వామన మహా పురాణము
వేదాలలో వామనుని ప్రసక్తి
అవతారాలను గురించిన కొంత ప్రసక్తి బీజ రూపంలో వేదాలలో ఉన్నది. ఇంద్రుడు తన మాయతో వివిధ రూపాలను ధరిస్తాడని ఋగ్వేదం చెప్పుతున్నది. (3.53.8, 6.47.18). కొన్ని బ్రాహ్మణాలు ఈ విషయాన్ని పేర్కొంటున్నాయి. శతపథ బ్రాహ్మణం ప్రజాపతి మత్స్య (1.8.1.1) కూర్మ (7.5.1.5, 14.1.2.11), వరాహ (14.1.2.11) అవతారాలు ఎత్తినట్లు తెలుపుతున్నది. అలాగే భగవంతుడు బహురూపాలను ధరించటం తైత్తిరీయ బ్రాహ్మణం (1.1.3.5), కాఠక సంహిత కూడా తెలుపుతున్నది. క్రమంగా ఈ అవతారాలు ఎత్తినవాడు విష్ణుభగవానుడే అని విఖ్యాతపరచబడింది. అయితే ఒక్క వామ నావతార విషయంలో మాత్రం అన్ని చోట్ల విష్ణువే ఈ అవతారాలను ఎత్తినట్లుగా తెలుపబడింది. ఋగ్వేదంలో ‘విచక్రమాణ స్త్రీ ధోరుగాయషః’-అని ‘ఉరుక్రమః’ అని విశేషణాలు విష్ణువుకు కూర్చబడ్డాయి. మూడు అడుగులతో ఆయన నేలను కొలవడం చాలా ఘనమైన విషయంగా స్తుతించబడింది.
ఋగ్వేదంలో విష్ణు సూక్తాలనే ప్రత్యేక స్తుతి ఉన్నది. ఆ భాగంలోని అనేక మంత్రాలలో వామనావతారం ధరించడం చాలాసార్లు స్తుతించబడింది. ఋగ్వేదం ప్రథమ మండలం 154 వ సూక్తంలో ఇంతకుముందు తెలిపిన ‘విచక్రమాణస్త్రే ధోరుగాయ’ అని మూడు అడుగులలో భూమిని కొలిచాడు అని పేర్కొనబడింది. అలాగే ‘యదం దీర్ఘం ప్రయత్నం సదస్థమ్, ఏకోవిమమే త్రిభిరత్వదేభిః (1.154.3) అని, పితరులు నివసించే బహుదూరం వ్యాపించిన దానిని అంతరిక్షాన్ని-విష్ణువు ఒక్కడే మూడు పాదాలతో కొలిచాడు అని చెప్పబడింది. మూడు అడుగులలో మొత్తం భూమిని కొలిచి నందునకే ఆయనకు ‘ఉరుగాయః’ ‘ఉరుక్రమః’ అన్న విశేషాలు ఉపయోగించబడ్డాయి. ఇంకొక ప్రసిద్ధ మంత్రంలో
ఇదం విష్ణుర్విచక్రమే॥ త్రేధానిదధం పరమ్
సమూఢ మస్య పాంసురే (1॥22॥17)
అనీ అనగా మూడు అడుగులలో విష్ణువు జగత్తును ఆక్రమించి తన పాదం ఉంచాడు. ఆయన ధూళి ధూసర పాదంలో భూమ్యాది సమస్త లోకాలు అంతర్హితమైనవి’ అని చెప్పబడింది. శతపథ బ్రాహ్మణం విష్ణువును ‘వామనోహి విష్ణురాస!’ అని అనగా విష్ణువు వామనుడని పేర్కొంటున్నది. కాబట్టి
త్రీణీ పదావిచక్రమే॥ విష్ణుర్గోపా ఆదాభ్యః
అతో ధర్మాణి ధారయన్॥ (1॥22॥18)
అని కథయే కాక పేరు కూడా ఉన్నందున వామనావతార కథ వేదమూలకమైనది అని తెలుస్తున్నది. వేదంలో సూచ్యాత్మకంగా ఉన్న వామన అవతార వృత్తాంతం విస్తృతంగా పురాణంలో వివరించడం, ఆ అవతార ఉద్దేశ్యం ధర్మోద్ధరణకేనని తెలపడం మొదలైనవాని చేత వామనుని కథావృత్తాంతం ముఖ్యాంశంగా వర్ణించిన వామన పురాణం వేదోప బృంహణం చేస్తున్నదని చెప్పడంలో ఎటువటి ధర్మసందేహం అవసరము లేదు.
ఋగ్వేదంలో భాగమైన శతపథ బ్రాహ్మణంలో వామన కథ ఉన్నది. ఈ కథే పురాణాలలో చెప్పబడిన వామనావతార కథకు మూలం కావచ్చు.
