పిండదాన మాహాత్మ్య కథనము

పసుపు పలికెను: ఇక ఇపుడు నీకు తృతీయ దినమున చేయవలసిన దానిని, భుక్తి ముక్తి ప్రదాయకమగు గయా సంగమ ఫలప్రదమును చెప్పెదను. బ్రహ్మ సరస్సున స్నానముచేసి పిండ ప్రదానముతో శ్రాద్ధము చేయవలయును. ఋణత్రయ విముక్తికి, శ్రాద్ధము కొరకు, పిండ దానము కొరకు, తర్పణము కొరకు అర్ధసిద్ధికొరకు ఈ తీర్థమున స్నానమును చేయుచున్నాను. ఆ కూపయూపముల మధ్యన శ్రాద్ధము చేయుచు పితరులను తరింప చేయును. స్నానముచేసి పెరిగి యున్న యూపము బ్రహ్మయూపము అనబడును. బ్రహ్మ సరస్సునందు స్నానముచేసిన పితరులను బ్రహ్మ లోకముకు చేర్చును. గోప్రచార సమీపస్థములు బ్రహ్మప్రకల్పితములు ఆమ్రములు. వీటిని సేచన మాత్రమున పితరులు మోక్షమునకు వెళ్ళెదరు. బ్రహ్మ సరోద్భూతము, సర్వదేవమయము, విభువు విష్ణు రూపమగు ఆమ్రమును తడుపుచున్నాను. పితరులకు ముక్తి కలుగవలెను. కుంభ కుశాగ్రహస్తుడగు ఒక మునియే అమ్ర మూలమున సలిలమును ఉంచును. ఆమ్ర వృక్షములు తడియును. పితరులు తృప్తి పొందుదురు. ఒకే పని రెండు ప్రయోజనములను కలిగించును. ఆచమనముచేసి ఆమ్రమూలమున జలమునిచ్చు నరుని దేవతలు ఉపేక్షించరు. యూపమున ప్రదక్షిణమును చేసి వాజపేయ ఫలమును పొందును. బ్రహ్మకు నమస్కరించి పితరులను బ్రహ్మ పురమునకు చేర్చును.

“ఓం నమో బ్రహ్మణేజాయ జగజ్జన్మాదికారిణే.

భక్తానాం చ పితృణాంచ తారకాయ నమోనమః”

అను ఈ మంత్రముచే సమస్తమునుంచి “యమరాజ ధర్మారాజా అను ఈ మంత్రముచే సమస్తము నుంచి “యమారాజ ధర్మరాజౌ నిశ్చలార్థా వితిస్థితిః తాభ్యాం బలింప్రయచ్ఛామి పితృణాం ముక్తి హేతవే” అని మంత్రమును ఉచ్చరించవలయును. ఇక పూర్వ మంత్రముచే శ్వాస బలినిచేసి ఈ మంత్రముచే కాక బలిని చేయవలయును ఇంద్రవారుణ వాయవ్యాయామ్యా వైనైఋతస్తదా.

“వాయసాః ప్రతిగృహ్ణన్తు భూమౌ పిండం మయార్పితమ్” అనునది మంత్రము. తరువాత దర్భలను గ్రహించి బ్రహ్మతీర్థమున స్నానమును చేయవలయును. ఇట్లు మూడవ దినమున కృత్యమును పూర్తిచేసి గదాధరుని నమస్కరించి బ్రహ్మచర్య పరుడు కావలెను. నాలుగవ దినమున ఫల్గు తీర్థమున స్నానాదికము నాచరించవలెను. గయాశిరమున సపిండక శ్రాద్ధము నాచరించవలెను. గయాశీరమే ఇచట ఫల్గు తీవ్రత్రయమైనది. క్రౌంచపాదమునుండి ఫల్గుతీర్థము గయాశిరము వరకు ఉండును. గయాశిరమున నగాది నుండి ఉన్నది ఫల్గుతీర్థము. ఇదియే గయాసురుని ముఖము. ఇచట స్నానముచేసి శ్రాద్ధమును ఆచరించవలెను. ఆది దేవుడగు గదాధరుడు వ్యక్తా వ్యక్తము కొరకు పితరుల ముక్తి కొరకు విష్ణ్వాది పదరూపముగా యుండెను. ఇచట దివ్యమగు విష్ణుపదము దర్శన మాత్రము ననే పాపనాశనము. స్పృశించిననూ పూజించిననూ పితరులకు మోక్షమును ప్రసాదించును. సపిండకముగా శ్రాద్ధమును ఆచరించి తమ సహస్ర కులమును ఉద్ధరించి విష్ణు పదమున విష్ణు లోకమును చేర్చును.

