వామన మహా పురాణము
వామనపురాణం మహాపురాణమా? ఉప పురాణమా?
పురాణ వర్గీకరణలో వామన పురాణం మహాపురాణమా లేక ఉప పురాణమా అనే ధర్మసందేహం కొందరికి రావచ్చు. దాదాపుగా పురాణాలన్నీ ఈ పురాణాన్ని మహాపురాణంగానే పేర్కొంటున్నాయి. కానీ గరుడ పురాణం బృహద్ధర్మ పురాణాలు మాత్రం దీనిని ఉపపురాణంగానే పేర్కొంటున్నాయి. కూర్మ పురాణం (7-20) కూర్మ పురాణాన్ని కూడా మహాపురాణంగాను ఉప పురాణంగాను పేర్కొంటున్నది. ఉప పురాణాలపై విస్తృత పరిశోధనలు చేసిన డా. ఆర్.సి. హజ్రా వివిధ గ్రంథాలలో చెప్పబడిన 23 రకాల ఉపపురాణ పట్టికలను ఇచ్చాడు. అయితే ఆ పట్టికలలో కేవలం నాల్గింటిలో మాత్రమే వామనపురాణం ఉప పురాణంగా చెప్పబడింది. ఆయన తన గ్రంథంలో ప్రస్తుతం లభ్యం అవుతున్న వామన పురాణం ఉప పురాణమనే చెప్పవచ్చు అని సూచించాడు. కానీ ఆయన అభిప్రాయం మాత్రమే గాక మరికొన్నింటిని కూడా పరిశీలించగా
గరుడ, బృహద్ధర్మ, కూర్మ పురాణాలు తప్ప మరేవీ వామన పురాణాన్ని ఉప పురాణం అని చెప్పటం లేదు. కూర్మ పురాణం వామన పురాణాలలోను ఉప పురాణాలోను కూడా చేర్చింది. కొన్ని పట్టికలలో అగ్ని, బ్రహ్మవైవర్త, లింగ పురాణాలు ఉప పురాణాలలోనూ మహాపురాణలలోనూ కూడా స్థానం పొందలేదు.
బ్రహ్మాండ పురాణం రెండు పట్టికలలోనూ ఉన్నది. ఇందుకు ఒక కారణం తమ ఇష్టా ఇష్టాలను బట్టి మహాపురాణ, ఉప పురాణ పట్టికలను తయారు చేసి ఉండాలి. కొందరు వామన పురాణం పేరుతో ఒక మహాపురాణం ఒక ఉప పురాణం ఉండి ఉండేదేమోనని ఊహిస్తున్నారు.
వామన పురాణాన్ని ఉప పురాణంగా పేర్కొన్న పట్టికలో వామన అని కాక ‘మానవ’ పురాణం అని వ్రాసి ఉన్నది. అసలు మానవ పురాణం అనేదే ఆకాశ కుసుమం. ఎక్కడే లేనిది. అది వామన పురాణం కాక లభించని మానవ పురాణమో మరేదో అయి ఉండాలి. అందుచేత వామన ఉప పురాణం ఎన్నడూ లేదని, ప్రస్తుత వామన పురాణం ఆ నాల్గు పట్టికలలోనూ పేర్కొనబడినది కాదని భావించవచ్చు. హజ్రూ తన వాదానికి బలంగా 1. ప్రస్తుత వామన పురాణంలో పురాణ పంచ లక్షణాలైన సర్గ ప్రతిసర్గాదులు లేవని 2. మత్స్య, స్కాందపురాణాలు వామన పురాణంలో ఉన్నాయని చెప్పిన విషయాలు ప్రస్తుత వామనంలోలేవని, మత్స్య, స్కాంద పురాణాలు, వామన పురాణం కూర్మ కల్పానికి చెందిన దని, దానికి వక్త చతుర్ముఖుడని చెపుతున్నారు. ప్రస్తుత వామన పురాణ వక్త పులస్త్యుడు. శ్రోత నారదుడు. ఇందులో అసలు కూర్మకల్ప విషయమే లేదు. ఇందులో కూర్మకల్ప వృత్తాంతము కానరాదు.
