వామన మహా పురాణము
ఉమా కళ్యాణం
ఆ విధంగా గృహంలో అడుగుపెట్టిన శివునిచూచి హిమవంతుని ఇంటిలోగల ఆడువారలు “ఆహా! ఈ అంబిక చేసిన తపస్సు కడుగొప్పది కదా! ఆ ఫలమే దేవశ్రేష్టుడైన ఈ హరుని రూపంలో లభించింది. కుసుమాయుధుడైన మన్మథుణ్ణి అనంగుడుగా చేసినది, దక్షయజ్ఞం ధ్వంసం చేసినది ఈ పినాకియే, శూలపాణియే. సూర్యుని నేత్రాన్ని హరించిన హరుడే!” అని ఆశ్చర్య పడుచూ ఆ భవుని యిలా స్తుతించారు. “శంకరా! త్రిశూలధరా! శూలహస్తా నీకు నమస్సులు! వ్యాఘ్రచర్మధరా! మహాసర్పకుండలధరా! నాగేంద్రహారా! పార్వతీరమణా! నీకు ప్రణామశతములు!” అంతఃపురాంగనలు ఆ విధంగా స్తోత్రవాక్యాలు పలుకుతూండగా, దేవేంద్రుడు గొడుగు పట్టుకొనగా, సిద్ధయక్షులకు వందనీయుడగు నా నాగకంకణుడు, భస్మాలంకృత సర్వాంగుడై, విరించి మనస్సును ప్రమోదభరితం గావిస్తూ విష్ణువు వెంట అంటిరాగా, పవిత్రాగ్నులతో వెలుగొందుతున్న వివాహమంగళ వేదిక నలంకరించాడు. సపరివారుడై సప్తర్షులతో నేతెంచిన అ త్రిపురహరుని చూడగానే అక్కడి వారలంతా కాళీకుమారిని పెండ్లి కూతురుగా ముస్తాబుచేయుటలో నిమగ్నులయ్యారు. పర్వత ప్రవరులు వచ్చిన పెండ్లివారికి సపర్యలు చేయడంలో హడావుడి పడసాగారు. నిజమేమరి. ఆడపిల్ల పెండ్లిలో పిల్లవైపువారు ఆదుర్దాపడడం సహజమే గదా! అంతఃపురస్త్రీలు పార్వతిని శ్వేతాంబరాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తర్వాత ఆమె సోదరుడు సనాభుడు విహితమైన పూర్వాంగ కృత్యాలు నెరవేర్చి కాళీని వెంట పెట్టుకొని శంకరుని వద్దకు తీసుకొని వెళ్లాడు. స్వర్ణ నిర్మితమైన ఆ మంగళ వేదికవద్ద కూర్చొని దేవతలు, వధూవరులు నెరవేర్చదగు వివాహ కృత్యాలు గమనించసాగారు. శివుడు పార్వతితో కలిసి లోకానుమోదితాలైన వైవాహికాచారాలు యథాక్రమంగా నెరవేర్చాడు. ఆ సందర్భంలో చిత్రవిచిత్రాలైన వినోదక్రీడలతో, పుష్పభరితాలయిన వృక్షాలతో సుగంధాలు వెదజల్లే (పన్నీరు) జలసేచనాలతో, గంధపు చూర్ణాలు చల్లుకొనడంతో, రంగు రంగుల మ్రుగ్గులతో, ముత్యాలపేరులతోరణాలతో, శివపార్వతుల క్రీడార్థం ప్రదేశాన్నంతా సింధూర రంజితం గావించారు. ఆ విధంగా గిరికన్యతో క్రీడించి హరుడు ఋషులతో నిండిన దక్షిణ వేదికవద్దకు చేరాడు. చక్కగా నిర్మింపబడిన అ దృఢమైన మండపంవద్దకు శ్వేతాంబరాలు ధరించి, పవిత్ర పాణియై, ఉజ్జ్వల మధుపర్కాలతో హిమవంతుడు వచ్చాడు. పూర్వాభిముఖుడై త్రినేత్రుడు ఉపవిష్టుడు కాగా, కన్యాదాత సప్తర్షులవైపు తిరిగి కూర్చున్నాడు. సుఖాసనం మీదనున్న జామాత శర్వునితో, అంజలి ఘటించి ఆ నగపతి ధర్మసమ్మితమైన వాక్యం పలికాడు. “ఓ దేవా! నా పుత్రిక, పులహుని అన్నపౌత్రి, పితృ దేవతల దౌహిత్రి అయిన ఈ కాళీకన్యను నీకు దత్తం చేస్తున్నాను పరిగ్రహించి నన్ను అనుగ్రహింపుము. అని అలా అంటూ ఆ హిమవంతుడు తన కుమార్తె చేతిని హరుని చేతిలో ఉంచి అందరు వినునట్టుగా “దేవా! ఈమెను స్వీకరించుడ”ని ఉచ్ఛైస్వరంతో పలికాడు.