రుద్ర పదమున శ్రాద్ధమును ఆచరించి తనతోపాటు కులశతమును శివపురమును చేర్చును. బ్రహ్మపదమున చేసిననూ ఇదే ఫలితము. దక్షిణాగ్ని పదమున శ్రాద్ధమును ఆచరించిన వాజపేయ ఫలము లభించును. గార్హపత్య పదమున శ్రాద్ధము చేసినచో రాజసూయ ఫలము లభించును. చంద్రపదమున శ్రాద్ధము నాచరించిన అశ్వమేధ ఫలము లభించును, సత్యపదమున శ్రాద్ధము సోమ లోకమును ఇచ్చును. చంద్రపదమున చేయు శ్రాద్ధము ఇంద్ర లోకమును చేర్చును. ఇతర పదములలో చేయు శ్రాద్ధము పాపులను కూడా సూర్యపురము చేర్చును. కార్తికేయ పదమునచేయు శ్రాద్ధము పితృలోకమునకు పితరులను చేర్చును. అగస్త్యపదమునచేయు శ్రాద్ధము బ్రహ్మలోకమున చేర్చును. అన్ని పదములలో కాశ్యపపదము శ్రేష్ఠము. తరువాత విష్ణు పదము రుద్రపదము బ్రహ్మ పదము సర్వశ్రేష్ఠముగా చెప్పబడినది. ప్రారంభమున కాని సమాప్తిలో కాని వీటిలో ఒక పదమున చేయవలెను. ఇచట శ్రాద్ధకర్తకు మేలు చేకూరును. పూర్వము కశ్యపపదమున భరద్వాజముని శ్రాద్ధమును పిండ ప్రదానమును చేయుటకు సిద్ధపడెను. అంతట ఆ పదమును భేదించుకొని శుక్ల కృష్ణ హస్తములు వెడలినవి. రెండు హస్తములను చూచిన భరద్వాజమునికి తండ్రి విషయమున సందేహము కలిగెను. అంత తన తల్లియగు శాంతను తండ్రి ఎవరని యడిగెను. ఈ కశ్యపపదమున శుక్ల హస్తమున చేయవలయునా, కృష్ణ హస్తమున చేయవలెనా తండ్రెవరో నీవు తెలియుదువు కదా అతని మాటను వినిన శాంత కృష్ణవర్ణునకు ఈయమని పలికెను. అపుడు భారద్వాజుడు కృష్ణహస్తునకు పిండ ప్రదానము చేయ సిద్ధపడెను. అంతట శ్వేత వర్ణుడు కనపడి నీవు నాకు జౌరస పుత్రుడవు కాన నాకిమ్మని అడిగెను. కృష్ణవర్ణుడు నీవు నా క్షేత్రజుడవు. నాకు పిండము నిమ్ము అని అడిగెను. నీ మాత స్వైరణి కావున నీవు నాకు జౌరస పుత్రుడవు అనెను. అంతట స్వైరిణీ పుత్రుడగు భరద్వాజుడు మొదట క్షేత్రికి, తరువాత బీజికి పిండ ప్రదానమును కావించెను. ఇట్లు భక్తిచే ఇరువురికి పిండ ప్రదానమును గావించి వారిరువురు ప్రత్యక్షముగా మాట్లాడినందున తనను తాను కృతకృత్యునిగా తలచెను. భీష్ముడు విష్ణు పదమున శ్రాద్ధమును చేయ సంకల్పించి పితరులను ఆహ్వానించెను. యధావిధిగా శ్రాద్ధమును ఆచరించి పిండ దానమునకు సిద్ధపడెను. అంతట గయాశిరమున తండ్రియగు శంతనుని హస్తములు చాపబడెను. కాని కరమున ఇచ్చుటకు అధికారము లేదని భీష్ముడు భూమి యందుంచెను. అంతట శంతనుడు సంతోషించి నీవు శాస్త్రార్థమున నిశ్చలుడవు. కావున త్రికాల దర్శిపై స్వేచ్ఛామరణము కలవాడవై అంతమున విష్ణు లోకమున చేరెదవు అని పలికి ముక్తిని పొందెను.

