వామన మహా పురాణము
అంధక దేవేంద్రుల సంగ్రామం.
పులస్త్యుడు ఈ విధంగా నారదునికి తెలియచేశాడు, ఆ విధంగా పిరికివాండ్లను హడలెత్తించే సంగ్రామం జరుగుతుండగా, ఇంద్రుడు తన పెనుచాపాన్నెక్కుపెట్టి బాణాలు వదలసాగాడు. అంధకుడు సైతం దేదీప్యమానంగా వెలిగిపోతున్న తన వింటిని వంచి, మహావేగంతో నెమిలి ఈకలతో నలంకరించిన తీవ్ర శరాలను దేవేంద్రుని మీద కురిపించాడు. వారొకరినొకరు, బంగారు వికారముగల పదునైన బాణాలతో కడువేగంతో ప్రహరింపసాగారు. అంతట దేవేంద్రుడు కుపితుడై తన వజ్రాయుధాన్ని గిరగిర త్రిప్పి అంధకునిపై వేయగా నంధకుడది చూచి తీవ్రమైన శస్త్రాస్త్రాలు ప్రయోగించగా వానిని అతడు ఎండుచెట్లను అగ్ని కాల్చివేసినట్లుగా బూడిద గావించెను. తనపై విరుచుకుపడనున్న ఇంద్రుని వజ్రాన్ని చూచి దైత్యపతి తన రథం వదలి క్రిందకు దుమికెను. అంతట నా వజ్రము రథాన్ని సారథిని గుర్రాలను ధ్వజకూబరాలను దగ్ధం కావించి అంధకుని సమీపించెను. మహాబలశాలి యగు అంధకుడు తన కఠోర ముష్టిఘాతంతో, వేగంగా వస్తున్న వజ్రాన్ని భూమ్మీద పడగొట్టి, భీషణంగా గర్జించాడు! గర్జారావం చేస్తున్న శత్రునిపై ఇంద్రుడు బాణాలు గుప్పించగా అతడు వాటిని వారించి ఇంద్రునిపై లంఘించాడు. అతని మదపుటేనుగు కుంభ స్థలాన్ని అరచేతితోను, తొండమును కాళ్ళతోను మర్దించి, మోకాళ్ళతో దాని దంతాన్ని ముక్కలు గావించెను. ఎడమ చేతి పిడికిలితో ఏనుగు పార్శ్వాలను నుగ్గునుగ్గుగావించి నేలపై పడగొట్టెను. నేలమీద కొరిగిపోవుచున్న ఐరావతం మీదినుంచి క్రిందకు దుమికి ఇంద్రుడు త్వరత్వరగా తన వజ్రాయుధాన్ని తీసికొని అమరావతికి పారిపోయెను. నాయకుడు పారిపోగా మిగిలిన దేవతలనందరను ఆ దైత్యనాథుడు పదాఘాతాలతో ముష్టిఘాతాలతో మర్దించివైచెను. బ్రాహ్మణోత్తమా! అంతట తన దండాన్ని ఝళిపిస్తూ యముడు ప్రహ్లాదుని చంపుటకై అతనిని వెంబడించెను. అంత నా హిరణ్యకశ్యపసుతుడు త్వరగా విల్లెక్కుపెట్టి బాణవృష్టితో యముని ముంచెత్తెను. అంతట ఆ సూర్య తనయుడు ఆబాణ సమూహాన్ని చెదరగొట్టి లోక భయంకరమైన తన దండాన్ని ప్రహ్లాదునిపైకి విసరివైచెను. యమునిచే వదలబడిన ఆ దండం ముల్లోకాలను దహించి వేసే కాలాగ్ని లాగ మండుతూ రావడం చూచి రాక్షసభటులు “అయ్యో! ప్రహ్లాదుడు యముని చేతిలో హతుడయినాడని ఆక్రోశించారు. వారి ఆర్తనాదం విన్న అంధకుడు వెంటనే “నేనుండగా భయమెందుకు? ఎవడా సురాధము”డంటూ ఒక్క ఉదుటున దుమికి ఎడమ చేతితో ఆ దండాన్ని పట్టుకొని అట్టహాసంచేశాడు. తమ నాయకుడావిధంగా ప్రహ్లాదుని రక్షించుట చూచిన దైత్య దానవయోధులు ఆనందోత్సాహాలతో