అగ్ని మహా పురాణము

1 - ప్రశ్నము

మూలము : శ్రీయం సరస్వతీం గౌరీం గణేశం స్కన్దమీశ్వరమ్

బ్రహ్మాణం వహ్ని మింద్రాదీన్వాసుదేవం నమామ్యహమ్.

ఆంధ్రానువాదము : నత్వా శ్రీతాతపాదాన్ శాస్త్రమంత్రాది సద్గురూన్

   మహాపురాణ మాగ్నేయ మాంధ్య్రా మనువదామ్యహమ్.

శ్రీమహాలక్ష్మికిని, సరస్వతికిని, పార్వతికిని, గణపతికిని, కుమారస్వామికిని, మహేశ్వరునకును, అగ్ని దేవునకును, ఇంద్రాదులకును, శ్రీమహావిష్ణువు నకును నమస్కరించుచున్నాను.

నైమి షే హరిమీజానా ఋషయః శౌనకాదయః

తీర్థయాత్రాప్రసజ్గేన స్వాగతం సూతమబ్రువన్.

నైమిషారణ్యమునందు హరిని ఉద్దేశించి యజ్ఞము చేయుచున్న శౌనకాది మహర్షులు తీర్థయాత్రాసందర్భమున అచ్చటికి వచ్చిన సూతునితో ఇట్లనిరి.

ఋషయ ఊచుః:

 సూత త్వం పూజితో స్మాభిః సారాత్సారం వదస్వ నః

యేన విజ్ఞాత మాత్రేణ సర్వజ్ఞత్వం ప్రజాయతే.

ఋషులు పలికిరి : ఓ సూతుడా! నీవు (మాచేత పూజింపబడినావు) మాకు పూజ్యుడవు. దేనిని తెలిసికొనినంత మాత్రముచే (మానవునకు) సర్వజ్ఞత్వము కలుగునో అట్టి సారములలో కెల్ల సార మైనదానిని మాకు చెప్పుము.

సూత ఉవాచః -

సారాత్సారో హి భగవాన్విష్ణుః సర్గాది కృద్విభుః

బ్రహ్మాహమస్మి తం జ్ఞాత్వా సర్వజ్ఞత్వం ప్రజాయతే.

సూతుడు పలికెను - సృష్యాదులను చేసిన ప్రభువును, భగవంతుడును అయిన శ్రీమహావిష్ణువే సారములలో కెల్ల సారమైన వాడు. “నేనే ఆ పరబ్రహ్మస్వరూపుడను” ఆని ఆ విష్ణువును గూర్చి తెలిసికొన్న చో సర్వజ్ఞత్వము కలుగును.

ద్వే బ్రహ్మణీ వేదిత వ్యే శబ్ద బ్రహ్మ వరం చ యత్

ద్వే విద్యే వేదిత వ్యే హి ఇతి చాథర్వణీ శ్రుతి.

శబ్దములకు గోచర మగుసగుణబ్రహ్మయు, పర మగునిర్గుణబ్రహ్మయు తెలియదగినవి. అథర్వవేదమునకు సంబంధించిన ముండకోపనిషత్తు గూడ - “రెండు విద్యలు తెలిసికొనవలేను” అని చెప్పుచున్నది.

 అహం శుకశ్చ వైలాద్యా గత్వా బదరికాశ్రమమ్

వ్యాసం నత్వా వృష్టవ న్తః సోఒస్మానారమథాబ్రవీత్.

నేనును, శుకుడును, పైలుడు మొదలగువారును బదరికాశ్రమమునకు వెళ్లి వ్యాసుని నమస్కరించి ప్రశ్నింపగా అపుడాతడు మాకు సారము నుపదేశించేను.

వ్యాస ఉవాచః -

శుకాద్యైః శృణు సూత త్వం వసిష్ఠో మాం యథాబ్రవీత్

బ్రహ్మ సారం హి వృచ్ఛ న్తం మునిభిశ్చ వరాత్పరమ్.

వ్యాసుడు పలికెను : నేను మునులతో కలిసివెళ్ళి, పరముకంటె పరమును, సారభూతమును ఆగు బ్రహ్మను గూర్చి ప్రశ్నింపగా వసిష్ఠుడు ఏమని చెప్పెనో, ఓ ! సూతా ! నీవును శుకాదులును వినుడు.

వసిష్ట ఉవాచః

ద్వివిధం బ్రహ్మ వక్ష్యామి శృణు వ్యాసాఖిలానుగమ్

యథాగ్నిర్మాం పురా ప్రాహ మునిభిర్దైవ తైః సహ.

వసిష్టుడు పలికెను : ఓ వ్యాసా! పూర్వము ఆగ్ని దేవుడు మునులకును, దేవతలకును, నాకును ఏ విధముగా చెప్పెనో ఆ విధముగ సర్వవ్యాప్త మగు, ద్వివిధ మైన బ్రహ్మను గూర్చి చెప్పెదను; వినుము.

పురాణం పరమాగ్నేయం బ్రహ్మవిద్యా క్షరం వరమ్

ఋగ్వేదాద్యవరం బ్రహ్మ సర్వదేవసుఖావహమ్.

