పరశురామ పంచ హ్రదాల మహాత్మ్యం

అచట నుంచి తీర్థసేవ చేయగోరు బ్రాహ్మణోత్తముడు రామప్రదానికి వెళ్ళాలి. ఆచోటనే మహాతేజస్వి అయిన భార్గవరాముడు క్షత్రియ సంహారం చేసి వారల రక్తంతో అయిదు సరోవరాలను నింపాడు. ఈవిషయం మేమువిన్నాము. ఆజలాలతో పితృపితా మహులకు తర్పణాలిచ్చాడు. అంతట పరమ ప్రీతులై రాముని పితరులు మహాపరాక్రమ వంతుడవైన రామా! నీ విక్రమానికి పితరులయెడ భక్తికి సంతోషించాము. మహాయశస్వీ! నీకేమి వరం కావలయునో అడుగుము. నీకు కల్యాణమగుగాక! అనిఅతనితో అన్నారు. అంతట మహాబలశాలియైన భార్గవ రాముడు ఆకాశాన నిలబడిన పితృ దేవతలకు చేతులెత్తి నమస్కరించి ఇలా అన్నాడు. మీరలు నాయెడ ప్రసన్నులైనచో నన్ననుగ్రహించుచో మీఅనుగ్రహం వల్ల నేను మరల తపోసిద్ధి పొందవలెను. రోషాతిరేకంతో క్షత్రియ సంహారం చేసినందున నాకు గల్గిన పాపం నశించవలెను. మీ ప్రభావంవల్ల ఈ అయిదు సరోవరాలు పవిత్ర తీర్థాలుగా ప్రసిద్ధి చెందవలెను. రాముడు పలికిన ఈ శుభ వాక్యాలువిని హర్షంతో ఆయన పితరులు ప్రేమతో అభయ మిచ్చారు. పుత్రా! విశిష్టమైన నీ పితృభక్తివల్ల నీ తపస్సు వర్ధిల్లుతుంది. కోపవశాన నీకు సంక్రమించిన క్షత్రియవం పాతకం తొలగి పోయినది. అ క్షత్రియులు తమ దుష్కర్మల వల్లనే చంపబడ్డారు. నిస్సందేహంగా, నీవు నిర్మించిన ఈ సరస్సులకు తీర్థత్వం లభిస్తుంది. ఈ సరస్సులలో మునిగి ఎవరు తమ పితరులకు తర్పణాలు విడుస్తారో వారల కోర్కెలు వారి పితరులు సిద్ధింపచేస్తారు. వారలకు శాశ్వత స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా పరశురామునకు వరాలిచ్చి ఆయన పితృదేవతలు అంతర్ధానమైనారు. మహాత్ముడగు భార్గవరామునిచే నెలకొల్పబడిన రామ సరోవరాలు పరమ పవిత్రాలు. బ్రహ్మచారియై నియమంతో వానిలో స్నానంచేసి రాముని అర్చిస్తే బహుసువర్ణ ప్రాప్తి కలుగుతుంది.