వారిని అభినందించారు. తన కాలదండాన్ని ఆ విధంగా అంధకుడు గిరగిర త్రిప్పడం చూచి భరించలేక రవిపుత్రుడు యముడు అంతర్హితుడై పోయాడు. ధర్మరాజు పలాయనంకావడంతో ప్రహ్లాదుడు దేవసైన్యాన్ని చెల్లాచెదరు కావించెను. అంతట వరుణుడు కుపితుడై, తన శింశుమారాన్నెక్కి రాక్షసులను తన పాశాలతో బంధించి గదతో మోదసాగెను. అంతట వరుణునిపై విరోచనుడు లంఘించి వజ్రపమాలైన తోమరశక్తి ముద్గర కణపాది ఆయుధాలతో ఆతనిని ప్రహరించాడు. దానితో రెచ్చిపోయి వరుణుడు తన గదతో విరోచనుని నేలబడగొట్టి మదపుటేనుగువలె తన బలమైన పాశాలతో కట్టివైచెను. నారదా! అంతట క్షణమాత్రాన విరోచనుడా వరుణ పాశాలను త్రెంచి వైచికొని వరుణునిపై దూకి అతని నడుము నొడిసిపట్టెను. అపుడాతని ఏనుగు వరుణుని తనదంతాలతో క్రిందకు బడద్రోసి వాహనంతో కూడా ఆజలాధిపతిని తన కాళ్లతో మర్దించివైచినది. వరుణుని దుర్గతి చూచినంతనే చంద్రుడు పరుగు పరుగున వచ్చి దానిని పదునైన బాణాలతో ప్రహరించెను. చంద్రుని వాడి బాణాల బాధకు ఓర్వలేక ఘీంకరిస్తూ ఆ గజం వరుణుని మరింతగా తనపాదాల క్రింద మర్దించసాగింది.
మహర్షీ! అంతట వరుణుడు తన బలమంతా కూడగట్టుకొని తనను మర్దిస్తున్న ఏనుగు కాళ్ళను గట్టిగా పట్టుకొని తలతో బలంగా నెట్టెను. వెంటనే అతివేగంతో దాని తోకను తన వ్రేళ్ళతో పట్టుకొని నాగపాశాలతో పైనున్న విరోచనుని బంధించి, బలం కొలదీ ఆకాశానికి విసరివైచెను. అలా పైకెగరగొట్టబడి విరోచనుడు, సూర్యునిచే భూమి మీదకు సాట్టగోపుర ప్రాకార హర్మ్యాదులతో త్రోసివేయబడిన సుకేశి నగరం వలె తన గజంతో గూడ నేలమీద పడిపోయెను. అతనిని చంపివేయుటకు తన గదను పాశాలను. తీసుకొని మీదబడుతూన్న వరుణుని చూచి దైత్యభటులు “అయ్యో! వరుణుని చేతిలో విరోచనుడు హతుడౌతున్నాడు గదా! ఓ ప్రహ్లాదా! జంభకుజంభులారా! ఎవరైనా అడ్డు పడండి. అంధకా! ఈ జలాధిపతి వాహనంతో కూడ విరోచనుని పాశబద్ధుని చేసి గదతో మర్దించి అశ్వమేధంలో ఇంద్రుడు పశువునువలె చంపుచున్నాడు. రండు! రక్షించుడు’ డంటూ హాహాకారాలు చేశారు. ఆ అరుపులు విని జంభాదులైన రాక్షస నాయకులు అగ్ని శిఖలపై దూకి శలభాల వలె జలేశ్వరునిపైకి లంఘించారు. వారిరాక గమనించి వరుణుడు, విరోచనుని వదలిపెట్టి తన పాశాన్ని పెంచి గదాదండం త్రిప్పుతూ శత్రువులపై విరుకుపడ్డాడు. జంభుణ్ణి పాశంతో సంహరించాడు. అరచేతితో తారుడి తల పగలగొట్టాడు. పాదాలతో వృత్ర కుజంభులను తన్ని, పిడికిటిపోటుతో బలుణ్ణి యమపురికి పంపాడు. అలా ఆ దేవశ్రేష్ఠుని చేత చావుదెబ్బలు తిని రాక్షసులు అయుధాలు వదలి తలకొక దారిగా