు, పాదములకు మూడుమార్లు గండూషమును ఆచరించవలెను. తరువాత ఈ మంత్రముచే వనస్పతిని ప్రార్ధించవలెను. “ఆయుష్యమును, బలమును, యశమును, వర్చస్సును, సంతానమును, పశువులను, ధనమును, శ్రీని, ప్రజ్ఞను, మేధస్సును నీవు నాకిమ్ము” అని ఇట్లు ప్రార్ధించి పన్నెండు అంగుళములుకల దంతకాష్ఠమును తీసుకొని మంత్రమును పొందినవాడు కామమంత్రముచే సావధానుడై కామదేవపదము సర్వజనప్రియము హృదయాంతరమున కామబీజాఢ్యముగా నుండు దంతములను ఈ కాష్ఠముచే శోధించవలయును. వాగ్భవమగు మూలముచే నాలుకను గీచుకొని ముఖ ప్రక్షాళనమును గావించవలెను. తరువాత దేవాలయమునకు వెళ్ళి, నిర్మాల్యమును తీసివేసి శుద్ధవస్త్రమును ధరించి మంగళహారతి నీయవలెను. అస్త్రముచే పాత్రను ప్రోక్షించి మూలమంత్రముచే జ్వలింపచేయవలెను. చక్కగా పూజించి పాత్రను తీసుకొని లేచి ఘంటానాదమును చేయవలెను. మంచి ఆవు నెయ్యితో వెలిగించిన దీపమును అంతటా త్రిప్పి సుందరము అగు వాద్యగీతములచే దేవునికి హారతీయవలెను. ఇట్లు నీరాజనమును చేసి తన ఇష్టదేవతను ప్రార్థించి, దేవతాగణములను కీర్తించుచు నదీ ప్రాంతమునకు స్నానమునకు వెళ్ళవలెను. అట్లు వెళ్ళి తీర్థమునకు నమస్కరించి స్నానీయపాత్రను ఉంచి, మూలమంత్రముచే మంత్రించబడిన మట్టిని తీసుకొని కటి ప్రాంతము నుండి పాదముల వరకు వ్రాసుకొని తీర్ధజలముచే క్షాళనము చేయవలెను. తరువాత అయిదు మార్లు మట్టితో పాదములను కడిగి జలాంతర్భాగమున ప్రవేశించి నాభిమాత్రమున వామ హస్తమునను, మణి బంధమున, అరచేతిలో, చేతిముందు భాగమున అంగుళులచే గంగామృత్తికను వ్రాసి దానిని అస్త్రముచే మరల తనమీదచుట్టి వదలవలెను. అరచేతిలోఉన్నదానిని షడంగములయందు ఆ మంత్రములచే వ్రాయవలెను. మునిగి చక్కగా క్షాళన చేయవలెను. దీనిని మలస్నానము అందురు. ఇట్లు ఇష్టమయముగా భావించి అంతర స్నానమును ఆచరించవలయును. అనంతాదిత్య సంకాశుడు, నిజభూషాయుధములతో కూడియున్న మంత్రమూర్తియగు ప్రభువును స్మరించి తత్పాదోదకసంభవయగు ధారను బ్రహ్మరంధ్రముచే తన శరీరమున ప్రవేశించుచున్న జలముచే దేహాంతర్గతమగు మలమునంతటిని క్షాళన చేయవలెను. ఇట్లు చేసినచో మంత్రమును పొందినవాడు వెంటనే దుమ్ము తొలగినవాడై స్ఫటికమువలె అగును. తరువాత శ్రౌతోక్త విధిచే సావధానముగా స్నానముచేసి మంత్ర స్నానమును ఆచరించవలెను. ఆ విధానమును ఇపుడు చెప్పుచున్నాను.

