మత్స్య మహా పురాణము

Table of Contents

220 - దైవ-పురుషకారముల తారతమ్య విచారము.

 “దైవపురుషకారములలో ఏది మేలైనదో నాకు తెలుపుము; దేవా! ఈ విషయమున నాకు కలిగిన సంశయము ఛేదింప వేడుచున్నాను;” అనిన మనువుతో మత్యుడిట్లనెను; దేహాంతరార్జితమగు స్వకర్మఫలము దైవమనబడునని ఎరుగుము. కనుక ఇందు మానుషమే (పౌరుషము - పురుష కారము) గొప్పదని మనీషులందురు. ఇంతేకాదు; ప్రతి కూలడై వమును పౌరుషముతో విహతమగును; పురుషకారము సరిగ నున్న చో దురదృష్టము కూడ అదృష్టముగా మారి ఫలము నిచ్చును. శుభము నాచరించు వారును నిత్యమును ప్రయత్న పరులునునగు కొందరకు ఈ జన్మమందు పౌరుషము పురుషయత్నము) లేక యే ఫలము కనబడుచున్న దనినచో వారి పూర్వజన్మ కృతకర్మము సాత్వికమయి ఫలమునిచ్చినది. అని అర్థము; పురుష కార్యకర్మముతో ఫలము కనబడు వారి పూర్వజన్మ కృతకర్మము (దైవము) రజోగుణ ప్రధానమయి యుండును; ఎంతో శ్రమతో చేసిన పురుష కారముతో ఫలము కలిగినపొ పూర్వజన్మ కృతకర్మము తామసము (తమో గుణ ప్రధానము) ఆయియుండును; రాజా! నరులు తమ ప్రార్థిత ఫలమును పురుష కారముతోనే పొందుదురు; అయినను పౌరుష (పురుషకార-పురుషయత్న) రహితులగువారు (సోమరులు) దైవమును మాత్రమే గొప్పదిగా ఎరుగుదురు భావింతురు.) కావున ఇట్లు త్రికాల (కృతపురుష కార) సంయుక్తమగు దైవము మాత్రమే సఫలమగును; పురుషకారము దైవసంపత్తితో కూడినదై ఫలించును; మనుజో తమా! దైవమును పురుష కారమును కాలమును - మూడును కలిసియే మనుష్యునకు ఫలము కలిగించును; కృషియు వర్షమును కలిసినచో ఫల(పంటల) సిద్దులు కనబడుచున్నవి; అవియును కాలమునందే కానీ అకాలమందేప్పుడును కావుకదా! కావున మానవులెప్పుడును. ధర్మయుక్తమగు పురుషకారము నాచరించుచుండ వలయును. ఆపదలయందును ఇట్లుండు వానికి ఇహపరములు రెండును నిశ్చయముగా ఫలము చేకూర్చును; అలసులును దైవపరాయణులును ఫలము నందజాలరు. కావున సర్వ (ప్రతియొక విధమగు) యత్నముతో ధర్మమాచరించవలయును. నృపేంద్రా! లక్ష్మి ఆలసులను దైవపరులను విడిచి ఉత్థాన నిరంతర ప్రయత్న) - పరులను మాత్రము వెదకి యత్న పూర్వకముగా వరించును; కావున సదా ఉత్తాన (నిరంతరోద్యోగ-నతత యత్న) పరుడు కావలయును. దైవము అదృష్టము.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున దైవపురుషకార తారతమ్య విచారములను రెండు వందల ఇరువదవ అధ్యాయము.