పారిపోయారు. అది తెలిసిన అంధకుడు జలాధిపతితో సమరానికి త్వరత్వరగా పరుగులతో వచ్చిపడ్డాడు. తనమీద లంఘించిన ఆ దైత్యనాథుణ్ణి వరుణుడు పాశాలతో బంధించి గదతో ప్రహరించబోగా, అతడా కట్లు తెంచుకొని తన గదాదండం వరుణుని మీద ప్రయోగించాడు. తన గదాపాశాలు లాక్కొని తననే చంపవచ్చుచున్న అంధకుని ధాటికి తట్టుకోలేక వరుణుడు సముద్రంలో మునిగి దాక్కున్నాడు. మిగిలిన దేవసైన్యాన్ని అంధకుడు మర్ధించసాగాడు. అదిచూచి పవనుడు తోడుకాగా అగ్ని విజృంభించి దైత్యసేనలను దహించసాగగా, వారిపైకి విశ్వకర్మమయ దానవుడు శంబరు నితో కూడి దాడి చేశాడు. వారిర్వురను చూచి అగ్ని వాయువుతో కలిసి శక్తితో శూలంతో వారల కంఠాలను ప్రహరించి, ఇద్దరిని గట్టిగా పట్టుకున్నారు. శక్తిఘాతానికి వాళ్ళదేహాలు చీలిపోయాయి. అగ్ని పట్టుకు ఇద్దరి దేహాలు జ్వాలల్లో మాడిపోయాయి. అలా తగలబడుతూ వాళ్లిద్దరూ సింహంచేత చిక్కిన మదపుటేనుగులవలె ఆర్తనాదాలు చేశారు. ఆ శబ్దం విని దైత్యేశ్వరుడు కోపంతోమండి పడుతూ “ఏమిది? మయశంబరులను జయించిన వాడెవ్వడు? వాడెక్కడ?” అని అరిచాడు. అప్పుడు రాక్షసభటులు “ప్రభూ! అగ్నివాయువులు వీరిని దహిస్తున్నారు. రక్షించండి! ఈ అగ్నిని నివారించడం ఎవ్వరితరం గాదు” అని మొరపెట్టారు. మహర్షీ! ఆ మాట వింటూనే హిరణ్యాక్ష పుత్రుడు మహావేగంతో ఇనుప గుదియ పట్టుకొని “అగ్నీ! నిలునిలువు” మంటూ వెంబడించాడు.
అంధకుని కేక వినగానే అగ్ని అతనిని లాగిపట్టి నేలపై పడగొట్టాడు. దానితో మండిపడి ఉత్తమాలయిన శస్త్రాలతో అంధకుడు ఆహుతాశనుణ్ణి ప్రహరించాడు. నెత్తిపై బలమైన దెబ్బ తగలడంతో అగ్ని శంబరుణ్ణి వదలిపెట్టి, అంధకుడి మీదదూకాడు. అగ్ని తనను పరిఘతో ప్రహరించ రాగా, అంధకుడు మరల గట్టిగా నతనిని కొట్టెను. దాంతో అగ్ని యుద్ధభూమి వదలి భయంతో పారిపోయెను. మహర్షీ! అంతటపోక, అంధకుడు చంద్ర సూర్య వాయువులను, రుద్రాశ్వి వసువులతోబాటు సిద్ధ సాధ్యనాగులను, ఆయుధాలు పట్టి నిలబడిన ప్రతివారిని, బాణాలతో ప్రహరించి యుద్ధభూమి వదలి పారిపోవునట్లు చేశాడు. ఆ విధంగా ఇంద్ర రుద్ర యమ సోమాదులతో కూడిన దేవతలను దేవ సైన్యాన్నీ జయించి దైత్యదానవుల పూజలందుకొని అంధకుడు భూలోకానికి తిరిగి చేరుకున్నాడు. భూలోకంలోని రాజులందరను లోబరచుకొని వారి నుండి పన్నులు వసూలుచేస్తూ చరాచర జగత్తునంతను తన వశంగావించుకొని ఆ ధీమంతుడైన అంధకుడు పాతాళానికి పోయి అశ్మకమనే నగరాన్ని చేరుకున్నాడు. ఆ మహాదానవు డక్కడ ఉండగా, గంధర్వ విద్యాధర అప్సరాదులు పాతాళానికి వెళ్ళి, అతనికి సపర్యలు చేయసాగారు.