వామన మహా పురాణము
భగవ ద్విభూతి స్థానాలు
అది విని వామన దేవుడిలా అన్నాడు, ఓ గురూ! ఏఏ పుణ్య ప్రదేశాలలో బహురూపినగు నేను నివసింతునో ఆ వివరం చెబుతున్నా వినుము. ఓ భరద్వాజా! భూమి, ఆకాశం, పాతాళం, సముద్రాలు, దివి, దిక్కులు, సమస్త పర్వతాలు, మేఘాలు, ఇవన్నీ నా కనురూపాలుగా ఉండే నా వివిధావతారాలతోనే నిండి ఉన్నాయి. స్వర్గంలో భూమి మీద, ఆకాశజలాల్లో, ఉండే స్థావర జంగమ జీవులు, ఇంద్ర, సూర్య, చంద్ర, యమ, వసు, వరుణ, అగ్ని, లోకపాలకు లందరూ, బ్రహ్మ మొదలు స్తంబ (జడం) పర్యంతం స్థూలంగానూ, సూక్ష్మంగానూ ఉండే బహు విధాలయిన పశు పక్ష్యాదులన్నీ ఈ భూమిని నింపేందుకు నేను సృష్టించినవే. నా నుండి ఉద్భవించినవే. దేవ, దానవ, సిద్ధులచే సృజింపబడే నాప్రధానమైన ఈఅంశాలు భూమి మీద ఉన్నాయి. ఓ బ్రాహ్మణా! వీనిని చూచిననూ, కీర్తించిననూ అప్పటికప్పుడే సకల పాపాలు నశిస్తాయి సుమా!
శ్రీ వామనదేవుడు ఇలా చెప్పుకుంటూపోయాడు. ఓ బ్రహ్మర్షీ! నా వ్యక్త రూపాల్లో మొదటిదీ మహోన్నతమైనదీ మత్స్యరూపం. మానస సరోవరంలో ఉన్నది. కీర్తన స్పర్శ నాదుల చేతనే అది సర్వ పాపాలనూ నశింపజేస్తుంది పాపనాశకమై కూర్మరూపం కౌశికి నదిలో సన్నిహితమై యున్నది. కృష్ణాంశ తీర్థంలో హయశీర్షం హస్తినాపురంలో గోవింద రూపాలు ఉన్నాయి.
త్రివిక్రమ రూపం యమునలో, భవరూపం లింగభేదంలో, కేదారంలో మాధవ శౌరి రూపాలు, కుబ్జాశ్రమంలో హృష్టమూర్దజహృష్టీకేశ రూపాలున్నాయి. బదరికా వనంలోని నారాయణుడు, గరుడాసనక్షేత్రంలోని వరాహమూర్తి, భద్రకర్ణంలోని జయేశ్వరుడు, విపాశా నదిలోని బ్రాహ్మణప్రియుడు నారూపాలే. ఇరావతిలోని రూపధరుడు, కురుక్షేత్రంలోని కుధ్వజుడు, కృతశౌచంలోని నృసింహుడు, గోకర్ణంలోని విశ్వకర్మ, ప్రాచీనంలో కామపాలుడు, మహాంభసంలోని పుండరీకుడు, విశాఖయూపంలో అజితుడు హంసపదిలోని హంసుడు, వయోష్ణిలోని అఖండుడు, వితస్తలోని కుమారిలుడు, మణిపర్వతానగల శివుడు, బ్రహ్మణ క్షేత్రం లోని ప్రజాపతి, వీరందరు నారూపాలే. మధునదిలోని చక్రధరుడు, హిమాలయాన శూలపాణి, ఓషధిప్రస్థాన గల విష్ణువు, భృగుతుంగంలోని సువర్ణాక్షుడు, నైమిశంలోని పీతాంబరుడు, గయా క్షేత్రంలోని గదాధర గోపతీశ్వరులు, గోప్రతారలలోని త్రైలోక్యనాథ, వరద, కుశేశయ రూపాలు, దక్షిణాన పవిత్రమైన మహేంద్రగిరి మీది అర్థనారీశ్వరుడు, ఉత్తర మహేంద్రంలో గోపాల, సోమపీధి, మూర్తులు సహ్యగిరిపై వెలసిన వైకుంఠుడు, పారి యాత్రా చలాన అపరాజితుడు, కవేరుదేశంలోని దేవేశ్వర, విశ్వరూప, తపోధన, రూపాలు మలయ పర్వతాన గల సుగంధి (పరిమళం), వింధ్య పాదాన గల సదాశివ రూపం, నా విభూతులేనని తెలుసుకో భరద్వాజా! అవంతి దేశాన విష్ణువు, నిషధలోని అమరేశ్వరుడు. పాంచాల భూమి యందలి పాంచాలిక దేవుడు, మహోదయంలోని హయగ్రీవుడు, ప్రయాగలోని యోగశాయి, మధువనంలోని స్వయంభూదేవుడు, పుష్కర కేశవుడు, లోలుడు, నా అంశాలే!
