మత్స్య మహా పురాణము

Table of Contents

154 - పార్వతి ఒడలి నలుపు విషయమున శివుడు ఆమెను పరిహసించుట॥

 “సుందరీ! తెల్లగా ప్రకాశించు నాదేహమున నీ మేని చాయ చందనవృక్షమును చుట్టుకొనిన నల్లని శుద్దమగు ఆడు త్రాచువలె నున్నది॥ మనోహరాకాశమున వెన్నెలతో కూడిన కృష్ణపక్ష రాత్రివలె నాకు దృష్టి దోషము కలిగించుచున్నావు॥” అనిన శివునితో పార్వతి కోపరక్త నేత్రయై కనుబొమలు వికృతముగా ముడివేసి బిగ్గరగా ఇట్లనెను॥ ప్రతివాడును తన బుద్ధి మాంద్యముచే తానే అవమానమందును॥ చంద్రభూషణా! యాచించిన వాడు ఖండనము (అవమానము) పొందక తప్పదు॥ ఏదో కోరి చిర కాలము నేనాచరించిన తపస్సునకు ఫలమీయవ మానము ఆడుగడుగున తగులుచున్నది॥ శర్వా! నేను కుటిలను కాను; ధూర్జటీ! నేను విషమనుకాను; నీవు విషము తల పై గంగా జలము-కంఠమున విషము) కలవాడవు; దోషాకరునకు (రాత్రిని ఏర్పరచు చంద్రునకు-దోషములకు గని యగు వానికి) ఆశ్రయుడవు; అని కీర్తిగాంచిన వాడవు; నేను పూషుడను ఆదిత్యుని దంతములును భగుడను ఆదిత్యుని కన్ను లును కాను! ద్వాదశాత్ముడగు ఆదిత్యు (సూర్యునకును ఇది తెలియును; నీ తప్పులు నీకు ఉండగా నన్ను నిందించు నీచే నాకు తలనొప్పిగా నున్నది; నన్ను కృష్ణ (నల్లనిది) అనిన నీకు మహాకాలుడు (చాల నల్లనివాడు) అని ప్రసిద్ధి లేదా! తపస్సుచే దేహము త్యజింప నేను గిరి కేగుచున్నాను॥ ధూర్తునిచే అవమానమందిన నాకు జీవితముతో పనిలేదు॥ ఇట్లు కోపముతో తీక్షాక్షరముగా పలికిన పార్వతి మాటలు విని తడబాటుతో మీ శ్రమయిన అనురాగమున చంద్ర శేఖరుడగు భవుడిట్లనెను:

గిరిజా! నీవు పర్వతరాజ పుత్రివికదా! నా విషయము నీకు తెలియదు॥ నేను నిన్ను నిందింతునా ? నిన్ను ప్రశంసించు తలపుతోనే విలాసమున కై ఆమాట అంటిని॥ స్వస్థ చిత్తము కలవానికి కూడ ఒకప్పుడు చిత్త వికారము కలుగవచ్చును॥ కాని నా చిత్తమున కట్టి వీకారము (మార్పు) ఎన్నడును కలుగదు॥ కాని పిరికిదానా ! ఒక వేళ నీకిందుల కై కోపమే వచ్చినచో మరెన్నడు వినోదములు పలుకను; శుచిస్మితా! (నిర్మలమగు చిరునవ్వు కలదానవు కమ్ము;) కోపము మానుము; దోసిలి వట్టి శిరసు వంచి నమస్కరించుచున్నాను॥ ఎంత స్నేహము కలవారై నను తను అవమానించినను నిందించినను వినోద వచనములు తగిలినను మనస్సు మార్పు పొందుట దుర్జనుల లక్షణము కానీ సజ్జన లక్షణముకాదు॥ కాని శివుడనిన పైమాట దేవికి మర్మమున తాకుట చే తరువాత శివుడేంత బుజ్జగించినను నచ్చ జెప్పినను ఆమే కోపము విడువలేదు॥ శంకరుడు చేతితో గట్టిగ పట్టిన వస్త్రపు కొంగు కూడ చట్టున కొట్టినట్లు వదలించు కొని గిరిజ చెదరిన ముంగురులతోనే పోవుటకు సిద్దపడెను॥ ఆమె ఆట్లు కోపముతో పోవుచుండ పురాంతకుడు మరల ఇట్లనెను: “నీవు అన్ని అంశములందును నీ తండ్రిని పోలిన కూతురవు; మేఘ సమూహములతో కల్లోలితముగా వ్యాప మయిన నీ తండ్రి శిఖరములతో నీ మనస్సును చోరశక్యముకాని ఆడవుల నుండి నీ హృదయమును ఏర్పడినవి; కఠినత్వము వనములందలి వృక్షముల నుండి నేర్చితివి; నీతండ్రియందలి త్రోవలనుండి వంకరలు నేర్చితివి; మంచు మొదలగువానినుండి ఎవరికిని సేవింపనలవి కాక పోవుట నీక బ్బినది॥ సుందరీ! ఇదియంతయు నీకు హిమవంతుని నుండి సంక్ర మించినది సుమా! అని శివుడు పలుక గిరిజ మరింత కోపముతో కన్ను లేరవడగా పెదవులు వణకుచుండ ఇట్లనెను:

“తప్పలారోపించి సద్గుణవంతులగు ఇతరులనెందులకు ఆడిపోసికొనెదవు? నీవనిన దోషములును మాకు దుష్ట సంసర్గము వలననే సంక్రమించినవి॥ నీకుగల) సర్పములనుండి వంకరతనమును నీ భస్మముతో స్నేహమును గట్టి పర చుటయు (బూడిద జిడ్డును॥ స్నేహమును-తొలగించును॥) నీ చంద్రుని వలన హృదయ మాలిన్యమును నీ కుత్తుక యందలి విషము వలన చెడు మాటలును మాకు వచ్చినవి; ఎక్కువ చెప్పవలసినదేమున్నది; నోటికి శ్రమ కలిగించు కొనవలదు; వల్లకాటియందు నివసించు నీకు భయమేమి ? దిసమొలతో సుండు నీకు సిగ్గేమి ? తల పు రైలు పట్టుకొని తిరుగు నీకు దయ ఏమి ? ఆదేప్పుడో పోయినది॥” అని పలుకుచు హిమాద్రి పుత్రి ఆ మందిరమునుండి వెడలిపోసాగెను॥ పార్వతి యట్టు పోవుచుండ ప్రమథులు కిలకిల (దుఃఖ) ధ్వని చేసిరి॥ అమ్మా ! ఎక్కడికి పోవుచున్నావని ఏడ్చిరి॥ వెంట పరుగెత్తి రి॥ వీరకుడు దేవి పాదములు పట్టుకొని కన్నీటితో డగ్గుత్తిక తో ఇట్లనెను: తల్లీ : ఇదియేమి ? కోపించిన మనస్సుతో ఎక్కడికి పోవుచున్నావు ? నీవు స్నేహము వదలిపోవుచున్నను నేను నీవెంట వత్తును॥ లేక నీవు నన్ను వదలినచో ఈగిరి శిఖరమునుండి క్రింద పడెదను॥ అనగా దేవి తన కుడి చేతితో వీర కుని మొగమెత్తి ప్రీతిచూపుచు) అతనితో ఇట్లనెను: నాయనా! శోకమును భావన చేయకుము॥ నీవు నా వెంట వచ్చుటకాని పర్వతాగ్రమునుండి పడుట॥ కాని తగదు॥ ఏ పనితో పోవుచున్నా నో చెప్పెద వినుము; హరుడు॥ నన్ను నల్లని దానవనెను; దానితో నామనస్సు గట్టిపడినది; కనుక నేను తపమాచరించి గౌరత్వము (తెల్లదనము) పొందుదును॥ ఈ దేవుడు స్త్రీలంకటుడనిపించు చున్నది॥ కనుక నేను వెడలిన తరువాత నీవు ఎట్టివారికి ఏ అవకాశమునీయక ద్వారరక్ష సేయుచుండవలయును॥ శిపునికడకు అన్యశ్రీ ఎవరును ప్రవేశింపరాదు॥ ఆ టైవరైన ప్రవేశించినచో నాకు చెప్పుము॥ తరువాత శీఘ్రమే నేను తగినట్లు చేయుదును॥ వీరకుడు వెంటనే సరే అనేను॥ తల్లి ఆజ్ఞ అమృతమయి కలిగించిన ఆహ్లాదముతో ఆతని నంతాపము తగ్గేను॥ శరీరమును మనస్సును చల్లనయ్యెను॥ అతడు వెంటనే అమ్మకు నమస్కరించి కడ్యాంతరమును కని పెట్టి చూచుటకై బయలుదేరెను॥

ఇది శ్రీమత్స్య మహాపురాణమున దేవాసుర సంగ్రామమున దేవీ తపోవన గమనమను నూట ఏబది నాలుగవ అధ్యాయము॥