వామన మహా పురాణము
సుధర్ముని కథ
పూర్వం త్రేతాయుగారంభంలో అది జరిగింది. మద్ర దేశంలో శాకలమనే ప్రసిద్ధ నగరం ఉండేది. ఆ ఊరిలో ధనవంతుడు గుణవంతుడు నానా శాస్త్ర కోవిదుడు మహాభోగి అయిన సుధర్ముడనే వణిజుడు (వ్యాపారి) ఉండేవాడు. అతడొక పర్యాయం విశేషంగా విలువగల సరకులు తీసికొని చరాస్తి తీసికొని తన రాష్ట్రం వదలి సురాష్ట్ర దేశానికి వెళ్తుండగా మార్గ మధ్యాన దొంగలు అడ్డగించి ఆయన సర్వస్వాన్ని, ఎడారి ప్రదేశంలో దోచుకుపోయారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మగిలిన ఆ వ్యాపారి తన దుర్దశకు మిక్కిలిగా దుఃఖించి అసహాయుడై ఆ ఎడారి దేశంలో పిచ్చివాడివలె తిరుగ సాగాడు. అలా ఒకనాడు అరణ్యంలో తిరుగుతూ తనవలెనే ఏకాకిగా నిలబడిన ఒకజమ్మి చెట్టువద్దకు చేరాడు. ఆ చుట్టుపట్ల పక్షులుగాని, మృగాలుగాని ఏవీ కనుపించ లేదు. నడక శ్రమతో ఆకలితో తూలిపోతూ అసుధర్ముడు అశమీవృక్షం క్రింద కూలబడినాడు.
వెంటనే పండుకొని గాఢంగా నిద్రించి మధ్యాహ్న వేళకు, బడలిక తీరిపోగా మేలుకొనే సరికి ఎదురుగా వందలాది ప్రేతాలచే పరివేష్టితుడైన ఒకానొక ప్రేతాన్ని చూచాడు. ఆ ప్రేత నాయకుడిని మరొక ప్రేతం మోసుకుని వచ్చింది. ఎందరో పిండ భుక్కులైన ప్రేతాలు ఎండిన శరీరాలతో ముందర పరుగిడుతూ వచ్చారు. అలా అరణ్యంలో తిరిగివచ్చి ఆ ప్రేతపతి శమీ వృక్షం క్రింద ఆ కోమటి బిడ్డను చూచి స్వాగత పూర్వకంగా అభివాదనం చేశాడు. ఇద్దరూ శ్రమ మూలాన సుఖోపవిష్టులై పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ ప్రేతనాయకుడు తన వణిక్ మిత్రునితో ఇలా అన్నాడు - సౌమ్యా! నీ వెవరవు? ఎక్కడ నుండి రాక? ఎక్కడకు వెళ్తున్నావు? ఈ మృగపక్షి విహీనమైన మహారణ్యానికెలా వచ్చి చేరావు? నీకు క్షేమమగుగాక! అంతా వివరంగా చెప్పుము. అది విని ఓనారదా! ఆ వణిక్పుత్రుడు ఉన్నది ఉన్నట్టుగా, స్వదేశాన్ని వదలడం దారిలో సర్వస్వం కోలుపోవడం వివరంగా చెప్పాడు. అది విని ఆ వణి క్సుతునితో బాటు ఆ ప్రేత నాయకుడు గూడ దుఃఖించి ఆప్యాయతతో అతడి నిలా ఓదార్చాడు. బాబూ! ధనం పోయిందని విచారించకుము. సమయం కలిసివస్తే ధనం మళ్ళీ వస్తుంది. భాగ్యక్షయంతో ధన క్షయం కలుగుతుంది. భాగ్యం కలిసి వస్తే మళ్ళీ అభ్యుదయం కలుగుతుంది. అంతేకాని విచారంతో శరీరాన్ని క్షీణింపజేసుకుంటే ఏమి అనుభవించనగును? కనుక దిగులు మానుము. తర్వాత తన సేవకులను అందరను పిలిచి, ఇదుగో ఈ సోదరుడు మన అతిథి. పూజ్యుడు. నా స్వజనంలోనివాడు. ఇతనిని చూస్తే నా స్వజనులను చూచినంత ఆనందంగా ఉందని అంటూండగా ఎక్కడనుంచో ఒక దృఢమైన మట్టి కుండ పెరుగన్నంతో నిండుగా వచ్చి ఎదుట కనిపించింది. మరొక గట్టి