వామన మహా పురాణము
పితరుల ఆరాధన
ఇలా స్తుతించిన బ్రహ్మతో శంకరుడు ఇలా చెప్పాడు, “పితామహా! భవిష్యత్తులో జరుగబోవు కార్యాలకు నీవు చింతించనవసరంలేదు. పూర్వం వరాహ కల్పంలో నీ తలల్లో ఒకదానిని నేను సంహరించాను. అప్పుడు నీకు నాలుగు తలలే మిగిలాయి. అవి ఎన్నడూ నశించవు. ఈ సాన్నిహిత్యతీర్థంలో భక్తితో నా లింగ స్థాపన చేసిన సర్వ పాపాల నుండి ముక్తుడవు కాగలవు. ప్రాచీన సమయాన సృష్టిచేయు కోర్కెతో నీవు నన్ను ప్రేరేపించగానే అట్లేయని సన్నిహిత సరస్సులో మునిగి చిరకాలం తపస్సు గావించగా నీవు నా కొరకు చాలాకాలం ప్రతీక్షించావు. అంతట నీవు సంకల్ప మాత్రాన పుట్టించిన సృష్టికర్త నీతో నన్ను తాను నీళ్ళలో మునిగి ఉండగా చూచానని చెప్పాడు. తన కన్న పెద్దవారు లేనిచో తాను ప్రజాసృష్టి చేస్తాననగా అప్పుడు నీ వాతనితో నీ కన్నజ్యేష్ఠు లెవరులేరు. ఇక్కడ స్థాణువు విధిలేక నీళ్ళలోబడి యున్నాడు. కనుక నీవు నాకు హితం చేయవలెనని కోరావు. అంతట అతడు సకలజీవరాసులను దక్షుడు మొదలగు ప్రజాపతులను సృష్టింపగావారు జీవులనందరను నాలుగు విధాల విభజించారు. అలా సృష్టించబడిన వెంటనే ఆ ప్రజలంతా ఆకటితో అలమటిస్తూ ప్రజాపతిని భక్షింప పరుగిడినారు. ఆ ప్రజాపతి తన ప్రాణం కాపాడుకొనుటకై పితామహుని వద్దకు పరుగుతీసి ఈ జీవ రాసుల జీవిత విధానాన్ని నిర్ణయించమని కోరాడు. అప్పుడు నీవు వారలకు భోజన విధానం ఏర్పాటు చేశావు. స్థావర జీవాలకు మహౌషధులను భోజనంగా చేశావు. జంగమ జీవులందరకు, వారిలో బలవంతులకు దుర్బలులను తిండిగా నియమించావు. ఈ విధంగా తమతమ అన్న విధానమును తెలిసికొని ఆ వచ్చిన వారంతా తమతమ చోట్లకు తిరిగి వెళ్ళారు. అప్పటి నుంచీ జీవులంతా పరస్పరం ప్రేమతో వర్ధిల్లారు. అలా సృష్టి వృద్ధి పొందటం చూచి లోకగురువైన నీవు సంతోషించి తివి. అంతట నేను జలమధ్యం నుండి బయటకువచ్చి ఆప్రజలను చూచి నాతేజస్సుతో వారిని నింపాను. తీవ్రమైన కోపంతో నా లింగాన్ని పెరికి సరస్సు మధ్య విసరి వేశాను. అది నీటిలో పైకి నిటారుగా నిలబడటంతో అప్పటి నుండి స్థాణులింగంగా విఖ్యాతమైంది. దానిని సకృత్తుగా చూచినంతనే అన్ని కిల్బిషాలు తొలిగిపోయాయి. పునరావృత్తిలేని మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ తీర్థంలో కృష్ణపక్ష అష్టమిరోజున నిర్మల చిత్తంతో నివసించినవాడు పరదారగమన గురుతల్ప గతాది సకలపాపాల నుండీ ముక్తుడౌతాడని ఆజ్ఞాపించి ఆ మహాదేవు డక్కడనే అంతర్హితుడైనాడు.
అంతట పాపముక్తుడైన బ్రహ్మ చతుర్ముఖ భవుని పూజించి ఆ దేవదేవుని లింగాలను సరోవరం మధ్యన ప్రతిష్ఠించెను. అందులో మొదటిది హరి పార్శ్వాన ప్రతిష్ఠించబడిన మహాపుణ్య లింగం బ్రహ్మసరము. రెండవది తన ఆశ్రమంలోనే నెలకొల్పిన బ్రహ్మసదనం. దానికి తూర్పుగా మూడవ లింగం ప్రతిష్ఠించాడు. నాల్గవదైన బ్రహ్మలింగం సర్వతీ తీరాన స్థాపించాడు. ఈ నాలుగు బ్రహ్మతీర్థాలు పరమపవిత్రాలు. వీనిని ఉపవసించి దర్శించినవారికి పరమగతి లభిస్తుంది. కృతయుగంలో హరి పార్శ్వంలో ఉన్న లింగాన్ని, త్రేతాయుగంలో బ్రహ్మ ఆశ్రమంలోని లింగాన్ని ద్వాపరంలో దానికి తూర్పున ఉన్నదానిని, కలియుగంలో సరస్వతి ఒడ్డున ఉన్న లింగాన్ని భక్తితో దర్శించి అర్చిస్తే సర్వపాపాలు తొలగి పరమగతి తప్పక లభిస్తుంది. సృష్ట్యాదిలో భగవంతుడు సరస్వతి ఉత్తర తీరాన పూజించిన మహేశ్వర లింగానికి చతుర్ముఖ లింగమని పేరు. దానికి శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తే సర్వపాప పరిహారం కలుగుతుంది. కామ పశు ప్రవృత్తితో కావించిన వర్ణాంతర సంగమ దోషాలు, దూషితాన్నం భుజించిన పాపాలు నశిస్తాయి. అలాగే ద్వాపరంలో శంకరుని ఆయన ఆశ్రమంలోనే పూజిస్తే రజోగుణ సముద్భూతాలయిన వర్ణ సంకర దోషాలు తప్పక తొలగిపోతాయి. ఇక ప్రతి కృష్ణ చతుర్దశి (మాసశివరాత్రి) నాడు ఆ స్వామిని పూజించినచో అభోజ్యాన్న (తినరాని తిండ్లు తిన్న) సంభవాలైన పాపాలు నశిస్తాయి. కలియుగంలో వసిష్ఠాశ్రమంలో ఉంటూ చతుర్మఖ లింగాన్ని స్థాపించి సర్వోత్తమ సిద్ధిపొందెను. అందుననూ శ్రద్ధా భక్తులతో నిరాహారులై, జితేంద్రియులై ఆ మహాదేవుని పూజించి వారలు పరమ పదవిని పొందుతారు. ఏ మాత్రము సంశయం లేదు. ఈ విధంగా మీకు మాహాత్మ్యం సమగ్రంగా వివరించాను. దీనిని విన్న మానవుడు సకల పాపములు తొలగి ముక్తి పొందుతాడు.