వామనుని సర్వదేవమయ రూప ప్రదర్శనం

దానజలంచేతిలో పడగానే అంతవరకు పొట్టిగానున్న ఆ ప్రభువు అవామనుడై, గట్టివాడైనాడు. సర్వదేవమయమైన తన విరాడ్రూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపుడి నేత్రాలు చంద్ర సూర్యులు, శిరస్సు ద్యులోకం, కాళ్ళు భూమి, పాదాంగుళులు పిశాచాలు, చేతుల వ్రేళ్లు యక్షులు, మోకాళ్ళు విశ్వదేవులు, జంఘలు, గోళ్ళు యక్షులు, రేఖలు అప్సరోగణం, చూపులు నక్షత్రాలు, కేశాలు సూర్యకిరణాలు, తారలు రోమకూపాలు. ఆ రోమాలలో మహర్షులున్నారు. బాహువులు విదిశలు, శ్రోతృగుణం దిశలు, అశ్వనీ దేవతలు బాహ్య శ్రవణాలు, నాసిక వాయువులు, ఆ మహాత్ముని అనుగ్రహం చంద్రుడు, మనస్సులో ధర్మ దేవత, సత్య మాయన వాక్కు, సరస్వతి నాలుక, కంఠం దేవమాత, అదితి, త్రయీ విద్య. దానిలోని త్రివళులు, అనూరాధ స్వర్గద్వారం, కనుబొమలు త్వష్టపూషులు, నోరు వైశ్వానరాగ్ని, వృషణాలు ప్రజాపతులు, పరబ్రహ్మ హృదయం, పుంస్త్వం (మగటిమి) కశ్యపుడు, వీపు వసువులు, సకల సంధులు మరుత్తులు, వక్షోభాగం రుద్రుడు, ధృతి (సహనశక్తి) మహాసముద్రాలు, కడుపు గంధర్వులు, లక్ష్మి మేధాధృతి, కాంతి సకల విద్యలు కటి ప్రదేశం. ఆ ప్రభువు యొక్క తేజస్సే సకలమైన గ్రహ నక్షత్రాది జ్యోతిర్గణంగా వెలిగిపోతున్నవి.

నిగమాలన్నీ ఆయనశరీరంలో కుక్షిలో ఉన్నాయి. మహాయజ్ఞాలన్నీ యిష్టులు పశువు బ్రాహ్మణ కర్మలు మోకాళ్ళలో నిలిచాయి. మహాత్ముడగు విష్ణువు యొక్క ఆ సర్వదేవాత్మక విశ్వరూపాన్ని చూచి రాక్షసులందరు అగ్నిజ్వాలల్లో దూకే శలభాల్లాగా ఆయన మీదకు లంఘించారు. చిక్షురుడా ప్రభువు బొటన వ్రేలిని తన దంతాలతో పట్టుకోగా హరి వాని కంఠాన్ని ఆ కొనగోటితో త్రుంచివేశాడు. ఆ విధంగా రాక్షసు లందరను తన అరచేతులతో అరకాళ్ళతో అణగద్రొక్కి త్రివిక్రమ రూపంతో విజృంభించాడు. అడుగుతో భూమిని ఆక్రమించి నపుడు సూర్య చంద్రులాయన స్తనాల మధ్య నిలచారు. ఆకాశాన్ని ఆక్రమించగా వారిద్దరు పిరుదుల వద్దకు దిగారు. ఇంకా పైభాగాన్ని ఆక్రమించగా ఆ సూర్య చంద్రులు మోకాళ్ళ క్రిందకు చేరారు. ఈ విధంగా దేవతల కార్యం సాధించుటకు ఆ విష్ణువు విరాట్ రూపాన్ని ధరించి రాక్షస సంహారంగావించి త్రిలోక రాజ్యాన్ని పురందరు నకిచ్చాడు. పరమ ప్రదాతయైన బలిరాజేంద్రునకు భూమికి క్రింద ఉన్న సుతలమనే పాతాళలోకాన్ని ప్రసాదించాడు. అంతట ఆదైత్యపతితో ఇలా అన్నాడు. ఓ బలిరాజా! నీవిచ్చిన దానజలాన్ని నేను నాచేతితో గ్రహించాను. ఈ కారణంవల్ల నీకు కల్పాయుర్దాయము, ఉత్తమమైనది చేకూరినది. ఇప్పుడు జరుగుతున్న వైవస్వత మన్వంతరం గడచిన తర్వాత రాబోవు సావర్ణి మన్వంతరంలో నీవు ఇంద్ర పదవి పొందగలవు. ఈ లోపల సంభవించు డెబ్బదియొక్క చతుర్యుగ చక్రాల లోపల ఇంద్రుని నెదిరించు శత్రువులందరు నాచేత దండింపబడుతారుసుమా! ఎందుకంటే అతడు నన్ను పూర్వం ఎంతో భక్తితో ఆరాధించాడు కనుక నా ఆదేశానుసారం సుతల లోకానికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉండు. అక్కడ నీకు నూర్లుకొలది ఉత్తుంగ సౌధాలు, కమలాకరాలు, ఉపవనాలు, చీనిచీనాంబరాలు రత్నాభరణాదులు స్రక్చందనాది సకల సౌఖ్యాలు సమకూరుతవి. నృత్య గీతాది వినోదాలు అనుభవిస్తూ శతాధిక సుందరీమణులతో విహరించగలవు. దేవ బ్రాహ్మణులకు విరోధంగా ప్రవర్తించనంత కాలము నీవు అన్ని భోగాలు అనుభవించగలవు. అలాకాక దేవ బ్రాహ్మణులతో వైరం పెట్టుకొనినచో భయంకరమైన వరుణ పాశాలు నిన్ను బంధించగలవు.