పరమేశ్వరుడు చెప్పెను : స్కందా! ఇపుడు నిత్యనైమిత్తికాది స్నానమును గూర్చియు, సంధ్యను గూర్చియు, ప్రతిష్ణాసహితపూజను గూర్చియు చెప్పెదను, కత్తితో (లేదా ‘ఫట్' అన అస్త్రమంత్రముతో) ఎనిమిది అంగుళముల లోతు నుండి మట్టి త్రవ్వి, దానిని పూర్తిగా పైకి తీసికొని వచ్చి, ఆ మంత్రముతోడనే పూజించి, “స్వాహా” మంత్రముతో ఆ మృత్తి కను తటముపై ఉంచి, అస్త్రమంత్రమచే శోధింపవలెను. “వషట్” మంత్రముచే దానినుండి తృణాదికమును తొలగించి “హుమ్” అను మంత్రముచే దానిని మూడుభాగములు చేయవలెను. మొదటి భాగపు మట్టిని జలసహిత మైనదానిని నాభినుండి పాదముల వరకు అవయవములకు పూయవలెను. దానిని కడిగివేసి, అస్త్రమంత్రముచే ఆభిమంత్రిత మగు రెండవభాగమునందలి, కాంతి గల మట్టితో మిగిలిన శరీరము నంతయు పూసి, రెండు చేతులతో చెవులు, ముక్కు మొదలగు ఇంద్రియరంధ్రములను మూసికొని, ఊపిరి బిగపట్టి, మనస్సులో కాలాగ్నితుల్య మగు తేజోమయాస్త్రమును ధ్యానించుచు నీటిలో మునకలు వేసి స్నానము చేయవలెను. దీనికి మలస్నాన మని పేరు. ఈ స్నానము చేసిన పిదప నీటినుండి బైటకు వచ్చి, సంధ్య చేసిన పిమ్మట విధిస్నానము చేయవలెను. హృదయమంత్రముచే (నమః) అంకుశ మద్రతో సరస్వత్యాది తీర్థములలో ఏదో ఒక తీర్థ మును ఆకర్షించి, సంహారముద్రతో, దానిని తన సమీపమున నున్న జలాశయములో స్థాపింపవలెను. పిమ్మట మూడవభాగము మట్టి తీసికొని నాభివరకు జలములో మునిగి, ఉత్తరాభిముఖుడై, ఎడమచేతిలో దానిని మూడు భాగములు చేయవలెను. దక్షిణ భాగమునం దున్న మట్టిని అంగన్యాస మంత్రములచే ఒక మారు ఆభిమంత్రించి, తూర్పున నున్న మట్టిని “ఆస్త్రాయ ఫట్ అని ఏడు పర్యాయములు జపించి అభిమంత్రించి, ఉత్తర భాగము మట్టిని “ఓం నమః శివాయ” అను మంత్రము పది పర్యాయ ములు జపించి అభిమంత్రించవలెను. పిమ్మట ఈ మృత్తికలనుండి కొంచము కొంచెము గ్రహించి “అస్త్రాయ హుం ఫట్” అనుచు ఆన్ని దిక్కులందును చిమ్మవలెను. పిమ్మట ఓం నమః శివాయ అను శివమంత్రమును, “ఓం సోమాయస్వాహా” ఆను సోమమంత్రమును జపించుచు, నీటిలో తన భుజములు త్రిప్పి, దానిని శివతీర్థస్వరూపము చేయవలెను; అంగన్యాస మంత్రమును జపించుచు దానిని శిరస్సునుండి పాదముల వరకు, మొ త్తము శరీరము పై పూసికొనవలెను.