శ్రీరామచంద్రుడు రుద్ర పదమున పిండార్పణ చేయుటకు సిద్ధముకాగా తండ్రియగు దశరధుడు స్వర్గమునుండి చేయిచాచి వచ్చెను. శాస్త్రాతి క్రమ భయముచే శ్రీరాముడు చేతిలో నిడక రుద్ర పదమున ఇచ్చెను. అపుడు దశరథ మహారాజు రామునితో ఇట్లు పలికెను. నీవిట్లు రుద్ర పదమున పిండ ప్రదానము చేయుటచే నేను తరించితిని. నాకు రుద్ర లోకము లభించినది. కరమున పిండ ప్రదానము చేసిన స్వర్గము లభించదు. నీవు చాలా కాలము రాజ్యమును చేసి ప్రజలను చక్కగా పాలించి సదక్షిణలుగా యజ్ఞములను ఆచరించి విష్ణులోకమును చేరెదవు. అయోధ్యాజనులతో క్రిమికీటాదులతో విష్ణులోకము నకు వెళ్ళెదవు. ఇట్లు పలికి దశరధ మహారాజు రుద్రలోకమును చేరెను. కనకేశుని కేదారమును నారసింహుని వామనుని రథమార్గమున పూజించి పితరులనందరిని తరింపచేయవచ్చును. గయా శిరమున ఎవరి పేరుతో పిండ ప్రదానమును చేయునో వారు నరకములో ఉన్న యెడల స్వర్గమును, స్వర్గములో ఉన్న యెడల మోక్షమును పొందెదరు. గయాశిరమున కందమూల ఫలాదులచే కాని శమీపత్ర ప్రమాణముతో పిండ ప్రదానము కావించిన పితరులను స్వర్గమును చేర్చును. విష్ణ్వాది పదములు కనపడుచోట ఆ పదముల ముందు శ్రాద్ధము చేసినచో ఆయా లోకములకు పితరులు చేరుదురు. ముండ పృష్ఠాద్రి యంతట ఈ పదముల గుర్తులుండును. ఇచట పూజించబడిన పితరులు బ్రహ్మలోకమును చేరెదరు. గదచే గయాసురుని శిరము రెండుగా చేసి ఆ గదను ఈ తీర్థమున కడిగెను కావున గదాలోలము అనబడును. ఋషి క్రౌంచరూపముచే ముండ పృష్ఠమున తపము ఆచరించెను. అతని పాదముల ముద్రపడుటచే క్రౌంచపాదమని పేరు కలిగినది. విష్ణ్వాది పదములు ఇచట లింగరూపముగా నున్నవి. రుద్ర పదాది తీర్థములలో దేవాది తర్పణమును గావించి శ్రాద్ధమును ఆచరించి ఈ నాలుగవ దినమున కృత్యమును ఆచరించి పవిత్రుడై కర్మాధికారమును పొంది శ్రాద్ధమును చేయువాడు బ్రహ్మ లోకమును పొందును. ప్రేతశిలయందు కల తీర్థములందు స్నానము నాచరించి తర్పణము గావించి సపిండకముగా శ్రాద్ధము చేసినచో పితరులు బ్రహ్మలోకమును చేరెదరు. ఆ బ్రహ్మలోకముననే ప్రళయ కాలమువరకు ఉందురు. ఆనందింతురు. స్వేదజ అండజ జరాయుజ ప్రాణులన్నింటిలో శిలాపృష్ఠమున తనువును చాలించిన ప్రాణులు ఏడువందల తరములలో విష్ణు సాయుజ్యమును పొందెదరు. (II/46)