దేశకాలములను కీర్తించి, ప్రాణాయామమును చేసి, షడంగన్యాసము గావించి, ముష్టిముద్రచే అర్కమండలము నుండి తీర్ధమును ఆహ్వానించవలయును. బ్రహ్మాండోదరము నుండి మకరములచే స్పృశింపబడిన తీర్థమున ఓ దివాకరా సత్యముతో నాకిమ్ము. ఓ గంగా! యమునా! గోదావరీ! సరస్వతి! నర్మదా! సింధూ! కావేరీ! మీరందరూ ఈ జలములో నిలువుడు అని జలమున ఆవాహనచేసి సుధాబీజముతో యోగము చేయవలెను. గోముద్రచే అమృతమును చేసి కవచముచే అవగుంఠనము చేసి అస్త్రముచే రక్షగావించి చక్రముద్రను చూపవలెను. అచట సూర్యచంద్ర అగ్ని మండలములను ధ్యానించ వలయును. ఆ జలమును సూర్య మంత్రముచే సుధా బీజముచే మంత్రించవలెను. మూలమంత్రముచే పదకొండుమార్లు మంత్రించి భావించవలెను. ఆ మధ్య భాగమున పూజాయంత్రమును స్థాపించి స్వాంతమునుండి దేవతను ఆవహించి స్నానము చేయించి మానసోపచారములచే పూజించవలెను. సింహాసనమున ఉన్న ఆ దేవతకు నమస్కరించి, ఆ జలమునకు నమస్కరించవలెను. సర్వ భూతములకు ఆధారములు సాటిలేని తేజస్సుగల విష్ణువునుండి పుట్టినవి, విష్ణురూపములు అయిన జలములకు నేను నమస్కరించుచున్నాను అని ఇట్లు నమస్కరించి ఆరాధించి సప్త చ్ఛిత్రములను సాధకుడు ఏర్పరిచి ఆ జలములో మునిగి మూలమగు దేవాకృతిని స్మరించవలెను. మునిగి లేచి - బ్రహ్మముద్రచే శిరస్సుపై జలమును చల్లవలయును. తన శరీరమును మూడు మార్లు మూల మంత్రముచే, నాలుగు సార్లు మంత్రములచే అభిషేకము చేయవలెను. ఆ నాలుగు మంత్రములు ఇచట చెప్పుచున్నాను.

“పిసృక్షోర్నిఖిలం విశ్వం ముముశ్శుక్రం ప్రజాపతేః

మాతరస్సర్వభూతానామాపో దేవ్యః పునన్తు మామ్

అలక్ష్మీర్మలరూపా యా సర్వభూతేషు సంస్థితా

క్షాళయంతి చ తాం స్పర్శాదాపో దేవ్యః పునన్తు మామ్

యన్మే కేశేషు దౌర్భాగ్యం సీమన్య్ఱ్ యచ్చ మూర్ధని

లలాటే కర్ణయోరక్షోరాపస్తద్ధన్తు వో నమః

ఆయురారోగ్యమైశ్వర్య మరిపక్షక్షయం శుభమ్

సంతోషః క్షాంతిరాస్తిక్యం విద్యా భవతు నో నమః “

ఇవి నాలుగు మంత్రములు. అఖిల ప్రపంచమును సృష్టించు ప్రజాపతికి శుక్ర రూపము, సర్వ భూతములకు మాతృ స్వరూపములైన ఆపోదేవులు నన్ను పవిత్రుని చేయుగాక. సర్వ భూతములలో మలరూపముగా నున్న అలక్ష్మిని స్పర్శ మాత్రముచే క్షాళనము చేయు ఆపోదేవులు నన్ను పవిత్రుని చేయుగాక. నాకేశములలో, సీమన్తమున, శిరస్సున, లలాటమున, కర్ణములలో నేత్రములలో నున్న దౌర్భాగ్యమును జలములు నశింపచేయుగాక. అట్టి జలములకు నమస్కరించుచున్నాను అని పై మంత్రములకు అర్థము. ఆయుష్యమును ఆరోగ్యమును, ఐశ్వర్యమును, శత్రునాశమును, శుభమును, సంతోషమును, శాంతిని, ఆస్తిక్యమును, విద్యను నాకు ప్రసాదించు జలములకు నమస్కారము. బ్రాహ్మణ పాదజలమును పానము చేసిన తరువాత శాలగ్రామ శిలా జలమును పానము చేయవలెను. విపరీతముగా ఆచరించరాదు. ఇది నియతవిధి. భూమి మీద ఉన్న సర్వ తీర్ధములు బ్రాహ్మణోత్తముని దక్షిణ పాదమున ఉండును. మంత్రమును పొందినవాడు మార్తాండ మండలమున స్వేష్ట దైవమును ఉద్వాసన చేసి తీరమున కొత్త వస్త్రమును ప్రయత్నముచే శుద్ధి చేసుకొని, వస్త్రములను ధరించి బుద్ధిమంతుడు సంధ్యాదికమును ఆచరించవలయును. రోగాదులచే శక్తిలేనివాడు అఘమర్షణము నాచరించవలెను. లేనిచో భస్మస్నానమును కాని రజస్నానమును కాని చేయవలెను. తరువాత శుభాసనమున కూర్చుండి సంధ్యాదికమును ఆచరించవలెను. కేశవ, నారాయణ, మాధవ నామములతో