ఇంద్రాది దేవతా కృత దేవతస్తుతి

దేవతలు ఇలా స్తోత్రం చేశారు. హే భగవతి! పాపనాశిని నీకు నమస్సులు! దేవ శత్రువుల దర్పం నాశమొనర్చు తల్లీ! హరిహరులకు రాజ్యమిచ్చు జననీ! యజ్ఞకార్యాలు రక్షించు తల్లీ! నీకు నమస్సులు. దేవ శత్రువుల దునుమాడు తల్లీ! శుంభ నిశుంభుల చంపిన మాతా నమస్సులు! ప్రజల ఆర్తి పోగొట్టే తల్లీ! త్రిశూలధారిణీ! నారాయణీ! చక్ర ధారిణీ! నీకు నమస్సులు. ఎల్లపుడు భూమిని ధరించే వారాహీ నారసింహీ! వజ్రం ధరించిన ఐంద్రీ! మయూర వాహినివగు కౌమారీ! నీకు నమస్కారము.

హంస వాహినివగు బ్రాహ్మీ! మాలాధారిణివగు కేశినీ! గార్దభారూఢవగు తల్లీ! ఎల్లర దుఃఖాలు పోగొట్టు జగన్మయీ! నీకు నమస్కారము. దేవబ్రాహ్మణ శత్రువుల సంహరించి విశ్వరక్షణచేసే విశ్వేశ్వరీ, సర్వమయీ, త్ర్యంబకీ! వరదాయినీ! నీకు ప్రణామాలు. మమ్మను గ్రహింపుము. నీవు బ్రహ్మాణివి, మృడానివి, నెమలిమీద నెక్కు శక్తిధారిణి కౌమారివి, వారాహివి, గరుడారూఢవై శార్ ఙ్గం ధరించిన వైష్ణవీ దేవివి. చూడ భయంకరమై, ఘుర్ఘర ధ్వనులుచేసే నారసింహివి. వజ్రంధరించిన మాహేంద్రివి. చండముండవు, శవగమనప్రియవు, యోగిని, ఇవన్నియు నీ రూపాలే. నీకు నమస్సులు. త్రినయనా భగవతీ, రాత్రింబవళ్ళు అవనతశిరులై నీ చరణాలను సేవించువారలకు, స్తోత్రాలతో బల్యన్నాలతో పుష్పాలతో నిన్ను పూజించు ఘనులకు జీవితంలో పరాభవంగాని, అశుభంగాని ఎన్నడూ కలుగవు. తల్లీ నీకు నమోవాకములు!” దేవతలు గావించిన ఈ స్తోత్రం విని ఆ అంబిక వారలతో మీ ప్రసాదంవల్లనే సంగ్రామరంగంలో శత్రు విజయం నాకుచేకూరినదని నవ్వుతూ అన్నది. మీరందరు గావించిన ఈ స్తోత్రాన్ని భక్తితో కీర్తించు మానవులకు దుస్వప్ననాశనం కలుగుతుంది. సందేహం లేదు. ఇక మీకు కావలసిన వరం కోరుకొనండి అని ఆ తల్లి ఆదేశించింది.

దేవతలన్నారు, తల్లీ! దేవతలకు మరొకవరం ఇవ్వదలచినచో బ్రాహ్మణ శిశు గోవులకు మేలుగావింపుము. మళ్ళీ నీ అగ్నిశరీరంతో రాక్షసులను భస్మమొనరింపుము. అందులకు అంబిక యిలా అన్నది - దేవతలారా; నేను మరల శంకరుని ముఖమందలి స్వేదం (చెమట) నుండి రుధిరాననం (ముఖం)తో జన్మించి అంధకాసురుణ్ణి సంహరిస్తాను. అప్పుడు నన్ను చర్చిక అంటారు. మళ్ళీ నందునియింట యశోదకు జన్మించి విప్రచిత్తి లవణాసురుడు శుంభ నిశుంభాదులను నా దంతాలతో చీల్చి చంపుతాను. తర్వాత, దేవతలారా, కలియుగంలో జనులు తిండిలేక మాడిపోవు సమయాన ఇంద్రునింట మారిగా పుట్టి సత్యభామాదేవి సహాయంతో దేవతల నందరకు అన్ని రకాల కూరగాయలు సమకూర్చి రక్షిస్తాను. అప్పుడు నా పేరు “శాకంభరి”. తర్వాత మరల శత్రువులను సంహరించి ఋషులను రక్షించుటకు వింధ్య గిరులలో పుట్టి దైత్యులను వధించి సురాలయానికి చేరుకుంటాను. అంతేకాదు. ఆతర్వాత కూడ మరొక పర్యాయం అరుణాక్షుడనే రాక్షసుడు ప్రజలను బాధించునపుడు నేను ఒక పెద్ద గండు తుమ్మెదగా భ్రమరంగా పుట్టి వాడిని చంపి దేవతలకు మేలు గావించి మరల స్వర్గానికి వెళ్తాను. అప్పుడు నా పేరు భ్రమరాంబి ఈ విధంగా భవిష్యత్తులో కూడ మీరు కోరినట్లు సాధుసంరక్షణ చేస్తూ ఉంటాను.

పులస్త్యుడన్నాడు, వరదాయిని అయిన ఆ అంబిక ఇలా వరప్రదానంచేసి, బ్రాహ్మణ శ్రేష్టుల కభివాదనంచేసి భూతగణాదులనందరను పంపివైచి సిద్ధసంఘాలు తన వెంటరాగా స్వర్గానికి వెళ్లినది. అంబికయొక్క విజయగాధలు తెలిపే ఈఆఖ్యానంచాల పవిత్రమైనది ప్రాచీన మైనది. ఇది అన్ని శుభాలు చేకూర్చుతుంది. ఇది సకల రాక్షసనాశకమని భగవానుడు స్వయంగా వక్కాణించాడు. కనక మానవులంతా దీనిని సదా శ్రవణంచేస్తూ ఉండాలి.