మత్స్య మహా పురాణము
183 - అవిముక్త మాహాత్మ్యము-ఈ క్షేత్ర విశిష్టతకు హేతువులు॥
ఈశ్వరుడిట్లనెను : పునర్జన్మ రాహిత్యము కోరు సిద్దులనేకులు సేవించినదగు ఆవిముక్త క్షేత్ర మహిమ నేరిగి ఆ పరమ క్షేత్రము నాశ్రయముగా చేసికొనవలెను॥ ఆది దేవ దేవుని గుహ్య స్థానము-గుహ్య తీర్థము-తపోవనము॥ దానికేగిన వారు మరల జన్మించరు॥పరమానందము కోరి జ్ఞానమునందు సమాహిత చిత్తులగు వారికి కలుగు ఉత్తమ గతి ఆవిముక్తమున మరణించినంతనే కలుగును: భవునకు దీనియందుగల ప్రీతి అనుత్త మమును అసమానమును; అచట అసంఖ్యేయమగు ఫల మును ఆక్షయ గతియు లభించును; ఇది పరమగుహ్యమగు శ్మశానము; దీనిని సేవింపని నరులు వంచితులయినట్లే; అచటి ధూళి రేణువులు గాలికి ఎగిరివచ్చి తాకినంతనే పాపకర్ములు కూడ ము క్తినందుదురు; శివుని నిత్య నివాసమగు ఆవిముక్తపు గుణములు ఇంతింత॥ఇటివి అని చెప్ప శక్యముకానివి; వానిని దేవ దానవ మానవులెవ్వరును వర్ణింప జాలరు; ఆహితాగ్ని - యజ్ఞకర్త॥ శుచి॥కాక తస్కరుడే ఐనను అవి ముక్తమున వసించువాడు ఈశ్వరాలయమున వసించినట్లే; అచట పుణ్యవంతుడు కాని వాడెవ్వడును లేడు; శ్రీ కాని పురుషుడు కాని తెలిసియే మానవ సహజ బుద్ధితోనో చేసిన ఏ పాప కర్మమయినను ఆవి ము క్షమును ప్రవేశించినంతనే ఈశ్వర ప్రసాదమున నశిం చును; నదులు సముద్రములు పర్వతములు క్షేత్రములు తీర్థ ములు భూత ప్రేత పిశాచములు ప్రమథగణ మాతృ గణములు మొదలగు॥ శ్మశాన సహజ పరివారములు అన్ని యు ఆ మహాత్ము నకు శివునకు ప్రియములు; అవి శివుని విడువవు; శివుడు వానిని విడువడు; ఆ ప్రభువచట నుండి గణములతో విహరించు చుండును: పాప దుష్కృత కారులగు దీనులను కృపణులను అతడు దయతోచూచి అచట నుండు వారికి పరమగతి నొన గును; భక్తాను కంపా వరుడగు ఆ భగవానునకు తిర్యగ్యోని గతములగు పశుపక్ష్యాది ప్రాణులయందును దయయే; భృగ్వంగిరసాదులగు మహావ్రతులగు సిద్దులును పరమ ఋషులును తమ పాపములు అగ్ని యందు వేసిన దూదివలె దగ్గ మగుట కై ఎచటికి యాత్ర చేయుదురో అట్టి అవిముక్తము పరమో త్తమ స్థానమెట్లు కాక పోవును?