జలప్రాశనము గావించి, గోవింద, విష్ణు నామములతో కర ప్రక్షాళనము గావించి, మధుసూదన త్రివిక్రమ నామములతో ఓష్ఠములను మార్జన చేయవలెను. వామన, శ్రీధర నామములతో ముఖమును, హస్తములను స్పృశించవలయును, దామోదర నామముతో మూర్ధను, సంకర్షణ నామముతో ముఖమును, వాసుదేవ, ప్రద్యుమ్న నామములతో నాసికలను స్పృశించవలెను. అనిరుద్ధ పురుషోత్తమ నామములతో నేత్రములను స్పృశించవలెను. అధోక్షజ నృసింహనామములతో శ్రవణములను స్పృశించవలెను. అచ్యుత నామములతో భుజములను స్పృశించవలెను. దీనిని వైష్ణవాచమన మందురు. ప్రణవాదిగా నమోంతముగా కేశవాది నామములతో ప్రదేశినితో ముఖమున నాసికలలో, అనామికతో నేత్రకర్ణములయందు, కనిష్టతో నాభి దేశమున, ఇతర ప్రదేశములలో అంగుష్ఠముతో యోజన చేయవలెను. స్వాహాంతములైన శివతత్త్వములతో చేయునది శైవాచమనము. దీర్ఘత్రయేందుయుక్ వ్యోమపూర్వకముగా జలపానము చేయవలెను. శివతత్త్వములచేతనే స్వాహాంతములుగా శైవము చెప్పబడినది. వాగ్లజ్జాశ్రీముఖములుగా స్వాహాంతములుగా శాక్తాచమనము చెప్పబడినది. వాగ్లజ్ఞాశ్రీముఖములుగా ద్విజాచమనము అర్థ ప్రదమని చెప్పబడినది. తరువాత పాల భాగమున గదాకారముగా చక్కగా తిలకధారణ చేయవలయును. హృదయమున నందకాకారముగా, భుజద్వయమున శంఖచక్రములను, మస్తకమున శార్ఙబాణములను, క్రమముగా ఉంచవలెను. కర్ణమూలములందు, పార్శ్వ భాగములలో, పృష్ఠభాగమున, నాభియందు, కకుద్భాగమున తీర్ధోద్భవాదులకు మృత్ఞితకలతో వైష్ణవుడు తిలకధారణ చేయవలెను. శైవులు అగ్నిహోత్రోద్భవమగు భస్మమును “కింవాగ్ని” అసుమంత్రముచే పంచమంత్రములచే అభిమంత్రణము చేసి, క్రమముగా తత్పురుష, అఘోర, సద్యోజాతాని నామములచే అయిదు ఫాల, అంస, ఉదర హృదయములలో త్రిపుండ్రములను ధరించవలెను. శైవుడు శాక్తుడు త్రికోణాకారముగాని, నారివలెకాని పుండ్రమును ధరించవలెను. వైదిక సంధ్యా వందనము ఆచరించిన తరువాత తాంత్రిక విధిగా ఆచరించవలెను. విధానోక్తముగా ఆచమనమును గావించి, మొదటి దానివలె తీర్ధములను ఆవాహన చేసిన తరువాత భూమిపై మూడుమార్లు దర్భతో నీరు చల్లవలెను. ఏడుమార్లు ఆ జలముతో శిరస్సున చల్లుకొనవలెను. తరువాత ప్రాణాయామమును చేసి షడంగన్యాసమును చేసి ఎడమచేతిలో నీరు తీసుకొని కుడిచేతితో కప్పి ఆకాశవాయు అగ్ని జల భూ బీజములతో అభిమంత్రించి మూలమంత్రముచే తత్త్వముద్రలో ఆ జలబిందువులను ఏడుమార్లు శిరస్సున చల్లుకొనవలయును. అట్లు చల్లుకొనగా మిగిలిన జలమును నాసిక సమీపములకు తేవలెను, తేజోమయమైన అజలమును ఇడామార్గము ద్వారా నాసికలోనికి ఆకర్షించి దానితో నాసికాంతర్గత కల్మషమును ప్రక్షాళన చేసి మరల ఆ జలమును పింగళమార్గముతో బయటికి విడువవలెను. తరువాత కల్పించబడిన కులిశోపలము మీద ఆ జలమును అస్త్రముచే విడువవలెను. దీనినే సర్వ పాపహరమగు అఘమర్షణ మందురు. తరువాత హస్తప్రక్షాళనము గావించుటకు మొదటివలె ఆచమనమును గావించి, లేచి మంత్రజ్ఞుడై తామ్ర పాత్రమున పుష్పాదికమునుంచి మూలాంతములచే మంత్రమును ఉచ్చరించును రవిమండలాంతర్వర్తియగు దేవునికి అర్ఘ్యమును కల్పించవలెను. అట్లు అర్ఘ్యప్రదానమును గావించి మూడుమార్లు ఈ మంత్రముచే దేవుని స్మరించవలయును. తరువాత స్వకల్పోక్త ప్రకారముగా అష్టోత్తర శత పర్యాయము గాయత్రీ మంత్రజపమును ఆచరించవలెను. లేనిచో ఇరువై ఎనిమిది మార్లు జపించవలెను. తరువాత ‘గుహ్య’ అనుమంత్రముచే అర్పణ చేయవలెను.

