మరికొన్ని తీర్థాల మహాత్మ్యాలు

పులస్త్యుడిలా చెప్పసాగాడు, ఓ నారదా! ఋషి కన్య అయిన పవిత్ర ఇరావతికి వెళ్ళి స్నానంచేసి ఆప్రహ్లాదుడు చైత్రఅష్టమినాడు జనార్దనునిపూజించాడు. అచటశుచియై పుణ్యప్రదమైన నక్షత్ర వ్రతమాచరించి ఆ దానవేశ్వరుడు కురుక్షేత్రానికి వెళ్లాడు ఐరావత మంత్రాలతో సుదర్శనుడగు చక్రతీర్థుని అర్చించి విధ్యుక్తంగా స్నానం చేశాడు. ఆ రాత్రి ఉపవసించి భక్తితో కురుధ్వజుని పూజించి శుచియై నృసింహదేవుని చూచుటకు వెళ్లాడు. ఆ దానవపతి దేవికానదిలో మునిగి నృసింహుని పూజించి ఆ రాత్రి అక్కడ వసించి మరునాడు గోకర్ణ క్షేత్రానికి వెళ్లాడు. అక్కడ స్నానం చేసి తూర్పు దిక్కున విశ్వకర్మను పూజించి మరొక దిశగా కామేశ్వరుని దర్శించుటకై వెళ్లాడు. అక్కడ స్నాతుడై కామేశ్వర మహాదేవుని పూజించి ప్రహ్లాదుడు మహాజల మధ్యాన పుండరీకానికి వెళ్లాడు. అక్కడ స్నానంచేసి పితృ దేవతలకు తర్పణాదులిచ్చి పుండరీకుని అర్చించి మూడు రోజులు గడిపాడు. అనంతరం విశాఖ యూప క్షేత్రంలో అజిత భగవానుని దర్శించి స్నానం చేసి శుచియై కృష్ణ తీర్థంలో మూడు రాత్రులు గడిపాడు. అనంతరం హంస పదంలో హంసేశ్వరుని సేవించి ఆ భాగవతుడు అఖండేశ్వరుని దర్శించుటకై పయోష్ణి వెళ్లాడు. పయోష్ణిలో స్నానంచేసి అఖండేశ్వరుని అర్చించి ఆమతిమంతుడు కుమారిలుని చూచుటకు వితస్తకు వెళ్లాడు. ఆ వితస్తలో మునిగి, జ్యోతిర్మయులైన వాలఖిల్య ఋషులచే ఆరాధింపబడిన దేవేశ్వరుని అర్చించి తాను చేసిన పాపాలన్నీ నశింప జేసుకున్నాడు. అక్కడ దేవతల ప్రీత్యర్థమూ లోక కళ్యాణార్థం కామధేనువు కపిల అను గోవును కనిన, దేవహ్రదమనే తీర్థంలో స్నానం చేసి భక్తితో శివుని ఆరాధించి విధి విధానంగా పెరుగు తిని మణీమంతానికి ప్రయాణమైనాడు. ప్రజానపతి నిలయమైన ఆ శ్రేష్ఠ తీర్థంలో స్నానం చేసి ఆ మహామతి హరునీ చతుర్ముఖునీ దర్శించి యథావిధిగా పూజించాడు. ఆరు రాత్రులు ఆ ప్రదేశంలో గడిపి మధునందిని వెళ్లాడు. తేనె లాగ తియ్యగా ఉండే ఆ నదీ జలాలలో స్నానమాడి శూలపాణి చక్రధారి హరినీ ఆ దానవ శ్రేష్ఠుడు దర్శించాడు.