జితేంద్రియుడగు తైర్థికుడు తన వంశాభివృద్ధికోసం వంశమూలంలో స్నానంచేసి అటనుండి కాయశోధనం అనే ముల్లోకాల్లో పేరుగన్న తీర్థంలో స్నానంచేసి తప్పకుండా కాయసిద్ధి పొందుతాడు. పరిశుద్ధమైన దేహం కలిగి పునరావృత్తిలేని లోకాలకు పోతాడు. తీర్థపరాయణులయిన సిద్ధులు కాయశోధనం పొందనంతవరకు తీర్థాటనం చేస్తూ ఉంటారు. ఆ తీర్థంలో స్నానంచేసి సంయతచిత్తులయ్యే వారు పరమపదాన్ని చేరుకుంటారు. తరువాత ఉత్తములైన విప్రులు, సకలప్రాణులు విష్ణువుచేత ఉద్ధరింపబడిన త్రిలోకఖ్యాతిగల లోకోద్ధారమను తీర్థంలో స్నానంచేసి శాశ్వత లోకాలను పొందుతారు. సనాతనులయిన శివవిష్ణువులిరువురు నిత్యం సన్నిహితులగుచోట, నా దేవులకు ప్రణమిల్లి ప్రసన్నుల గావించుకొని ముక్తిపొందవచ్చును. అచ్చటి నుండి పరమోత్తమమైన శాలగ్రామ శ్రీతీర్థంలో స్నానంచేసిన సదాపరమేశ్వరి సాన్నిధ్యం పొందవచ్చు. తర్వాత త్రిలోకఖ్యాతి గల కపిల తీర్థంలో స్నానంచేసి, దేవపితరులను అర్చించినచో, వేయి కపిలగోవులు దాన మిచ్చిన ఫలం కలుగును. అచటనే కపిలరూపంలో వెలసిన మహాదేవుని, ఋషి పూజితుని దర్శించినచో ముక్తిగలుగును. ఆపైని, సూర్యతీర్థంలో స్నానంచేసి స్థిర చిత్తంతో ఉపవాసపూర్వకంగా పితరులను దేవతలను అర్చించిన, అగ్నిష్టోమ యాగఫలం కలిగి సూర్యలోక ప్రాప్తి పొందగలరు. జ్ఞానియగు నరుడు సహస్ర ఖరకిరణుడగు సూర్యదేవుని దర్శించి మోక్షగామి అవుతాడు. అనంతరం భవానివనంచేరి అచట అభిషేకాదులొనర్చిన గోసహ ప్రదాన ఫలం దక్కుతుంది. పూర్వకాలాన బ్రహ్మ అమృతపానంచేసి పుక్కిలించగా అందులోనుంచి సురభి (కామధేనువు) పుట్టి పాతాళానికి వెళ్లింది. లోకమాత అయిన ఆ సురభికి ఎన్నో గోవులు జన్మించాయి. వానితో పాతాళం నిండిపోయింది. తర్వాత బ్రహ్మయజ్ఞం చేసినపుడు దక్షిణ ఇవ్వడానికి ఆ గోవులు జన్మించాయి. అవి ఒక బిల ద్వారాన ప్రయాణించివెళ్లాయి. ఆ బిలద్వార ముఖాన వేంచేసిన గణపతిని దర్శించి, భక్తి శ్రద్ధలతో సేవించినచో సకల కోర్కెలు సిద్ధిస్తాయి.

అనంతరం ముక్తినిలయమైన సంగిని తీర్థంలోని దేవీతీర్థంలో స్నానంచేసిన నరుడు చక్కని రూపవంతుడు కాగలడు. అనంతైశ్వర్యాలు పుత్రపౌత్రులు గలిగి విస్తారమైన భోగభాగ్యాలను అనుభవించి పరమపదము అందగలడు. బ్రహ్మావర్తంలో స్నానమాడినవాడు బ్రహ్మజ్ఞాని తప్పక అవుతాడు. స్వేచ్ఛా మరణం పొందుతాడు. సందేహం లేదు. బ్రాహ్మణోత్తములారా! అచట నుండి రంతుక ద్వారపాలుని సేవించాలి. మహాత్ముడగు ఆయక్షేంద్రుని సరస్వతీ తీర్థంలో ఉపవాసముండి స్నానమాడుచో యక్ష ప్రసాదంవల్ల కోరిన ఫలములు పొందనగును. అటనుండి మునిస్తుత్యమైన బ్రహ్మావర్త తీర్థంలో స్నానం చేసిన తప్పక బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. అచట నుండి దేవతలకు పితరులకు నిత్య నివాసమైన సుతీర్థకమను ఉత్తమ తీర్థంలో పితృదేవార్చనలు అభిషేకాదులుచేసి వారలను సంతోషపెట్టి అశ్వమేధ ఫలం పొందవచ్చు. అక్కడనుంచి అంబువనంవెళ్ళి అచట కామేశ్వర తీర్థంలో భక్తి ప్రపత్తులతో స్నానం చేసినవాడు సర్వరోగముక్తుడై బ్రహ్మజ్ఞాని తప్పక అవుతాడు. అక్కడే మహిమాన్వితమైన మాతృతీర్థం ఉంది. అక్కడ భక్తితో స్నానంచేస్తే సంతానవృద్ధి కలిగి అనంతైశ్వర్యాలు లభిస్తాయి. అక్కడ నుంచి నియతాహార సేవియై శీతవనానికి వెళ్లాలి. బ్రాహ్మణులారా! అక్కడ అన్యత్ర దుర్లభమైన తీర్థం ఉంది. దర్శనమాత్రాన్నే పవిత్రంచేసే అ క్షేత్రం దండకం. అక్కడ శిరోముండనం చేసికొని మానవుడు పవిత్రుడౌతాడు. పాపాలుపోతాయి. అక్కడే స్వానులోమా యనమనే మరో త్రైలోక విఖ్యాతిగాంచిన తీర్థం ఉంది. అక్కడ మహాప్రాజ్ఞులైన తీర్థోపసేవులు ప్రాణాయామ విధిచే తమ శరీరం మీది రోమాలన్నీ పోగొట్టుకుంటారు. అలాంటి పవిత్రులు పరమపదం పొందుతారు. ఆవల దశాశ్వమేధిక తీర్థం ప్రఖ్యాతమైనది. అక్కడ భక్తితో స్నానంచేస్తే దశ అశ్వమేధ యాగఫలం లభిస్తుంది. తర్వాత శ్రద్ధాళువులు, లోకవిఖ్యాతమైన మానుష తీర్థానికి వెళ్తారు. దానిని చూసినంతనే కిల్బిషాలు తొలగిముక్తులౌతారు. పూర్వ సమయాన ఆ ప్రదేశాన వేటకాని బాణాలకు గురియై కృష్ణమృగాలు ఆ సరస్సులోపడి మనుష్యశరీరాలు ధరించాయి. అలావచ్చిన బ్రాహ్మణోత్తములనుచూచి వేటగాళ్లు వారలతో ఓ ఋషులారా! మా బాణాలు తగిలిన లేళ్ళు సరస్సులో మునిగిపోయాయి. అవి తర్వాత ఏమైనవని అడిగారు. అందులకా బ్రాహ్మణులు మేమే ఆ జింకలము. ఈ పవిత్ర తీర్థమహిమ వల్ల ఉత్తమమానుష రూపములు ధరించాము. మీరు గూడ మా వలెనే మత్సరరహితులై స్నానంచేసి పాపాలనుండి ముక్తులుకాండి అని చెప్పారు. అంతట వారుగూడ అందులో స్నానంచేసి పవిత్ర శరీరులై స్వర్గానికి వెళ్లారు. ఓ విప్రోత్తములారా! యిలాంటి మహిమగల మానుషతీర్థం గరిమనువిన్న శ్రద్ధాళువులు గూడ పరమపదం పొందుతారు.

