అగ్ని మహా పురాణము

213 - అథ పృథ్వీదానాని

ఆగ్ని దేవుడు చెప్పెను- ఇపుడు పృథివీదానమును గూర్చి చెప్పెదను. పృథివి మూడు విధములైనది. నూరుకోట్ల యోజనముల వైశాల్యముతో, సప్తద్వీపములతో, సముద్రములతో జంబూద్వీపపర్యంతముఉన్న పృథివి ఉత్తమైనది. ఐదు భారాల సువర్ణముతో ఉత్తమపృథ్విని నిర్మించవలేను. దానిలో సగముతో కూర్మమును, కమలమును నిర్మించవలెను ఇది “ఉత్తమపృథివి”. దీనిలో సగము “మధ్యమ పృథివి”. దీనిలో మూడవవంతుతో నిర్మించినది “కనిష్ఠ పృథివి”. దీనితో పృథివిలోని మూడవభాగమునందు కూర్మమును వరాహమును నిర్మించవలెను. వెయ్యిపలముల సువర్ణముతో మూలము, దండము, ఆకులు, ఫలములు, పుష్పములు, ఐదు శాఖలుగల కల్పవృక్షము నిర్మించవచెను. పండితుడైన బ్రాహ్మణుడు యజమానునిచే సంకల్పము చేయించి దీనిని ఐదుగురు బ్రాహ్మణులకు దానము చేయించవలెను. దీని దానము చేసినవాడు బ్రహ్మలోకమునందు పితృగణములతోకలిసి చాలకాలము ఆనంద మనుభవించును. ఐదువందల పలముల సువర్ణముతో కామధేనువు నిర్మించి విష్ణుసంముఖమున దానము చేయవలెను. బ్రహ్మ విష్ణు శివాది దేవతలందరును గోవు శరీరమునాశ్రయించి యుందురు. గోదానము చేయుటచే సకలదానములు చేసినట్లే ఆగును. దీనివలన సకలాభీష్టములు సిద్దించి బ్రహ్మలోక ప్రాప్తి కలుగును. శ్రీమహావిష్ణు సాంధ్యమున కపిల గోదానము చేసినవాడు తనకులమున కంతకును ఉద్దారకుడగును. అలంకృత కన్యాదానము చేసినవానికి అశ్వమేధయాగ ఫలము లభించును. సకలసస్యములు పండించు టకు తగిన భూమిని దానము చేసినవాడు సర్వమును పొందగలడు. గ్రామము, నగరము, పల్లె దానము చేసినవాడు సుఖవంతుడగును. కార్తికపూర్ణిమాదులందు వృషోత్సర్గము చేయువాడు తనకులమునుద్ధరించును.

అగ్ని మహాపురాణమునందు పృథ్వీదానవర్ణన మను రెండువందలపదమూడవ అధ్యాయము సమాప్తము.