పిమ్మట అంగన్యాసమంత్రములను నాల్గింటిని చదువుచు కుడినుండి ప్రారంభించి ఎడమవై పువరకు హృదయము, శిరస్సు, శిఖ, రెండు భుజములు స్పృశించి, చెవులు, ముక్కు మొదలగు రంధ్రములు మూసికొని, సంముఖీక రణముద్రతో శివ - విష్ణు - గంగ లను స్మరించుచు, నీటిలో మునగ వలెను. షడంగన్యాస మంత్రములను ఉచ్చరించుచు (ఓం హృదయాయ నమః, శిరసే స్వాహా, శిఖాయై వషట్, కవచాయ హుమ్, నేత్రత్రయాయ వౌషట్, అస్త్రాయ ఫట్) నీటిలో నిలచి, రెండు చేతులను కలిపి కుంభముద్రతో స్నానము చేయవలెను. స్నానానంతరము నీటినుండి బైటకు వచ్చి సంహారిణీముద్రతో తీర్థ మును ఉపసంహరించవలెను. పిమ్మట యథావిధిగా పరిశుద్ధము, సంహితామంత్రములచే అభిమంత్రితము, నివృత్యాదులచే శోధితము అగు భస్మచే స్నానము చేయవలెను. “ఓం ఆస్తాయ హుం ఫట్” అను మంత్ర ముచ్చరించుచ శిరస్సునుండి పాదములవరకు భస్మముతో మలస్నానము చేసి, పిదప, యథావిధిగ శుద్దస్నానము చేయవలెను. ఈశాన , తత్పురుష అఘోర - గుహ్యక (దేదా వామదేవ) సద్యోజాత మంత్రములతో క్రమముగ శిరస్సు, ముఖము. హృదయము, గుహ్యాంగము, శరీరమునందలి ఇతరావయవములు వీటిపై ఉంచవలెను. మూడు సంధ్యలందును, ఆర్ధరాత్రమునందును, వర్షాకాలమునకు పూర్వము, అనంతరము, నిద్రానంతరము, భోజనానంతరము, జలపానానంతరము. ఇతర మైన ఆవశ్యక కార్యములు చేసిన పిమ్మట నీవు, ఆగ్నేయస్నానము చేయవలెను. శ్రీని, నపుంసకుని, శూద్రుని, పిల్లిని, శవమును. ఎలుకను స్పృశించి నపుడు ఆగ్నేయస్నానము విధింపబడినది, చుశుక ము నిండ పవిత్రజలము పోసికొని త్రాగవలెను. ఇదియే ఆగ్నేయస్నానము, సూర్యకిరణములు కనబడు చున్న పుడు ఆకాశమునుండి వర్షము కురియుచున్న చో, పూర్వాభిముఖుడై రెండు భుజములు పైకెత్తి ఈశాన మంత్రముచ్చరించుచు, ఏడు అడుగులు నడిచి, ఆ వర్షాజలమునందు స్నానము చేయవలెను. ఇది “మాహేంద్ర స్నానము”, గోసముదాయము మధ్య నిలిచి, గోవుల డెక్కలచే పైకి ఎగురగొట్టబడిన ధూళిలో ఇష్టదేవతా మూలమంత్రము జపించుచు, లేదా కవచమంత్రము (హుం) జపించుచు చేయు స్నానము “పావనస్నానము” సద్యోజాతాది మంత్రముల నుచ్చ రించు జలముతో చేయు స్నానము “మంత్రస్నానము”, ఈ స్నానము వరుణదేవతా మంత్రములను, అగ్ని దేవతామంత్రము లను ఉచ్చరించుచు గూడ చేయవచ్చును. మనస్సులో మూలమంత్రముచ్చరించుచు ప్రాణాయామము చేయుట “మానసిక స్నానము” ఈ స్నానము సర్వకర్మలయందును విధింపబడినది. విష్ణదేవతాదులకు సంబంధించిన కార్యములలో ఆ యా దేవతల మంత్రములతో ఈ స్నానము చేయవలెను.
