మత్స్య మహా పురాణము

Table of Contents

 265 - దేవతా ప్రతిష్టావిధాన కథనము.

సూతుడు ఋషులకు ఇట్లు చేప్పెను; ప్రాసాద పరిమాణమునుగాని లింగపరిమాణమునుగాని అనునరించి జ్యేష్ఠ మధ్యమ కనిష్ట పరిమాణములను దృష్టియందుంచుకొని ఋత్విక్ సంఖ్యయును ఇతర ప్రక్రియలును పాటించుచు లోగడ చెప్పినట్లు దేవతా ప్రతిమలకు అధివాసప్రక్రియను ముగించిన తరువాత యజమానుడు స్థాపక సహాయుడై శుభమును. (వుణ్యాహకర్మను) సమాహిత చిత్తతతో నేరవేర్చవలయును; పుణ్యాహమంత్రముతో (మంత్రమును పఠించుచు) పుష్పో దకముతో ప్రాసాద (దేవాయతన)మును ప్రోక్షించవలయును; తరువాత సంప్రదాయమును శాస్త్రమును ఎరిగి పక్ష సూత్రమును ద్వారసూత్రమును ప్రసారించవలయును; (దేవాగార ప్రధానద్వారపు నడిమినుండి తిన్న గ గర్భగృహపు పడమటి గోడలోపలి అంచువరకును ప్రాక్పశ్చిమములుగా ప్రసాదించు సూత్రము ద్వార సూత్రము; గర్భగృహపు ప్రాక్ వశ్చిమాయామముల నడిమి బిందువునకు తిన్న గా దక్షిణా త్తరములుగా ప్రసాదించినది పక్ష సూత్రము; ఈ రెండును కలియుచోటు గర్భగృహపు మధ్యస్థానమగును; ఇచట దేవతార్చామూర్తి మధ్యస్థానము రావలయును. ఇట్లు మూర్తిని ప్రతిష్టించదగిన గర్భగృహపు మధ్యస్థానమును గురుతించిన తరువాత దానిని కాస్త వస్థానమునుండి కొంచెము ఈశాన్యదిశగా నుండునట్లు చూచి ఆది దేవతామూర్తి మధ్యస్థానమగునట్లు ప్రతిష్ట జరుపవలయును. ఏలయన. ఈశాన్యదిశను కాని ఉత్తర దిశను కాని యాశ్రయించియుండు దేవతామూర్తినే దేవతలును పూజింతురు; ఇట్లు ప్రతిష్టించుట ఆయురారోగ్య ఫలప్రద మును .శుభకరమును; మరియొక విధముగ ప్రతిష్టించుట అశుభకరమని తెలిసిన వారు అందురు.

దేవతామూర్తిని ప్రతిష్టించు స్థానమందు మొదట ‘కూర్మశిల’ అనుశిల యుండవలెను. దాని పైనుంచు శిలను ‘బ్రహ్మశిల' యందురు; ఇది కూర్మశిలకంటే అధిక పరిమాణములోనుండును; దానికిని పైభాగమునందు పూర్వోక్తమగు మానము (కొలతలతోను లక్షణములతోను 'పిండికా' 'పీఠికా’ శిలను ప్రతిష్టించవలయును; పుణ్యాహవాచనమును ప్రోక్షణమును గర్భాలయ మధ్యస్థాన-తదీశాన్యస్థానముల నిర్ణయమును ఐనతరువాత ఈ “పిండిక'  ‘పీఠిక'ను పంచగవ్యము తోను కషాయ(వగరు) జలముతోను మంత్రపఠన పూర్వకముగా ప్రక్షాళనము చేయవలయును; దేవతార్చామూర్తి విషయ మున వినియోగించు మంత్రమునే ఆ మూర్తిప్రతిష్టకగు పీఠికాఒవక్షాళనమందును వినియోగించవలెను; తరువాత దేవతార్చా మూర్తిని 'ఉత్తిష్ఠ బ్రహ్మణస్పతే' అను మంత్రముతో లేవదీసి గర్బాలయములోనికి తీసికొనివచ్చి పీఠికాంతమునందు విచక్షణుడై ఉంచవలయును; అచ్చట ఆమూ ర్తికి ఆర్యపాద్యాదులను మధుపర్కమును ఈయవలెను; తరువాత ఒక ముహూర్త కాలము విశ్రమించి రత్న న్యానమును (అష్ట దిశల యందును ఆయా రత్నముల నుంచుట) జరుపవలెను. వజ్రము మౌక్తికము వైదూర్యము శంఖము స్ఫటికము పుష్యరాగము ఇంద్రనీలము నీలము అనురత్న ములను తొలకము శిలావజము గంధకము శ్యామాంజనము కాక్షి . కాసీసము . మాసికము (తేనె మైనము) గ్రే రికము అను అలంకారోపయుక్త రసద్రవ్యములను గోధూమ యవతిలముద్ద నీవార శ్యామాక వర్షప (ఆవాలు) ద్రోహుల (వరిధాన్యము)ను ధాన్య విశేషములను చందనము ర క్తచందనము అగురు అంజనము ఉశీరము (వట్టివేళ్లు) వైష్ణవి . సహదేవి - లక్ష్మణ - అను మూలికౌషధీ ద్రవ్యములను పూర్వాది దిశలందు వరుసగా ఆయాలోక (దిక్) పాలుర నామములతో తత్తన్మంత్రములతో ప్రణవపూర్వకముగా ఉంచవలెను; ఇదియే రత్న (రత్నాది) న్యాసము.