బ్రహ్మవిద్య నాశనరహిత మగు పర విద్య. అందుచే తత్రతిపాదక, మగు ఆగ్నేయపురాణము పరము. సర్వ దేవతలకును సుఖమును కలిగించు ఋగ్వేదాదికము అపరబ్రహ్మ. ఆపరబ్రహ్మను ప్రతిపాదించున దగుట చే దాని కాపేరు.

 అగ్నినోక్తం పురాణం యదాగ్నేయం బ్రహ్మసమితమ్

భుక్తిముక్తిప్రదం దివ్యం పఠతాం శృణ్వతాం నృణామ్.

అగ్ని చెప్పిన పురాణము ఆగ్నేయపురాణము. ఇది వేదముతో సమానమైనది. చదువువారికిని, వినువారికిని భుక్తిముక్తుల నొసగునది.

కాలాగ్ని రూపిణం విష్ణుం జ్యోతిర్ర్బహ్మ పరాత్పరమ్

మునిభిః వృష్ట వాందేవం పూజితం జ్ఞానకర్మభిః.

కాలాగ్ని స్వరూపుడును, జ్యోతిస్వరూపుడును, పరాత్పర మైన, బ్రహ్మయు, జ్ఞాన-కర్మలచే పూజింపబడువాడును ఆగు విష్ణుదేవుని మునినమేతుడై (వసిష్ఠుడు) ప్రశ్నించెను

వసిష్ఠ ఉవాచః -

సంసారసాగరోత్తారనావం బ్రహ్మేశ్వరం వద

 విద్యాసారం యద్విదిత్వా సర్వజ్ఞో జాయతే నరః.

వసిష్టుడు పలికెను : సకల విద్యల సారమగు ఏ బ్రహ్మను గూర్చి తెలిసికొని నరుడు నర్వజత్వమును పొందునో అట్టిదియు, సంసార సాగరమును దాటించుటలో నావయు, సర్వశ క్తమును ఆగు బ్రహ్మను గూర్చి చెప్పుము.

అగ్ని రువాచః

విష్ణుః కాలాగ్ని రుద్రోహం విద్యాసారం వదామి తే

విద్యాసారం పురాణం యత్సర్వం సర్వస్య కార ణమ్.

ఆగ్ని పలికెను : విష్ణువు నైన నేనే కాలాగ్ని రుద్రుడను. నర్వస్వరూపమును, సర్వకార ణమును, ఆతి ప్రాచీ నమును అగు విద్యాసారమును గూర్చి నీకు చెప్పెదను.

సర్గస్య ప్రతిసర్గ స్య వంశ మన్వన్తరస్య చ

వంశానుచరితాదేశ్చ మత్స్యకూర్మాది రూపధృక్.

మత్స్యకూర్మా రూపములను ధరించిన నేను సృష్టికిని, ప్రలయమునకును, వంశములకును, మన్వంతరములకును, వంశాను చరితము మొదలగుదానికి కారణ మైనవాడను. (ముని ఋష్యాదుల వంశముల వర్ణనము వంశము. ప్రధాన రాజవంశముల వర్ణనము వంశాను చరితము)

ద్వే విద్యే భగవాన్విష్ణుః వరా చై వాషరా చ హ

ఋగ్యజుఃసామాథర్వాఖ్యా వేదాజ్ఞాని చ షట్ ద్విజ.

శిగా కల్పో వ్యాకరణం నిరుక్తం జ్యోతిషాం గతిః

ఛన్లోభిధానం మీమాంసా ధర్మశాస్త్రం పురాణకమ్.

 న్యాయ వైద్యక గాంధర్వం ధనుర్వేదోఅర్థశాస్త్రకమ్

ఆపరేయం; వరా విద్యా యయా బ్రహ్మాభిగమ్యతే.

యత్తదదృశ్యమగ్రాహ్యమగోత్ర చరణం ధ్రువమ్.

వర, అపర అను ఈ రెండు విద్యలును విష్ణు స్వరూపములే. ఓ బ్రాహ్మణా ! ఋగ్యజుస్సామాథర్వవేదములును, శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు అను వేదాంగములారును, కోళము, మీమాంస, ధర్మ శాస్త్రము, పురాణము, న్యాయశాస్త్రము, ఆయు ర్వేదము, సంగీతశాస్త్రము. ధనుర్వేదము, ఆర్థశాస్త్రము - ఇవన్ని యు అపరవిద్య. చూడ శక్యము కానిదియు, పట్టుకొన శక్యము కానిదియు, గోత్రము గాని శాఖ గాని లేనిదియు, నిత్యమును ఆగు బ్రహ్మను బోధించు విద్య పర విద్య.

విష్ణునోక్తం యథా మహ్యం దేవేభ్యో బ్రహ్మణా పురా

తథా తే కథయిష్యామి హేతుం మత్స్యాది రూపిణమ్.

ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే ప్రశ్నో నామ ప్రథమోధ్యాయః,

పూర్వము బ్రహ్మ దేవతల కెట్లు చెప్పెనో, విష్ణువు నా కెట్లు చెప్పెనో ఆ విధముగ మల్యాది రూపములను ధరించిన జగత్కారణభూతు డగు విష్ణువును గూర్చి నీకు చెప్పెదను.

ఆగ్ని మహాపురాణములో ‘ప్రశ్నము’ అను ప్రథమాధ్యాయము సమాప్తము.