పద్మ క్షేత్రంలో పద్మకిరణ రూపంలో సముద్రంలో బడవా ముఖంగా, కుమార ధారలో బాహ్లీశ కార్తికేయ, బర్హిణులుగా, అజేశంలో శంభు, అనఘ రూపాల్లో, కురు జాంగలంలో స్థాణువుగా, కిష్కింధవాసులచే వనమాలియని పిలువబడుతూ ఉన్నవి నా అంశలే. నర్మదలో నన్ను వీరుడనీ, కువలయ ఆరూఢుడనీ, శంఖచక్ర గదాధరుడనీ, శ్రీవత్సాంకుడనీ, ఉదారాంగుడు శ్రియఃపతి అనీ పిలుస్తారు. మాహిష్మతిలో త్రినయనుడనీ, హుతాశనుడనీ, అర్భుదక్షేత్రాన త్రిసౌపర్ణుడనీ, సూకరాచలంలో క్ష్మాధరుడనీ నాకు పేర్లు. ఓ బ్రహ్మర్షీ! ప్రభాస క్షేత్రాన త్రిణాచికేత, కపర్ది, సోమశేఖర రూపాల్లో నేనుంటాను. ఉదయతీర్థాన శశి, సూర్య, ధ్రువులుగా హేమ కూటంలో హిరణ్యాక్షుడుగా, శరవణంలో స్కందుడుగా ఉన్నాను. మహాలయంలో రుద్రుడుగా, ఉత్తరు కురుదేశాన సర్వ సౌఖ్యదాయకుడగు పద్మనాభుడుగా నాకు ప్రసిద్ధి! సప్తగోదావరి క్షేత్రాన హాటకేశ్వరుడుగా, మహాహంసగా, వటేశ్వరుడుగా ప్రయాగలో నాకు పేర్లు. శోణలో రుక్మ కవచుడను, కుండినంలో ఘ్రాణ తర్పణుడను, ఖిల్లీ వనంలోని మహాయోగిని, మద్ర దేశంలోని పురుషోత్తముడను నేనే. ప్లక్షావతరణంలో విశ్వుడుగా, శ్రీనివాసుడుగా, శూర్పారకాన చతుర్భుజుడుగా, మగధలో సుధాపతిగా నన్ను పేర్కొంటారు. గిరివ్రజంలో పశుపతిగా, యమునా తీరాన శ్రీకంఠుడుగా, దండకారణ్యవాసులచే వనస్పతిగా తెలియబడుచున్నాను. కాలింజరంలో నీలకంఠుడను. సరయూ తీర్థాన శంభుడను. మహాకోశిలో హంస యుక్తుడను. దక్షిణ గోకర్ణంలో శర్వుడను. ప్రజాముఖతీర్థంలో వాసుదేవుడను. వింధ్య శిఖరాన మహాశౌరిని. కంధలో మధు సూదనుడనుగా ఉన్నాను. ఓ బ్రాహ్మణా! త్రికూట శిఖరాన చక్రపాణి ఈశ్వరులుగా, లౌహ దండంలో హృషీకేశుడుగా, కోసలలో మనోహరుడుగా సురాష్ట్రంలో మహాభుజుడుగా, నవరాష్ట్రంలో యశోధరుడుగా, దేవికా నదిలో భూధరుడుగా, మహోదలో కుశ ప్రియుడుగా నన్ను పేర్కొంటారు. గోమతిలో ఛాదితగదుడుగా, శంభోద్ధారంలో శంఖిగా, సైంధవారణ్యంలో సునేత్రుడుగా, శూరపురంలో శూరుడుగా నేనే ఉన్నాను. హిరణ్యధతిలో నేను రుద్రుడను. త్రివిష్టపంలో వీరభద్రుడను. భీమా తారాన శంకుకర్ణుడను. శాలవనంలో భీముడను.
