వామన మహా పురాణము
వింధ్యగిరి పల్లమైన కథ
నారదుడు: మహర్షీ! భగవంతుడగు అగస్త్య మహర్షి ఎందువలన ఎవరి కొరకు వింధ్యాద్రి ఔన్నత్యాన్ని తగ్గించెను. పుణ్య పురుషులగు మీరు నాకవి వివరించుడు ఆ వృత్తాంతము వినుటకు కుతూహలముగా ఉన్నది అని అడుగగా, పులస్త్యుడు ఇట్లు పలికెను.
పూర్వమొక పర్యాయం వింధ్యుడు ఆకాశం పొడవున పెరిగిన సూర్యుని గమనాన్ని నిరోధించెను. అంతట రవి కుంభజుడగు నగస్త్యుని చేరి ఆ ముని హోమ కార్యానంతరం ఇట్లనెను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠా! బహుదూరాన్నుంచి వచ్చియున్నాను; నన్నుద్ధరింపుము. నేను నిరాటంకంగా అంతరిక్షగమనం చేయుటకు వీలుగ నామనోవాంఛితాన్ని ప్రదానం చేయుము. సూర్యుని అర్ధగర్భితాలయిన మాటలు విని అగస్త్యుడు-నన్నర్థించిన వారెవ్వరూ విఫలులై తిరిగి వెళ్ళరు. నీ మనోవాంఛితము తెలుపుము. నెరవేర్చెదను. అనగా అమృతోపమాలైన ఆ మాటలకు సంతోషించి చేతులు జోడించుకొని సూర్యుడు-“ఈ పర్వత శ్రేష్ఠుడు నామార్గాన్ని నిరోధించినాడు. ఈ వింధ్యుని ఔన్నత్యాన్ని తగ్గించండి” అని విన్నవించెను. “దివాకరా! నన్నాశ్రయించితివి. నీకేమి బాధకలుగదు. వింధ్యుని శిఖరములను అణచినట్లే తెలియుము. నీ కిరణ ప్రసారాని కిక ఆటంకం ఉండదు అని సూర్యుని ఊరడించి అగస్త్యుడు, భక్తితో రవికి మ్రొక్కి దండకారణ్యం వదలి వింధ్యాచలానికి ప్రయాణించెను. వింధ్యుని చూచి కుంభజుడు “అచలోత్తమా! నేను ముసలివాడను. పుణ్యతీర్థ యాత్రలకై వెళ్ళుచున్నాను. నిన్ను దాటిపోజాలకున్నాను. కనుక నీవు వెంటనే క్రిందకు వంగి నాకు దారిఇమ్మనియెను. ఆ ముని శ్రేష్ఠుని కోరికను తలదాల్చి వెంటనే వింధ్యుడు పొట్టి వాడాయెను. ఆ పర్వతాన్ని దాటిన తర్వాత అగస్త్యుడతనితో నిట్లనెను-“ఓ శైలమా! నేను తీర్థవగాహనం చేసి పరిశుద్ధుడనై నిజాశ్రమానికి తిరిగి వచ్చువరకు నీవు పెరుగకుండా ఇట్లే పడియుండుము. లేనిచో నీఅవజ్ఞకు శపింపగలను.” అనెను. ఆ విధంగా ఉద్ధతుడగు వింధ్యుని హెచ్చరించి అగస్త్యుడు ఆకాశ మార్గాన దక్షిణ దిశగా వెళ్ళి, తగిన అదనుచూచి తిరిగి పోవు నుద్దేశ్యముతో నచటనే స్థిరపడి పోయెను. అచట బంగారు తోరణాలతో రమ్యంగా ఉండే ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకొని విదర్భ రాజపుత్రి యగు భార్య లోపాముద్ర నచటవదలి నిజాశ్రమానికి వెళ్ళెను. ఋతువు ఋతువుకూ పర్వ సమయాల్లో ఆ మహర్షి ఆకాశంలోని ఆ ఆశ్రమంలో ఉంటూ ఇతర సమయాల్లో దండకారణ్యంలోని నిజాశ్రమానికి వెళ్తూ ఉంటాడు. ఇక వింధ్యుడు గూడ ఆకాశంలోని ఆ దివ్యాశ్రమాన్ని చూచి భయపడి పెరుగుటమాని ఆ తేజస్వి తిరిగి వస్తాడని ప్రతీక్షిస్తూ తన శిఖరాలను వంచుకొనియేయున్నాడు. ఈ విధంగా తపోధనుడగు అగస్త్యుడా వింధ్యుని తలపొగరణచి పాదాక్రాంతుని చేసికొన్నాడు. మహర్షి! మునీశ్వరులంతా స్తోత్రాలు చేస్తూండగా ఆకాత్యాయనీ దుర్గ రాక్షస సంహారం చేసే సంకల్పంతో ఆ వింధ్యాద్రి ఊర్ధ్వ శృంగాన్ని అధిరోహించి నిలచింది. ఇక తమ బాధలు మరచి దేవతలు సిద్దులు, ఉరగులు, విద్యాధరులు, భూతగణాలు, అప్సరసలు ఆ కాత్యాయనీ దేవిని రంజింపజేస్తూ ఆమె సేవలో ఉండి పోయారు.