కొత్తకుండ నిర్మలోదకంతో నిండి వచ్చింది. ఆ రెండు పాత్రలను అందులోని అన్నజలాలను చూచి ఆ మహామతి అయిన ప్రేత నాయకుడా వణికుణ్ణి చూచి - బాబూ! లేచి ఆహ్నికలు తీర్చుకొనుమని చెప్పాడు. అనంతరం ఆ నాయకుడా కడుపార పెరుగు అన్నం, చల్లని మంచి నీరు ఆరగింపచేసి, తర్వాత తన పరివారాని కంతకూ భోజనం పెట్టాడు. అందరూ ఆరగించి నీరు త్రాగిన తర్వాత ఆ ప్రేత నాయకుడు తానూ ఆ దధ్యోదనంతిని చల్లని నీరు యధేచ్ఛగా త్రాగాడు. అందరూ అలా తృప్తులైనంతనే ఆ కోమటి బిడ్డడు చూస్తుండగనే ఆ రెండు పాత్రలూ అదృశ్యమైపోయాయి. ఆ అద్భుతం చూచిన కోమటి బిడ్డ కుతూహలం కొద్దీ ఆ ప్రేత నాధుడిని సాధూ! ఈ నిర్జనారణ్యంలో ఈ అమృతోపమైన అన్నం నిర్మల జలంతో నింపిన పానపాత్ర ఎలా వచ్చాయి? ఈ నీ భృత్యులెవరు? నీకంటె బక్క చిక్కి, వర్చస్సు లేకుండా ఉన్నారేల? నీవూ వారల కంటే పుష్టిగా తేజస్విగా ఉన్నావు. తెల్లటి వస్త్రాలు ధరించి ఇందరను పోషిస్తున్న నీ వెవరు? ఈ శమీ వృక్షం విషయమేమిటి? ఈ విషయాలన్నీ నాకు చెప్పుము అని ప్రశ్నించాడు. వణిక్ పుత్రుడి మాటలు విని ఆ ప్రేతాల పెద్ద పూర్వం గడచిన తన జీవిత గాధనంతా పూస గ్రుచ్చినట్టుగా చెప్పాడు. బాబూ! పూర్వం శాకల నగరంలో నేను సోమశర్మగా ప్రసిద్దికెక్కిన విప్రుడను. మా తల్లి పేరు బహుళాదేవి. నా పొరుగుననే మహాధనికుడైన సోమశ్రవుడనే వైశ్యుడుండెడివాడు. అతడు విష్ణుభక్తుడు, యశస్వి. నేను పరమ మూర్ఖుణ్ణి. డబ్బు ఉన్నప్పటికి బ్రాహ్మణుల కిచ్చెడి వాడను కాను. కడుపునిండా మంచి భోజనంకూడ చేసేవాడిని కాదు. మహాలోభిని, దుర్మార్గుడను. ఏ నాడైనా షడ్రసోపేతంగా భోజనం చేశానంటే ఆ రాత్రి ఎవరో మనుష్యులు వచ్చి నా వళ్ళు హూనం చేసి పొయ్యేవారు. తెల్లవారగానే నాకు భయంకరమైన విషూచి (కలరా) కలిగి మరణ బాధ పడుతూండే వాడిని, ఆ విధంగా సిగ్గుమాలిన పాపిష్టి జీవితం గడపే వాడిని. తరవాణి, నువ్వులచక్క పేలపిండి, ఆకుకూరలు, పాడైపోయిన అన్నం యిలాంటి వాటితో రోజులు గడిపే వాడిని. ఈవిధంగాచాలాకాలం గడచిపోగా భాద్రపద మాసంలో ద్వాదశీ పర్వం వచ్చింది. మా నగరంలోని బ్రాహ్మణులూ, క్షత్రియులూ, యితరులూ పర్వస్నానం చేసేందుకు ఇరావతి నడ్వల సంగమానికి వెళ్ళారు. నాపొరుగు మిత్రుడు వైశ్యునితో కలసి నేను కూడ వెళ్ళి సంగమస్నానం చేసి శుచినై ఏకాదశీ ఉపవాసం గావించాను. ఆ పర్వాన సంగమ స్నానంలో పవిత్రుడు జ్ఞాని ధర్మనిష్ఠుడైన ఒక బ్రాహ్మణునకు క్రొత్త జలకుంభాన్ని వస్త్రాచ్ఛాదనంతో, గొడుగు ఒక జత పాదరక్షలతో కూడా కలిపియిచ్చాను. మరొక కుండలో తియ్యని పెరుగన్నం నింపి ఇచ్చాను. డెబ్బది యేండ్ల నా జీవిత కాలంలో నేను గావించిన దానం అదొక్కటి మాత్రమే.