కార్తికేయా! విభిన్న మంత్రములతో సంధ్యావిధిని గూర్చి చెప్పెదను బాగుగా చూచి జలమును, మంత్రిపాఠపూర్వ కముగ బ్రహ్మతీర్థము ద్వారా మూడు పర్మాయములు గ్రహించవలెను. ఆచమన సమయమున ఆత్మతత్త్వ - విద్యాతత్వ - శివతత్వములకు 'నమః' సహిత “స్వాహాశబ్దమును చేర్చి మంత్రము చదువవలెను. అనగా ఇచ్చట ఆత్మాతత్త్వాయ నమః స్వాహా, ఓం విద్యాతత్త్వాయ నమః స్వాహా, ఓం శివతత్త్వాయ నమః స్వాహా” అను మంత్రములతో ఆచమనము చేయ వలెను. పిదప ముఖము, నాసిక, నేత్రములు, కర్ణములుస్పృశింపవలెను. ప్రాణాయామముచేసి, సఫలీకరణక్రియను సంపన్నము చేసి స్థిరముగ కూర్చుండవలెను. పిమ్మట మంత్రసాధకుడు శివసంహితను మనస్సులోనే ఆవృత్తిచేసి, ఆచమనము, అంగ న్యాసములుచేసి, ప్రాతఃకాలమునందు బ్రాహ్మీ సంధ్యను ఈ విధముగ ధ్యానించవలేను. ప్రాతఃకాలమున సంధ్యాదేవి బ్రాహ్మీ రూపమున ప్రత్యక్షమగును. హంసారూఢ యే కమలాసనముపై కూర్చుండి యుండును. శరీర కాంతి ఎర్రగా నుండును. ఆమెకు నాలుగు ముఖములు, నాలుగు చేతులు ఉండును. కుడి చేతులలో కమలము, స్ఫటికాక్షమాల, ఎడమ చేతులలో దండకమండల ములు ప్రకాశించుచుండును. మధ్యాహ్న కాలమున సంధ్యను వైష్ణవీశ క్తి రూపమున ధ్యానించవలెను. ఆమె గరుత్మంతుని వీపు మీద పరచిన కమలాసనముపై కూర్చుండును. శరీర కాంతి తెల్లగా నుండును. వామహస్తముచే శంఖచక్రములను, దక్షిణహస్త ములచే గదా . ఆభయముద్రలను ధరించి యుండును. సాయంకాలమున సంధ్యను రుద్రశక్తి రూపమున ధ్యానింపవలెను. త్రినేత్రమై శిరస్సుపై అర్ధచంద్రముకుటముతో విరాజిల్లు చున్న ఆమె వృషభపీఠముపై కమలాసనమున కూర్చుండి యుండును. కుడి చేతులలో త్రిశూల రుద్రాక్షమాలలతోను, ఎడమచేతులలో అభయముద్రా శక్తులతోను ప్రకాశించుచుం డును. ఈ సంధ్యలు కర్మసాక్షులు. సాధకుడు ఈ శ క్తుల కాంతులు తనను అనుసరించి యున్నట్లు భావన చేయవలెను. ఇవి కాక మరొక సంధ్య నాల్గవది కూడ ఉన్నది. అది కేవలము జ్ఞానికి మాత్రమే. ఆర్ధ రాత్రి ప్రారంభమున, దాని బోధాత్మక సాక్షాత్కారము కలుగును. ఈ మూడు సంధ్యలును క్రమముగ, హృదయ - బిందు - బ్రహ్మరంధ్రములలో నుండును. నాల్గవ సంధ్యకు రూపముండదు. ఆ సంధ్య పరమశివునిలో ప్రకాశించుచుండును. ఈమె శివునికంటె ఆతీత మగుటచే 'పరా సంధ్య' ఆని పేరు. తర్జనీ మూలము పితృతీర్థము. కనిష్ఠికామూలము ప్రజాపతి తీర్థము. అంగుష్ఠ మూలము బ్రహ్మతీర్థము. హస్తాగ్రభాగము దేవతా తీర్థము. కుడి అర చేయి అగ్నితీర్థము. ఎడమ అర చెయ్యి సోమతీర్థము. అంగుళుల అన్ని పర్వము లును, సంధులును ఋషితీర్థము. సంధ్యాధ్యానానంతరము, శివమంత్రములచే జలాశయమును శివస్వరూపము చేసి, “ఆపోహిష్టా” ఇత్యాది సంహితామంత్రములతో, ఆ జలముతో మార్జనము చేసికొనవలెను. ఎడమ చేతిలో తీర్థ జలము పోసికొని కుడి చేతితో మంత్రపఠన పూర్వకముగ శిరస్సుపై ఆ నీరు చల్లుకొనుటకు మార్జన మని పేరు.