ఓ బ్రాహ్మణోత్తములారా, మానుష తీర్థానికి తూర్పుగా క్రోసెడు దూరాన ద్విజోత్తములచే సేవింపబడునట్టి ఆపగ అనే ప్రసిద్ధిచెందిన నది ఉన్నది. అక్కడ పాలలో వండి నేతితో కలుపబడిన శ్యామాక (సామధాన్యం) పరమాన్నం బ్రాహ్మణులకు సమర్పించువారు పాపములు పొందరు. ఆ నదీతీరాన శ్రాద్ధకర్మలు జరుపువారల సర్వకామ్యములు సిద్ధించుటకు సందేహములేదు. తమవంశంలో ఎవడైనా ఒకడు పుత్రుడు కాని పౌత్రుడు కాని ఆ నదీతీరాన తమకు తిలతర్పణం చేయువాడు పుట్టి తమకు నూరుకల్పాల వరకు సద్గతులు కలిగించగలరా అని పితృదేవతలు ఎదురుచూస్తూ ఉంటారు! భాద్రపద కృష్ణ పక్ష చతుర్దశినాడు విశేషించి మధ్యాహ్న సమయాన అచ్చట పిండ ప్రదానం చేయువానికి మోక్షం కలుగుతుంది. అచట నుండి బ్రహ్మకు ముఖ్యస్థానమైన బ్రహ్మోదుంబరమనే లోక విశ్రుతమైన ప్రదేశానికి వెళ్లాలి. బ్రాహ్మణులారా! అచట ఉన్న బ్రహ్మర్షి కుండంలో స్నానం చేసినవాడు సప్తర్షుల అనుగ్రహం వల్ల ఏడు సోమ యాగాలు చేసిన పుణ్యఫలం పొందగలడు. భూలోకంలో దుర్లభమైన ఆతీర్థాన్ని భరద్వాజ గౌతమ జమదగ్ని కశ్యప విశ్వామిత్ర వసిష్ట అత్రి మహర్షులు కలిసి కల్పించారు. ఆ తీర్థాన్ని చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా సేవించినందున బ్రహ్మోదుంబర తీర్థంగా ప్రశస్తిపొందింది.