నక్షత్రయుక్తమైన ఆకాశమున ఉదయించుచున్న సూర్యునికాంతిగల, పుస్తకాక్ష మాలలు చేతియందు ధరించియున్న, కృష్ణాజినాంబరయగు సరస్వతిని ధ్యానించవలెను. మధ్యాహ్నమున వరదయగు పార్వతీదేవిని స్మరించవలెను. ఈ పార్వతీ దేవిని, శుక్లాంబరవృషారూఢ, త్రినేత్ర కవిబింబగత శ్రేష్ఠమగు పాశమును శూలమును, కపాలమును ధరించిన దేవిగా స్మరించవలెను. సాయంకాలమున రత్నభూషాఢ్య, పీతకౌశేయవస్త్ర, శ్యామర, చతుర్హస్త, శంకచక్రధారిణి, గదాపద్మధారిణి, సూర్యాసనకృతా శ్రయ యగు దేవిని స్మరించవలెను. తరువాత విధానమును తెలిసినవారు దేవతలను, ఋషులను, పితృదేవతలను తృప్తిపరిచి, తన ఇష్టదేవతకు తర్పణము చేయవలెను. తరువాత గురుపరంపరను పూజించి సాయుధుడగు వైనతేయుని తృప్తుని గావించవలెను. నారదుని, పర్వతుని, జిష్ణుని, నిశరుని, ఉద్ధవదారుకులను, విష్వక్సేనుని, శైతేయుని వే విష్ణుభక్తులు పూజించవలయును. తర్పణము చేయవలెను. ఇట్లు తర్పణములను గావించి సూర్యునికి అర్ఘ్యమునిచ్చి, పూజాగారమునకు వచ్చి పాదప్రక్షాళనమును గావించి ఆచమనమును చేయవలయును. అగ్నిహోత్రశాలలో ఉన్న అగ్న్యుప స్థానమును గావించి హోమములుచేసి, పూజా స్థలమునకు వచ్చి ద్వారపూజను ఆచరించవలెను. ఊర్ధ్వభాగమున గణేశుని, దక్షిణ భాగమున మహాలక్ష్మిని, వామ భాగమున సరస్వతిని, దక్షిణ భాగమున విఘ్నేశ్వరుని, వామభాగమున యమునా నదిని, దక్షిణ భాగమున ధాతను, వామ భాగమున విధాతను, వామ భాగమున శంఖమును, దక్షిణ భాగమున పద్మనిధిని, తరువాత ఆయా కల్పములలో చెప్పబడిన ద్వారపాలకులను పూజించవలెను. నందుడు, సునందుడు, చండుడు, ప్రచండుడు, ప్రచలుడు, బలుడు, భద్రుడు, సుభద్రుడు మొదలగువారు విష్ణు ద్వారపాలకులు. నంది, భృంగి, రిటీ, స్కందుడు, గణేశుడు, ఉమా, మహేశ్వరుడు, వృషభుడు, మహాకాలుడు వారు శైవద్వారపాలకులు. బ్రాహ్మి మొదలగు అష్టమాతృదేవతలు, స్వంయముగా శక్తి రూపముగా ద్వార దేశమున ఉందురు. తరువాత శుచియై ఆసనమున కూర్చుండి ఇంద్రియ నిగ్రహముకలవాడై దివ్య, అంతరిక్ష, భౌమ విఘ్నములను తొలగించుకొని, విష్ణు భక్తాగ్రేసరులు కేశవాని మాతృకలను వ్యాసము చేయవలయును. కేశవుడు కీర్తితో కలిసియుండును. నారాయణుడు కాంతితో, మాధవుడు