మత్స్య మహా పురాణము

Table of Contents

66 - సారస్వత వ్రతము

మనువు మత్స్య నారాయణునితో ఇట్లనెను: సరస్వతికి సంబంధించిన ఏవ్రతము చేత జ్ఞానము సౌభాగ్యము విద్యలయందు అత్యంత కౌశలము దంపతుల నడుమను బంధుజనములోను అభేద భావము విపులమగు ఆయుష్యము లభించునో దానిని నాకు తెలుపుము. అని ఇట్లడుగగా నారాయణుడిట్లనెను: రాజా! నీవు చక్కగా ఆడిగితివి. సారస్వత వ్రతమును తెలిపెదను. దీనిని కీర్తించినంత మాత్రముననే నర స్వతి సం తుష్టయగును.

ఈ వ్రతమును చేయదలచిన భక్తుడు ఆ దినారంభమున యథా శాస్త్ర విధానమున ఆరంభించి పూజ చేయ వలయును. లేదా ఆదిత్యవారమున గ్రహ తారాబల యు కదినమున బ్రాహ్మణులచే పాయసమును భుజింపజేసి వారి చేత స్వస్తి పుణ్యాహవాచనము జరిపించవలేను. వారికి తెల్లని వస్త్రములను బంగారును ఈయవలెను. తరువాత భక్తితో తెల్లని పూవులతో సుగంధపు పూతలతో గాయత్రిని పూజించవలెను.

“దేవీ! లోకపితామహుడు భగవానుడు అగు బ్రహ్మ సదా నిన్ను విడిచియుండడు. అట్టి నీవు నాకు వర ప్రదురాలవుకమ్ము, సర్వ వేదశాస్త్రములును నృత్తగీతాది విద్యలును నీ అధీనములు. అట్టి నీకృపవలన నాకును వాటి యందు సిద్దులు కలుగుగాక ! సరస్వతీ! లక్ష్మీ-మేధా-పరా (వాస్తత్వము) పుష్టి-గౌరి-తుష్టి-ప్రభా-మతి-అను ఈ ఎనిమిది శరీరములతో కూడిన నీవు నన్ను రక్షించుము.” అని దేవిని ప్రార్థించవలయును.

వీణాక్షమాలా కమండలు పుస్తక ధారిణియగు గాయతిని తెల్లని పూవులతో తెల్లని అక్షతలతో పూజించవలెను. సంప్రదాయ ధర్మమును ఎరిగి యజమానుడు ప్రతిపక్షమున పంచమినాడు సాయం ప్రాతఃకాలములందు దేవిని పూజించి సువాసినిని పూజించి మౌన వ్రతము పాటించి హవిష్యమును) భుజించవలయును. కుంచెడు బియ్యమును ఘృతపాత్రమును పాలను బంగారమును ఆ ముత్తైదువకు “గాయతీ పీయతామ్” అను మంత్రముతో దానమీయవలెను. ఈ వ్రత దినమునందు సంధ్యా కాలమునందు మౌనవ్రతమును పాటించవలయును. ఇట్లు పదుమూడు మాసములు జరుపవలెను. ఈ వ్రతకాలములో నియత కాలములందు నియత భోజనము తప్ప నడుమ ఏ ఆహారమును భుజించరాదు.

ఇట్లు వ్రతము ముగిసిన తరువాత తెల్లని బియ్యముతో నిండిన పాత్రలును వస్త్రముల జతను తెల్లని కంటి ఆవరణ వస్త్రముతో కూడ చక్కని గోవును దేవిని పూజించిన మండపపు పొందినీనుంచి తీసిన ముక్కను చందనమును అంగవస్త్రముల జతను పెరుగన్నముతో నిండిన గరిగ పాత్రను కూడ దానముగ ఈయవలయును. తరువాత తనకు ఉప దేష్టయగు గురుని భక్తితో వస్త్ర మాల్య సుగంధ ద్రవ్యములతో పూజించవలయును. ఏ విషయమునను ధనమునకు లోభము చూపరాదు.

ఈ విధానము ననుసరించి సారస్వత వ్రతము నాచరించువాడు విద్యావంతుడును ధనవంతుడును మధురమగు కంఠము కలవాడునునగును. సరస్వతీ ప్రసాదమున బ్రహ్మలోకమున సుఖించును. దీనిని స్త్రీ ఆచరించినను ఈ ఫలమును పొందును. ముప్పదివేల కల్పములంత కాలము బ్రహ్మలోకమున వసించును. ఈ సారస్వత వ్రతమును వినినను చదివినను అట్టివారు కూడ ముప్పదివేల కల్పముల కాలము విద్యాధర లోకమున వసింతురు.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున సారస్వత (గాయత్రీ) వ్రతము అను అరువది ఆరవ అధ్యాయము.