మత్స్య మహా పురాణము
68 - సప్తమీ స్నపన వ్రతము
నారదుడు ఈశ్వరుని ఇట్లు ప్రశ్నించెను: ఉద్వేగము (భయమును కలవరపాటును) కలిగించు ఆద్భుత విషయములు సంభవించినపుడు ఏమి చేసిన చో వాటివలన సంభవించు అశుభము నశించును? శిశు మరణము ఆభి షేకము మొదలగు కార్యములందు (అశుభ నివారణము శుభవృది కలుగుటకు) ఏమి చేయవలయును?
ఈశ్వరుడు ఇటు చెప్పెను: నారదమునీ! పూర్వ జన్మమున చేసిన పాపములు ఈ జన్మమున రోగములు ఇతర దుఃఖములు ఇష్ట జనుల మృతి మొదలగు రూపముస ఫలించును. అవి నశించి శుభము కలిగించు విధానమును చెప్పెదను. బాలురును పాలు త్రాగు శిశువులు వృద్ధులు యౌవనస్థులు ఆకస్మికముగ మరణించుట . మరణించిన శిశువులు జన్మించుట ఆశ్చర్యకరములు భయాకులత్వమును కలిగించునవి అగు సంఘటనలు జరుగుట మొదలగు జనపీడ లను నశింప జేయు ‘స ప్రమీస్న పనము’ అను శాంతి ప్రక్రియ కలదు.
రాబోవు వరాహకల్పమున వైవస్వత మన్వంతరమున ఇరువది పెదవ మహాయుగమున హైహయ వంశమున కృతవీర్యుడను రాజు పుట్టి డెబ్బది ఏడు వేల సంవత్సరములపాటు సప్తద్వీపసహిత భూమండలమును పాలించును. చ్యవ నుని శాసమున అతని నూరుగురు కుమారులు పుట్టిన వెంటనే మరణింతురు. అతని కే సహస్రబాహుడు కాబోవు కమా రుడు (అర్జునుడు) శంఖచక్రాది ( రేఖారూప) చక్రవర్తిత్వ లక్షణములతో పుట్టును. ఈ పుత్రుడు (చ్యవన శాపముచే మర ణించక) జీవించుటకై కృతవీర్యుడు సూర్యుని అడుగగా అతడు అతనికి ఉపవాస వ్రతములతో వేదసూక్త పారాయణము మొదలగు వానితో కూడిన ఈ సూత్రము జంబును ప్రకియ ఆ శేష దుఃఖ శాంతిని కలిగించి కలి కల్మషములను నశింపజేయును.
సూర్యుడిట్లు చెప్పెను: రాజా! (కృత వీర్యా!) నీవు ఎక్కువ క్లేశము పొందవలసిన పని లేదు. నీ కుమారుడు చిరంజీవి కాగలడు. కలికల్మష నాశకమగు సప్తమీ స్నపనము (సప్తమినాడు స్నానము చేయించుట) అను స్నాన ప్రక్రియను సర్వలోక హితమునకై చెప్పెదను.
[కాలము] మరణించిన శిశువులు పుట్టుట పాలు త్రాగెడి శిశువులకు మరణాంతమగు వ్యాధులు కలుగుట మొద లగునవి సంభవించినపుడు తల్లి గర్భవతియైన ఏడవ మాసమునగాని బిడ్డని శై శవమున శుక్లపక్ష సప్తమినాడు కాని శిశువు నకు గ్రహతారాబలములు బాగుగా నున్న దినమున కానీ బాలుని జన్మ తిథి జన్మనక్షత్రములందు కాని శాస్త్ర సంప్రదాయ ముల నెరిగి దేవతల నారాధించవలయును. వృద్ధులు యువకులు మొదలగు వారికి ఆకస్మికముగ మరణాంతక వ్యాధులు ఉపద్రవములు కలిగినను అద్భుతములు సంభవించినను ఈ సప్తమీ న్న వనము జరుపవలేను.