తుష్టితో, గోవిందుడు పుష్టితో, విష్ణువు ధృతితో, మధుసూదనుడు శాంతితో, త్రివిక్రముడు క్రియతో, వామనుడు దయితతో, శ్రీధరుడు మేధతో, హృషీకేశుడు హర్షతో, పద్మనాభుడు శ్రద్ధతో, దామోదరుడు లజ్జతో, వాసుదేవుడు లక్ష్మితో, సంకర్షణుడు సరస్వతితో, ప్రద్యుమ్నుడు ప్రీతితో, అనిరుద్ధుడు రతితో, చక్రి జయతో, గదీ దుర్గతో, శార్ఙీప్రభతో, ఖడ్గ సత్యతో, శంఖి చండతో, హలి వాణితో, ముసలి విలాసినితో, శూలి విజయతో, పాశి విరజితో, కూశి విశ్వతో, ముకుందుడు వినతతో, నందజుడు సునందతో, నంది స్మృతితో, నరుడు వృద్ధితో, నరకజిత్తు సమృద్ధితో, హరి శుద్ధితో కూడియుండును. కృష్ణుడు బుద్ధితో, సత్యుడు భుక్తితో, సాత్వతుడు ముక్తితో, సౌరి క్షమతో, సూరమతో, జనార్దనుడు ఉమతో, భూధరుడు క్లేదినితో, విశ్వమూర్తి క్లిన్నతో, వైకుంఠుడు వసుధతో, పురుషోత్తముడు వసువుతో, బలి పరతో, బలానుజుడు పరాయణతో, బాలుడు సూక్ష్మతో, వృషఘ్నడు సంధ్యతో, వృషుడు ప్రజ్ఞతో, హుసుడు ప్రభతో, వరాహుడు నిశతో, విమలుడు ధారతో, నృసింహుడు విద్యుత్తో కూడియుండును. కేశవాది మాతృకలకు నారాయణముని చెప్పబడెను. గాయత్రీ ఛందస్సు, విష్ణువు దేవత, చక్రాధ్యాయుధములతో కూడియున్న కుంభ ఆదర్శధరుడగు, లక్ష్మీ సహితుడు, విద్యున్నిభుడు, బహుభూషాయుతుడగు శ్రీహరిని భజించవలయును. ఇట్లు ధ్యానించి శ్రీకామపుటితాక్షరయగు శక్తిని న్యాసము చేయవలెను. ఆ విష్ణు శక్తులతో ప్రణవాదికమును హృదయమునకు చెప్పవలెను. త్వక్, అసృక్ మాంస, మేదో, అస్థి, మజ్జి, శుక్రాద్యసువులను చెప్పవలెను. ప్రాణమును, క్రోధమును, మదమును, మొదలగు వాటిని దిక్కులలో ఉంచవలెను. మౌళియందు ఒకటి, ముఖమున ఒకటి, నేత్రములలో రెండు, చెవులలో రెండు, నాసికలలో రెండు, కపోలములయందు రెండు, దంతములలో రెండు, ఓష్ఠములలో రెండు, రసనామూలమున ఒకటి, కంఠమున ఒకటి, ఉంచవలెను. దక్షిణ బాహువున ‘క’వర్గను, వామబాహువున ‘చ’వర్గము, ‘ట’తవర్గలను పాదములలో, ‘ప’ఫలను కుక్షిలో ఉంచవలెను. పృష్ఠవంశమున అనుదానిని, నాభిలో ‘ఛం’ను, హృదయమున ‘మం’ను, ‘యా’ది సప్త ధాతువులను హంను ప్రాణమున, ఆత్మలో ‘లం’ను, క్రోధమున ‘క్షం’ను, క్రమముగా ఉంచి విష్ణు పూజా యోగ్యుడగును.