అక్కడనే నా విశ్వామిత్ర రూపం. ఉన్నది కైలాసాన వృషభ ధ్వజుడను, మహాళాగిరి మీద మహేశుడను, కామరూపాన శశి ప్రభుడను, వలభిలో గోమిత్రుడను, కటాహక్షేత్రాన పంకజ ప్రియుడను, సింహళ ద్వీపంలో ఉపేంద్రుడను, శక్ర తీర్థాన కుందమూలాధరుడను, రసాతలంలో సమస్ర శీర్షు (ఆదిశేషు)డుగా విఖ్యాతుడను. అక్కడనే కాలాగ్ని రుద్ర కృత్తి వాసులు రూపాన గూడ ఉన్నాను. సుతలాన కూర్మ, అచల రూపాలలో, వితలాన పంకజాసనుడుగా ఉన్నది నా అంశలే. ఓ గురూ! మహాతలాన ఛాగలేశ, దేవేశులుగా తలలోకాన సహస్ర చరణుడుగా, సహస్రభుజుడుగా, ఈశ్వరుడుగా, సహస్రాక్షుడుగా, ముసలాకృష్ణ దానవుడుగా పిలువబడుతున్నాను. పాతాళంలో యోగీశ, హరి, శంకర, రూపాల్లోను, ధరా తలాన కోకనదుడు గాను, మేదిని యందు చక్రపాణిగాను ప్రసిద్ధుడనైనాను. భువర్లోకాన నేను గరుడుడను. స్వర్లోకాన అవ్యయుడనగు విష్ణువును. మహార్లోకంలో అగస్త్యుడను. జనో లోకాన కపిలదేవుడను. తపోలోకంలో అఖిల వాఙ్మయ సత్య సంయుతరూపాలు. ఏడవదియగు లోకాన బ్రహ్మ రూపాన నేను ప్రతిష్ఠ నందుచున్నాను. శైవ వాతావరణంలో సనాతనుడను. వైష్ణవ సముదాయాన పరబ్రహ్మను. నిరాలంబస్థితిలో అప్రతర్క్యుడను. నిరాకాశంలో తపో మయుడను. జంబూద్వీపంలో చతుర్భుజుడను. కుశ ద్వీపంలో కుశేశయుడను. ఓ మునిశ్రేష్ఠా! ప్లక్ష ద్వీపంలో గరుడ వాహనుడుగా ఖ్యాతి వహించాను. నన్ను క్రౌంచ ద్వీపంలో పద్మనాభుడనీ, శాల్మలంలో వృషభధ్వజుడనీ, శాకదీపాన సహస్రాంశుడనీ, పుష్కర ద్వీపాన ధర్మరాట్ అనీ పిలుస్తారు. అలాగే ఓ బ్రహ్మర్షీ! ఈ పృథ్వి మీద శాలగ్రామాలలో నా ఉనికి, జలస్థలాలలో గల స్థావర జంగమ జీవులన్నింటిలో నేను నివసిస్తాను. సనాతనాలు, పురాతనాలు, పవిత్రాలునైన ఇవన్నియు నే నుండు స్థానాలు. ఇవి ధర్మప్రదాలు. తేజోమయాలు. పాపనాశకాలు. సదా కీర్తింప దగినవి. ఈ దేవతల దర్శన స్పర్శన కీర్తన స్మరణాదు లాచరించినచో దేవ మానవ సాధ్యులు నాలుగు విధాల పురుషార్థాలూ సాధిస్తారు. ఇది నిశ్చయము. బ్రాహ్మణా! లెమ్ము, నా తపోమయాలయిన విభూతి స్థానాలు తెలుసుకున్నావు. ఇక మనమా దేవతలకు కల్యాణం చేకూర్చుటకు అసురేశ్వరుడు చేస్తున్న యజ్ఞానికి వెళ్దాముపద. అని ఇలా భగవానుడు వామనుడుచెప్పి ఆభరద్వాజ ఋషితో ఆ పర్వతా న్నుంచి లీలా విలాసాలు వెలార్చుతూ కురుజాంగలానికి వెళ్లాడు.