తరువాత బ్రహ్మ స్థానమునందు 1. సర్వబీజములను ధాతువులను రత్న ములను ఓషధులను తూర్పునందును ఆగ్నేయమందు మొదలుగా 2. కాంచనము 3. పద్మరాగము 4. పారదము (పాదరసము) 5. పద్మము 6. కూర్మము 7. ధర 8. వృషము అను ఓషధ్యాదిక మును అన్ని దిక్కులందు నుంచవలేను; అట్లే ప్రాగాదిగా 1. కనకము 2. విద్రు మము (పగడము) 3. తామము 4. కాంస్యము 5. ఆర కూటము(ఇత్తడి) 6. రజతము 7. విమల పుష్పము 8. లోహము (ఇనుము) ఇవియు ఉంచవలయును; ఇవియన్నియును బ్రహ్మస్థానమందు పరస్పరము కలిసిపోవును; ఇవి వేరు వేరుగా దొరుక నపుడు రత్నా దికమునకు మారుగా కొందనమును ధాతువులకన్నిటికి మారుగా హరితాళమును బీజములక న్ని టీకి మారుగాయవలను ఓషధులన్నిటి స్థానమున సహదేవిని ఉంచవచ్చును; లోకపాలాత్మ కములగు మంత్రముల (అర్థముల)ను ఇపుడు చెప్పెదను; ఇంద్రునకు: ఇంద్రుని విశేషము ఏమనిన-ఆతడు దృఢముగా ప్రజ్వలించువాడు . సర్వదేవాధిపుడు - గొప్పవాడు - వజ్రహస్తుడు మహాసత్వుడు . అతనికి సదా నమస్సు - నమస్సు; అగ్ని కి: అగ్ని పురుషుడు (శూరుడు) రక్త వర్ణుడు - సర్వదేవమయుడు - జ్వాలలు కలవాడు . ధూమము అతని ధ్వజము(జెండా). అతడు అనాధృష్యుడు (ఎవరికిని ఎదిరించనలవి కానివాడు. అతనికి ఎల్లప్పుడును నమస్సు - నమస్సు; యమునకు: యముడు నల్లకలువ పూబోయవాడు - కిరీటి - దండధరుడు . ధర్మసాక్షి - విశుద్ధాత్ముడు - అతనికి నిత్యమును నమస్సు - నమస్సు; నిరృతి కృష్ణపురుషుడు - సర్వరక్షోధిపతి - గొప్పవాడు - ఖడ్గహస్తుడు - మహాసత్వుడు - అతనికి సదా నమస్సు-సమస్సు; వరుణునకు: వరుణుడు- తెల్లనివాడు విష్ణురూప పురుషుడు నదీపతి - పాశహస్తుడు - మహాబాహుడు - అతనికి సదా నమస్సు-నమస్సు; వాయువు నకు: వాయువు అన్ని వన్నె లును గలవాడు. ఆన్నీ వాసనలను మోయువాడు; అయినను శుభుడు ధ్వజహస్తుడగు పురుషుడు. అతనికి సదానమస్సు-నమస్సు; సోమునకు: సోముడు గౌరవర్ణపురుషుడు - సర్వోషధీయుక్తుడు - నక్షత్రాధిపతి - సౌమ్యుడు. అతనికి ఎల్లప్పుడును నమస్సు - నమస్సు; ఈశానునకు: ఈశానుడు శుక్ల (తెల్లని) పురుషుడు - నర్వవిద్యాధిపతి - గొప్ప వాడు - శూలహస్తుడు - విరూపాక్షుడు - అతనికి నిత్యమును నమస్సు - నమస్సు; బ్రహ్మకు: పద్మము ఈతని జన్మ స్థానము - ఇతడు చతుర్మూర్తి వేద ముల ప ఆశ్రయుడు - ఎల్లరకును తాత - యజ్ఞాధిపతి - చతుర్ముఖుడు - ఆతనికి సదా నమస్సు. నమస్సు; ఆనంతు(ఆది శేషు)నకు: ఎవడు సదా 'అనంత' అనబడు రూపముతోనుండుచు సచరాచర బ్రహ్మాండ మును పూవునువలె తన తల ఫై నిలుపుకొనునో ఆతనికి నిత్యమును నమస్సు-నమస్సు; ఈ మంత్రములు దేవతార్చా నర్వకార్యములందును న్యానములకును బలినివేదనమునకును ప్రణవ పూర్వకముగా వినియోగించవలసిన మంత్రములు: ఇవి వృద్ధిని పుత్రులను ఇతరములగు సత్ఫలములను ఇచ్చును; ఇట్లు మంత్రపఠన పూర్వకముగా న్యాసము జరిపి మూర్తిని ప్రతిష్టించవలసిన పీఠిక యందలి గోతిని పొయనముతో పూసి దాని పై యథాశ క్తిగ తెల్లని వస్త్రముతో కప్పవలయును.

