ఇందలి ముఖ్యాంశాలు

మొదట దేవర్షి నారదునికి పులస్త్యమహర్షి వామనావతార కథను వివరించాడు, తరువాత శివుని లీలా చరిత్రము ఆయన జీమూతవాహనుడైన వృత్తాంతము, బ్రహ్మ కపాలమును శివుడు ఖండించడం, కపాల మోచన ఆఖ్యానము, దక్షయజ్ఞ విధ్వంసము, హరియొక్క కాల రూపము, మన్మథ దహనము, ప్రహ్లాదునికి నారాయణనికి మధ్య జరిగిన ఘోర సంగ్రామము, భావనకోశము, దుర్గా చరిత్రము, కురుక్షేత్ర వర్ణనం. పార్వతీ జన్మము, గౌరీ ఆఖ్యానము, స్కందచరిత్రము, అంధక వధ, జాబాలి మహర్షి కథ, మరుద్గణాల ఉత్పత్తి, బలిచక్రవర్తి చరిత్రము, లక్ష్మీ చరిత్రము, ప్రేతోపాఖ్యానము, నక్షత్ర పురుషాఖ్యానము మొదలైనవి వర్ణించబడ్డాయి. ఇతర పురాణలలో అసలులేని విషయాలు, లేక చాలా సంక్షిప్తంగా చెప్పబడిన విషయాలు కొన్ని ఇందులో చెప్పబడ్డాయి. శివుని శరీరంలోని వివిధ అవయవాలకు అలంకారాలుగా ఉన్న వివిధ సర్పాల పేర్లు ఇందులో చెప్పబడ్డాయి. బదరికాశ్రమంలో నరనారాయణులతో ప్రహ్లాదుని యుద్ధం, దేవాసురుల యుద్ధంలో వారి వేరువేరు వాహనాల వర్ణన, కర్కచతుర్థీ వ్రత కథ, కాయజ్జీవీ వ్రత కథ, గంగామానసిక స్నానం, గంగామాహాత్మ్యం, దధివామన స్తోత్రం ఇవ్వబడ్డాయి. అల్లసాని పెద్దన తన మనుచరిత్రలో ప్రవరుడు ప్రతిరోజు ప్రాతఃకాలంలో దధి వామన స్తోత్రం చేస్తూ స్నానాన్ని వరుణానదీ తీరంలో నిర్వర్తించేవాడని చెప్పబడిన స్తోత్రం ఇదే. ఇలాగే వరాహ మాహాత్మ్యం, వేంకటేశగిరి మాహాత్మ్యం, త్రివిక్రముని చేత జరిగిన దుంధువధ, ప్రహ్లాదుని తీర్థయాత్ర, వామనుని విధి స్వరూపము, వివిధ నివాస స్థానముల వర్ణనలే గాక ఇంకా ప్రహ్లాదుడు తన మనుమడైన బలి చక్రవర్తికి చేసిన విష్ణుభక్తి మహాత్మ్యాపదేశము, విష్ణు పూజావిధి, విష్ణ్వాలయ నిర్మాణ విధానము, వైష్ణవదీక్షలో దీక్షితుడు అగు విధానములతో పురాణము ముగించబడింది.

వర్ష ఋతువులో తీవ్ర వృష్టివలన బాధపడిన పార్వతి శివునితో నాథా మనకు ఒక మంచి ఇంటిని సమకూర్చండి. అందులో మనం సుఖంగా నివాసం చేయగలం. ఈ వర్షబాధ భరించలేకపోతున్నాను అని విన్నవించుకొన్న. ఈ మాటలను విన్న శివుడు పార్వతితో పరిహాసపూర్వకంగా “పార్వతీ నేను శ్మశాసనంలో ఉండేవాడిని, పులితోలు కప్పుకొని శరీర ఆచ్ఛాదన చేసుకొనేవాడిని. నా హారాలు సర్పాలు. అలాంటి నేను ఇంటిని ఎలా సమకూర్చగలను అని అమెతో అన్నాడు. ఈ మాటలు వినిన పార్వతి ఇంకా కోపాన్ని తెచ్చుకొని నాథా! నేను వర్షంలో నానిపోతున్నాను. ఎంత గట్టిగా వర్షం పడుతున్నదో చూడండి. అలాంటప్పుడు నాకు వర్షం నుంచి రక్షణే లేదా అని ప్రశ్నించింది. మీకు ఇల్లు సమకూర్చే ఉద్దేశ్యంలేకపోతే ఇక వేరే మార్గం ఆలోచించండి అన్నది. అందుకు చద్రమౌళి ప్రతిస్పందిస్తూ, పార్వతీ ఇంటిని నేను సమకూర్చలేను గానీ నీ శరీరాన్ని వర్ష జలం స్పృశించకుండా చేయగలను అని చెప్పి పరమ శివుడు, తాను మేఘాలపై ఆశీనుడై సతీదేవిని ఒక జల బిందువు కూడా స్పృశించటానికి వీలులేదని మేఘాలను ఆదేశించాడు. అప్పటి నుంచి శంకరుని పేరు జీమూతవాహనుడు అయింది అని ఈ పురాణం హృద్యంగా తెలుపుతూ ఋతువులను కావ్యశైలిలో వర్ణించింది.