ఆవిముక్త నివాసులకు కలుగు ఉత్తమగతి కురు క్షేత్రమునను గంగా ద్వారమునను పుష్కరమునను కలుగదు; తిర్యకాణులయినను అచటికి పోయి అది తమ నివాసముగా చేసికొనినచో తమ కాలము వచ్చి మృతినందీ ముకు లగుదురు; మేరు మందర పర్వత సమాన పాపరాశియయినను అవిముక్తము నకు పోగానే నశించును; ఇది మహా శ్మశా నము నిత్య శివాలయము॥ దేవ దేవుని గుహ్యమగు తీర్ష మును తపోవనమును; అచట శివుడనగు నాయందు భక్తిగల బ్రహ్మ విష్ణ్వాది దేవతలును యోగులును సిద్దులును వందలకొలదిమంది మద్భక్తులు నన్నే పరమగతిగా భావించి భగవానుడు సనాతనుడు (శాశ్వతుడు) నగు నన్ను పాసింతురు; జ్ఞాన తపోవంతులకు యజ్ఞక ర్తలకు కలుగు ఉత్తమగతులు అవిముక్త నివాసులకు కలుగును; లోకకర్తలును లోక సంహార కులునునగు బ్రహ్మాది దేవతలును సమ్రాట్ విరాట్స్వరూపులగు ఈశ్వరతత్వములును పునర్జన్మము కలుగనీయని ఉత్తమ లోకములును మహర్ణన స్తపస్సత్యలో కాదులును నా నుండి ఉద్భవించునవన్ని యు ఎచట నుండు వారికి లభించునో ఏది మనస్సునకును భూతభవిష్య వర్తమానములకును బ్రహ్మాది స్థావరాంత భూతములకును సాంఖ్యత త్వమునకును ముక్తికిని జన్మ హేతువో అట్టి ఆవిముక్తము నాశ్రయించువారు వంచితులు కాక తమ జన్మమును సఫల మొనర్చుకొన్న వారే యగుదురు; ఆది అన్ని తీర్థములందు స్థానములందు క్షేత్రములందు ॥ శ్మశానములందు తటాక ములందు కూపములందు జల ప్రవాహములందు శైలములందును ఉత్తమ మయినది; దీనిని శివ భక్తులు మృతినందబోవుచు సేవించినను ముక్తు లగుదురు; ఇది బ్రహ్మకు పరమస్థానము; బ్రహ్మకు ఆశ్రయము; బ్రహ్మచే సేవితము; బ్రహ్మచే రక్షితము; బ్రహ్మలోకములగు స ప్రభువనములును ఇవియే; కాంచన మేరుపర్వతము ఇదియే; ఇది మానన పరమయోగము; ఇది బ్రహ్మకు పరమ ప్రీతికరము; ఇచట భగవానుడగు బ్రహ్మ త్రిసంధ్యములందును ఈశ్వరుని యందు ఉండును॥ ఇది పుణ్యమగు వానిలో పుణ్యతమమగు స్థానము; పుణ్యము చేసినవారే దీనిని సేవింతురు; ఇచట ఆదిత్యోపాసన మొనర్చిన విప్రులు ఆమరత్వము నందిరి;
ప్రియా! ఇతరులను మూడు వర్ణములవారును (క్షత్రియ వైశ్య శూద్రులును) సమాహితులయి భవునియందు భక్తి గలిగి ఈ అవీ ము క్షమున తనువు విడిచినచో పరమగతి నందుదురు॥ ఇతరలగు కామ స్వేచ్చా)చారిణులును భోగపరా యణలగు స్త్రీలు కూడ ఇచట నివసించుచో తమ కాలము వచ్చి మృతి నందిన తరువాత పరమగతి (ముక్తి) నందుదురు॥ నియత మనస్కులగు యతులు కూడ ఇతర ప్రదేశములం దయినచో సంవత్సరమున ఎనిమిది మాసములు సంచరించుచు నాలుగు మాసము లొక చోట నుండుట విహితము; ఈ ఆవిముక్తమున ప్రవేశించిన తరువాత వారు సంచరించుచుండ నక్కరలేదు॥ (ఈ ఆవిము క్షమున యతులు ఏడాది పొడవునను కదలక ఓ కేచోట నున్న ను దోషము కాదు॥) అచట॥ నుండు వారికి దేహము ఉండదు॥ అని శాస్త్రమునందు కనబడుచున్నది॥ అచట పంచత్వము (మరణము) నందిన వారికి ముక్తి కలుగుట నిస్సంశయము; భవునియందు భక్తలయి సమాహితచిత్తలగు పతివ్రతలగు స్త్రీలును ఆవిముక్తమున దేహ త్యాగ మొనర్చి పరమగతి నందుదురు॥ ఇచట నరులకు దుర్లభమగు భోగముక్తులు రెండును లభించును॥ కావున ఇటకు వచ్చినవారు మరి యే తపోవనమునకును పోవ పనిలేదు॥ బ్రాహ్మణుడు సర్వభావముతో భవుని సేవింపవలయును; ఆట్లు॥ ఆవిముక్తమున వసించు విప్రుడు నాతో సమానుడగును; నేను దాని నెన్నడును విడువను॥ కావుననే దాని కవిముక్తమని పేరు; దానిని సేవింపని మూడులు పాపయుతులయి మరల మరల మలమూత్ర రేతస్సుల నడుమ నుండువారే యగుదురు; కొమము క్రోధము లోభము దంభము స్తంభము (విర్రవీగుట) ఆతిమత్సరము నిద్ర॥బద్దకము- అలసత్వము పిశునత్వము (కొండె ములు చెప్పుట) అను పదియు ఆవిము క్షమున ఇంద్రుడు స్వయముగ ఏర్పరచిన విఘ్నములు; వినాయకుడు కలిగించు ఉపసర్గము (ఉపద్రవము) పదునొకొండవది ఎప్పుడును తలమీద కూర్చుండి యుండును; ఇన్ని యున్న ను ఇవి భక్తుల నను గ్రహించు బుద్దతో వారికి శుభకరములే యగునను ఈ పరమ రహస్యము శాస్త్రముల పరిశీలించిన దేవదేవులును తత్వ దర్శులగు మునులును వచించిరి; మధు కైటభుల మేదస్సుతో తడిసినందున భూమికి మేదినియని వ్యవహారము కలిగెను; అముక్తమునందలి భూమికి మాత్రము వారి మీద స్సుతోడి సంబంధము లేదు; కావున ఇతర స్థానములందలి భూమికి వలె ఇచటి భూమిని సంస్కరింపకున్న ను ఆది స్వాభావికముగా పవిత్రము అగునని నిర్ణయించి మహాదేవుడిచటి॥ భూపవిత్రతను రక్షించుచున్నాడు॥
దేవదానవ గంధర్వ యక్షరక్షో మహానాగాది భక్తు లెవరు ఆవిము క్ర వాసియు వరదుడు అక్షరుడు వరమపద రూపుడు నగు మహాదేవుని పరమగమ్యముగ శ్రద్ధతో భావించి ఉపాసింతురో వారు ఆజ్యాహుతి అగ్ని హోత్రమునందు వలే శివునియందే ప్రవేశింతురు; ఈశ్వరున కాశ్రయమును శుభమును నగు ఆవిముక్తమును చేరిన వారు తాము మహాదేవునందే చేరిరని భావించవలయును; జపహోమ పరాయణులగు ఋషులును దేవాసురులును ము కాములగు యతులును అవిము క్షము సాశ్రయింతురు; ఇచట మృతి నందిన పాపియు ఎవడును నరకము నందడు; దీని నాశ్రయించినవా రెల్లరును ఈశ్వరాను గ్రహమున పరమగతి నందుదురు; ఈ క్షేత్రపు తూర్పు పడమరల పొడవు రెండున్నర యోజనములు రెండు యోజనము లని లోగడ చెప్పబడినది); దక్ష్మిణో తరముల వెడలుపు అర్ధ యోజనము; ఇది వారాణసీ నదీ శుక్ల నదుల నడుమ నున్న ది; అని ఈ క్షేత్ర విస్తారము ధీమంతుడగు మహాదేవుడు చెప్పెను; ఉత్తమ జ్ఞానమును మోక్షమును కోరి యోగసాధన నాశ యించి మన్నిష్ణులు (నాయందే శ్రద్ధ కలవారు) మత్పరాయణులు (నన్నే పరమగమ్యముగా భావించినవారు) ఆయి అవిము క్షమును వీడువక ఇట నివసించినవారు శాచ్యులుకారు (అభినందింపబడవలసినవారే); అన్ని నదులును సముద్రములును పర్వతములును యోగ క్షేమమును తపః క్షేత్రమును సిద్ద గంధర్వ సేవితమును నగు ఆవిముక్తమునందే యుండును; ఆవిముక్తము భూమ్యంతరిక్ష ద్యులోకములందలి సకల తీర్థము లను తన