నారదా! ఆ పర్వత శిఖరాన తపస్వినిగా ఉన్న కాత్యాయనిని చండుడు, ముండుడు అనే యిద్దరు రాక్షస వీరులు చూచారు. వెంటనే ఆ అసురులు పర్వతం దిగి తమ భవనానికి వెళ్ళి మహిషాసురునితో “ప్రభూ! నీవిలా సుఖంగా చేతులు ముడుచుకొని కూర్చొని ఉండుటకు కారణమేమి? అలా వింధ్యకు వెళ్లి చూతము పద. ముల్లోకాల్లో సౌందర్యవతీ, మహమహిమా న్వితురాలై, సురకాంతల తలదన్నే ఒక కన్యారత్నం అక్కడ ఉన్నది. ఆమె కేశాలు మేఘాలను జయించాయి. చంద్రుని ఆమె ముఖం ధిక్కరిస్తుంది. మూడు నేత్రాలు త్రేతాగ్నులను వెక్కిరిస్తాయి. కంఠానికి శంఖం దాసోహమంటుంది. ఆమె గుండ్రని స్తనాలు ఏనుగు కుంభస్థలాలను జయించాయి. ముల్లోకాలను జయించిన నీ వృత్తాంతం విని మన్మథుడామె కుచాలను తనకు చక్కని దుర్గాలుగా చేసుకున్నాడు. పరిఘలులాగా కండలుదీరిన పద్దెనిమిది బాహువులలో ఆమె వివిధ శస్త్రాస్త్రాలు ధరించి ఉంది. నీ పరాక్రమాన్ని గ్రహించిన మన్మథుడు వాటిని వివిధ యంత్రాలుగా మలుచుకున్నాడనిపిస్తుంది. మూడువళులతో, రోమసమూహంతో అందమైన ఆమె నడుము చూస్తే భయంతో మన్మథుడు ఎక్కుట కేర్పరచుకున్న సోపానపంక్తిలా ఉంటుంది. ఆమె పీనకుచాల క్రింద ఉన్న చక్కని రోమపంక్తి నీ ప్రతాపోద్ధతికి భయాతురుడైన మన్మథుని వంటి నుండి జారిన చెమట బిందువుల్లాగా కనిపిస్తుంది. కుడివైపు ప్రదక్షిణంగా తిరిగి లోతైన నాభి, సౌందర్య గృహంమీద దానికి రాజైన మన్మథుడు వేసిన ముద్ర (తాళము)గా భాసిస్తుంది. వడ్డాణంతో పరివేష్టితమైన ఆమె జఘన (పిరుదు) ప్రదేశం చూస్తే మన్మథుడు ఎత్తైన ప్రహరీగోడతో నిర్మించుకున్న శత్రు దుర్భేద్యమైన దుర్గమా అనిపిస్తుంది. రోమరహితాలై, గుండ్రనివై, మృదువుగా ఉన్న ఊరువులు, మన్మథ నరేశ్వరుడు తన వారలకై ఏర్పరచుకొన్న నివేశన స్థలముల్లాగా కనిపిస్తవి. మహిషేశ్వరా! కొంచెం ఉబ్బెత్తుగా ఉన్న ఆమె అందమైన మోకాళ్ళను చూస్తే బ్రహ్మ ఆమెను సృష్టించి అలసిపోయి, తన సృష్టి సౌందర్య సమగ్రతను నిరూపించుటకు తన రెండు అరచేతులను వానిపై పెట్టుకున్నట్లు తోస్తుంది ఆ సుందరి వట్రువలై, రోమరహితాలైన జంఘలు (పిక్కలు) ప్రపంచంలోని సౌందర్య సృష్టి నంతటినీ అధఃకరిస్తాయి. తామరపూల లోపలి మృదుత్వాన్ని తలతన్నే ఆమె పాదాలనైతే విధాత ఎంతో శ్రమపడి నిర్మించాడు. ఆమె అంగుళ్యాభరణాలు సౌరు, నక్షత్రాల కాంతిని మరపిస్తుంది. ఇంతటి అందాల రాశి అయిన ఆ బాలిక ఓ దనుజేశ్వరా! భయంకరమైన శస్త్రాస్త్రాలు ధరిస్తుంది! మేమెంతో దీక్షగా ఆమెను చూచాము. అయినప్పటికీ ఆమె ఎవరి కుమార్తెయో, ఎవరో, ఏమో తెలుసు కొనలేక పోయాము! దివి నుండి భువికి దిగిన అనర్ఘ రత్నం ఆ బాలిక! స్వయంగా నీవే వెళ్ళి వింధ్య శిఖరాన ఆమెను చూడుము. అనంతరం నీకు తోచినట్టుగా చేతనైనది చేయుము.” అని అతడికి దుర్బోధ చేశారు.