ఈ వాదాన్ని పరిశీలించగా, పురాణాలలో పంచలక్షణాలు ఉండాలనేది తరువాతి కాలంలో నిర్ణయించబడిన విషయం. ప్రాచీన కాల పురాణాలు అనబడే వాటిలో వంశాను చరితలు లేవు. ఎక్కువగా ధర్మ శాస్త్రాది విషయాలే ఉన్నాయి. వంశ వంశాను చరితలు సూతులకు సంబంధించినవి కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో చెప్పిన దానిని బట్టి పౌరాణికులు లేరు. సూతులు లేరు. భవిష్య పురాణం కూడా పురాణాలు ధర్మాశాస్త్రాలని చెప్పుతున్నవి. అందువలన పంచలక్షణాలు పురాణాలకు ప్రధాన లక్షణాలని భావించ నక్కరలేదు. కాబట్టి అవిలేకపోతే దానిని మహాపురాణం కాదనడం అంత సమంజసం కాదు.
వామన పురాణంలో వంశ, వంశానుచరిత్రలు లేవుకానీ సర్గ, ప్రతిసర్గ విషయాలు ఉన్నాయి. వివిధ మన్వంతరాలలోని మరుత్తులు జన్మాదికాలు చెప్పే దానిని బట్టి మన్వంతర వృత్తాంతము చెప్పబడి ఉన్నట్లే. అందువలన పురాణ పంచలక్షణాలు దీనికి నప్పవు అనేది అంత పొసగే మాటకాదు.
మత్స్యపురాణము, స్కాందపురాణము, వామన పురాణాన్ని గురించి
త్రివిక్రమస్య మహాత్మ్య మధికృత్య చతుర్ముఖః
త్రివర్గ మభ్యధాత్ తచ్చ వామనం పరిశీర్తితం
పురాణం దశ సాహస్రం కూర్మ కల్పానుగం శివం
(మత్స్య 53.44-45, స్కంద 7-1.2.63-64)
(త్రివిక్రమ మాహాత్మ్యం గురించి బ్రహ్మ త్రివర్గాలను చెప్పాడు. దానినే వామన పురాణం అంటారు. దానిలో పదివేల శ్లోకాలు ఉన్నాయి. కూర్మకల్పాన్ని అనుసరించినది శుభప్రదమైనది) ఈ విషయాలు ప్రస్తుత వామనపురాణంలో లేవు. కానీ నారదీయ పురాణంలో వామన మహాపురాణం గురించి
శృణుతాత ప్రవక్ష్యామి పురాణం వామనాభిధమ్ ।
త్రివిక్రమస్య చరిత్రాఢ్యం దశ సాహస్ర సంఖ్యకమ్ ॥
కూర్మకల్ప సమాఖ్యానం వర్గ త్రయకథానకమ్।
భాగద్వయసమాయుక్తం వక్తృ శ్రోతృశుభావహమ్ ॥
పురాణ ప్రశ్నః ప్రతమం బ్రహ్మశీర్షచ్ఛిదా తతః ।
కపాల మోచనాఖ్యానం దక్షయజ్ఞ విహింసనమ్ ॥
హరస్య కాల రూపాఖ్యా కామస్య దహనం తతః।
ప్రహ్లాద నారాయణ యోర్యుద్ధః దేవాసురాహవః ॥
సుకేశ్కర్క సమాఖ్యానం తతో భువనకోశకమ్ ।
తతః కామవ్రతాక్యానం శ్రీదుర్గాచరితం తతః ॥
తపతీచరితం పశ్చాత్ కురుక్షేత్రస్య వర్ణనమ్ ।
సత్యా మహాత్మ్యమతులం పార్వతీ జన్మకీర్తనమ్ ।
తతస్తస్యా వివాహశ్చ గౌర్యుపాఖ్యానకం తతః ।
తతః కౌశిక్యుపాఖ్యానం కుమార చిరత్ర తతః ॥
తతో అంధక వధాఖ్యానం సాధ్యోపాఖ్యానకం తతః ॥
జాబాలిచరితం పశ్చాదరజాయాః కథాద్భుతా ॥
అంధకేశ్వర యోర్యుద్ధం గణత్వం చాంధకస్య చ।
