మత్స్య మహా పురాణము

Table of Contents

165 - ప్రళయానువర్ణనము॥  

మత్యుడు మనువునకిట్లు చెప్పెను: యోగియు సత్యమూర్తియు అగు నారాయణుడు సూర్యుడయి మిగుల ప్రజ్వలించు కిరణములతో సముద్రముల నెండింపజేయును॥ సముద్ర నదీ కూప పర్వతములందలి జలమునంతను తన కిరణములతో గ్రహించి ఇట్లు భూస్థిత జలము త్రాగిన తరువాత పాతాళమునకు పోయి అచటి జలమును కూడ పీల్చును॥ తరువాత ఆరవిందా కుడగు ఆ పురుషోత్తముడు ప్రాణులయందలి మూత్ర రక్తాది ద్రవమును కూడ పీల్చును॥ బలవ ద్వాయులై అఖిల జగమును చలింపచేయుచు ప్రాణుల ప్రాణాపాన సమానాది పాయువులను కూడ లాగివేయును॥ తరువాత దేవగణాది సర్వ ప్రాణుల పంచేంద్రియ గుణములను పంచ భూతములను పృథివికుండు ఘణ గంధ శరీర ఘనీభవనములు (ఈ మూడును వరుసగా 1॥ ఇంద్రియము -2॥ దాని విషయము॥పృథివీ భూత లక్షణము) జలమునకుండు జిహ్వారస స్నేహములు అగ్ని కుండెడు చక్షూరూప విపాకములు పాయువునందలి ప్రాణ స్పర్శవిపాక ములును ఆకా శమునకుండు శ్రోత్ర శబ్ద శూన్యతలును ( వీటికి మూల తత్వమయిన సర్వప్రాణుల మనోబుద్ది క్షేత్రజ్ఞ (చైతన్య) త త్వ ములును వరేణ్యుడు ప్రార్థనీయుడు- శ్రేష్ఠుడు పరమేష్ఠి (సర్వోత్తమ స్థానమందున్న) హృషీ కేశుడు (ఇంద్రియాధిపతి) అగు భగవానుని ఆశ్రయించియుండు లోకమాయయు భగవంతునిచే ముహూర్తములో నశింపజేయబడును॥ తరువాత ఆ భగవానుని కిరణములతో చుట్టుకొనబడినదియు వాయువుచే ఆక్రమింపబడినదయి వృక్షశాఖల నాశ్రయించియుండు నదియు ఆ కొమ్మల రాపిడితో " పుట్టినదియునగు ప్రళయాగ్ని వందలవిధములుగా మండుచు నర్వము ను చుట్టుకొని దహించివేయును॥

ఆ అగ్ని పర్వతములు వృక్షములు గుబురులు పొదలు లతలు వల్లులు తృణములు దివ్య విమానములు (భవన విశేషములు) వివిధ పురములు వాటి నాశ్రయించదగినవి అన్నియు కాల్చును॥ లోక గురుడగు శ్రీహరి సర్వలోకములను భస్మీక రించి మరల అదే యుగాంతమున అదే ప్రక్రియతో ఆ అగ్ని ని చల్లార్చును॥ నల్లని మహామేఘ మే నూరుల విధముల వేలకొలది వానలు కురియించి దివ్యజలమను హవిస్సుతో భూమిని తడుపును॥ పాలవలెనుండి రుచికల శుభ పవిత్రోత్తమ జలముతో భూమి మహాతృప్తిని పొందును॥ వర్షమువలన ఏర్పడిన ఆ నీటి వరదతో కప్పబడినదయి భూమి సర్వప్రాణి రహితమయి ఏకార్ణవ జలావృత యగును॥ ఎంతటి మహాసత్వము (ప్రాణు)లును అమిత శక్తి శాలియగు పరమాత్మునందు ప్రవేశించును॥ జగమంతయు అర్క వాయ్వాకోశాదులు లేక రూక్షమయి (ఆర్గత లేక ) మరుగుపడగా అమిత వికముడు సనాతనుడునగు భగవానుడు సముద్రములను ప్రాణులను తనుదాను కూడ మొదట ఎండింపజేసికొని తరువాత దహించి పిమ్మట నీటితో ముంచెత్తి తానొక డేయుండి పురాణ ( మొదటి) శుద్ద రూపము నాశ్రయించి తాను నిద్రించును॥

ఇట్లా యోగి ఏకార్ణవ జలమునందు వ్యాపించి దానియందనేక సహస్ర యుగముల కాలము యోగమందుండును॥ సర్వలయమే యోగము॥) ఈ పరమాత్ముని ఎవ్వరును వ్యక్త రూపునిగాగాని ఆవ్యక్త రూపునిగాగాని నిశ్చయింప జాలరు॥ ఈ ఉత్తమ పురుషుడెవ్వరు? ఇతని యోగము ఏది? ఈ యోగి ఎట్టి యోగి? భగవానుడగు ఈ ప్రభువెంత కాలము ఏకార్ణవ స్థితియందుండును? అని ఎవరును ఎరుగరు॥ ఆ దేవసత్తముడొక్కడే కాని అతనిని చూచు వాడు తెలుపు వాడు తెలిసికొనువాడు పార్శ్వచరుడు ఎవరును ఉన్నట్లు శాస్త్ర ప్రమాణముచే తెలియదు॥ ఆకాశము భూమి వాయువు జలము ఆగ్ని - ఈ పంచభూతములను ప్రజాపతిని భువన రక్షకుడగు సురేశ్వరుని వేదముల కాశ్రయుడు మహామునియగు బ్రహ్మను తనయందు లయింపజేసి మరల ఏకార్ణవ జలమందు తన ఇచ్ఛతోనే శయనించియుండును॥

 ఇది శ్రీమత్స్యమహాపురాణమున ప్రళయాను వర్ణనమను నూట ఆరువది ఐదవ అధ్యాయము॥