తరువాత దేవేశుని (దేవతార్చామూర్తిని) లేవదీసి కొంత సేపు తనకు ఇష్టమగు శోభనదేశ మునందు ఉంచి 'ధ్రువా ద్యౌః' అను మంత్రముతో ఆ మూర్తిని దేవుని ప్రతిష్ఠించవలసిన పీఠపు గుంటయందు ఉంచ{ప్రతిష్ఠించవలెను: తరువాత ఆ మూర్తినందు స్థిరీకరించి అతని తల పై యజమానాచార్యులు తమ హస్తముంచి పరమ నద్(శ్రద్ధా)భావముతో నిష్కలరూపుడగు దేవ దేవుని ధ్యానించవలయును; దేవవ్రతసామమును రు దసూక్తమును పఠించవలయును; యజమానుడు తన్నే నాసాభరణభూషితుడగు ఈశ్వరునిగా (ప్రతిష్టించవలసిన దేవునిగా) భావన చేసి ఏయే దేవతలకు ఏయే రూపము కలదో ఆయా రూపములను ఆయా దేవతాప్రతిష్టార్థమై మనసాస్మరించి ధ్యానించవలయును. ఎట్లనగా-నల్ల ఆ విసిపూవన్నె వాడును శంఖచక్ర గదాధరుడును దేవేశుడును నగు జనార్ధనుని (విష్ణుని) నేనే ఆ దేవుడునుగానై ప్రతిష్ఠించుచున్నాను; త్రినేత్రుడును దశ భుజుడును చంద్రార్లశేఖరుడును ప్రమథగణాధిపతియు వృషభస్తుడును నగు త్రిలోచనుని శివుని ప్రతి షింతును. ఋషులచే స్తుతింపబడు దేవుడును చతుర్ముఖుడును జటాధరుడును ఎల్లరకును పితామహుడును మహాబాహుడును అంబుజ సంభవుడు నగు బ్రహ్మను ప్రతిష్టింతును. నహన కిరణుడును శాంతుడును అప్పరోగణయుతుడును పద్మహస్తు డును మహాబాహుడు నగు రవిని ప్రతిష్ఠింతును; ఇవియేకాక రుద్రప్రతిష్టకే రౌద్రములును విష్ణుప్రతిష్ఠ కె వైష్ణవములును బ్రహ్మ కై బ్రాహ్మణములు (బ్రహ్మ నంబంధులు)ను రవికై సౌరములును నగు వైదిక మంత్రములను మరి యితర దేవ తల కాయా దేవతా సంబద్ధ వైదిక మంత్రములను జపించ(పఠించ)వలయును; ఏలయన వేద మంత్రపూర్వకమగు ప్రతిష్ట ఆనందదాయిని; గర్భ గృహపీఠమందు ప్రధాన దేవతామూర్తిని ప్రతిష్టించి ఆతనికి పార్శ్వస్థులగు గణనంది మహాకాళ వృష భృంగిరిటి గుహ పార్వతీ వినాయక విష్ణు బ్రహ్మ రుద్ర శక్ర (ఇంద్ర) జయంత లోకపాలాప్సరో గంధర్వగణ గుహ్యకారులను అతని పరివార దేవతలుగా గ్రహించి (తన ఇచ్ఛానుసారము వారిలో కొందరను) వారివారి స్థానములందు వారి వారి వైదిక మంత్రములతో ప్రతిష్ఠించవలయును: అందు రుద్రున కై ఆవాహన మంత్ర(పు ఆ ర్థ)ము ఇది:

ఎవనీ రథమున సింహములు వ్యాఘములు భూతములు సర్పములు పూంచబడియుండునో ఋషులు లోక పాలురు నందదేవుడు నందివృషము ప్రియ ప్రమథగణము మాతృకలు సోముడు విష్ణుడు బ్రహ్మ నాగ యక్షగంధర్వాది దివ్య ఖేచరులు ఎవనిని పరివారించియుందురో అట్టి త్రినేత్రుడు ఈశానుడు శివుడు రుద్రుడు ఉమాపతియగు మహాదేవుని వృషభధ్వజుని అతని పత్ని తో ప్రమథగణముతో కూడ ఆవాహన మొనర్చుచున్నాను; నర్వమును ప్రణవమయము; రుద్రా! భగవన్! నన్ను అనుగ్రహింప రమ్ము: శివ శుభరూపు)కరుడవు కమ్ము: భగవన్! నీవు ఇందు శాశ్వతుడవయి నా పూజను గ్రహించుము. నమోనమః. మరికొన్ని వాక్యములు: ప్రణవరూపునకు ప్రణవపూర్వక నమస్సు: భగవానునకు నమః పూర్వక స్వాగతము; ఉమతో ప్రమథ గణముతో ఇతర పరివారముతో కూడిన రుద్రునకు ప్రణవపూర్వక నమస్కారము: భగవానుడు బ్రహ్మచే వేదమంఝూర్వకముగా ఈయబడిన మంత్రపవిత్రమగు ఈ అర్ఘ్యపాద్యాచమనీయాననాదిక మంతయు గ్రహించవలయునని ప్రార్థన; నమోనమః స్వాహా.

ఇట్లు ఆవహించిన తరువాత పుష్కలమగు పుణ్యాహ ధ్వనులతో వేద మంత్ర ధ్వనులతో దధిక్షీర ఘృతము లతో మధుశర్కరాపుష్ప-గంధజలములతో దేవునిన్న పనము చేయించవలయును: ఆ సమయమున దే)శివధ్యానే కచిత్తుడై ఈ మంత్రముల నుచ్చరించవలయును: 1. యజ్ఞాగ్రతో దూరముచేతి: 2, తతో విరాడజాయత: 3. సహనశీరాపురుషః: 4. అభిత్వాశూర నోనుమః: 6. పురుష ఏవేదం నర్వమ్: 6. త్రిపాదూర్ద్వం: 7. యేనేదం భూతమ్: 8. నత్వాహం అన్యో: ఈ మంత్రముల నన్నిటిని ప్రతిష్టాకార్యములందు మరల మరల జపించుచు జలముతో నాలుగుమారులు ఆర్చామూర్తి పాద నాభిశిరః ప్రదేశములను స్పృశించవలయును; దీనితో ప్రతిష్టా ప్రక్రియ ముగిసినట్లే; అనంతరము యజమానుడు ఆచార్యు (ప్రధాన ఋత్విక్ - స్థాపకు)ని మూర్తిపులను (ఇతర ఋత్విక్లను) భ క్తి పూర్వకముగా వస్తాలంకార భూషణములతో పూజించ(ఆదరించవలెను; అచటకు వచ్చి యున్న ఇతర జనులను దీనులను అంధులు మొదలగు దయనీయ జనులను కూడ యథోచితముగా ఆదరించవలయును.