[స్థానము] గోమయముతో అలికిన ప్రదేశమున (స్థితి) ఏకాగ్రభావముతో ఈ సప్తమీ స్నపనము చేయవలెను. (ద్రవ్యములు) ఎర్రని వడ్లనుండి చేసిన బియ్యముతో ఎక్కువ పరిమాణముగల ఆవుపాలతో మొదట సూర్యదేవతాక ములు రుద్రదేవతాకములు నగు మంత్రములతో ఆగ్ని లో ఆహుతులను వేల్చవలెను. తరువాత సూర్యదేవతాక ములును రుద్ర దేవతాకములు ఆగు సూక్తములతో వేరు వేరుగ ఈ ఇద్దరు దేవతల నుద్దేశించి ప్రతి ఋక్కుతోను స్వాహా ఆనీ పలుకుచు) నేతితో తడిపిన జిల్లేడు- మోదుగ సమిధలతోను యవలతోను నల్లని నూవులతోను. నేతితో నూటఎనిమిదేసి సారులు ఆహు తులు వేయవలెను.
తరువాత మంగళ పవిత్ర ద్రవ్యములతో మంగళ స్నానము జరుపుకొని యజమానుడు మంగళాలంకారములు వస్త్రములు ధరించి మంగళ శ రీరుడు కావలెను. వేదవిదుడు దర్భ పవిత్రపాణి యగు బ్రాహ్మణునిచే నాలుగు కోణము లందును రంధములు లేని నాలుగు (మామిడి పల్లవములు మొదలగునవి ఆలంకరించిన) మంగళ కలశములను స్థాపింప జేయవలెను. నాలుగింటికి నడుమ రంధ్రములేని మరియొక ఐదవ కలశమును నిలుపవలెను. దానియందు పెరుగును అక్షతలను వేయవలెను. (అక్షతము-దెబ్బ తిననిది; నడుము విరుగకుండునట్లు జోటిలో దంచి చేసిన బియ్యము అక్షతలు; అంతేకాని వేరు విధమగునవి కావు.) దీనిని అగ్ని దేవతాక ములగు మంత్రములతో అభిమంత్రించవలెను. ఈ ఐదిటిని సుగంధ జలముతో నింపవలేను. వాటియందు రావి మామిడి జువ్వి మొదలగు చిగుళ్లను అన్ని విధములగు ఓషధులను (భృంగము మొదలగునవి) తెల్ల గరికను ఫలములను కూడ వేయవలెను. పంచరత్నములను కూడ వేయవలెను. నూతన వస్త్రములతో చుట్టవలెను. ఏనుగలు గుర్రములు రథములు గోవులు మొదలగునవి తిరుగు స్థలములనుండి పుట్టనుండి నదీద్వయ-నదీసాగర-సంగమ ప్రదేశములనుండి సంపాదించిన శుద్దమగు (జల్లించిన) మట్టి కూడ వానితో వేయవలెను. నడుమ నున్న ఐదవ కలశమును మాత్రము రెండు వస్త్రములతో చుట్టవలెను. అంతట సూర్యదేవతాకములగు మంత్రము లను పఠించవలయును. అంగ వైకల్యములేని ఏడుమంది ముత్తైదువలను ఏడుమంది బ్రాహ్మణులను యథాశక్తిగా పూలతో వస్త్రములతో అలంకరణములతో సంపూజించి వారిచేత మరణించునంత దుర న్తములగు వ్యాధులకు లోనై బాధ పడుచున్న ఈ శిశువును (బాలుడుకాని బాలిక కాని) స్నానము చేయించవలెను.
స్నాన సమయమున ఆచార్యుడు ఈ ఆర్థ మిచ్చు మంత్రములను పలుకవలయును. “ఈ బాలుడు (బాలిక) దీర్ఘాయువగుగాక! ఈ శ్రీ (మాత) జీవించిన శిశువు కలది యగుగాక! ఆదిత్యుడు, చంద్రుడు గ్రహములు నక్షత్ర (మండల)ములు ఇంద్రుడు లోకపాలురు బ్రహ్మ విష్ణుమహేశ్వరులు ఇతర దేవతలును ఈ కుమారకుని (కుమారిక ను) సదా రక్షింతురు గాక ! ఇచట పిడుగుకాని అగ్ని కాని బాలగ్రహములు కాని ఈ శిశువునకును తల్లిదండ్రులకును ఏ పీడను కలుగ నీయకుందురు గాక !”