శివుడు ఇలా అన్నాడు, “ఓ పర్వతరాజా! నాకు తల్లిలేదు. తండ్రిలేడు. జ్ఞాతులు బంధువు లంటూ ఎవరూలేరు. ఇల్లులేదు. కొండకొమ్ములమీద తిరుగుతూ ఉంటాను. ఇలాంటి నేను నీ కుమార్తెను స్వీకరిస్తున్నాను” అలా చెబుతూ వరదాయకుడైన ఆ శర్వుడు పార్వతిచేతిని గట్టిగాపట్టు కున్నాడు. నారదా! ఆమె కూడ తన భర్తకరస్పర్శకు పులకించిపోయినది. అంతట మధుపర్క ప్రాశనంచేసి శివుడు పార్వతితో కలిసి వేదికపైకి వెళ్ళి లాజలు (బియ్యపు పేలాలు) అర్పించాడు. అపుడు బ్రహ్మ పార్వతితో, “కాళీ! స్థిరదృష్టితో చంద్రకాంతితో సమంగా వెలుగుచున్న నీ భర్త ముఖాన్ని చక్కగాచూచి అగ్నికి ప్రదక్షిణం చేయుము” అన్నాడు. వేసవికి తపించిపోయిన భూమి తొలకరి వృష్టికి స్పందించినట్లుగా, భర్త ముఖదర్శనంతో అంబిక అపూర్వమైన చల్లదనాన్ని అనుభవించింది. బ్రహ్మమరల నామెను భర్త ముఖము చూడమనగా నామె చూచితినని సిగ్గుతో నుడివినది. అంతట గిరిజతో కలిసి హరుడు అగ్నికి ముమ్మారు ప్రదక్షిణంచేసి, హవిస్సులాజలు అగ్నిలో వ్రేల్చాడు. అంతట బహుమతి కోసం మాలిని, శివుని కాళ్ళు రెండూ గట్టిగా పట్టుకున్నది. “నీవడిగినది ఇవ్వగలను, కాళ్ళు వదలమ”ని అంటున్న హరునితో నామాలిని “ప్రభూ! నాయీ చెలికి మీ గోత్ర సౌభాగ్యం, ఇస్తే కాని మీ పాదాలు విడువను” అన్నది. “అట్లే ఇచ్చితిని మాలినీ, ఇక నన్ను వదలుము. నా గోత్ర సౌభాగ్యం ఎటువంటిదో చెబుతున్నా వినుము. ఇదుగో, పీతాంబరం ధరించి శంఖం పట్టిన ఈ మధుసూదనుని సౌభాగ్యం, నేను నా గోత్రంగా ప్రసాదించినదే! శివుడన్న మాటలు విని, నిజ గోత్ర శుభచరిత్ర శాలియైన ఆ మాలిని, ఆయన కాళ్ళు వదలిపెట్టింది. మాలిని శివుని పాదాలు పట్టుకున్న సమయంలో బ్రహ్మ చంద్రునికన్నా మిన్నగా వెలుగుచున్న ఆకాళి ముఖాన్ని చూచాడు. వెంటనే మారవికారానికి లోనుకాగా అతడి వీర్యం నేలపై పడిపోయింది. దానితో కంగారు పడి ఆయన ఇసుకపైబడిన శుక్రాన్ని నిర్వీర్యం గావించాడు. అంతట శివుడు బ్రహ్మతో “బ్రహ్మా! నీవు బ్రాహ్మణహత్య చేయరాదుసుమా. ఓ పితామహా! ఈ వాలఖిల్య మహర్షులు ధన్యాత్ములు!” అన్నారు. అలా అనగానే, ఎనభై ఏనిమిదివేల ఆవాలఖిల్య మునులులేచి నిలబడ్డారు. ఆ విధంగా వివాహం సంపన్నం కాగానే హరుడు సంతుష్టుడై ఉమతో కలిసి ఆ రాత్రి యథేష్ట సుఖాలనుభవించి ఉదయాన్నే లేచాడు. ఆ విధంగా పార్వతిని వివాహమై హరుడు మిక్కిలిగా సంతోషించాడు. దేవతలు, ప్రమథ గణాలుకూడ ఆనందించారు. అంతట హిమవంతుని సత్కారాలందుకొని ఆయన మందగిరికి తిరిగి వెళ్ళాడు. తన వివాహానికి వచ్చిన బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలను యథావిధిగా సత్కరించి వీడ్కోలు చెప్పినవాడై. ఆ అష్టమూర్తి తన శివగణాలలో మందరగిరి మీద నివాస మేర్పరచుకున్నాడు.
ఓ మునీ! అలా హరుడా గిరి మీద పార్వతితో యథేచ్ఛగా విహరిస్తూ విశ్వకర్మను పిలిచి తనకొక గృహం నిర్మించమన్నాడు. అంతట నాతడు స్వస్తిక లక్షణంతో అరవైనాలుగు యోజన ప్రమాణం గల మేలిమి బంగారం భవనాన్ని నిర్మించాడు. దంతాలతో చేసిన తోరణాలు, ముత్యాలు పొదిగిన గవాక్షాలు, వాకిండ్లు, స్ఫటిక సోపాన పంక్తులు, వైడూర్యమణుల చిత్తరువులు, ఏడు విశాలమైన గదులు, సకలవిధాల వసతులు, భోగసామగ్రులు కలిగి ఆ భవనం సర్వాతి శాయిగా రూపొందింది. అందులోచేరి ఆ దేవదేవుడు గృహస్థులు చేయదగిన యజ్ఞం చేశాడు. అందులో పూర్వీకుల పద్ధతినే హరుడు అవలంబించాడు. ఆ సుందరహర్మ్యంలో చాలాకాలం పార్వతితో సుఖాలనుభవిస్తూ శివుడు గడిపాడు.