పిమ్మట ఆఘమర్షణము చేయవలెను. కుడిచేతిలో బోధరూప శివమయ మగు ఉదకము పోసికొని, ముక్కు దగ్గరకు తీసికొనిపోయి, (వామ) ఇడానా ద్వారా శ్వాస పీల్చి లోపల నిలిపి, లోపలినుండి నల్లని పాప పురుషుని (దక్షిణ) పింగళానాడి ద్వారా బైటకు తీసికొని వచ్చి ఆ జలమునందు స్థాపించవలెను. ఆ పాపపురుషునితో కూడిన జలమును, ఒక వజ్రమయ శిలను భావన చేసి, దానిపై పడవేసి చంపవలెను. దీనితో అఘమర్షణము సంపన్న మగును. పిమ్మట కుశ - పుష్ప - అక్ష తలతో కూడిన జలముతో ఆర్యాంజలి పట్టి దానిని “ఓం నమః శివాయ స్వాహా” అను మంత్రముతో శివునకు సమర్పించి యథాశ క్తిగ గాయత్రీ మంత్రము జపింపవలెను.
ఇపుడు తర్పణవిధిని చేప్పెదను. దేవతలకు వారి నామ మంత్రముల నుచ్చరించుచు, దేవతీర్థము ద్వారా తర్పణము చేయవలెను. “ఓం హూం శివాయ స్వాహా” అని చెప్పి శివునకు తర్పణమీయవలెను. ఇతర దేవతలకు కూడ ఈ విధముగనే వారి వారి పేర్లకు ఆస్వాహా చేర్చి తర్పణము లీయవలెను. “ఓం హాం హృదయాయ నమః, ఓం హీం శిరసే స్వాహా ఓం హూం శిఖాయై వషట్; ఓం హైం కవచాయ హుం; ఓం హౌం నేత్రత్రయాయ వౌషట్; ఓం హః అస్త్రాయ కట్ అను వాక్యము లుచ్చరించుచు క్రమముగ హృదయ.శిర. శిఖా.కవచ నేత్ర-అస్త్రన్యాసములు చేయవలెను. ఎనిమిది దేవగణములకు వారి పేర్ల చివర నమః అను పదము చేర్చి తర్పణము చేయవలెను. “ఓం హాం ఆదిత్యభ్యో నమః ; ఓం హాం వసుభ్యో నమః; ఓం హం రుద్రేభ్యో నమః; ఓం హాం విశ్వేభ్యో దేవేభ్యో నమః; ఓం హాం మరుద్బ్యో నమః; ఓం హాం భృగుభ్యో నమః ఓం హాం అంగిరోభ్యో నమః”. ఈ విధముగ చేయవలెను. పిమ్మట యజ్ఞోపవీతమును కంఠమునందు మాల వలే ధరించి (ఉపవీతి) ఋషితర్పణము చేయవలెను. “ఓం హాం ఆత్రయే నమః; ఓం హాం వసిష్ణాయ నమః; ఓం హాం పులస్తయే నమః ఓం హాం క్రతవే నమః; ఓం హం భరద్వాజాయ నమః, ఓం హాం విశ్వామిత్రాయ నమః; ఓం హం ప్రచేతసే నమః, ఓం హం మరీచయే నమః” అను మంత్రములు పఠించుచు అత్ర్యాది ఋషులకు ఋషితీర్థము ద్వారా తర్పణములు చేయవలెను. పిమ్మట ఈ క్రింది వాక్యములు చదువుచు, సనకాది మునులకు (రెండేసి అంజలులుఇ చ్చుచు) తర్పణము చేయవలెను. “ఓం షాం సనకాయ వషట్; ఓం హాం సనన్దనాయ వషట్; ఓం హం సనాతనాయ వషట్; ఓం హాం సనత్కుమారాయ వషట్ : ఓం హాం కపిలాయ వషట్; ఓం హాం పజ్చశిఖాయ వషట్ ; ఓం హాం ఋభవే వషట్” అను వాక్యములు చదువుచు దగ్గరగా ఉంచిన చేతుల కనిష్టికామూల భాగములనుండి జలాంజలి ఈయవలేను. “ఓం హాం సర్వేభ్యో భూతేభ్యో వషట్ “ అను మంత్రముచే వషడ్రూపభూతగణములకు తర్పణము చేయవలెను. పిమ్మట యజ్ఞోపవీతమును కుడిభుజము పై ఉండునట్లు వేసికొని ప్రాచీనావీతి రెండుగా మణచిన కుశ మూలాగ్రముల నుండి తిలసహిత జలమును మూడేసి పర్యాయములు దివ్యపితృదేవతలకు అర్పించి తర్పణము చేయవలెను. “ఓం హాం కవ్యవాహనాయ స్వధా; ఓం హం అనలాయ స్వధా; ఓం హాం సోమాయ స్వధా; ఓం హం యమాయ స్వధా; ఓం హం ఆర్యన్డే స్వధా; ఓం హాం అగ్నిష్వా తేభ్యః స్వధా; ఓం హాం బర్హిషద్భ్యః స్వధా; ఓం హాం ఆజ్య పేభ్యః స్వధా ఇత్యాదిమంత్రము లచ్చరించుచు విశిష్ట దేవతలకు తలెనే దివ్య పితృదేవతలకును తర్పణము లీయవలెను.