మరుతాం జన్మకథనం బలేశ్చ చిర్తర తతః ॥
తతస్తు లక్ష్య్యాశ్చరితం త్రైవిక్రమతః పరమ్ ।
ప్రహ్లాద తీర్థ యాత్రాయం ప్రోచ్యతేథ కథాః శుభా ॥
తతశ్చ ధుంధుచరితం ప్రేతోపాఖ్యానకం తతః ।
నక్షత్రపురుషాఖ్యానం శ్రీదామ చరితం తతః ॥
త్రివిక్రమ చరిత్రాంతే బ్రహ్మప్రోక్తః స్తవోత్తమః ।
ప్రహ్లాదబలి సందవాదే సుతలే హరిశంసనమ్ ॥
ఇత్యేష పూర్వ భాగో అస్య పురాణస్య తవోదితః ।
శృణ్వతోస్యోత్తరం భాగం బృహద్వామనసంజ్ఞరమ్ ॥
మహేశ్వరీ భాగవతీ సౌరీ గాణేశ్వరీ తథా ।
చతస్రః సంహితాశ్చాత్ర పృథక్సాహ ప్రసంఖ్యయా ॥
మాహేశ్వర్యాం తు కృష్ణస్య తద్భక్తానాం చ కీర్తనమ్ ।
భాగవత్యాం జగన్మాతుర పితార కథాద్భుతా ॥
సౌర్యాం సూర్యస్య మహిమా గదితః పాపనాశనః।
గణేశ్వర్యాం గణేశస్య చిరతం చ మహేశితుః ॥
ఇత్యేతద్వామనం నామ పురణం సువిచిత్రకమ్ ।
పులస్త్యేన సమాఖ్యాతం నారదాయ మహాత్మనే ॥
(నారదపురాణం-1-105-1-17)
(నాయనా విను వామన పురాణం గురించి తెలుపుతున్నాను. అందులో త్రివిక్రమ చరిత్ర చెప్పబడింది. పదివేల శ్లోకాలు ఉన్నాయి. కూర్మకల్పంలో చెప్పబడింది. త్రివర్గాలను గురించి తెలుపబడ్డది. దానిలో రెండు భాగాలున్నాయి. వక్తకూ, శ్రోతకూ శుభం కలిగిస్తుంది.
మొదట పురాణం గూర్చిన ప్రశ్న, తరువాత బ్రహ్మశిరశ్ఛేదం, కపాల మోచన వృత్తాంతం, దక్ష యజ్ఞ ధ్వంసం, హరకాల రూప కథనం, కామదహనం, ప్రహ్లాద నారాయణ యుద్ధం, దేవాసురాహవం, సుకేశి సూర్యవృత్తాంతం, భావనా కోశం, కామ్యవ్రతాలు, శ్రీ దుర్గాచరితం, ఆ వెనుక తపతీ చరిత్ర, కురుక్షేత్ర వర్ణన, సతీ మాహాత్మ్యం, పార్వతీ జన్మ వృత్తాంతం, ఆమె తపస్సు, వివాహం, గౌర్యుపాఖ్యానం, కౌశిక్యుపాఖ్యానం, కుమార చరితం, అంధక వధ, సాధోపాఖ్యానం, జాబాలి చరిత్ర, అరజ అద్భుత కథ, అంధకేశ్వరు యుద్ధం, అంధక గణత్వ వృత్తాంతము, మరుత్తుల జన్మ వృత్తాంతము, బలి చరిత్ర, అటుతరువాత లక్ష్మీచరిత్ర, తరువాత త్రివిక్రమ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, ప్రహ్లాద తీర్థ యాత్ర, పుణ్యకథలు, దుంధు చరిత్ర, ప్రేతోపాఖ్యానం, నక్షత్ర పురుషాఖ్యానం, శ్రీదామచరిత్ర, త్రివిక్రమ చరిత్ర చివర బ్రహ్మప్రోక్తస్తవోత్తమం, సుతలంలో ప్రహ్లాద బలి సంవాదంలో హరిప్రశంస-ఇది ఈ పురాణ పూర్వభాగం నీకు తెలిపాను.)
దీని ఉత్తరభాగం బృహద్వామనం అనే పేరుగలది, అందులో ఒక్కొక్కటి వెయ్యి శ్లోకాల చొప్పున నాలుగు సంహితలు ఉన్నాయి. వాటి పేర్లు మాహేశ్వరి, భాగవతి, శౌరి, గాణేశ్వరి.
