కామదహన వృత్తాంతము

అందులకు పులస్త్యుడు, ఆ అనంగుడు హర్షతనయుడగు కాముడు. శంకరునిచే దగ్ధ శరీరుడై అనంగు (శరీర రహితు) డైనాడు. అని పలికాడు.

అందులకు నారదుడు, ఏ కారణమున కామదేవుని దేవదేవుడగు శంకరుడు భస్మము గావించెను. ఆ వివరణము తెలుపుము. అని పులస్త్యుని ప్రార్థించగా

పులస్త్యుడు: నారదా! వినుము. దక్షపుత్రి సతీదేవి మరణానంతరం త్రిలోచనుడు దక్షయజ్ఞం ధ్వంసం గావించి సంచరించుచుండగా, అపత్నీకుడగు నా వృషకేతనుని చూచి కుసు మాయుధుడగు కందర్పుడు ఉన్మాదనాస్త్రంతో ప్రహరించెను. ఆ ఉన్మాదనాస్త్ర ప్రభావం వల్ల హరుడు పిచ్చివానివలె అడవుల్లో నదీతీరాల్లో తిరుగాడసాగెను. తన భార్య సతీదేవి స్మరణకురాగా, బాణందెబ్బతిన్న మదగజంలాగ మనోనిబ్బరాన్ని కోలుపోయెను. ఆ తాపాన్ని భరించలేక హరుడు యమునా నదిలో దుమికెను. ఆ విరహానలానికి క్రాగి యమునాజలాలు నల్లబడెను. అప్పటి నుంచీ కాటుక రంగు నీరు కలిగిన యమున "కాళింది" అయ్యెను. ఆ ప్రవాహం భూదేవి కేశపాశంలాగ ప్రవహించి పవిత్ర తీర్థమాయెను. ఆ విధంగా ఎన్నో పవిత్రనదుల్లో సరస్సులలో వాపీకూపాల్లో మునుగుతూ నదీ తీరాల్లో పర్వత భూముల్లో అరణ్యాల్లో స్వచ్ఛందంగా తిరుగాడుచున్నను శివునకు మనశ్శాంతి కలుగలేదు. కొంతసేపు ఏమోపాడుతూ, కొంతసేపు ఏడుస్తూ, కొంతసేపు ధ్యానంలో ఉంటూ, అందాల బరిణ అయిన దక్షకన్యనే స్మరిస్తూ ఉండేవాడు. ఒక్కొక్కపుడు ఆమెను గురించి కలకంటూ కలువరించెడివాడు.

ఇలా దీనదీనంగా విలపిస్తున్న హరుని చూచి కాముడు సంతాపనమనే మరొక బాణముతో గొట్టెను. ఆ దెబ్బకు శంకరుడు మరింత సంతప్తుడై ఆగ్నేయ నిశ్వాసాలు ఫూత్కారాలు గావిస్తూ ప్రపంచాన్నంతటినీ తీవ్రతాపంలో ముంచెను. అదేసమయాన మరల కాముడు విజృంభణమనే బాణాన్ని వదలెను. దానితో శివుడు విపరీతంగా ఆవు లించుచూ నలుదిశలు కలయజూచెను. అప్పుడతనికి కుబేర పుత్రుడు పాంచాలికుడనువాడు కనుపించెను. వెంటనే వానిని సమీపించి శివుడు-"బాబూ; నీవు మహావీరుడవు. నేను చెప్పునట్లు చేయుము” అనెను. అంతట పాంచాలికుడు-"ప్రభూ! మీరు అసమాన పరాక్రమములు. మీకు దాసుడను. మీరు చెప్పునది దేవతలకు అసాధ్యమైననూ సరే, నేను తప్పక చేయుదును. ఆజ్ఞాపింపు"డనెను. అందులకు ఈశ్వరుడు "పుత్రా! వరదాంబిక మరణానంతరం కామాగ్ని దగ్ధుడనై విజృంభణ ఉన్మాదన బాణాలకు గురియై విలవిల లాడుచున్నాను. మదన చోదితాలయిన ఈ జృంభణ మాదన సంతాపనాస్త్రాల వేడిమిని తట్టుకొనగలవాడవు నీవు దక్క మరొకడులేడు. కనుక వీనిని గ్రహించి నాకు శాంతి కలిగించుము. అని వేడగా ఈశ్వరుని వచనములు విని యక్షపుత్రుడా విజృంభణ మాదనాది అస్త్రాలను గ్రహించెను. అంతట సంతోషించిన వాడై శూలి బిడ్డా! దుస్సహములయిన జృంభణాది అస్త్రముల తాపమును స్వీకరించిన నీయందు ప్రీతుడనైతిని. అందుకు బదులుగా నీకు అనుకూలించునదియు, లోకులకు సంతోషకర మైనదియునైన వరమొకటి యిచ్చుచున్నాను. చైత్రమాసంలో నిన్ను చూచినను తాకినను, భక్తితో అర్చించినను, అట్టివారు వృద్ధులైనా, బాలురైనా, స్త్రీలైనా, పురుషులైనా సరే వారందరు ఉన్మత్తులగుదురు. వారు ఆ స్థితిలో నాట్యగానాలు చేయుదురు. వివిధ వాద్యాలు నేర్పుతో వాయింతురు. నీ ముందర హాస్యోక్తులు పలుకుచుందురు. అయితే వారందరకు దివ్యశక్తులు లభించును. ఇక నీవూ, భూలోకంలో నా పేరుతో పాంచాలికేశ్వరుడవుగా విఖ్యాతుడవై నిన్ను గొలిచిన వారలకు వరము లొసంగెదవు. ఎల్లరకు పూజ్యుడవగుదువు" అని అతనికి వరము నిచ్చెను.