ఇక ఇపుడు శైవశక్తులను మాతృకలను చెప్పుచున్నాను. శ్రీకంఠుడు పూర్ణోదరితో అనంతుడు విజరతో, సూక్ష్మేశుడు శాల్మలితో, త్రిమూతకుడు లోలాక్షితో మహేశ్వరుడు వర్తులాక్షితో అర్ధీశుడు దీర్ఘఘోణతో, భారభూతి దీర్ఘముఖితో, తిధీశుడు గోముఖితో ఉండును, దీర్ఘ జిహ్వతో స్ధావరేశుడు, కుండోదరితో హరుడు, ఉర్ధ్వకేశితో ఘంటీశుడు, వికృతాస్యతో భౌతికుడు, సద్యుడు జ్వాలాముఖితో, ఉల్కాముఖితో అనుగ్రహుడు, ఆస్యతో అక్రూరుడు, విద్యతో మహాసేనుడు, మహాకాళితో క్రోధీశుడు, సరస్వతితో చండేశుడు, సిద్ధగౌరితో పంచాంతకుడు, త్రైలోక్యవిద్యతో శీరోత్తముడు, ఏకరుద్రకుడు మంత్రశక్తితో యుండును. కూర్మేశుడు కమరితో, ఏకనేత్రుడు భూతమాతతో, చతుర్వక్త్రుడు లంబోదరితో, అజేశుడు ద్రావిణితో, సర్వేశుడు నాగరితో, సోమేశుడు ఖేచరితో, లాంగలీశుడు మర్యాదతో, దారుకేశుడు రూపిణీతో, అర్ధనారీశుడు వారుణితో, ఉమాకాంతుడు కాకోదరితో, ఆషాఢి పూతనతో ఉండును. దండేశుడు భద్రకాలితో, అత్రీశుడు యోగినితో, శంఖినితో మీనేశుడు, తర్జనితో మేషేశుడు, కాలరాత్రితో లోహితుడు, కుజనితో శిఖీశుడు, కపర్దినితో ఛలగండుడు, వజ్రతో ద్విరండేశుడు, జయతో మహాబలుడు, సుమేశ్వరితో బలీశుడు, రేవతితో భుజంగుడు, మాధవితో పినాకి కలిసి ఉండును. ఖడ్గీశుడు వారుణితో, బకేశుడు వాయవితో, శ్వేతోరస్కుడు వీదారిణితో, భృగువు సహజతో, లకులీశుడు లక్ష్మితో, శివేశుడు వ్యాపినితో, సంవర్తకుడు మహామాయతో ఉండును. వీరందరు శ్రీకంఠమాతృకలు. వారి ఈశులుగా చెప్పబడిరి. ఈశ పదము చెప్పని ప్రదేశమునంతట ఈశపదమును చేర్చవలయును. ఈ మాతృకలను ముని దక్షిణామూర్తి గాయత్రీ ఛందస్సు చెప్పబడినది. అర్ధనారీశుడు దేవత. అఖిలప్రాప్తికొరకు వినియోగము, హలము బీజములు స్వరములు శక్తులుగా చెప్పబడినవి. షడ్దీర్ఘములతో కూడిన భృగుస్థాకాశముతో అంగన్యాసమును చేయవలెను. బంధూక స్వర్ణవర్ణాంగుడు, వరాక్ష అంకుశ పాశధారి, త్రినేత్రుడు దేవవంద్యుడు అగు అర్దేన్దుశేఖరుని చింతించవలెను. ఇట్లు హృదయాంతమున నాలుగు విధములుగా శివశక్తులను ధ్యానించి మాతృకాస్థలమున సౌబీజమాతృకాపూర్వమున మాతృకాన్యాసమును చేయవలెను. విఘ్నేశ్వరుడు ‘మ్రీ’తో, విఘ్నరాజు ‘శ్రీ’తో, వినాయకుడు పుష్టితో, శివోత్తముడు శాంతితో, విఘ్నకారకుడు స్వస్తితో, విఘ్నహర్త సరస్వతితో, గణనాథుడు స్వాహా దేవితో, ఏకదంతుడు సుమేధతో, ద్విదంతుడు కాంతితో, గజవక్త్రుడు కామినితో, నిరంజనుడు మోహినితో కపర్ది నటితో, దీర్ఘజిహ్వుడు పార్వతితో, శంఖుకర్ణకుడు జ్వాలినీతో కలిసి ఉండును. వృషధ్వజుడు నందతో, గణనాయకుడు సురేశితో, గజేంద్రుడు కామరూపిణితో, శూర్పకర్ణుడు