ప్రభావముచే అతిశయి )చి యున్నది; ద్విజులు ఎవరు నిరతమును ఆవిముక్తమునందే యుండి ధ్యాన మవలంబించి మనస్సును భవునందు యోజించి నమాహితచిత్తులయి ఇంద్రియముల నిగ్రహించి శత రుద్రియ(మను వేద భాగమును జపింతురో వారు కృతార్థులు; అట్టి భవభక్తులు నిశ్చయ ముగ ఆనంద మందుదురు; భక్తి కలిగి కామములనుప సంహరించి విషయ సుఖములకు బహిర్భూతులై శ క్తి ననుసరించి అన్ని సంగ ములను విడిచి తన మాచరించుచు ఇంద్రియములను మనస్సునునిగ్రహించుకొని ఆవిముక్త వాసులగు వారు శతకోటి కల్పముల తరువాత కూడ మరల జన్మింపరు; వారు పునర్జన్మ రహితులయి మహాదేవుడగు ఈశ్వరుని చేరి నిర్భయులయి యుందురు; ఇచట నుండువారిని భవుడు తానే దగ్గరకు తీసికొనును॥
మానవులకు సిద్ధి కలుగుటకే ఈ క్షేత్రమును శివు డుత్పాదించెను॥ ఆవిముక క్షేత్ర గుణములను ఉద్దేశ (పేరులు చెప్పుట) మాత్రముగా ఇట్లు తెలిపితిని; అవి నముద్రపు రత్నములవలే అనంతములు; భక్తులు కానివారి బుద్ధికిని మోహమును (ఇంకను మూఢత్వమును) భక్తులగు ప్రాణులకు బుద్ది వృద్ధిని కలిగించును; మూఢులు మోహితులయి ఇది శ్మశానమే యను భావముతో చూతురు; వందల విఘ్నములు కలుగుచున్న ను ఇట వసించు వివేకులు శోకరహితమగు పరమవద మందుదురు; ఆది జన్మజరామరణములు పోగొట్టు పరమ జ్ఞాన ప్రదమగు శివాలయము; పునరావృత్తి రహిత ముక్తి కోరువారి కది పరమగతి; దీనిని చేరితిని కాని కృతకృత్యుడ నయితినని భావించువాడు వివేకి; ఆవిము క్షమున లభించు ఇష్టగతి దానములతో యజ్ఞములతో తపముతో విద్యలతో లభించక పోవచ్చును; సంకరవర్థులు వర్ణరహితులు (ఏ వర్ణవ్యవస్థయు లేని దేశ ములవారు) చండాలురు జుగుప్సితులు (జనులచే అనహించుకొనబడు వారు) పాపపూర్ణ శ రీరులు మహాపాతకులు నగు వారికి ఇది పరమౌషధము; అని పండితులు చెప్పుచున్నారు; వేలకొలదిగా గల ఆయా ప్రాణి జాతు లందు పుట్టియున్న దేహధారియైనను అవిముక్త క్షేత్రమున మృతి నందినవాడు విశ్వేశ్వర భక్తు డే; వానికి పునర్జన్మ ముండదు; అందు ఆచరించిన జపహవన దానతపస్సు లన్నియు అక్షయ ఫలప్రదములు; ఇట్టివి చేసినవారు అచట నివ సించుచు తమ కాలము వచ్చి మరణమంది నిశ్చయముగ శివసాయుజ్య మందుదురు; పాప సహనములు చేసినను పశ్చాత్తాప మందీ అవీము క్షమున మరణించినను ముక్తి లభించును; అందు మరణించుటలో ఈ కాలము శుభమా అశుభమా యని మీమాంస చేయ పనిలేదు; స్థాణు(శాశ్వత)రూపుడు అద్భుత కార్యసమర్థుడు సర్వరక్షకుడు సర్వవిభుడు నగు॥ ఆ మహా దేవుని మాహాత్మ్యముచే ఉత్తరాయనమో దక్షిణాయన మో ఏదయినను మంచిదే॥
పూర్వము స్కందుడు చెప్పిన ఈ అవిముక్త క్షేత్ర విషయక వృత్తాంతమును విని ఋషులు ఎల్లరును తమ తమ శుభములగు అంతః కరణములతో దానిని భావన చేసిరి॥
ఇది శ్రీమత్స్య మహాపురాణమున స్కంద-ఋషి- సంవాదాంతర్గత దేవీదేవ సంవాద రూపమగు అవిముక్త మాహాత్మ్యము అను నూట ఎనుబది మూడవ అధ్యాయము॥