తరువాత ఈ శిశుమాత శిశువుతోను భర్తతోను కూడి . బ్రహ్మదేవుని సభయందలి పెద్దలను గురువులను పూజించవలెను. తరువాత ఒక తామ్ర పాత్రయందు నల్లని నూవులను నింపి దాని పై బంగారు (యమ) ధర్మరాజ ప్రతిమను ఉంచి దానినంతటిని గురువునకు సమర్పించవలెను. పిమ్మట వస్త్రములు బంగారు రత్నములు ఇచ్చి పిండివంటలు నేతి పాయసములు- వీనితో బ్రాహ్మణులను భుజింపజేసి పూజించవలయును. గురుని కూడ భుజింపజేయవలెను.
అపుడు గురువు ఈ యర్ధమునిచ్చు మంత్రములను పలుకవలయును: “ఈ బాలుడు (బాలిక) దీర్ఘాయువగుగాక ! నూరేండ్లు నిండుగా జీవించుగాక ! ఈ శిశుని పాపమంతయు బడబానలములో పడుగాక ! బ్రహ్మ రుద్ర వసు సుబ్రహ్మణ్య విష్ణు హుతాశనులు ఈ శిశువును అన్ని దుఃఖములనుండి కాపాడుచు వరముల నిత్తురుగాక!”. ఈ మొదలగు వాక్యములు మంత్ర రూపమున పలికిన గురుని యథాశ క్తిగ సమ్మానించి శ క్తియున్న చో కపిల గోదానము , చేసి నమస్క రించి వీడ్కొనవలయును.
తరువాత శిశుమాత శిశువుతో కూడి రవి శ కరులను నమస్కంచి హోమము చేయగా మిగిలిన ‘చరు’ ద్రవ్యమును ‘ఆదిత్యాయ నమోస్తు’ అనుచు భుజించవలయును. (చరువు. ఆవిరి బయటికి పోనీయక అత్తెసరుతో పాలతోనో నేతితోనో నీటితోనైన వరిబియ్యపు-గోధుమ నూక -యవలనూక - సీనిలో దేనితోనైన చేసిన అన్నము.)
ఈ విధానము ఆశ్చర్యకరములగు అపురూవపు సంఘటనలు జరిగినపుడు కలవరపాటు భయము కలిగించు సంఘటనములు దుస్స్వప్నములు సంభవించినపుడు కూడ ప్రశస్తమయినది. యజమానుని జన్మ నక్షత్రము మొదలగు నవి కల దినమున ఆయా నక్షత్రాధిదేవతలను పూజించవలయును. లేదా శుక్లపక్ష సప్తమినాడై నను ఈ శాంతి జరుప వచ్చును. (అందుచేతనే దీనికి సప్తమీ స్నపనమని పేరు.) దానివలన ఉపద్రవములు శాంతించును. శుభము కలుగును.
కృతవీర్యుడు సూర్యుని ఉపదేశానుసారము ఈ శాంతిక స్నానము తన కుమారునకు జరిపించుటచేతనే అతడు ఆర్జునుడు దీర్ఘాయుష్మంతుడై లక్ష సంవత్సరము లీ పృథివిని పాలించెను.
అని ఇట్లు సప్తమీ స్నపన ప్రక్రియను కృతవీర్యునకు తెలిపి రవి అంతర్ధానమునందెను.
రవినుండి “ఆరోగ్యమును అగ్ని నుండి ద్రవ్యమును ఈశ్వరుని నుండి జ్ఞానమును విష్ణునినుండి సద్గతిని కోరవలయును.(పొందవలయును.)
ఈ స్నాన విధానము మహాపాతక నాశనము; అక్షయ ఫలప్రదము; అని వేదతత్వ వేత్తలు చెప్పుదురు. అనన్య చితులే దీనిని వినిన వారికి కూడ దీనిని యథా విధానముగ ఆచరించిన ఫలము కలుగునని మునులు చెప్పుచున్నారు.
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున సప్తమీ స్నపన విధానమను ఆరువది ఎనిమిదవ అధ్యాయము.