మరణానంతరం నేను ప్రేతాన్నైనాను. నేను దానం చేసిన ఆ అన్నమే తింటున్నా. ఈ మహాప్రేతా లేవీ అలా దానం చేయనందున నా అన్నం తిని జీవిస్తున్నారు. నేను దానం చేసిన జల కుంభం, అన్న కుంభం రోజూ మధ్యాహ్న వేళకు ఇలాగే వస్తాయి. నేను తినినంత వరకు అక్షయంగా ఉంటాయి. నేను తిని నీరు త్రాగిన వెంటనే వెళ్లిపోతాయి. నేను వెనుక దానం చేసిన గొడుగే ఈ జమ్మివృక్షం నాకు నీడ ఇస్తున్నది. నేను దానం చేసిన చెప్పులే ప్రేతాలరూపంతో నన్నుమోసికొని వెళ్లాయి. ఓధర్మజ్ఞా! నాలోభి గుణాన్నీ, శ్రవణ ద్వాదశి వ్రత మహాఫలాన్ని నీకు వివరించి చెప్పాను. ఇది ఎంతో పుణ్యవర్ధకమైనది. ఆ మాటలు విని ఆ వణిజుడు ఇలా అడిగాడు. “దయచేసి నాకుభవిష్యత్ కర్తవ్యంకూడా చెప్పండి. అంతట ఆప్రేకపాలకుడు ఇలా అన్నాడు. మిత్రమా! వినుము. నీకూ నాకూ కూడా కల్యాణకరమైన విషయం చెబుతున్నాను. అనేక తీర్థాలతో కూడిన గయా క్షేత్రానికి వెళ్ళి శుచిగా స్నానం చేసి నా పేరు చెప్పి పిండ ప్రదానం చేయుము. దానితో నాకు ప్రేత దేహవిముక్తి కలుగుతుంది. సర్వదాతలు ఉండే లోకాలకు పోతాను. ఇక ఈ భాద్రపద శుద్ధ బుధ శ్రవణా నక్షత్రంతో గూడిన ద్వాదశి వ్రతం ఆచరించినచో అనంత సుఖాలు కలుగుతాయి సుమా. “అలా చెప్పి ఆ ప్రేత నాయకుడావణిజుని ప్రేతాల భుజాల మీద నెక్కించి ఆ ఎడారి దాటించి రమ్యమైన శూరసేన దేశానికి చేర్చాడు. అచట తన శక్తి సామర్త్యంతో ఆ వణిజుడు బాగా వ్యాపారంచేసి ధనం సంపాదించి పవిత్రమైన గయాశిర క్షేత్రానికివెళ్ళాడు. అక్కడ ప్రేతనాయకుడు చెప్పినవిధంగా అతనికీ అతని సహప్రేతాలకు నామగోత్రాలతో అనుపూర్వీకంగా పిండప్రదానం చేశాడు. తర్వాత తనపితృదేవతలకూ దాయాదులకు పిండ ప్రదానంచేసి ఆ బుద్ధిమంతుడు తిలలు లేకుండా తనకూ ఇతరులకు పిండదానం చేసుకున్నాడు.
ఓ నారదా! అలా నా వర్తకుడు పిండ ప్రదానాలు చేసినంతనే ఆ ప్రేతాలన్నీ ప్రేతయోనివదలి బ్రహ్మ లోకానికి వెళ్ళిపోయాయి. అతడు తన నగరానికి తిరిగివెళ్ళి శ్రవణ ద్వాదశీ వ్రతాన్ని చేసి కాలధర్మం చెందాడు. గంధర్వ లోకంలో చాలా కాలం భోగాలను భవించి శాకల నగరంలో ఉత్తమమైన మానవ జన్మ పొందాడు. తన ధర్మాలు అనుష్ఠిస్తూ శ్రవణ ద్వాదశీ వ్రతాన్ని తప్పకుండా పాటిస్తూ దేహత్యాగం చేసి యక్షుడై యక్షలోకంలో అన్ని విధాల భోగాలు అనుభవించాడు. అనంతరం భూలోకంలో రాజునకు పుత్రుడై జన్మించి క్షాత్రధర్మం అనుష్ఠిస్తూ దాన భోగాసక్తుడై గోవులను విడిపించుటకై శత్రువులతో పోరాడి జయించి కాలంచేశాడు. అనంతరము ఇంద్రలోకంలో దేవతల పూజలందుకుంటూ దుర్లభాలైన భోగాలు అనుభవించి పుణ్య క్షయం కాగా శాకలనగరంలో బ్రాహ్మణుడుగా జన్మించాడు. సర్వశాస్త్ర నిష్ణాతుడై ఒక ఉత్తమ సౌందర్య రాశి అయిన ద్విజ పుత్రికను పెండ్లాడాడు. చూచేందుకు వికారమైన రూపంతో ఉన్నందున ఆ కన్య విద్వాంసుడైన ఆ భర్తను ఏవగించుకుని అవమానించుటతో చాలా దుఃఖించి అతడు ఇరావతీ నదీ తటాన గల విష్ణుదేవుని ఆరాధించి అందమైన రూపాన్ని వరంగాపొందాడు. అచట నక్షత్ర పురుష వ్రతయుక్తంగా జన్మలో సుందర విగ్రహుడై భార్య వద్దకు పోయి ఆమెతో సకల భోగాలూ అనుభవించాడు. పూర్వ జన్మవాసనల వల్ల శ్రవణ ద్వాదశీ వ్రతాలు చేస్తూ ఆ ద్విజుడు కురూపియై కూడ భగవత్కృపవల్ల మన్మథరూపుడై మరణానంతరం పురూరవుడై జన్మించాడు.