నారద మహా పురాణము
పూర్వభాగము
వందే బృందావనాసీన మిందిరానంద మందిరమ్
ఉపేంద్రం సాంద్ర కారుణ్యం పరానందం పరాత్పరం
(బృందావనంలో కూర్చొని ఉన్నవాడు, లక్ష్మీదేవి ఆనందమునకు వాసస్థానమైనవాడు, అతి ఎక్కువైన దయకలవాడు, పరములకంటే పరుడు, అన్ని ఆనందముల కంటే ఉత్తమ ఆనంద స్వరూపుడు అయిన ఉపేంద్రునకు అనగా శ్రీకృష్ణునకు నమస్కారము)
బ్రహ్మవిష్ణు మహేశాఖ్య యస్యాంశాః లోకసాధకాః
తమాది దేవం చిద్రూపం విశుద్ధం పరమంభజే
(లోకములను రక్షించు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఎవని అంశరూపులో అట్టి జ్ఞాన స్వరూపుడు పరిశుద్ధుడు పరముడు, సర్వమునకు మూలకారణము తానే అయిన ఆదిదేవుని సేవించెదను)
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్,
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్.
(పరమాత్ముడైన నారాయణునికి, నరులలో శ్రేష్ఠుడైన నరునికి, సమస్త విద్యలకు ఆధారభూతురాలైన సరస్వతీదేవికి, సమస్త పురాణ వ్యాయమును, ఇతిహాసమైన భారతమును ఉపదేశించిన మరియు వేద వ్యాసమహామునికి నమస్కరించి, అనంతరము జయ (జ: 8, య క్ష్మ1- అంకానాం వామోతో గతిః) అను సూత్రముచే 18 అను అక్షర సంఖ్యచే చెప్పబడిన పద్దెనిమిది పురాణములను, మహాభారతమును (జయము అనే పేరు 18 పురాణాలకు, మహా భారతమునకు కూడా వర్తిస్తుంది) అష్టాదశ పురాణములలో ఆరవది అగు ఈ శ్రీనారద మహాపురాణమును చెప్పవలెను)