శుంభ నిశుంభుల వధ

ఆ విధంగా కవచాదులు భిన్నమై దిగంబరులుగా పారివచ్చిన తన బలాలను చూచి దానవేంద్రుడయిన నిశుంభుడు, చక్రాలు దెబ్బతిని ఇరుసులూడుచున్న రథంతో, క్రోధోన్మత్తుడై దేవిని సమీపించాడు. మెరిసిపోతున్న ఖడ్గం డాలు పట్టుకొని నిలబడి, ఆ దేవి సౌందర్యానికి ముగ్ధుడై వాడు చిత్రలిఖిత ప్రతిమలాగా స్తంభించి చూస్తూ ఉండి పోయాడు. అలా కదలికలేక నిలబడిన ఆ దేవవిరోధిని చూచి పకపకనవ్వి - ఈ పౌరుషం తోనేనా నీవు దేవతలను జయించింది? ఈ వీరత్వంచూపియేనా నన్ను పొందాలని చూస్తున్నావురా?” అని గేలిచేసింది. కౌశికి మాటలు విని ఆ మాటకారి అయిన రాక్షసుడు క్షణకాలం ఆలోచించి ఇలా అన్నాడు. “ఓ భీరూ! నీ శరీరమో అతి సుకుమారం! నాబాణాలో అతితీక్ష్ణాలు. ఒక్క వ్రేటునకు పచ్చికుండవలె నూరుముక్కలవుతుందే అని విచారిస్తున్నాను. అంచేత నిన్ను ప్రహరించేందుకు మనసొప్పకుండా ఉన్నది నాకు. కాబట్టి ఓ సుందరీ! విశాలాక్షీ! నన్ను సేవించుము. నా కత్తివ్రేటుకు ఇంద్రుడు సైతం నిలవజాలడు. యుద్ధ సంకల్పం వదలి నన్ను వివాహం చేసుకో. ఓ నారదా! వాని మాటలకా యోగీశ్వరి అర్థగర్భితంగా ఈ మాటలు పలికింది. “యుద్ధంలో ఓడిపోకుండా నేనెవడి భార్య నగుటకూ వీలుపడదు కదా! వివాహ సంకల్పమే ఉంటే రా! యుద్ధంలో నన్ను ఓడించు.” ఆ మాట వింటూనే ఆ దానవుడు ఖడ్గాన్ని బలంకొద్దీ దేవిమీదకు విసిరివేశాడు. అంతట కౌశికి అరు బాణాలు గుప్పించి ఆ ఖడ్గాన్నీ డాలునూ ముక్కలు ముక్కలు గావించింది. దానితో వాడు మండిపడి రెండు చేతులతో పెద్దగదను త్రిప్పుతూ దేవి మీదకు దుమికాడు. అంత అంబిక ఒక క్షురప్రంతో గదతో కూడా వాడి రెండు చేతులనూ నరికివేసింది. నిష్ర్పాణమైన వాడి శరీరం నేలకొరిగింది. ఆ దానవుని మరణానికి చండమారి మొదలయిన మాతృశక్తులు సంతోషంతో కిలకిలరావాలు చేశారు. భూతగణాలు తూర్యాలు మోగించారు. దేవతలు ఆ తల్లిమీద పుష్పవర్షం గురిపించారు. నిశుంభుని సంహారంచూచి శుంభుడు కోపంతో పాశం ధరించి ఏనుగుమీదనెక్కి దేవిపైకి లంఘించాడు. అలా వచ్చే ఆ రాక్షసాధముణ్ని చూస్తూనే అంబిక అలవోకగా నవ్వుతూ, నాలుగు అర్ధచంద్రబాణాలు చేతితో తీసికొని రెండు క్షురప్రాలతో వాడి ఏనుగు కాళ్ళను నరికి, ఇంకొక రెండు బాణాలతో దాని కుంభస్థలాన్ని బద్దలుగావించింది. దానితో అఏనుగు దేవేంద్రుని వజ్రాఘాతానికి విరిగిన పర్వత శిఖరంలాగా కుప్పకూలిపోయింది. కూలిన ఏనుగు మీద నుంచి దిగుతుండగానే పరమేశ్వరి మరొక బాణంతో కుండలాలతో వెలుగుతున్న వాడితలను ఖండించింది. తల తెగిన ఆ మహాదైత్యుడు ఏనుగుతో బాటు కార్తికేయుని బాణాహతికి మహిషంతో కూడ నేలకొరిగిన క్రౌంచంవలె పడిపోయాడు. పరమేశ్వరి దేవశత్రువును వధించిన వార్త విని, ఇంద్రుని ముందుంచుకొని సూర్య యమదశ్వినీ వసువులు మొదలయిన దేవతలంతా వింధ్యగిరి కేతెంచి వినయావనతులై చేతులు జోడించుకొని ఆ జగదంబిక నిలా స్తుతించారు.