తా వాంవాస్తూన్యుశ్మసి గమధ్యై
యత్ర గావో భూరి శృంగా ఆయాసః
అత్రాహ తదురుగాయస్య వృష్ణః
పరమం పదమవభాతి భూరి (1॥154॥6)
దేవాసురులిద్దరూ ప్రజాపతి సంతతి. అసురలచేతిలో దేవతలు ఓడిపోయారు. అందువలన బలదర్పితులైన అసురులు లోకమంతా తమదే అనుకొంటున్నారు. భూమిని పంచుకొందామని వారు వ్యాఘ్ర చర్మంతో సన్నని త్రాడు చేసి తూర్పు నుంచి పడమరకు విభజింపబోయారు. ఇది విని దేవతలు భూమిని అసురులు పంచుకొంటే, మనకు భాగం లేకుంటే, ఎలా గడుస్తుందనుకొని యజ్ఞరూపి విష్ణువును ముందు ఉంచుకొని రాక్షసుల వద్దకు వెళ్లారు. భూమిని మాపరోక్షంలో పంచుకోవద్దు. మాకూ అందులో భాగం ఇవ్వండి అన్నారు. అసురులు ఈ మాటకు అసూయపడి ‘విష్ణువు పడుకొన్నంత మేర నేల మీకు ఇస్తామన్నారు. విష్ణువు వామనుడు కనుక దేవతలు దీనికి అంగీకరింపక తమలోతాము ‘అసురులు యజ్ఞతుల్యమైన భూమినిస్తే తక్కువ కాదు. ఎక్కువే అనుకొన్నారు. దేవతలు భూమిని, తూర్పు దిక్కున, స్థాపించిన ఛందస్సుల ద్వారా విష్ణువును నాలుగు దిక్కుల తిప్పారు. తూర్పున గాయత్రీ ఛందంతో, దక్షిణాన త్రిష్టుపు ఛందంతో, పశ్చిమాన జగతీ ఛందంతో, ఉత్తరాన ఆ ఛందస్సులతోనే తిప్పారు. తూర్పున అగ్నిని ఉంచి అర్చించుతూ నలు దిక్కులా తిరిగారు. ఆ అర్చా ప్రభావంవల్ల పృథ్వినంతను పొందారు అని చెప్పబడింది.
ఈ కథలో దేవతలు రాక్షసులనుంచి యజ్ఞరూప విష్ణు సహాయంతో భూమిని లాగుకొన్నారని, ఆ విష్ణువు వామనుడని తెలుపబడింది. ఋగ్వేదంలో ఉరుగాయ, విష్ణు త్రివిక్రముడున్నాడు. ఈ రెండూ కలసి పురాణాలలో వామనకథ అయింది. దానికి దీనికి తేడా ఏమంటే వేదం (శతపథ బ్రాహ్మణం)లో భూమిని దేవతలు లాగుకొన్నది అసురుల నుంచి అయితే పురాణంలో అసుర రాజు బలిచక్రవర్తి నుంచి. శతపథ బ్రాహ్మణంలో యజ్ఞ వ్యాప్తి ద్వారా అయితే, పురాణంలో మూడడుగులు కొలవడం ద్వారా.
ఇక భాగవత పురాణంలో విశేషంగా వామన అవతార వృత్తాంతం వివరించబడింది. ఈ కథ బాగా ప్రసిద్ధి పొందింది. అందులో యజ్ఞవేళ వామనుడు ప్రవేశించి బలిని దానమడిగి నేలను, నింగినీ, బలి శిరస్సును మూడడుగులుంచి వామనుడు త్రివిక్రముడైనాడు. భాగవతంలో వామనునికి ఉపయోగించిన పృశ్నిగర్భుడు, వేదగర్భుడు, త్రినాభుడు, త్రిషృష్ఠుడు, శిపివిష్టుడు, బ్రహ్మణ్యదేవుడు, ఉరుగాయుడు, ఉరుక్రముడు వంటివి వైదిక విశేషణాలే.
అందువలన వైదిక సాహిత్యంలో వామనావతారం సూచితం మాత్రమేకాక, ఇతరావతారాలలాగే సంపూర్ణంగా వేదానుకూలమని తెలుసుకొనవచ్చును. ఈ విధంగా వామనపురాణం వేదోప బృహంణం చేస్తుంది.
పురాణ పురుషుని చర్మం (త్వక్) వామన పురాణం:
బ్రాహ్మం మూర్ధా హరేరేవ హృదయం పద్మ సంజ్ఞకమ్
వైష్ణవం దక్షిణో బాహుః వాయుర్వామో మహేశితుః
ఊరూభాగవతం ప్రోక్తం నాభి స్యాన్నారదీయకం
మార్కండేయంచ దక్షాంఘ్రిః వామోహ్యాగ్నేయముచ్యతే
భివిష్యం దక్షిణో జానుర్విష్ణో రేవ మహాత్మనః
బ్రహ్మవైవర్తసంజ్ఞం తువామో జాను ర్విష్ణోరేవ మహాత్మనః
బ్రహ్మవైవర్త సంజ్ఞంతు వామోజాను రుదాహృతః
వైంగ్యంతు గుల్ఫకం దక్షం వారాహం వామ గుల్ఫకం
స్కాందం పురాణంలోమాని త్వగస్య వామనం స్మృతం
కౌర్మం పృష్ఠి సమాఖ్యాతం మాత్స్యమేదః ప్రకీర్త్యతే
మజ్జాతుగారుడం ప్రోక్తం బ్రహ్మాండ మస్తి గీయతే
ఏవమేవా భవద్విష్ణుః పురాణావియవో హరిః (పద్మ 1॥62॥67)
పద్మపురాణం హరిపురాణ (అవయవుడు) పురుషుడు అని తెలుపుతున్నది. దీని ప్రకారం వివిధ పురాణాలు విష్ణువు యొక్క వివిధ అవయవాలు. వానిలో వామనపురాణం ఆయన ‘త్వక్’ అనగా చర్మం అని చెప్పబడింది. చర్మం సర్వ అవయవాలను కప్పి ఉంచుతుంది. కాబట్టి వామన పురాణం విష్ణువునకు సంబంధించిన సర్వ విషయాలను వివరించే ప్రముఖమైన వైష్ణవ పురాణం అని చెప్పవచ్చు. (చిత్రం ఇతర వివరాలకు ఈ పుస్తకంలోనే గల పురాణ పరిచయం చూడండి)