అనంతరము మొదటిదినమున తేనేతోను రెండవ దినమున పసపుతోను . తెల్ల ఆవల(పిండి)తోను మూడవ దినమున చందనములతోను యవల (పిండి)లోను నాలుగవదినమున ప్రియంగు (ప్రేంకణపుపూవు) చూర్ణముతోను మనః శిలాధాతువుతోను దేవుని ఆర్చామూర్తికి పూత పూయవలయును; ఏలయన ఇట్లు పూత పెట్టుట నరులకు సౌభాగ్యమును శుభమును వ్యాధినాశమును పరమప్రీతి సుఖములను కలిగించునని వేదతత్వ విదులు చెప్పుచున్నారు; ఐదవ దినమున కృషాంజనము తోను తిలల (పిండి )తోను ఆరవనాడు నేతితో చందనముతో పద్మ కేనరముతోను ఏడవ దినమున గోలో చనముతో అగురుతోను పూవులతోను పూతపూయవలెను; (ఇది యంతయు లోగడ తెలిపిన ఆధివాన ప్రక్రియ జరిపిన దినములు ఎన్ని యో ఆన్ని దినములపాటు ఈ లేపన ప్రక్రియ జరుపవలెనని సూచించుచున్నది; ఇట్లుకాక) సద్యోజధివాస ముతో ప్రతిష్ఠ జరిపిన సందర్భములలో ఈ పూతలన్ని యు ప్రతిష్ఠానంతరము ఒకేసారి వరుసగా చేయవలెను.

ప్రతిష్టానంతరము దేవుని మూర్తిని మరల నెన్నడును కదలించరాదు; కదలించినచో దోషభాక్కు అగును.

కూర్మశిలా-బ్రహ్మశిలా- పీఠికా స్థానముల గోతిని ఇసుకతో నీరంధ్రముగా నింపవలయును; అట్లు ఆవికాని వాని మూలమున దేవతామూర్తి కాని కదలకుండునట్లు చూడవలయును; మూర్తిని ప్రతిష్టించిన పీఠభాగ శ్వభమును కూడ ఇసుక సున్న ములతో గట్టిగ పూడ్చవలయును.

ఇంతచేసినను ఒక వేళ మూర్తి చలించినచో మరల అచట కదలిక లేకుండునట్లు భద్రపరచుటయే కాక ఈ కదలిక ఏదిశగా జరిగినదో ఆ దిక్పాలకుడు శాంతించుట కై ఇంద్రునకై సువర్ణాభరణములను అల్పధనవంతుడు యథా శ క్తిగ బంగారమునై నను 2. అగ్ని కై బంగారమును యమున కై మహిషమును 4. నిరృతికై అన్న మును సువర్ణమును 6. వరుణునకై ముత్తెములను ము తైపు చిప్పలను 6. వాయువునకై ఇత్తడిని వస్త్రయుగమును 7. సోమునకై ధేనువును 8. శివు నడై వృషభమును వెండిని దానము చేయవలయును; దీనిచే ఆయా దిక్కులందు కలిగిన చలనపు దోషము శాంతించును; లేనిచో కులనాశకరమగు ఘోరభయము కలుగును; అందును ఇట్టి చలనము కనబడ గానే ఇసుకతో (కలిపి నూరిన సున్నము మొదలగు వానితో) సురేశుని మూర్తిని కదలకుండ చేయవలేను: అన్న వస్త్రాది దానము జరిపి పుణ్యాహవాచనము జరుప వలయును; ఈ దినక్రమమున నాలుగవ దినమున మహా స్నానమును చతుర్థికర్మ ప్రక్రియను (ప్రతిష్ఠవంటి ప్రక్రియను) జరుపవలయును; అపుడు కూడ ఋత్విగాదులకు మరల దక్షిణాదికము భక్తితో నీయవలెను: పాప వినాశ హేతువగు దేవ ప్రతిష్ఠావిధి నీకు తెలిపితిని. ఈ విద్యాధరులును దేవతలును విని ఆనందించేడు అనంత ప్రకారమగు ఈ విధానము ఇంతకు మునుపు కూడ పండితులనేకులు చాల మారులు బోధించిరి. వినిరి.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున దేవతా ప్రతిష్టా విధానమున ప్రతిష్టా ప్రక్రియయను రెండు వందల అరువది యైదవ యధ్యాయము.