మత్స్య మహా పురాణము

Table of Contents

108 - ప్రయాగ మాహాత్మ్యము

మార్కండేయుడింక ను ఇట్లు చెప్పెను: యుధిష్ఠిరా: ప్రయాగ మాహాత్మ్యమునింకను చెప్పేద; వినుము. నైమిశము పుష్కరము గోతీర్థము సింధు సాగరము గయ చైత్ర(ధనూక)ము గంగా సాగర (సంగమ)ము మొదలగు ముప్పదికోట్ల పది వేల తీర్థములును పుణ్య పర్వతములును సదా ప్రయాగ యందుండునని , విద్వాంసులు చెప్పెదరు. ప్రయాగ సమీపమున సర్వదేవ నమస్కృతయగు గంగ చూడగ్ని కుండముల నడుమగా ముంపునకు సాగివచ్చును. లోకత్రయ ప్రసిద్దయు సూర్యపు తొయు నగు యమునయు ఈ గంగయు అచట సంగమించును, ఈ గంగా యమునో మధ్యదేశము పృథివీ జఘనమని ప్రసిద్ధము. లోకత్రయమందలి మూడున్నర కోట్ల తీర్థములన్నియు కూడియు ప్రయాగ తీర్ధ షోడశాంశముతో సరిపోలవు. ఏలయన భూర్ భువః స్వరోక ములందలి తీర్ధములన్నియు నచట గలవు. అని సాక్షాత్ వసువు చెప్పెను. నాగ ప్రభువులగు కంబళాశ్వతరులును ఇచట నుందురు. శేషతల్ప శయనుడగు ప్రజాపతికి విష్ణునకు ఇది పడక యరుగు. తపోధనులగు మునులును ఋషులును మూ ర్తిమంతములగుచు వేదములును యజ్ఞములును నచట ప్రజాపతిని ఉపాసించుచుండును. దేవతలును చక్రవర్తులును నచట క్రతువులతో విష్ణు ప్రజాపతిని ఆరాధింతురు. త్రిలోకములందును ఈ ప్రయాగముకం టే పుణ్యతమమగు తీర్థ క్షేత్రము లేదు. మహాభాగయగు గంగ యుండుటచే ఆచోటు సర్వ తీర్థములకంటే అధిక ప్రభావ సంపన్న ము; పావనము.

గంగా తీరముతో కూడిన యాతీర్థము సిద్ధ క్షేత్రమని ఎరుగవలయును. ఈ సర్వ విషయమును సజ్జనులకును తన కుమారునకును తన మిత్రునకును తనకు ప్రీతిపాత్రుడగు శిష్యునకును తెలుపవలయును. ఈ తీర్థ క్షేత్రము ధన్యము; స్వర్గప్రదము; సేవింపదగినది; సుఖకరమయినది; పుణ్యప్రదము; కీర్తనీయము; పావనము; ఉత్తమ ధర్మరూపము; ఇది మహర్షులకును ఎరుగరాని గుహ్యత త్వము; సర్వపాపనాశక ము. నిర్మలమగు ఈ తీర్థ మాహాత్మ్యమును అధ్యయనము చేసినను విప్రులు స్వర్గ ప్రాప్తులగుదురు. శుచియై ఈ పుణ్యతీర్థ మాహాత్మ్యమును వినునతడు స్వర్గ సుఖములదు టేకాక తరువాతి జన్మములందును పూర్వజన్మ స్మృతి కలవాడగును. కావున యుధిష్ఠిరా! శిష్యులై సంప్రదాయము నెరిగిన వృద్దులతో కూడి నీవును ఈ తీర్థముల కేగి వానియందు స్నానమాడుము. నీకిక దుర్గతి యుండదు. రాజా! నీవు చక్కగా ఆడిగిన విషయమంతయు నీకు నేజెప్పితిని. నీ పితృ పితామహులందరును తరించినారు. లోకములందలి ఆ తీర్థములన్నియు కలిసియు ప్రయాగలో పదునారవ వంతునకు చాలవు; ఏలయన తీర్థము జ్ఞానము యోగము ఈ మూడును ఒకేచోట లభించుట దుస్సాధ్యము. ఇతర తీర్థములకు ఇట్టి యోగ్యత లేదు. దీని మహిమను త్రికాలమును జపించుచుండుటచే స్వర్గ ప్రాప్తియగును.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున ప్రయాగ మాహాత్మ్యమను నూట ఎనిమిదవ అధ్యాయము.