దేవి సౌందర్య ప్రవృత్తులను గురించి ఆ రాక్షసులు చెప్పినదంతయు విని మహిషా సురుడు “ఇందులో యింకా ఆలోచించవలసినదేమి? ఏమీ లేదని” అనుకున్నాడు. నారదా! జీవుల శుభాశుభాలు ముందుగానే బ్రహ్మ ద్వారా నిర్ణయింపబడే ఉంటాయి. ఎప్పుడు ఎవడు ఎక్కడకు వెళ్ళాలో అక్కడకు స్వయంగానైనా వెళ్ళతాడు లేక తీసికొనిపోబడతాడు. అప్పుడా అసురేంద్రుడు చండముండ నమర బిడాల నేత్ర పిశంగ, బాష్కల ఉగ్రాయుధ చిక్షుర రక్తబీజాదులను ఆజ్ఞాపించుటతో ఆ యుద్ధోన్మాదులందరు యుద్ధ భేరీలు మ్రోగించి స్వర్గం వదలి భూమి మీద వింధ్య పర్వతాన్ని చేరి ఆ గిరి మూలాన స్కంధావారాలు నిర్మించుకున్నారు. అప్పుడా మహిషుడు, శత్రు సంహారకుడు, తన సేనాపతి, మయాసురుని కుమారుడు దుందుభి ఘోషం వంటి కంఠధ్వని కలిగిన దుందుభి అనే రాక్షసుని దేవి వద్దకు దూతగా పంపాడు. వాడు దేవికి సమీపంగా అకాశంలో నిలబడి యిలా అన్నాడు. “ఓ కుమారీ! అప్రతిమ వీరుడు రంభ దైత్యుని కుమారుడు అసురలోకాధిపతి అయిన మహిషాసురుని దూతను నేను.” ఆ మాట వింటూనే కాత్యాయని, రావయ్యా దైత్యేంద్రా! రా నిర్భయంగా జంకు లేకుండా నీ యజమాని, రంభపుత్రుడు పంపిన సందేశం చెప్పుమనెను. దేవి మాటలు విని దుందుభి అకాశం నుంచి భూమికి దిగి దేవి కెదురుగా సుఖోపవిష్ణుడై మహిషాసురుని సందేశాన్ని యిలా వినిపించాడు. “దేవీ! మహిషదైత్యుడు నీకిలా అజ్ఞాపించాడు. “యుద్ధంలో నాతో ఓడిపోయి హీనబలులై అమరులు భూమి మీద తిరుగుతున్నారు. స్వర్గ మర్త్య పాతాళాలు వాయుమండలం అక్కడి రాజులు, అంతా నాకు వశ్యులైనారు. నేనే ఇంద్రుణ్ని, రుద్రుణ్ని, సూర్యుణ్ని, పరలోకాధిపతిని! ఓ బాలా! స్వర్గమర్త్య పాతాళాలలో ఎవ్వరు కూడా-దేవాసుర యక్ష భూతగణాల్లో-యుద్ధంలో నన్నెదురు కొని జీవింపగల వారులేరు. స్వర్గమర్త్యపాతాళాలలో ఉన్న అనర్ఘరత్నాలన్నీ ఈనాడు నా ప్రతాపానికి లోబడి నన్ను చేరాయి. ఓ విశాలనేత్రా! స్త్రీ జాతి కంతకూ నీవు రత్నానివి. అలాంటి నీ కోసం నేను ఈ వింధ్య మూలానికి వచ్చాను. జగత్పతినీ సర్వ ప్రభువునూ అయిన నన్ను కన్యారత్నమవైన నీవు వరించి భజింపుము. అని అదేవికి తన రాజైన మహిషుని సందేశాన్ని వినిపించాడు.