ఉమతో, విరోచనుడు తేజోవతితో, లంబోదరుడు సత్యతో, మహానందుడు విఘ్నేశితో, సదాశివుడు కామదతో, ఆమోదుడు మదజిహ్వాతో, దుర్ముఖుడు భూతితో, సుముఖుడు భౌతికితో, ప్రమోదుడు సీతతో, ఏకపాదుడు రమతో, ద్విజిహ్వుడు మహిషితో శూరనామకుడు జంఖనితో కలిసియుండును. వీరుడు వికర్ణతో, షణ్ముఖుడు భృకుటితో, వరదుడు లజ్జతో, వామదేవేశుడు దీర్ఘఘోణతో, వక్రతుండుడు ధనుర్ధరితో, ద్విరండుడు యామినితో, సేనాని రాత్రితో, కామాంధుడు గ్రామణితో, మత్తుడు శశిప్రభతో, విమత్తుడు లోలనేత్రతో, మత్తవాహుడు చంచలతో, జటిదీప్తితో, ముండి సుభగతో, ఖడ్గి దుర్భగతో, వరేణ్యుడు శివతో, వృషకేతనుడు భగతో, భక్ష్య ప్రియుడు భగినితో, గణేశుడు భగినితో, మేఘనాధుడు సుభగతో, వ్యాపి కాళరాత్రితో కలిసియుండును. గణేశ్వరుడు కాళికతో ఉండును. వీరందరూ విఘ్నేశ మాతృకలుగా చెప్పబడిరి. ఈ గణేశమాతృకా గణము మునులచే చెప్పబడినది. ఈ గణమునను త్రివృద్గాయత్రీ ఛందస్సు. శక్తి గణేశ్వరుడు దేవత. షడ్దీర్ఘ బీజముతో అంగన్యాసముచేసి స్మరించవలెను. పాశాంకుశాభయవరములను ధరించువాడు, కంజహస్తుయగు పత్నిచే కూడి ఉన్నవాడు రక్త తనువు త్రినేత్రుడు గణాధిపతియగును. ఇట్లు ధ్యానించి స్వీయ బీజాపూర్వాక్షరాన్వితముగా న్యాసమును చేయవలెను. నివృత్తి ప్రతిష్ట. విద్యా, శాంతి, ఏధికా, దీపికా, రేచికా, మోచిర, పదా, సూక్ష్మా, అసూక్ష్మా, అమృతా, జ్ఞానామృత, అప్యాయనీ, వ్యాపినీ, వ్యోమరూపా, అనంతా, సృష్టి, సమృద్ధితా, స్మృతి, మేధా, కాంతి, లక్ష్మి, ధృతి, స్థీరా, స్థితి, సిద్ధి, జరా, పాలీనీ, క్షాంతి, ఈశ్వరికా, రతి, కామికా, వవరదా, హ్రాదినీ, ప్రీతి సంయుతా, దీర్ఘా తీక్ష్ణా, రౌద్రా, నిద్రా, తంద్రికా, క్షుధా, క్రోధినీ, క్రియాకారీ, సమృత్యుకా, పీతా, శ్వేతా, అరుణా, అనితా, అనంతా అనువారు కలామాతృకలు. ఆయా మాతృకాభక్తులా వారి వారిని పూజించవలెను. కలామాతృ కలకు ముని ప్రజాపతి. గాయత్రీ ఛందస్సు. శారద దేవత, హ్రస్వదీర్ఘాంతర తారలతో షడంగ న్యాసమును చేయవలెను. పద్మ, చక్ర, గుణ, ఏణములను ధరించునది, త్రిలోచన, పంచవక్త్ర, ముక్తాభూషయగు భారతిని భజించవలెను. ఇట్లు తార పూర్వముగా భారతిని ధ్యానించి కళాన్వితముగా ‘ఙ’న్త న్యాసము చేయవలెను. తరువాత మూల మంత్రమునకు షడంగ న్యాసమును చేయవలెను. హృదయాది చతుర్థ్యంతముగా జాతి సంయోజనము గావించి వ్యాసము గావించవలెను. నమః, స్వాహా, వషట్, హుం, వౌషట్, ఫట్, అనునవి జాతులుగా చెప్పబడినవి. తరువాత తమ ఇష్టదైవమును భూషాయుధ సమన్వితముగా ధ్యానించి, ఇష్టదేవతా మూర్తిలో షడంగ న్యాసమును చేసి పూజను ఆరంభించవలెయును. (3/66)