ఓ బ్రాహ్మణోత్తములారా! అవ్యక్తజన్ముడగు ఆ బ్రహ్మ తీర్థాన స్నానం చేసినచో బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. దీనికి తిరుగులేదు. ఆ ప్రదేశాన ఒక బ్రాహ్మణునకు భోజనం పితరులను ఉద్దేశించి పెట్టినచో దానసంతుష్టులై పితరులాతనికి దుర్లభమైన వరము లొసంగుదురు. విడిగా సప్తమహర్షులనుద్దేశించి ఆకుండంలో స్నానంచేస్తే ఆ ఋషుల అనుగ్రహం వల్ల సప్తలోకాధి పత్యమూ పొందవచ్చును. సమస్త పాపాలను పోగొట్టు కపిస్థలమనే ప్రసిద్ధ తీర్థం ఉంది. అక్కడ వృద్ధకేదారేశ్వర మహాదేవుడు నెలకొని ఉన్నాడు. అక్కడ దండితో కూడియున్న రుద్రుని, స్నాతుడై అర్చించినచో అంతర్థానశక్తిని పొంది శివలోకంలో సుఖించవచ్చు నమస్కరించినచో కేదార క్షేత్రాటన ఫలం పొందగలరు. చైత్రశుక్ల చతుర్దశినాడు శివునకు ప్రీతిగా అక్కడ శ్రాద్ధ మొనర్చినచో పరమపదం లభించును. అచట నుండి దుర్గ, కాత్యాయని, భద్ర, నిద్ర, మాయ సనాతనీ అనే పేర్లతో విరాజిల్లే దేవీస్థానమైన కలశానికి వెళ్ళవలెను. ఆ కలశ తీర్థంలో స్నానంచేసి ఒడ్డునే ఉన్న దుర్గాదేవిని దర్శించినచో దుస్తరమైన సంసారసాగరాన్ని నిస్సందేహంగా దాటవచ్చు.

తర్వాత ముల్లోకాల్లో దుర్లభమైన సరక క్షేత్రాన్ని దర్శించాలి. కృష్ణ పక్ష చతుర్దశినాడు అందు వేంచేసిన మహాదేవుని సేవించినచో కోర్కెలన్నీ ఫలించి శివలోకం పొందవచ్చు. మహామునులారా! ఆ సరక క్షేత్రంలో ముక్కోటి తీర్థాలున్నవి.

ఆ సరోవరం మధ్య భాగాన ఉన్న ఒక బావిలో కోటి రుద్రులున్నారు. ఆ సరస్సులో స్నానంచేసి కోటి రుద్రులను స్మరించినచోట ఆ రుద్రుల అనుగ్రహం వల్ల కోటి రుద్రులను పూజించిన ఫలం లభించి సర్వదోషములు తొలగిపోవును. ఇంద్రజ్ఞానం పొంది పరమపదం లభించును. అక్కడే సర్వపాపభయాలు పోద్రోలు ఇడాస్పద తీర్థం కలదు. దాని దర్శన మాత్రము ననే నరులు ముక్తి పొందగలరు. అక్కడ స్నానంచేసి దేవ పితృగణాలను అర్చిస్తే కోరిన కోర్కెలు సిద్ధించును. ఎలాంటి దుర్గతులు కలుగవు. అచటనే సర్వకిల్పిష నాశకమైన కేదారతీర్థం ఉంది. అచట స్నానమాడిన మానవునకు సకల దానఫలమూ కలుగుతుంది. అక్కడనే భూలోకంలో దుర్లభమైన కింరూప తీర్థం ఉంది. ఆ మహాతీర్థంలో మునిగినచో సర్వయజ్ఞ ఫలాన్నీ పొందవచ్చు. సరకక్షేత్రానికి తూర్పు దిశగా ముల్లోకాల్లో ప్రఖ్యాతి పొందిన అన్యజన్మమనే తీర్థం ఉంది. అది అన్ని పాపాలనూ నశింప జేస్తుంది. నరసింహరూపాన క్రూర రాక్షసుని సంహరించిన విష్ణువు ఆ సింహరూపంలోనే ఉండి సింహాల పట్ల మమకారం పెంచుకున్నాడు. అంతట దేవ గంధర్వాదులంతా శివుణ్ణి ఆరాధించి సాష్టాంగ ప్రణామాలుచేసి విష్ణువు ఘోరరూపాన్ని గురించి విన్నవించారు. అంతట ఆమహేశ్వరుడు శరభమనే మృగ రూపం ధరించి నరసింహదేవునితో వేయి దివ్య వర్షాలు యుద్ధంచేశాడు. అలా పోరాడి పోరాడి చివరకా దేవులిద్దరూ సరోవరంలో పడిపోయారు. ఆ సరోవరం తీరాన ఒక రావిచెట్టు క్రింద నారద మహర్షి ధ్యానస్థుడై యుండి ఆ విషయం చూచాడు. అలా చూస్తుండగానే విష్ణువు చతుర్భుజాకారాన్ని శివుడు లింగాకృతిని పొంది నిలచారు. ఆపరమ పురుషుల నిద్దరిని చూచి నారదుడు భక్తితో యిలా స్తోత్రం చేశాడు.