“ఓం హాం ఈశానాయ పిత్రే స్వధా” అని చెప్పి తండ్రికిని, ఓం హాం పితామహాయ స్వధా” అని చెప్పి పితామహునకును, “ఓం హోం శాస్త్రప్రపితామహాయ స్వధా” అని చెప్పి ప్రపితామహునకును తర్పణము లీయవలెను. సమస్త పేతపితృదేవతలకును ఈ విధముగనే తర్పణము చేయవలెను. ఎట్లనగా “ఓం హాం పితృభ్యః స్వధా; ఓం హోం పితామహేభ్యః స్వధా; ఓం హాం ప్రపితామహేభ్యః స్వధా; ఓం హాం వృద్దప్రపితామహేభ్యః స్వధా; ఓం హాం మాతృభ్యః స్వధా; ఓం హాం మాతామహేభ్యః స్వధా; ఓం హం ప్రమాతామహేభ్యః స్వధా; ఓం హాం వృద్దమాతామహేభ్యః స్వధా; ఓం హాం సర్వేభ్యః పితృభ్యః స్వధా; ఓం హాం సర్వేభ్యః జ్ఞాతిథ్యః స్వధా, ఓం హాం సర్వాచార్యేభ్యః స్వధా; ఓం హాం దిగ్భ్యః స్వధా: ఓం హాం దిక్పతిభ్య: స్వధా; ఓం హం సిద్దేభ్యః స్వధా: ఓం హం మాతృభ్యః స్వధా; ఓం హం గ్ర హేభ్యః స్వధా; ఓం హాం రక్షోభ్యః స్వధా” ఈ వాక్యముల నుచ్చరించుచు క్రమముగ ‘పితృ-పితామహ-ప్రపితామహవృద్ధ ప్రపితామహ- మాతృ-సర్వజ్ఞాతి. సర్వాచార్య-సర్వదిక్ దిక్పతి–సిద్ధ-మాతృకా-గ్రహ-రాక్షసులకు తర్పణము లీయవలెను.
అగ్ని మహాపురాణమునందు స్నానతర్పణాదివిధి యను డెబ్బది రెండవ ఆధ్యాయము సమాప్తము.
Summary of chapter 72 of the Agni Mahā Purana is as follows:
The seventy-second chapter provides a systematic account of the nine types of ritual bathing (snāna): the mala-snāna (cleansing of physical impurity), vidhi-snāna (prescribed ritual bath), bhasma-snāna (ash bath for Śaiva practice), māhendra-snāna (rain bath, considered supremely purifying), pāvana-snāna (purification by wind — standing in a strong wind), mantra-snāna (mental bath using mantras alone), āgneya-snāna (fire purification), mānasa-snāna (mental visualization of bathing in sacred rivers), and varuṇa-snāna (the standard water bath). The three forms of sandhyā-upāsanā (twilight worship) — Brāhmī at dawn, Vaiṣṇavī at noon, and Raudrī at dusk — and the four tīrthas present in the human hand (Brahmā, Prajāpati, Pitṛ, and Deva tīrthas) are described. Complete mantra sequences for tarpana — offering water to the three categories of deva-s, ṛṣi-s, and pitṛ-s — are given in full.