మాహేశ్వరీ సంహితలో కృష్ణుని, అతని భక్తులను ప్రశంసించటం జరిగింది. భాగవతీ సంహితలో జగన్మాత అద్భుత అవతార గాధ ఉన్నది. సౌర సంహితలో సూర్య మహిమ చెప్పబడింది. అది పాపాన్ని నశింపచేసేది. గాణేశ్వర సంహితలో గణేశ చరిత్ర, మహేశ చరిత్ర ఉన్నవి. ఈ వామన పురాణం అతి విచిత్రమైనది. పులస్త్యుడు మహాత్ముడైన నాదునికి చెప్పినది).
వామనపురాణం పూర్వభాగంలోనివని నారద పురాణం చెప్పిన విషయాలు అన్నీ ప్రస్తుత వామన పురాణంలో అదే వరుసలో ఉన్నాయి. ఇందులోని సరోమాహాత్మ్యం అని మధ్యలో చెప్పిన 28 అధ్యాయాలు పూర్వభాగంలోని వృత్తాంతాన్ని నారద పురాణం చెప్పలేదు. నాలుగు సంహితలు నాలుగువేల శ్లోకాలుగల బృహద్వామన పురాణం ఇంకా ఎక్కడా లభ్యం కాలేదు. వాని మధ్యయుగాలనాటి కొన్ని నిబంధ, స్మృతి గ్రంథాలలో ఈ బృహద్వామన పురాణ భాగం పేర్కొనబడింది. కాబట్టి ప్రస్తుత వామన పురాణం మహా పురాణాలలోనిదిగా నారద పురాణంలో పేర్కొనబడింది. కాబట్టి ప్రస్తుత వామన పురాణం మహాపురాణాలలోనిదిగా నారదపురాణం పేర్కొంటున్నదే ననటంలో సందేహం అక్కర లేదు.
ఇక మత్స్య స్కంద నారద పురాణాలు వామనపురాణ లక్షణాలుగా నాల్గింటిని
1. త్రివిక్రమ మాహాత్మ్యం లేదా త్రివిక్రమ చరిత్ర
2. కూర్మ కల్పాఖ్యానాలు
3. త్రివర్గ (ధర్మార్థ కామ) వివరణ
4. పదివేల శ్లోకాలు ఉండటాన్ని పేర్కొంటున్నాయి.
అలాగే మత్స్య స్కంద పురాణాలు వక్త చతుర్ముఖుడు (బ్రహ్మ)ని చెపితే నారదీయ పురాణం ప్రస్తుత వామన పురాణంలో ఉన్నట్లుగానే వక్త పులస్త్యుడనీ, శ్రోత నారదుడని తెలుపుతున్నది.
ఈ సందర్భంలో మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి పురాణం కొన్ని కొన్ని యుగాలలో మారుతూ వచ్చింది. ఆ మార్పులో గ్రంథస్థ విషయాలు, గ్రంథ పరిమితీ, వక్త, శ్రోతల పేర్లు మారుతూ వచ్చాయి. ప్రస్తుత మత్స్య పురాణం సంస్కరణ నాటికి బ్రహ్మపేరు వక్త పేరుగా ఉన్నా, నారదీయ పురాణం సంస్కరణ నాటికి బ్రహ్మ మానపుత్రుడైన పులస్త్యుడు వక్త అయి, శ్రోత నారదుడై నేటి వరకు మారకుండా ఉన్నాడు.
ప్రస్తుత వామన పురాణంలో కూర్మకల్పం అనే మాట లేకపోయినా, మత్స్య స్కాంద పురాణాలలోగల కూర్మకల్పానుగం అన్న సమాసానికి నారదీయ పురాణంలోని కూర్మకల్ప సమాఖ్యానం అన్న సమాసానికి, వామన పురాణంలో కూర్మకల్ప ప్రస్తావన కలదని, కాని కూర్మకల్ప వర్ణనం కలదని అర్థంకాక, కూర్మకల్పంలో జరిగిన కథలను వామన పురాణం తెలుపుతుంది అనే అర్థంగా గ్రహించవచ్చు అని పండితుల సమర్థింపు. ప్రతి పురాణమూ ఒక కల్పానికో, కొన్ని కల్పాలకో సంబంధించిన వృత్తాంతాలను తెలుపుతుంది. ఈ విషయం ఇంతకుముందే వివరించబడింది గదా.